25, ఏప్రిల్ 2015, శనివారం

కళ్ళు తెరిస్తే అదే పదివేలు

  
(Published by 'SURYA' telugu daily in it's edit page on 26-04-2015, SUNDAY)

రాజకీయ దిగజారుడుతనానికి పతాక సన్నివేశాన్ని గత బుధవారం నాడు  జాతి యావత్తూ మౌనంగా వీక్షించింది. టీవీ ఛానళ్ళ ద్వారా ప్రసారం అయిన  ఒక రైతు ఆత్మహత్యా దృశ్యానికి సమస్త ప్రజానీకం ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ విషాద సంఘటన రైతుల సమస్యలపై సాగుతున్న చర్చను మరో మలుపు 
తిప్పింది.

 
అసామాన్యులు అధిక సంఖ్యలో నివసించే ఢిల్లీ రాష్ట్రాన్ని  పాలిస్తున్న సామాన్యుడి పార్టీ 'ఆప్' నేతృత్వంలో  రైతు సమస్యలపై నిర్వహించిన ర్యాలీలోనే ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం మరో విషాదం. ఈ ర్యాలీకి ఢిల్లీ చుట్టుపక్కలనుంచి పెద్ద సంఖ్యలో రైతులు హాజరయ్యారు. వారి సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ఈ ర్యాలీలో ఓ పక్క నేతల ప్రసంగాలు సాగిపోతూ ఉండగానే,  ఆ సమస్య తీవ్రతను మరింత సుష్పష్టం చేసే రీతిలో   రాజస్తాన్ కు చెందిన గజేంద్ర సింగ్ అనే రైతు మరో పక్క ఓ చెట్టు కొమ్మకు ఉరి వేసుకుని వేదికమీద వున్న నాయకుల సాక్షిగా తన ఉసురు తీసుకున్నాడు. వ్యవసాయంలో వచ్చిన వరుస నష్టాల కారణంగా ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్టు గజిబిజిగా గిలికికినట్టు రాసిన ఓ చిన్న ఉత్తరం మృతుడి వద్ద పోలీసులకు లభించింది.
దేశ రాజధాని నడిబొడ్డున జరిగిన ఈ సంఘటనకు విశేష ప్రాచుర్యం లభించడం ఆశ్చర్యమేమీ కాదు. జాతీయ టీవీ ఛానళ్ళు ఈ సంఘటనకు అత్యంత ప్రాముఖ్యం ఇచ్చి వరుస కధనాలతో హోరెత్తించాయి. ప్రధాన మంత్రి మోడీ తక్షణం స్పందించారు. రాజస్తాన్  రైతు మరణం తన మనసును  కలచివేసిందని ఆయన ట్వీట్ చేసారు. తాము ఒంటరివారమని రైతులెవ్వరూ ఏ దశలోనూ భావించరాదని ఆయన అన్నారు. రైతులకు ఉజ్వల భవితవ్యం కోసమే తామంతా ఉన్నామని భరోసా ఇచ్చారు.
దాదాపు రెండుమాసాల అజ్ఞాతం నుంచి ఇటీవలే బయటకు వచ్చి, వచ్చీ రావడంతోనే మోడీ ప్రభుత్వంపై బాణాలు సంధిస్తున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, అందివచ్చిన ఈ అవకాశాన్ని వెంటనే ఉపయోగించుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు భౌతిక కాయం వుంచిన ఆసుపత్రికి హుటాహుటిన బయలుదేరి వెళ్ళారు. జరిగిన సంఘటనకు కేంద్ర ప్రభుత్వం, కేజ్రీ వాల్ నేతృత్వంలోని ఢిల్లీ సర్కారు బాధ్యత వహించాలని అన్నారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాల కారణంగానే రైతుల ఆత్మ హత్యలు పెరిగిపోతున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. రైతుల ఉసురు తీసే భూసేకరణ చట్టం సవరణకు చేస్తున్న మొండి  ప్రయత్నాలను ఇకనైనా మానుకోవాలని పనిలో పనిగా ఓ  సలహా ఇచ్చారు.  ఇక ఢిల్లీలో 'ఆప్', బీజేపీల నడుమ రగులుతున్న రాజకీయ వైరం ఈ సంఘటనతో కొత్త రంగు పులుముకుంది. ఢిల్లీ పీఠం పోగొట్టుకున్న బాధలో  వున్న బీజేపీ నాయకులకు, 'ఆప్' తమకు అంటిస్తున్న రైతు వ్యతిరేక ముద్ర సుతారమూ నచ్చడం లేదు. దాంతో ఆ పార్టీ నాయకులు, శ్రేణులు రైతు ఆత్మహత్యకు 'ఆప్' దే బాధ్యత అంటూ ఎదురుదాడికి దిగాయి. ఇక 'ఆప్' బృందం కూడా ఆలస్యం చేయకుండా  ప్రతిదాడి మొదలు పెట్టింది. ఆత్మహత్య చేసుకున్న రైతు గజేంద్ర సింగ్ అంత్యక్రియలు స్వగ్రామంలో ముగియడమే తరువాయి రాజకీయ సెగలు పొగలు కమ్ముతూ మిన్నంటాయి. ఢిల్లీ సంఘటన నుంచి ఏమేరకు రాజకీయ లబ్ది పొందాలి అన్న దిశగా విమర్శలు, ప్రతి విమర్శలు రాజుకుంటున్నాయి.
సాక్షాత్తు కేంద్ర హోం మంత్రి రాజనాథ్ సింగ్ చేసిన ప్రకటన 'ఆప్' నాయకులను మరింత ఆత్మరక్షణలో పడవేసింది. 'ఆత్మహత్య చేసుకున్న గజేంద్ర సింగ్  ను ఆ ప్రయత్నం నుంచి ఆపకుండా పైపెచ్చు చప్పట్లు చరుస్తూ అతడ్ని రెచ్చగొట్టి ఆత్నహత్యకు ప్రేరేపించార'ని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వ అధీనంలో పనిచేసే ఢిల్లీ పోలీసులు కూడా అవే పలుకులు 'ఎఫ్.ఐ.ఆర్.' లో నమోదు చేసారు. కేంద్ర హోం మంత్రి ప్రకటన తప్పుదోవపట్టించేదిగా వుందని, తమ  ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా వుందని 'ఆప్' నాయకుడు సంజయ్ సింగ్ ఆరోపించారు. అటు బీజేపీ ఇటు 'ఆప్'  ఈ రెండింటినీ సంఘటనకు బాధ్యుల్ని చేస్తూ కాంగ్రెస్ వ్యాఖ్యానాలు సాగాయి. కేంద్రం కనుసన్నల్లో  పనిచేసే ఢిల్లీ పోలీసులు చేసే దర్యాప్తుపై 'ఆప్' ప్రభుత్వానికి ఎటూ నమ్మకం వుండదు కనుక, ఈ సంఘటనపై  హైకోర్టు న్యాయమూర్తితో విచారణ  జరిపించడం సముచితంగా ఉంటుందని ఆ పార్టీ నాయకుడు అజయ్ మాకెన్ సూచించారు. ఇవి కొంతవరకు రాజకీయ పరమైన వ్యాఖ్యలుగా తీసుకున్నప్పటికీ  మరికొందరు 'ఆప్' నాయకులు స్పందించిన తీరు విమర్సలకు గురయింది. మొత్తం ఉదంతాన్ని ఎద్దేవా చేసే రీతిలో మాట్లాడడానికి ప్రయత్నించి వారు  అభాసుపాలయ్యారు.
ఒక విషాద సంఘటన దరిమిలా సాగిన ఈ విమర్శలు, ప్రతి విమర్శల స్థాయి చూసి జనం ముక్కు మీద వెళ్ళేసుకోవాల్సి వచ్చింది.  నోళ్ళు జారిన నాయకులు చివరికి నాలుకలు కరుచుకోవాల్సివచ్చింది.        
ఒక వ్యక్తి  మరణం, అందులోనూ ఇలాటి ఆత్మ హననం గురించి ఒక్క  ఢిల్లీ లోనే కాదు దేశ వ్యాప్తంగా చర్చలు జరిగాయి. గాలిలో కలిసి పోయిన ప్రాణానికి ధర కట్టినట్టు  ప్రభుత్వాలు, పార్టీలు  ఎంతో కొంత సాయం ప్రకటించి చేతులు దులుపుకున్నాయి.
ఢిల్లీ సంఘటన రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలకు కేంద్ర బిందువుగా మారినప్పటికీ, దేశంలో సాగిన చర్చల సరళి రైతాంగం పరిస్తితులపై  దృష్టి సారించేందుకు   దోహదపడ్డాయి. ఎన్నోనాళ్ళుగా జనాల మెదళ్లలో సుళ్ళు తిరుగుతున్న పలు సందేహాలను తెరపైకి తీసుకువచ్చాయి.
'భారత దేశం ప్రధానంగా వ్యవసాయిక దేశం' అంటూ  బొడ్డూడని  ప్రతి రాజకీయ నాయకుడు చెప్పే మాటలు వినీ  వినీ,  జనాల చెవులకు తుప్పుపట్టింది. పార్టీలతో నిమిత్తం లేకుండా ఏ రాజకీయ నాయకుడయినా చెప్పే ఇంకో మాట ఒకటుంది. 'తానూ రైతు కుటుంబం నుంచి వచ్చాననీ, వాళ్ళు పడే ఇబ్బందులన్నీ తనకు కరతలామలకమని'. అయితే ఇవన్నీ మాటలకే పరిమితం అవుతున్నాయి కాని చేతల వరకు రావడం లేదని అందరికీ తెలిసిన విషయమే. 'అందరికీ తెలిసిన విషయమే'  అని తెలిసికూడా వాళ్ళు ఆ మాట పదే పదే  చెప్పడానికి మాత్రం  ఏమాత్రం నామోషీ పడరు.
నిజానికి రైతుల సమస్యలు వారి స్వయంకృతం కాదు. పొలం దున్ని విత్తునాటిన నుంచీ ఫలితంకోసం ప్రకృతి మీదనో, ప్రభుత్వాల మీదనో ఆధార పడాల్సిన దుస్తితి వారిది. ఒకరకంగా చూస్తె వారివి తీర్చలేని పెద్ద సమస్యలు ఏవీ కావు. తరుణం మించి పోకుండా నేలలో విత్తనం పడాలి. తరుణంలో ఎరువులు దొరకాలి. పండించిన పంటకు తరుణం మించి పోకుండా గిట్టుబాటు ధర లభించాలి. ప్రభుత్వాలు తలచుకుంటే ఈ సమస్యలను తీర్చడం వాటికో లెక్క కాదు.
పొతే, అటు రైతుల చేతులో, ఇటు ప్రభుత్వాల చేతుల్లో లేని మరో సమస్య వుంది. సమయానికి వానలు పడకపోయినా, పడిన వానలు అవసరానికి మించి పడ్డా రైతుకు ఇబ్బందే. అతివృష్టి, అనావృష్టి వల్ల కలిగే నష్టాలను ఏ ప్రభుత్వం భర్తీ చేయలేని మాటా నిజమే. అయితే, 'అందిస్తాం' అన్న సాయాన్ని ఆలస్యం లేకుండా అందించకలిగితే, అరకొర సాయం అయినా రైతులు అదే పదివేలని తృప్తి పడతారు. కాకపోతే నిబంధనల పేరుతొ సాగే కాలయాపన వల్ల ప్రభుత్వాలు అందించే సాయం కూడా వారికి  అక్కరకు రాకుండా పోతోంది. అతివృష్టితో కోతకు వచ్చిన పంట వరదల్లో కొట్టుకు పోయి రైతుకు కడుపుకోత మిగిలిస్తుంది. అనావృష్టితో విత్తిన గింజ నేలలోనే నిదురపోయి రైతు కంటికి నిద్ర లేకుండా చేస్తుంది. సరే! అన్నీ సమకూరాయి. పంటలు దండిగా పండాయి. రైతుల ఇంట్లో గాదెలు నిండాయి అనుకుందాం.  అదేం చిత్రమో, అప్పటివరకు ఆకాశంలో వున్న పంటల ధరలు అమాంతం నేలచూపులు చూస్తాయి. పంటలు బాగా పండాయన్న రైతు సంతోషం ఆవిరి అయిపోతుంది. మరో చిత్రం. చేసిన అప్పులు తీర్చడానికి పండిన పంటను అయినకాడికి అమ్ముకున్న మరుసటి రోజునుంచే ధరలు ఆకాశంలోకి మళ్ళీ  ఎగబాకుతాయి. అవసరార్ధం తక్కువ ధరలకు అమ్ముకున్న తిండి గింజల్నే తిరిగి అధిక ధరలకు రైతులు కొనుక్కోవాల్సి రావడం మరో విషాదం.
ఏటేటా ఎదురవుతున్న ఈ సమస్యలకు ఒక నిర్దిష్టమైన పరిష్కార విధానం రూపొందించి సక్రమంగా అమలుచేయగలిగితే, ఆత్మహత్యలకు రైతులను ప్రేరేపిస్తున్న కొన్ని కారణాలకు సమాధానం దొరుకుతుంది.
 దీనికి కావాల్సింది కోట్ల రూపాయల నిధులు కాదు, కాసింత చిత్తశుద్ధి.
అదేమిటో, ప్రకృతి వైపరీత్యాల వంటి కారణాలు ఏవీ లేకుండానే దేశంలో చిత్తశుద్ధికి తీవ్రమైన  కొరత ఏర్పడుతోంది.
ఎవరయినా విదేశాలవాళ్ళు వచ్చి 'చిత్తశుద్ది' కర్మాగారాలు ఏర్పాటు చేయాలేమో!
 (25-04-2015)

రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com  మొబైల్: 98491 30595

2 కామెంట్‌లు:

hari.S.babu చెప్పారు...

కేజ్రీవాల్ నిజంగా క్రేజీవాల్ సుమీ!

ఒక రైతు అరగంటసేపు అంత హడావిడి చేసి కళ్లముందే చచ్చిపోతే అంతసేపూ తమాషా అనుకుని చూసినా అతను నిజంగానే ఆ పని చేశాడని తెలిసి ఆస్పత్రికి తీసుకెళ్తున్నా ఆపకుండా తన హడావిడి తను చెయ్యటం చూస్తుంటే కనీసపు మానవత్వం కూడా లేదేమో అనిపిస్తుంది గదా?!

అయినా అతను తీవ్రమయిన అకాలవర్షాలకి పంట నష్టపోయి యెవరూ పట్టించుకోక అంతపని చేస్తే దాన్ని కూడా భూసేకరణ బిల్లుకి అంటగట్టాలని చూడటం చూస్తుంటే "గోధ్రా అల్లర్లు" అనే ఒక్క ముక్కని భుజానేసుకుని యేళ్ళ తరబడి అల్లరల్లరి చేస్తూ తిరిగి ముస్లిములకే వీళ్లకన్నా మోదీయే మెరుగు అనిపించేటంతగా అభాసు పాలయిన కాంగ్రెసోళ్ళూ కమ్యునిష్టోళ్ళూ గుర్తుకు రావటం లేదా?

Saahitya Abhimaani చెప్పారు...

చిత్తశుద్ది కూడా విదేశీయులే నేర్పాలా! దారుణం కాదూ! ఇజాలు విదేశీవి, వాటిమీద మోజుతో పార్టీలే పెట్టుకున్నారు, కట్టే గుడ్డలు, మాట్లాడే భాష, వ్రాసే భాష, పనిచేసే భాష, తినే తిండి బ్రాండు, పూసుకునే సెంటు, అన్నీ విదేశీవే కాని, చివరకు చిత్తశుద్ది కూడా విదేశీయులే మనకు ఎగుమతి చెయ్యాలా! నా దృష్టిలో మన ప్రజలకు వేరేవాళ్ళు చెప్పాల్సిన పనిలేదు, పైగా విదేశీయులు. మీడియా వాళ్ళు వార్తలను వార్తలుగా ప్రజలకు అందచేస్తే చాలు, వాళ్ళ వ్యాఖ్యలతో, వాళ్ళ బుర్రలో పుట్టిన ఆలోచనలతో, పనికి రాని చెత్త చర్చలతో వార్తలను కల్తీ చెయ్యకుండా, వార్తలు వార్తలుగా మాకు ఇవ్వండి. ఆ చిత్తశుద్ది ఉంటే, ప్రజల్లో చిత్తశుద్ది దానంతట అదే వస్తుంది. ప్రజలకంటే ఎవరూ ఎక్కువకాదు, ప్రజలకు ఎవరూ బోధించాల్సిన పనిలేదు.