27, డిసెంబర్ 2012, గురువారం

ఏం భాషరా బాబు!


ఏం భాషరా బాబు!


తిరుపతిలో తెలుగు సభలేమో కాని టీవీ చానళ్ళలో తెలుగు చర్చలు హోరెత్తి పోతున్నాయి. నిన్న ఒక ఛానల్లో పాల్గొన్న  ముగ్గురూ ఓ పక్క తెలుగులో మాట్లాడుతూనే మరో పక్క మీ తెలుగు వేరు మా తెలుగు వేరు అని  వాదించుకోవడం చూసి చూస్తున్న వారికి  మతి పోయింది. ఒకాయన ఏకంగా దేశంలో యే భాషకు లేనివిధంగా ఒక్క తెలుగుకే తెలుగు,తెనుగు, తెనుంగు అని రకరకాల పేర్లు వున్నాయని, కావున రాష్ట్రంలో ఎవరి తెలుగు వారిదేననీ తేల్చేసారు. మరి పొరుగున వున్న తమిళనాడులో అరవం, తమిళం అని ఒకే భాషను రెండు రకాలుగా పిలుస్తున్న సంగతిని ఆయన వాదం కోసం కాసేపు మరచిపోయినట్టున్నారు. పైగా చర్చలో పాల్గొంటున్న వారెవ్వరూ తమ యాసలో తెలుగు మాట్లాడలేదు. అందరూ మాట్లాడే తీరు ఒకేరకంగా వుంది. పక్కవారు మాట్లాడేది అసలు తెలుగే కాదంటారు. వితండవాదం అంటే ఇదే కాబోలు.

ఇలావుంటే ఈ రోజు ఫేస్ బుక్ లో ఓ మిత్రుడు శ్రీ మంచాల శ్రీనివాసరావు  పెట్టిన పోస్టింగ్ తెలుగుకు పట్టిన తెగులుకు అద్దం పట్టేదిగా వుంది. చిత్తగించండి.
    
ఈనాడు" తెలుగీకరణ తెల్లారినట్టే ఉంది... ఖర్మరా బాబూ!!
APPSC
అంటే రాష్ట్ర ప్రజా సేవ సంస్థ అట! అది సర్కారు కొలువులకు నియామక పరీక్షలు నిర్వహించే సంస్థ మాత్రమే... అందులో సేవ అనే పదానికే అర్థముండదు.... కనీసం ఉద్యోగ నియామక సంస్థ అని చెప్పినా ఓ తీరుగా ఉండేది...!
IAS
పదానికి తెలుగీకరణ మరీ ఘోరంగా ఉంది. indian అనగానే భారత్, administration అనగానే పాలన, service అనగానే సేవ... ఇంకేం, భారత పాలన సేవ అని తేల్చేశారు... అది ఒక జాతీయ స్థాయి ఉద్యోగ కేడర్ అనే అర్థమేమైనా స్ఫురిస్తోందా అసలు!?
records
కి తెలుగు పదం నమోదు పత్రమట!! record చేయడం అనగానే నమోదు అనే పదం గుర్తొచ్చి అలా తేల్చేశారు... కానీ ఇక్కడ records అంటే పత్రాలను పదిలపర్చడం.... 
market yard
అంటే విపణి వేదిక అట! market అంటే ఎంతటి విస్తృతార్థం ఉందో తెలిసినవారెవ్వరూ ఈ పదాన్ని మామూలు market yardకి ఉపయోగించరు!!
commission agents
కి ప్రతిఫలాపేక్షదారులు అనే అనువాద ప్రయాస కూడా గుత్తేదారు అనే విఫల ప్రయోగాన్నే గుర్తుకు తెస్తోంది... .
మంచి సంకల్పం ఉన్నా... ఇలాంటి వంకర, సంకర పదాలు సృష్టిస్తే భాషకు మరింత నష్టదాయకం అవుతుంది...!!
NOTE: కార్టూనిస్టుకు ధన్యవాదాలు  

2 కామెంట్‌లు:

Saahitya Abhimaani చెప్పారు...

"వంకర, సంకర పదాలు సృష్టిస్తే భాషకు మరింత నష్టదాయకం అవుతుంది"

బహుబాగా చెప్పారు, ఒక్క ఈనాడు పత్రికే కాదు "గూగుల్ గుంపులు"(Google Groups)ట(ఇంకా నయం మందలు అనెయ్యలేదు!)ఆంగ్లంలో ఉన్న గ్రూప్ అనే పదానికి తమకు తాము పేరు పెట్టుకునేప్పుడు కూడా అపభ్రంశపు అనువాదనే చెబట్టారు. "గ్రూప్" అంటే బృదం అని కాని గుంపు కాదు. "క్రౌడ్" అంటే గుంపు. గుమికూడటం అంటే పనీపాటలేక ఏదో వింత జరుగుతోందని ఒకచోట అనుకోకుండా పోగుబడినవారికి వాడే మాట. బృదం అంటే, ఒకే దృక్పథంతో, ఒక పని చేయాలని ముందుగా నిర్ణయించుకుని ఒక చోట కలిసేవారిని బృదం అని అంటాము. మాటల్లోని తేడాలు, వాటి అర్ధాలు చూసుకుని తెలుగీకరిస్తే బాగుంటుంది, లేదా మీరన్నట్టు వంకర, సంకర పదాలు సృష్టిస్తే భాషకు మరింత నష్టదాయకం అవుతుంది. లెస్స పలికితిరి.

SATISH BABU చెప్పారు...

Idhee vimarsa ante...