18, ఏప్రిల్ 2015, శనివారం

చీలి కలిసే 'ఐక్యతాప్రయోగం' ఫలిస్తుందా?


(Published in 'SURYA' telugu daily in it's edit page on 19-04-2015, SUNDAY)

'జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలుతుంద'న్న తెలుగు సామెతను పోలే ఓ పద ప్రయోగం ఒకటి  బీజేపీ జాతీయ  అధ్యక్షుడు అమిత్ షా నోట వినబడింది. పూర్వపు జనతా దళ్ లో భాగస్వాములుగా వుండి తదనంతరం చీలిపోయి వేరు కుంపట్లు పెట్టుకున్న ఆరు ప్రాంతీయ పార్టీలు  'జనతా పరివార్'  అనే పేరుతొ ఒక్కటయిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ, ఆ కలయికకు ఓ కొత్త పోలిక చెప్పారు.  'సున్నాతో మరో సున్నా కలిస్తే గుండు సున్నా అవుతుంద'ని చమత్కరించారు.  

  
అమిత్ షా అభిప్రాయంతో ఏకీభవించాల్సిన పరిస్తితి లేకపోయినా అసలీ విలీనీకరణ నేపధ్యాన్ని తడిమి చూసుకోవాల్సిన అగత్యం ఏర్పడుతోంది. ఈ ఆరు పార్టీలకు వేర్వేరు పేర్లు ఉన్నప్పటికీ, వాటికి నాయకులుగా వున్న నేతల పేర్లను జోడించి  చెబితేనేకాని  ఆ పార్టీలకు ఓ గుర్తింపు లభించని ఓ వింత పరిస్తితి వుంది. ప్రాంతీయ పార్టీల మనుగడ వాటి నాయకత్వ దక్షత మీదనే ఆధారపడి ఉంటుందన్నది అనుభవం నేర్పే పాఠం. తమిళనాట ఈ సంస్కృతి మరింత వూడలు దిగి విస్తరించింది. పార్టీలు, సిద్ధాంతాలు ఏమైనప్పటికీ,  వాటి కంటే కూడా ఆయా పార్టీల నాయకుల పేరు, ప్రఖ్యాతులు చెప్పే  అవి కాయలు అమ్ముకోవాల్సిన దుస్తితి ఉందన్నది  బహిరంగ రహస్యమే. ఈ ఆరు ప్రాంతీయ  పార్టీల పరిస్తితి ఇందుకు భిన్నం ఏమీ కాదు. ఉదాహరణకు భారత జాతీయ లోక్ దళ్. దీనికి ఇంటి పేరు మాదిరిగా ముందు 'చౌతాలా' అని తగిలిస్తేనే కాని అ పార్టీ గురించి ఎవ్వరికీ తెలియదు. అలాగే, 'ములాయం' సమాజ్ వాది  పార్టీ, 'లాలూ' రాష్ట్రీయ జనతా దళ్, 'నితీష్' జనతా దళ్(యు), 'దేవెగౌడ' జనతా దళ్ (ఎస్), 'కమల్ మొరార్క' సమాజ్ వాదీ జనతా పార్టీ. ఇలా ఆయా నాయకుల పేర్లతో చెలామణీ అవుతున్న ఈ పార్టీలన్నీ 'జనతా పరివార్' అనే పేరుతొ ఏకం కావాలని సంకల్పించాయి. ఈ ప్రయోగ సాఫల్య, వైఫల్యాలను నిర్ణయించే తరుణం కూడా అయిదారునెలల్లోనే రాబోతోంది. ఈ పార్టీల విలీనంపై ప్రజామోదం ఏ తీరులో వుండబోయేది బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తేలిపోతుంది.           
గతంలో కూడా భారత రాజకీయాల్లో ఇటువంటి ప్రయోగాలు జరిగాయి. ఎమర్జెన్సీ తరువాత జరిగిన 'జనత' ప్రయోగమే విజయవంతం అయింది. కాంగ్రెస్ పార్టీని కలలో, ఇలలో వ్యతిరేకించే అనేక పార్టీలు ఒకే పార్టీగా రంగూ రూపూ మార్చుకుని ఎమర్జెన్సీ అనంతరం జరిగిన ఎన్నికల్లో ఒకే పేరు, ఒకే గుర్తు, ఒకే జెండా, ఒకే ఎజెండా' తో కాంగ్రెస్  తో తలపడి, ఆ పార్టీని మట్టి కరిపించాయి.
అంతకు ముందు వరకు ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ తన రాజకీయ ప్రత్యర్ధులకు చుక్కలు చూపించారు. వామ పక్షాలను మినహాయిస్తే ఆ రోజుల్లో వున్నవి నాలుగే జాతీయ ప్రతిపక్షాలు. కాంగ్రెస్ (ఓ), భారతీయ జన సంఘ్, భారతీయ లోక్ దళ్, సోషలిష్ట్ పార్టీ. ఈ పార్టీలకు కాంగ్రెస్ వ్యతిరేకత అన్న ఉమ్మడి అంశం తప్పిస్తే సిద్ధాంతాలు సూత్రాల విషయంలో ఒకటికొకటి పొసగని పరిస్తితే. దండలో దారంలా ఆ పార్టీలను ఆ ఒక్క అంశమే దగ్గరకు తీసింది. ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న కొన్ని దుందుడుకు చర్యలు వాటి ఐక్యతకు ప్రజామోదాన్ని అందించింది. కీర్తి శేషులు లోక్ నాయక్  జయప్రకాష నారాయణ్ నాయకత్వం ఈ పార్టీల కలయికకు ఒక నిబద్ధతను కల్పించింది. ఫలితం ప్రప్రధమ విలీన ప్రయోగం సాధించిన అద్భుత విజయం.          
తదనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కొత్తగా ఏర్పడ్డ జనతాపార్టీ, ఆ పార్టీకి మద్దతు ఇచ్చిన పార్టీలు కలిసి   వూడలు దిగిన కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్ళతో పెళ్లగించి వేసాయి. మొత్తం 542 లోక్ సభ స్థానాల్లో 345 స్థానాలను  కైవసం చేసుకున్నాయి. స్వాతంత్రానంతరం  దేశంలో, మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా  మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటయింది. కాంగ్రెస్ కు దాని మిత్ర పక్షాలకు కేవలం 189 సీట్లు మాత్రమె దక్కాయి. అవీ ఎక్కువగా దక్షిణ భారతంలో. ఉత్తర భారతంలో ఆ పార్టీ దాదాపు తుడిచిపెట్టుకు పోయింది. ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీతో సహా ఆ పార్టీ అతిరధ మహారధులందరూ పరాజయం పాలయ్యారు. యావత్తు ఉత్తర భారత రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ  కేవలం రెండే రెండు సీట్లతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. ఈ ఘోర పరాజయం ఇందిరాగాంధీ కళ్ళు తెరిపించింది. ఎమర్జెన్సీ లో జరిగిన ఆకృత్యాలకు ఆమె స్వయంగా జాతికి క్షమాపణ చెప్పారు.
అలా మొదలయిన ఓ అద్భుత రాజకీయ ప్రయోగం కొందరు స్వార్ధపరులయిన రాజకీయ నేతల పుణ్యమా అని కొద్ది కాలంలోనే విఫలం అయింది. ఇందిర, సంజయ్ లను అరెస్టు చేసి జైల్లో పెట్టడం, ఎమర్జెన్సీ ఆకృత్యాలను విచారించడానికి షా కమీషన్ ఏర్పాటుచేసి ఆ పేరుతొ ఇందిర కుటుంబాన్ని వేధింపులకు గురిచేయడం, వారి వ్యక్తిగతజీవితాలపై బురద చల్లే ప్రయత్నాలు సాగించడం మొదలయిన చర్యలు  ప్రజల్లో తిరిగి ఇందిరా గాంధీ పట్ల సానుభూతి పెరగడానికి దోహదం చేశాయి.  ప్రజలు తమకు  కట్టబెట్టిన అధికారాన్ని వారి బాగోగులకోసం వాడుకోవడానికి బదులు రాజకీయ ప్రతీకారాలకు వినియోగించే విధానం జనాలకు నచ్చలేదు. పైపెచ్చు ఇందిరను అధికారం నుంచి తొలగించడం కోసమే ఆ పార్టీలన్నీ ఏకమయ్యాయి తప్ప వారికి మరో ధ్యాస లేదన్నట్టుగా అంతర్గత కుమ్ములాటలకు జనతా పార్టీని ఒక వేదికగా మార్చారు. ఫలితం అంత మెజారిటీతో ఏర్పడ్డ జనత ప్రభుత్వం పూర్తి అయిదేళ్ళ కాలంకూడా  అధికారంలో కొనసాగలేక కుప్పకూలిపోయింది. ఈ ప్రయోగ వైఫల్యం కాంగ్రెస్ పార్టీకి ఎంతగా కలిసొచ్చిందంటే తదుపరి  జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తిరస్కరించిన ప్రజలే తిరిగి ఆ పార్టీకి పట్టం కట్టారు. బ్రహ్మ రధం పట్టి అధికార పీఠం ఎక్కించారు.
ఇదంతా ఎందుకు పునశ్చరణ చేసుకోవాల్సివచ్చిందంటే - రాజకీయ పార్టీల విలీనాలు సిద్ధాంత ప్రాతిపదిక  మీద కాకుండా యేవో పైకి కనిపించని ఎజెండా ఆధారంగా జరిగితే వొనగూడే ప్రయోజనాలు కూడా తాత్కాలికమే. ప్రజలకు పనికి వచ్చేలా నాలుగు కాలాలపాటు మనగలగడం కష్టం.  
ప్రస్తుతానికి వస్తే, జనతా పరివార్ అనేది  కూడా తాత్కాలికంగా మీడియాలో వినవస్తున్న కొత్త పార్టీ పేరు. విలీనం కావాలన్న నిర్ణయం అయితే జరిగింది కానీ, కొత్త పార్టీకి ఇంకా పేరు, జెండా, ఎజెండా, గుర్తు ఖరారు కావాల్సివుంది. ఎన్నికల్లో పార్టీ గుర్తు ఏమిటన్నది ఎన్నికల కమీషన్ చేతుల్లో వున్న విషయం. అయినా ములాయం సైకిల్, లాలూ లాంతరు గుర్తుల విషయంలో కొంత చర్చ జరుగుతున్నట్టు వినికిడి. ఉమ్మడి ఎన్నికల గుర్తు కొన్ని చిక్కులను తెచ్చిపెట్టే ప్రమాదం వుంది. ఈ ఆరు ప్రాంతీయ పార్టీలకు వారి వారి రాష్ట్రాల్లో వారి సొంత బలం వున్నట్టుగానే ఆయా పార్టీల ఎన్నికల గుర్తులు కూడా కొంత ప్రాచుర్యం పొందిన మాట కూడా కాదనలేనిది. అంచేత ఉమ్మడి గుర్తు ఎన్నికల ఫలితాలపై కొంత పరోక్ష ప్రభావం చూపే అవకాశం వుంటుంది. అంచేతే కాబోలు, విలీన నిర్ణయం ఆర్భాటంగా  ప్రకటించిన నేతలు విధివిధానాల ఖరారు అంశంపై కాలయాపన చేస్తున్నారు.
ఈ కొత్త ప్రయోగ విజయావకాశాలపై కొన్ని సందేహ మేఘాలు కమ్ముకోవడానికి కూడా ఆధారాలు వున్నాయి. ఒక వేదికపైకి వచ్చి చేతులు అయితే కలిపారు కాని వారి మనసులు కలిసాయి అనడానికి నమ్మకం కుదరడం లేదు. ఎందుకంటె పరస్పరం కత్తులు దూసుకునే విషయంలో ఈ పార్టీల నాయకుల గతం అలాటిది. ఒకరికొకరు చుక్కెదురు. ఒకరి పొడ మరొకరికి గిట్టదు. ఆధిపత్య స్వభావం విషయంలో మాత్రం అందరిదీ ఒకే బాట. తమ మాటే నెగ్గాలనే తత్వం అందరిలో వుంది. ఒక్క నితీష్ కుమార్ ని మినహాయిస్తే అవినీతి విషయంలో మినహాయింపు ఇవ్వగల నాయకులు ఆ పార్టీల్లో  లేరు. గతంలో కాంగ్రెస్ వ్యతిరేకత మాదిరిగా బీజేపీ వ్యతిరేకత ఒక్కటే వారినిప్పుడు విలీనం దిశగా అడుగులు వేయించింది.
ఈ విలీనం అనుకున్న ఫలితాలను ఇవ్వదని ఖరాఖండిగా చెప్పడం కూడా కష్టమే. కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని బీహార్ ఉప ఎన్నికల ఫలితాలు తెలుపుతున్నాయి. బహుశా ఇదే వారిని దగ్గరకు తీసిన అంశం అయివుంటుంది. అంతే కాకుండా ఇలా కుమ్ములాడుకుంటూ రాజకీయ కాలక్షేపం చేస్తూ పొతే చాప కింద నీరులా పాకుతూ వస్తున్న బీజేపీ ప్రభంజనాన్ని అడ్డుకోవడం కష్టం అన్న ఎరుక కూడా.            
ఐకమత్యం మహా బలం కావచ్చు. ఐక్యతారాగం అందుకుంటే ఆశించిన ఫలితాలు అందుకోనూ వచ్చు. అయితే చీలి కలిసే నాయకుల్లో చిత్తశుద్ధి లోపిస్తే మాత్రం భవిష్యత్తులో ఇటువంటి ప్రయోగాల పట్ల ప్రజల్లో  నమ్మకం పూర్తిగా  సడలిపోతుంది. అటువంటి నమ్మకం ఇప్పటికే బీటలు వారి ఉందన్న వాస్తవాన్ని గమనంలో పెట్టుకోవాలి.
అయితే, కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ కూడా ఒక  విషయం గుర్తుంచుకోవాలి. ఎన్నికల్లో గొప్ప వాగ్దానాలు ఏమీ చెయ్యకపోయినా ప్రజలు వారిని గద్దె ఎక్కించడానికి కారణం కేవలం ఆ పార్టీ పట్ల, ఆ పార్టీ నాయకత్వం పట్ల  పెంచుకున్న నమ్మకం ఒక్కటే కాదు, అంతకు పూర్వం  కాంగ్రెస్ పాలనపై  వారు పెంచుకున్న వ్యతిరేకత కూడా. ప్రజల్లో వ్యతిరేకత పెరిగితే ప్రతిపక్షాల ఐక్యత  ఓటమికి తోడవుతుంది అన్న వాస్తవాన్ని మరచిపోకూడదు.
ఏ పాలకపక్షానికయినా అన్వయించే సూక్తి ఇదొక్కటే! (18-04-2015)

రచయిత మొబైల్: 98491 30595, ఈమెయిలు:  bhandarusr@gmail.com

NOTE: Photo Courtesy Image Owner 

3 కామెంట్‌లు:

Saahitya Abhimaani చెప్పారు...

ఒకప్పుడు పార్టీలన్నీ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కూటమి(!) గా ఏర్పడేవి. ఇప్పుడు బి జే పి కి వ్యతిరేకంగా కూటమి! ఏమైనా బి జే పి బాగానే అభివృద్ది చెందిందనే చెప్పాలి.

అజ్ఞాత చెప్పారు...

మతతత్వ పార్టి లన్ని కలుస్తున్నాయన్నమాట ..
అయినా , బిజెపి కి వచ్చిన నష్టం ఏమి లేదు . మధ్యతరగతి అని ఒక వర్గం ఉంది, వాళ్లకి కూడా ఆలోచనలు ఉంటాయని గుర్తించింది కేవలం బిజెపి మాత్రమే .
ఈ దేశం మధ్యతరగతి ఉన్నంత వరకు బిజెపి ఉంటుంది .

Saahitya Abhimaani చెప్పారు...

"మతతత్వ పార్టి లన్ని కలుస్తున్నాయన్నమాట"

బాగా చెప్పారు అజ్ఞాత గారూ.

ఈమాత్రం వ్యాఖ్యకు పేరు వ్రాసుకోవటానికి భయం దేనికి!