5, ఏప్రిల్ 2015, ఆదివారం

సభకి నమస్కారం

(నిన్న - 04-04-2015 -  సాయంత్రం హైదరాబాదు ఆర్టీసీ కళ్యాణ మంటపం మందిరంలో అరోరా పీజీ కళాశాల వార్షికోత్సవంలో నేను చేసిన ప్రసంగపాఠం)
సభకి నమస్కారం -
ఈ ఒక్క వాక్యం కనిపెట్టి నా స్నేహితుడు, సినిమా దర్శకుడు 'జంధ్యాల'  సభల్లో వృధా అవుతున్న ఎంతో విలువయిన సమయాన్ని ఆదా చేసాడు. వేదికమీద వున్న పెద్దల పేర్లు,  ప్రతివక్తా ప్రస్తావిస్తూ వచ్చే ఒక సంప్రదాయానికి జంధ్యాల ఆ విధంగా మంగళం పాడాడు.
సరే. విషయానికి వస్తాను. ఈ సభలో మాట్లాడమని నన్ను ఆహ్వానించిన క్షణం నుంచి నన్నో ప్రశ్న అదేపనిగా తొలుస్తూ వచ్చింది. ఇందుకు, నాకున్న అర్హత ఏమిటన్నది ఆ ప్రశ్న. రేడియోలో పనిచేసాడు కనుక ఏదో కొంత మాట్లాడకపోతాడా అన్న నమ్మకం కావచ్చు. అయితే రేడియో వాళ్ళతో ఓ ఇబ్బంది వుంది. వాళ్లకు అన్నీ టైం ప్రకారం జరగాలి. పదినిమిషాలు వార్తలు అంటే పిడుగులు పడ్డా ఒక్క క్షణం ఎక్కువ కాకూడదు, అలాగే పది నిమిషాలు దాటకూడదు. విషయం యెంత పెద్దదయినా క్లుప్తంగా చెప్పాలి. బ్రివిటీ ఈజ్ సోల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది రేడియోలో చెప్పే మొదటి పాఠం.
అంచేత క్లుప్తంగా మాట్లాడేవాళ్ళు ఇలాటి సభల్లో మాట్లాడడానికి పనికి రారేమో అనేది నాకు కలిగిన మరో  సందేహం.
మాట్లాడ్డం అంటే గుర్తుకు వచ్చింది.
పశుపక్ష్యాదులు కూడా భావాలను పంచుకుంటాయి. కానీ మాటలతో వాటిని  వ్యక్తీకరించలేవు. అయితే  ఒకటినొకటి అర్ధం చేసుకుంటాయి. మాటలు రాని పాపాయి మాటలు తల్లి అర్ధం చేసుకున్నట్టుగా.
గుర్రం సకిలిస్తుంది. ఆవు అంబా అంటుంది. సింహం గర్జిస్తుంది. పాము బుస కొడుతుంది. అయితే ఈ చరాచర  సృష్టి మొత్తంలో మాట్లాడగలిగే శక్తి ఒక్క మనిషికే దక్కింది. 
అంటే ఏమిటన్నమాట. మాట్లాడే ప్రతిమాటా ఆచితూచి మాట్లాడాలి. ఆదీ మంచి మాట అయివుండాలి. మంచికోసమే మాట్లాడాలి. ఇతరులని నొప్పించడం కోసం కాకుండా సాధ్యమైనంతవరకు వారిని  మెప్పించడం కోసం లేదా ఒప్పించడం కోసం  మాట్లాడాలి. మంచిని చూసి, మంచిని విని,  మంచినే  మాట్లాడ్డం వల్ల మనలో పాజిటివ్ వేవ్స్ ప్రసరిస్తాయి. శరీరం మనస్సూ రెండూ తగిన శక్తిని సమకూర్చుకుంటాయి.
విద్యార్ధి దశలో ఇవన్నీ మీకు ప్రతిరోజూ అనుభవంలోకి వచ్చే విషయాలే. మంచి ఉపాధ్యాయులు, మంచి స్నేహితులు, మంచి వాతావరణం ఇంతకంటే మనిషీ, మనసూ ఎదగడానికి ఏం కావాలి చెప్పండి. ఉపాధ్యాయులు చెప్పే  మంచి వినండి. స్నేహితులతో మంచి పంచుకోండి. మంచిగా మెలగండి. అలా మంచిగా ఉండడానికీ, లేకపోవడానికీ వుండే తేడా ఏమిటో మీ మనసుకే తెలుస్తుంది. అంతేకాదు, అలా రోజల్లా పంచుకుని, పెంచుకున్న మంచిని ఇంటికి కూడా తీసుకువెళ్ళండి. ఇంట్లో కూడా అమ్మానాన్నతో, అక్కాచెల్లెళ్ళతో, అన్నాతమ్ములతో, ఇరుగూ పొరుగుతో మంచిగా ఉన్నారనుకోండి. ఇక పండగే పండగ. చెడు అన్నది దరి చేరనీయకుండా మంచినే పెంచుతూ పొతే ఇక ఆ సమాజానికి అంతా మంచే జరుగుతుంది. ఇందులో ఇంత  విషయం వుంది  కాబట్టే నాకిచ్చిన ఈ సమయాన్ని ఇందుకోసం వాడుకుంటున్నాను.
షరామామూలుగా యేవో కొన్ని అనుభవాలు, యేవో కొన్ని ఉద్భొదలు చెప్పి వెళ్లిపోవచ్చు. మాది గుంకే వయసు, మీది పొడిచే పొద్దు. మీరే సమాజానికి కావాల్సిన వాళ్ళు. మీ అవసరం సమాజానికి వుంది. నేను మాట్లాడుతోంది భావి పౌరులతోటి అన్న స్పృహతో మాట్లాడుతున్నాను. ఈ దేశ భవిష్యత్తు మీ చేతుల్లోనే వుంది. మీ చేతుల్లో మాత్రమే అది భద్రంగా వుంటుంది.  సరయిన పౌర సమాజం మీవల్లనే రూపు దిద్దుకుంటుంది. అల జరిగిన నాడు ఇక భవిష్యత్తు గురించి మాకెవ్వరికీ  బెంగ అక్కరలేదు.
చదువుకునే మీరందరూ దీపాల్లాంటి వారు. ఒక దీపం మరో దీపాన్ని వెలిగిస్తూ పొతే, ఇన్ని కోట్ల దీపాలున్న మన దేశం వెదజల్లే  వెలుగులు ఎల్లల్ని దాటి, సమస్త ప్రపంచానికి విజ్ఞాన కాంతుల్ని ప్రసరింపచేస్తాయి. యావత్ లోకం ఓ విజ్ఞానఖనిగా తయారవుతుంది.
మరో మాట. నా పిల్లల చిన్నతనంలో,  మా ఇంటికి దగ్గరలో వున్న అరోరా కాలేజీలో చదివించాలని అనుకున్నాను. కానీ ఆ ఆశ అప్పుడు  తీరలేదు. అందుకే ఈనాడు మిమ్మల్ని అందర్నీ  చూస్తుంటే నా కడుపు నిండినంత ఆనందంగా వుంది.
మంచి కాలేజీలో చేరారు. ఆరోరా విద్యార్ధిని అని గొప్పగా చెప్పుకునేలా మీ ప్రవర్తన వుండాలి. అంతే  కాదు, పలానా విద్యార్ధి  మా కాలేజీలో చదివాడు  సుమా అని యాజమాన్యం కూడా చెప్పుకోగలిగితే ఇరువురూ ధన్యులే.
ఈ ధన్యత అరోరా కాలేజీ ఇప్పటికే సంపాదించుకుని ఉంటుందని నా నమ్మకం.
నా మాటలు ఓపిగ్గా విన్న మీ అందరికీ నా ధన్యవాదాలు.
సభకి మరోమారు నమస్కారం.
 - భండారు శ్రీనివాసరావు

(04-04-2015)

4 కామెంట్‌లు:

voleti చెప్పారు...

Excellent..inspired..

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@voleti - Thanks a lot - Bhandaru Srinivas Rao

అజ్ఞాత చెప్పారు...

స్వోత్కర్ష లేకుండా సూటిగా విషయాన్నీ పిల్లలికి అర్థం అయ్యేట్టు భలే చెప్పారు. అందుకోండి నా అభినందనలు.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

ధన్యవాదాలు అజ్ఞాత గారు - భండారు శ్రీనివాసరావు