29, డిసెంబర్ 2012, శనివారం

రాజమండ్రి రైల్వే స్టేషన్లో దిగిపోయిన శ్రీనాధుడు



రాజమండ్రి  రైల్వే స్టేషన్లో  దిగిపోయిన  శ్రీనాధుడు


ఆరోజు విజయవాడలో ఆఫీసర్ల క్లబ్ వార్షికోత్సవం. వూళ్ళో వున్న పెద్ద పెద్ద ఆఫీసర్లు భార్యలతో సహా వచ్చారు. సాహిత్యం మీద ఇష్టాగోష్ఠి. స్టేజీమీద రైల్వే డి.ఆర్.ఎం గారు ముఖ్య అతిథిగా ఆసీనులయ్యారు. ఆ క్లబ్బుకి వారి సతీమణి కార్యదర్శి. ముఖ్యాంశం శ్రీనాధుని కవితా వైభవం. 

శ్రీనాధుని కవిత్వం గురించి సీస పద్యాలు ఉదహరిస్తూ ఒకరు మాట్లాడారు. ఆయన ప్రసంగం అవగానే అందరూ చప్పట్లు కొట్టారు. డి.ఆర్.ఎం గారు క్లబ్ చేస్తున్న కార్యక్రమాలను ప్రశంసించారు. 

చివర వందన సమర్పణ చేస్తూ డి.ఆర్.ఎం గారి సతీమణి "శ్రీనాధుని కవిత్వం గురించి ఎన్నో చక్కని విషయాలు చెప్పారని అబినందిస్తూ ఆ శ్రీనాధుని ఒక వారం రోజుల క్రితమే తాను తమిళ్‌నాడు ఎక్స్ ప్రెస్ రైల్లో చూసానని, ఆయన ఫలానావారు అని తెలిసేలోగానే వారు రాజమండ్రీలో రైలు దిగి వెళ్ళిపోయారని, అలాంటి మహాకవిని కలిసి మాట్లాడలేకపోవడం తన దురదృష్టమని" విచారంగా చెప్పింది. 

సభలో అంతా అవాక్కయ్యారు. ఆ నిశ్శబ్దానికి కారణం తెలియక భర్త వైపు చూసింది. డి.ఆర్.ఎం గారు భార్యకేసి కోపంగా చూసారు. 

సరే కార్యక్రమం పూర్తి అయింది. డి.ఆర్.ఎం గారు సతీమణితో కార్లో ఇంటికి వెళ్తున్నారు. 

మౌనంగా వున్న భర్తతో "ఏమండీ నేనేమన్నా తప్పుగా మాట్లాడానా, నాకేసి కోపంగా చూసారు?" అని అడిగింది. 

"
నీకు బుద్ధిలేదు. ఏం వాగావో తెలుసా?" 

"
నేనేమన్నానండి?" అంది భయంభయంగా. 

"
తమిళ్‌నాడు ఎక్స్ ప్రెస్ రాజమండ్రీ మీదుగా వెళ్తుందా? ఆ మాత్రం ఇంగిత ఙ్ఞానం లేకుండా మాట్లాడితే నలుగురూ నవ్వరూ? చూసావా అందరు విస్తుపోయి నీకేసి ఎలా చూసారో?" 

"
అవునండి. అది హౌరా మెయిల్ అనబోయి తమిళ్‌నాడు అన్నా" అంది ఖిన్నురాలై.

5 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

సూపర్...సూపర్... సూపర్...

అజ్ఞాత చెప్పారు...

హ్వహ్హ్వాహ్హ్వా

శ్రీరామ్ చెప్పారు...

Kevvu keka

Gopal చెప్పారు...

ఇలాంటిది నిజంగానే జరిగింది. కబీరు మీద విశ్వవిద్యాలయంలో గోష్టి ఉంది. వి.సి. గారి లెక్చరు హిందీలో తయారవుతోంది. ఆ వీసీ గారు కబీరు నాకు చాలా బెస్ట్ ఫ్రేండు ఆ విషయంకూడా అందులో రాయండి అన్నారు. ... పాపం ఆయనకు నిజంగానే కబీరు అనే ఆయన దోస్త్ . కాకపోతే ఆయనకు ఆ కబీరు ఈ కబీరు ఒకటని తెలవదు.

సో మా ర్క చెప్పారు...

శ్రీనివాస రావుగారూ!చాలా బాగుంది మీ వార్తా వ్యాఖ్య.శ్రీ నాధుడు నిజంగానే దిగాడేమో! రాజమండ్రీ టేషన్లో కొంచెం నిజమేనేమో!అనిపిస్తోంది నాకుకూడా!
ధన్యవాదాలు