24, డిసెంబర్ 2012, సోమవారం

గెలుపెవరిది?


గెలుపెవరిది?అనగనగా ఇద్దరు ........

తాతయ్య కధ చెప్పడం మొదలుపెట్టగానే చిన్నారి శంకరం అల్లరి మానేసి బుద్ధిగా వినడం మొదలెట్టాడు.

ఆ ఇద్దరిలో ఒకరికి  ముట్టె పొగరు జాస్తి. వాడికి  లేని అవలక్షణాలు లేవు. కోపం వస్తే వొళ్ళూ పై తెలియదు.పక్కవారు పచ్చగా వుంటే  కంట్లో నిప్పులు పోసుకుంటాడు. వాడి  అత్యాశకు అంతులేదు.  దురాశకు అవధులు లేవు. అన్నీ తనకే  కావాలనుకుంటాడు. పైగా, ఈ లక్షణాలకు తోడు  తనమీద తనకే ఎక్కడలేని  జాలి. భేషజానికేం  తక్కువలేదు. లేనిపోని  గొప్పలు చెప్పుకుంటూ తనో గొప్పవాడినని భ్రమ పడుతుంటాడు. పచ్చి అబద్దాలతో పబ్బం గడుపుకుంటాడు. పైపెచ్చు అహంకారం. ఎవర్నీ లెక్కచేయని తత్వం. తప్పు చేయడం అసలు  తప్పే కాదనుకునే మనిషి
మనుషుల్లో ఇలాటివాళ్ళు కూడా వుంటారా తాతయ్యా?’ అమాయకంగా అడిగాడు శంకరం.
మరో రకం కూడా వుంటారు.చెప్పసాగాడు తాతయ్య.
ఈ ఇద్దరిలో రెండోవాడున్నాడే వాడే ఈ రెండో రకం. వీడు మొదటివాడికి పూర్తిగా విరుద్ధం.
వీడేమో  అతి మంచివాడు. మంచంటే కామంచి కాదు. పుటం వేసిన బంగారం లాంటి మనిషి. ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ తుళ్ళుతూ వుంటాడు. ఎదటివారిని నవ్విస్తుంటాడు. పక్కవాడికి కాల్లో ముల్లు గుచ్చుకుంటే వీడికి కంట్లో నీరు తిరుగుతుంది. హాయిగా  హాయిని పంచి పెడుతూ ఎంతో  హాయిగా జీవించడం వీడి నుంచే నేర్చుకోవాలి. తనమీద తనకు యెనలేని విశ్వాసం. భవిష్యత్తు మీద ప్రగాఢమైన నమ్మకం.  ఉదార హృదయం. తన గురించి ఆలోచించకుండా అవసరంలో వున్నవాడికి సాయపడడం వీడి నైజం.
ఇలాటి వాళ్లు కూడా వుంటారా తాతయ్యా!మనవాడి సందేహం.
వుంటార్రా. అలాటివాళ్ళు వుండబట్టే మనందరం వుండగలుగుతున్నాం. అదిసరే. ముందు కధ విను.
ఈ ఇద్దరి నడుమా ఒకరోజు పోట్లాట వచ్చింది. అది చిలికి చిలికి గాలివానగా మారి భీషణ పోరాటంగా మారింది.
ఇద్దరిలో ఎవరు గెలిచారు తాతయ్యా?’ మనవడి ప్రశ్న.
తాతయ్య ఒక్క క్షణం ఆగి,
ఎవరు గెలుస్తారు? మనం ఎవరికి పాలుపోసి పెంచితే వాడిదే గెలుపు.
అంటూ తాతయ్య విలాసంగా నవ్వాడు.
(తనకు బాగా నచ్చిన చిన్న కధ అని కితాబు ఇస్తూ గూగుల్ ప్లస్ లో సుజాతగారు పోస్ట్ చేసిన ఆంగ్ల కధకు స్వేచ్చానువాదం – భండారు శ్రీనివాసరావు )

కామెంట్‌లు లేవు: