31, ఆగస్టు 2024, శనివారం

ఆవకాయతో అన్నం

ఎప్పుడో ముప్పై ఏళ్ల నాటి జ్ఞాపకం. మాస్కో యూనివర్సిటీలో చదువుకునే తెలుగు పిల్లలు ఇలా మా ఇంటికి వచ్చి మా ఆవిడ అప్పటికప్పుడు వండి పెట్టిన భోజనం చేసి, డైనింగ్ టేబుల్ దగ్గరే కూర్చుని నాలుగు కబుర్లు చెప్పి వెళ్ళే వాళ్ళు. వీటికి పిలుపులు వుండవు. ఎవరికి తీరిక దొరికినప్పుడు వాళ్ళు రావడమే!
దేనికీ ఏ కొరతా లేని ఆ దేశంలో మనం ఇష్టపడి తినే (ఆవకాయతో అన్నం) భోజనానికి ఎప్పుడూ కరువే.

కధలు రాస్తారా?


"రాయను, చెబుతాను"
" ఓహ్! మీరూ ఆ బాపతేనా!"
"ఏ బాపతు?"
" అదే! ఇంటికి ఆలస్యంగా వచ్చి భార్యలకు కధలు చెప్పే మొగుళ్ల బాపతు"
" మరీ అలా కాదు"
"అయితే ఓ కధ చెప్పండి, వింటాను"
"వింటాను అన్నవాడికి చెప్పకపోతే కధాహత్యా పాతకం చుట్టు కుంటుందని మా గురువు గారు చెప్పారు. చెవులు ఇలా పారేసి, నోరలా మూసుకోండి"
"......"

అనగనగా ఒక అనసూయ - భండారు శ్రీనివాసరావు 

చుట్టూ చిమ్మ చీకటి. ఆ చీకటి నడుమ ఆగిపోయిన కారు. ఆ కారులో వొంటరిగా అనసూయ.
భర్త తరచూ పరిహాసంగా అనే మాటలు ఆ సమయంలో గుర్తుకు వచ్చాయి.
‘నువ్వు మగాడిగా పుడితే సరిపోయేది’
కారులో వొంటరి ప్రయాణాలు ఆమెకు కొత్తేమీ కాదు. కారు ఆగిపోవడాలు, చిన్న చిన్న రిపేర్లు సొంతగా చేసుకోవడాలు కూడా కొత్త కాదు. అందుకే ముందు భయం అనిపించలేదు. కానీ పొద్దుపోయి చీకటి చిక్క పడుతున్న కొద్దీ, కొద్ది కొద్దిగా ఆందోళన మొదలయింది. ఈ ప్రయాణం పెట్టుకోకుండా వుంటే సరిపోయేదేమో అనిపించసాగింది.
అనసూయకు చిన్నతనం నుంచీ ధైర్యం పాలు కొంత ఎక్కువే. వొంటరి ప్రయాణాలు చేయడానికి ఎప్పుడూ జంకేది కాదు. మొగుడి తరపున వ్యాపార వ్యవహారాలు సంభాలించడానికి అనేక వూర్లు తిరగాల్సిన పరిస్తితి. ఆయన కాలం చేసిన తరువాత ఆమెపై ఈ బాధ్యత మరింత పెరిగింది. పిల్లలు పెద్దవాళ్లయి విదేశాల్లో స్తిరపడడంతో భర్త పెంచి పోషించిన సంస్తను తన చేతులతోనే మూసివేయలేక కొంతా, మరో వ్యాపకం లేక మరికొంతా ఏమయితేనేం దాన్ని ముందుకు నెట్టుకొస్తోంది. అందులో భాగంగానే ఈ ప్రయాణం. ఆ ప్రయాణంలోనే ఈ కొత్త అనుభవం.
హైదరాబాదు నుంచి బెజవాడ వెళ్ళే రోడ్డు మార్గాన్ని పెద్దది చేస్తూ వుండడంతో ఆ మార్గంలో రోడ్డు ఎక్కడ వుందో గుంత ఎక్కడ వుందో తెలియని పరిస్తితి. మామూలుగా ఇలాటి ప్రయాణాల్లో డ్రైవర్ ఎప్పుడూ వుంటాడు. కాని ఆ రోజు అతగాడి భార్యకు సుస్తీ చేయడంతో, గంట ప్రయాణమేగా వెంటనే తిరిగిరావచ్చు అన్న సొంత భరోసాతో బయలు దేరింది. తిరుగు ప్రయాణం బాగా ఆలశ్యం అయి చీకటి పడి పోయింది. కారు హెడ్ లైట్లు మొరాయించడంతో ముందు వెడుతున్న ఓ లారీ వెనుక కారు నడుపుతూ వెళ్ళింది. రోడ్ల విస్తరణ వల్ల కాబోలు, లోగడ మాదిరిగా ఎటువంటి మెకానిక్కు షాపు దోవలో కానరాలేదు. పైగా ఆ లారీ వెంట గుడ్డిగా వెడుతూ దోవ తప్పింది. ఆ సంగతి తెలిసివచ్చేసరికి ఆ లారీ కూడా అయిపులేకుండా పోయింది. మొబైల్ వెలుతురులో చూస్తే అదో డొంక దారిలా కానవచ్చింది. కనెక్టివిటీ లేకపోవడంతో హైదరాబాదు ఫోన్ చేసి విషయం చెప్పడానికి కూడా వీలు లేకుండా పోయింది. ఏం చేయాలా అని ఆలోచిస్తూ స్టీరింగ్ మీద తలపెట్టి చూస్తూ కారులో అలాగే వుండిపోయింది.
కొంతసేపటి తరువాత దూరంగా ఎవరో వస్తున్న అలికిడి. ముందు ప్రాణం లేచివచ్చినట్టు అనిపించినా ఆ సమయంలో వొంటరిగా వచ్చింది ఒక యువకుడు అని తెలియడంతో తెలియని భయం ఆవహించింది. అతడు తన మానాన తను పోకుండా కారు దగ్గరికి వచ్చి అద్దంలోనుంచి తొంగి చూసాడు. ఆ చీకట్లో ఏమీ కనబడకపోయినా ఆమె మనో నేత్రానికి అతగాడొక చిల్లర మనిషిలా కనిపించాడు. అందుకే కిటికీ అద్దాలు తీయకుండా అలాగే వుండి పోయింది. అతడు కాసేపు కారు చుట్టూ తిరిగి తన దారిన పోతుండడం చూసి ఆమె మనసు తేలిక పడింది. కానీ అది ఎంతో సేపు నిలవలేదు. కాసేపటిలో అతడు తిరిగి వచ్చాడు. అతడి చేతిలో ఈ సారి ఓ సంచీ వుంది. కిటికీ దగ్గర నిలబడి అద్దం తీయమని సైగలు చేయడం ప్రారంభించాడు. ఏదయితే అయిందని అద్దం దించింది.
బయట చలిగాలితో పాటు అతడి మాటలు మెల్లగా చెవిలో పడి అనసూయ మనసు చల్లబడింది.
‘అమ్మా! కారుకు ఏదో అయినట్టుంది. అందుకే దగ్గర్లో వున్న మా వూర్లోకి వెళ్లి రిపేరు సామాను తెచ్చాను. మీరలా కారులోనే కూర్చోండి. నేను ఈ లోగా కారు సంగతి చూస్తాను.’
అంత ఖరీదయిన కారు రిపేరు పల్లెటూరి వాడికి వొప్పచెప్పడం ఆమెకు సుతరామూ ఇష్టం లేదు. కానీ ఏం చేస్తుంది. విధిలేని పరిస్తితి.
అతడు ఏం చేసాడో తెలవదు. మంత్రం వేసినట్టుగా హెడ్ లైట్లు వెలిగాయి. మరి కాసేపటిలో కారు ఇంజన్ స్టార్ట్ అయింది. అనసూయ మొహం ఆ చీకట్లో వెలిగిపోయింది.
హాండ్ బ్యాగ్ తీసి చూసింది. అన్నీ క్రెడిట్ కార్డులే. వెతగ్గా కొన్ని వెయ్యి రూపాయల నోట్లు కనిపించాయి. లెక్కపెట్టకుండా తీసి అతడికి ఇవ్వబోయింది. నిజానికి ఆ మొత్తం చాలా ఎక్కువే. కానీ ఆ సమయంలో ఆ మాత్రం సాయం దొరక్కపోతే తను పడే కష్టాలు వూహించుకుంటే తక్కువే అనిపించింది. కానీ, అతడికీ తక్కువే అనిపించిందేమో అన్నట్టుగా ఆ డబ్బు వద్దన్నాడు. ఇంకా ఎక్కువ కావాలేమో అని మళ్ళీ బ్యాగు తెరవబోయి ఇంతలో అతడి మాటలు వినిపించి ఆగిపోయింది.
‘చూడమ్మా మీరింత చీకటిలో వొంటరిగా ఇలా చిక్కుకుపోవడం చూసి నేనేదో నా ప్రయత్నం చేసాను. ఈ పనికి డబ్బుతో సరిపెట్టుకోవడం నాకు నచ్చదు. ఈ డబ్బు మీ వద్దే వుంచండి. అంతగా ఇవ్వాలనిపిస్తే ఇలాగే అవసరంలో వున్న వారికి సాయంగా ఇవ్వండి. దానితో నా లెక్క చెల్లవుతుంది.’
అవాక్కయిన అనసూయ తేరుకునే లోగా అతడు మళ్ళీ అన్నాడు.
‘ఈ పక్కనే మా వూరు. నా పేరు సత్యనారాయణ. అందరూ మెకానిక్ సత్యం అంటారు. ఈ దారంట వెళ్ళండి. మూలమలుపులో ఓ చాయ్ దుకాణం వస్తుంది. అక్కడ రోడ్డెక్కారంటే చక్కగా షహర్ కెళ్ళి పోతారు. వస్తానమ్మా! నేను చెప్పింది మరచిపోకండి’ అంటూ సంచీ భుజాన వేసుకుని వెళ్ళిపోయాడు.
కారు స్టార్ట్ చేసింది. కొంత దూరంలో అతడు చెప్పిన టీ దుకాణం కనబడింది. లైట్లు వెలుగుతున్నాయి.
మెకానిక్ సత్యం మాటలే ఆమె చెవుల్లో మార్మోగుతున్నాయి. ఇంత హైరానా ప్రయాణం తరువాత కాస్త వేడి వేడి చాయ్ తాగితే బాగుంటుందనిపించి కారు అక్కడ ఆపి లోనికి నడిచింది. వేళకాని వేళ. జనం లేరు. స్టవ్ మీద గిన్నెలో టీ నీళ్లు మరుగుతున్నాయి. చెక్క బల్ల మీద కూర్చుంటూ వుండగానే లోపలనుంచి నిండు గర్భంతో వున్న మహిళ భారంగా అడుగులు వేస్తూ బయటకు వచ్చింది. కానీ కళ్ళల్లో ఏమాత్రం అలసట లేదు. టీ చెప్పగానే అనసూయ ముందు వున్న బల్లను శుభ్రంగా గుడ్డతో తుడిచింది. మూలగా వున్న ఫ్రిజ్ తెరిచి చల్లని నీళ్ళు తెచ్చిపెట్టింది. ఇంత రాత్రి వేళ ఇలా వొంటరి ప్రయాణం ఎందుకు పెట్టుకున్నారని మందలింపు ధోరణిలో మాట్లాడుతూనే వెళ్లి టీ తయారు చేసి తీసుకు వచ్చింది. దానితో పాటు కొన్ని బిస్కెట్లు కూడా సాసరులో పెట్టి ఇచ్చింది. నెలలు మీదపడ్డ ఆడమనిషి అంత కష్ట పడడం చూసి అనసూయ మనసు కూడా కష్టపెట్టుకుంది. పూర్తి విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో ఆ అమ్మాయి కుటుంబంకోసం పడుతున్న శ్రమ అనసూయను కదిలించింది. ఓ వంద రూపాయల నోటు సాసరులో వుంచింది. చిల్లర తేవడానికి ఆ అమ్మాయి లోపలకు వెళ్ళగానే మెకానిక్ కోసం తీసివుంచిన వెయ్యి నోట్లను ఆ సాసరు కింద వుంచి అక్కడ నుంచి తప్పుకుంది.
చిల్లరతో వచ్చిన అమ్మాయికి అక్కడ ఎవరూ కనిపించలేదు. కారులో వచ్చిన ఆవిడకోసం చుట్టూ చూసింది. ఆవిడ కనబడలేదు కానీ ఆవిడ వొదిలి వెళ్ళిన వెయ్యి నోట్లు కనిపించాయి. వాటితోపాటే వుంచిన మరో చిన్న కాగితం. దాని మీద హడావిడిగా రాసిన రెండే రెండు వాక్యాలు. ‘నువ్వు నాకు ఏమీ రుణపడి లేవు. అలాటి భావన వుంటే మరొకరికి సాయపడు, ఈ రుణం తీరిపోతుంది.’
పాపం ఆ అమ్మాయికి ఏం చెయ్యాలో తోచలేదు. అంత డబ్బు ఉదారంగా వొదిలివెళ్లడం అంటే మాటలు కాదు.
నిజానికి వచ్చేనెలలోనే డాక్టర్ పురుడు వస్తుందని చెబుతూ అందుకు తగ్గట్టుగా డబ్బు సర్దుబాటు చేసుకొమ్మని చెప్పింది. ఎలారా భగవంతుడా అని చూస్తుంటే ఎదురు చూడని విధంగా ఆ కారు ఆవిడ అందించిన అయాచిత ఆర్ధిక సాయం.
ఈ టీ కొట్టుతో వచ్చే రాబడి ఇంటి ఖర్చులకు బొటాబొటిగా సరిపోతుంది. చిన్న చిన్న రిపేర్లు చేసే మొగుడికి వచ్చే కొద్దో గొప్పో సంపాదన కూడా రోడ్డు విస్తరణ పనులవల్ల ఈ మధ్య బాగా తగ్గిపోయింది.
అసలే తొలి చూలు యెలా బయటపడాలి అని అనుకుంటున్న సమయంలో అనుకోని విధంగా ఈ రాత్రి ఈ ధన యోగం. సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయిపోతూ ఆమె హోటల్ కట్టేసి మొగుడు మెకానిక్ సత్యానికి ఈ కబురు చెవిలో వేయాలని ఆత్రుతగా ఇంటికి బయలుదేరింది.

కధలు రాయడం ఎలా?

‘నేను పుట్టడానికి కొన్ని నెలల ముందు నుండే నన్ను మట్టుబెట్టడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఆ దుర్మార్గానికి పూనుకుంది కూడా నా కన్నతల్లే కావడం విధి విచిత్రం’
‘కధలెలా రాయాలి’ అని కొత్త రచయితలకు మార్గ నిర్దేశం చేస్తూ కీర్తిశేషులు ఆరుద్ర రాసిన వ్యాసం ఈ విధంగా మొదలవుతుంది. కధ ఎత్తుగడ ఎలావుండాలి, తొలి వాక్యంతోనే పాఠకులను యెలా ఆకట్టుకోవాలి అనే అంశానికి ఉదాహరణగా ఆయన ఈ రెండు వాక్యాలను ఉటంకించారు.
పుట్టడానికి ముందే చంపే ప్రయత్నం అంటే ‘అబార్షన్’ అనుకోవాలి. తల్లే దానికి పూనుకున్నదంటే ఆమెకు పెళ్లి కాకుండానే గర్భం వచ్చిందని భావం. ఆ క్రమంలో ప్రాణాలు కోల్పోవాల్సిన పాపే ఈ మాటలు చెబుతోందంటే అబార్షన్ విఫలమయిందని అర్ధం. రెండు చిన్న వాక్యాలలో ఇంత కధను ఇమడ్చగలిగితే ఇక ఆ కధ పట్ల పాఠకుల ఆసక్తి అపరిమితంగా పెరిగిపోయే అవకాశం కూడా అంతే వుంటుంది. ఆరుద్ర గారంటే మాటలా మరి!

NOTE: Courtesy Image Owner

30, ఆగస్టు 2024, శుక్రవారం

అంతులేని వ్యధ

రాజకీయ పోస్టులు పెట్టకూడదు అని చాలా కాలంగా నాకై నేను పెట్టుకున్న నియమాన్ని పాటిస్తూ వస్తున్నాను. ఈ పోస్టులో కూడా ఎవరికైనా ఆ ఛాయలు కనపడితే వారికి ఓ నమస్కారం.
 సరిగ్గా పుష్కరం క్రితం, 2012 లో రాజధాని ఢిల్లీలో  జ్యోతి సింగ్ అనే ఫిజియో తెరపిష్టుపై, అర్ధరాత్రి నడుస్తున్న బస్సులో దారుణమైన మూకుమ్మడి అత్యాచారం జరిగింది. బహుశా అంతటి తీవ్ర స్థాయిలో జరిగిన దారుణ సంఘటన మరోటి లేదు. ఆ సంఘటన గురించి దరిమిలా దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన విషయాలను మళ్ళీ ప్రస్తావించడానికి నా మనస్సు ఒప్పుకోవడం లేదు.
ఆమె గోప్యతను కాపాడడానికి పేరును నిర్భయగా మార్చారు. జరిగిన సంఘటన తెలిసి ( ఎస్సెమ్మెస్  ల ద్వారా, అప్పటికి వాట్సప్ ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా లేదు) వేలాదిమంది ఆ యువతికి సంఘీభావం తెలుపుతూ ఢిల్లీ రోడ్ల మీదకు వచ్చారు . అప్పటి కేంద్ర ప్రభుత్వం తీవ్రతను గమనించి, దిగివచ్చి మహిళలపై అత్యాచారాలను కట్టడి చేసేందుకు నిర్భయ పేరుతో ఒక కఠినమైన చట్టం చేసింది. ఆ చట్టంలోని కఠిన నిబంధనలు చూసి నోళ్ళు వెళ్ళ బెట్టారు. దీని నుంచి  నిందితులు తప్పించుకోలేరని పేపర్లు సంపాదకీయాలు రాశాయి. కానీ ఏమైంది. కేసు విచారణకు రావడానికే ఏండ్లు పూండ్లూ పట్టింది. తర్వాత పుష్కర కాలానికి కూడా ఇలాంటి వార్తలు వినాల్సి వస్తోంది. అందుకే ఈ నిర్లిప్తత.
ఒక దుస్సంఘటన జరుగుతుంది. పత్రికల్లో పతాక శీర్షికలు, టీవీల్లో ఎడతెగని చర్చలు, సోషల్ మీడియాలో చర్చోపచర్చలు, ఖండన ముండనలు, రాజకీయ పార్టీల ప్రవేశంతో సంఘటన రంగూ రుచీ పూర్తిగా మారుతుంది. 
ఇది ఎప్పటి దాకా సాగుతుంది.
ఇలాంటి మరో సంఘటన జరిగే దాకా.
ఇదో అంతులేని కథ. ముగింపు లేని వ్యధ.

29, ఆగస్టు 2024, గురువారం

వాట్ ఈజ్ స్లం తాతా

అని ఎదురు ప్రశ్నించింది నా మనుమరాలు సృష్టి.
ఈ మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత సృష్టి అడిగింది ఈరోజు ఎక్కడికి పోదామని. అదే ఒక జాబితా చదివింది స్నో కాల్మీ ఫాల్స్, ఇంకా ఏవేవో మాల్స్, పార్కులు వగైరా.

" నాకు ఈరోజు సియాటిల్ లో ఏదైనా ఒక స్లం ఏరియా చూపిస్తావా " అని అడిగాను. 
" నేను ఎప్పుడూ చూడలేదు, మా ఫ్రెండ్స్ ని అడుగుతాను" అంటూ ఒకరిద్దరికి ఫోన్ చేసింది.
ఎవరికీ తెలియదట, ఒక ఫ్రెండేమో డౌన్ టౌన్ లో ట్రై చేయమంది. వెంటనే పద పోదాం అని బయలుదేర తీసింది. 
ఈసారి రెంటన్ మీదుగా వెళ్ళాము. ఎప్పుడూ లేనంతగా ఫ్రీ వే మీద కూడా ట్రాఫిక్ జామ్.

 పదిహేనేళ్ళ క్రితం సియాటిల్ వచ్చినప్పుడు రోడ్ల మీద ఇన్ని కార్లు లేవు. విశాలమైన రహదారులు. వాటిని కొన్ని చోట్ల మరింత విశాలంగా వెడల్పు చేసే పనులు సాగుతున్నాయి. కానీ ఎక్కడా చెట్లు కొట్టి వేస్తున్న దృశ్యాలు కనపడలేదు. రెండు వైపులా గుబురుగా, అడవిలా పెరిగిన చెట్లు. క్రితంసారి రోడ్డు మీద పోతుంటే జింకలు రోడ్డు దాటుతూ కనిపించేవి.  అవి తిరిగే చోట్లలో హెచ్చరిక బోర్డులు పెట్టారు. అవి ఇప్పటికీ వున్నాయి కానీ జింకల జాడ లేదు. 
మొత్తం మీద సియాటిల్ డౌన్ టౌన్ చేరాము. కొండల మీద కట్టిన నగరంలా అనిపించింది. ఎగుడు దిగుడు రోడ్లపై కారులో దాదాపు రెండు గంటల పాటు కలయతిరిగాము. ఎత్తైన పొడవాటి రమ్య హర్మ్య భవంతులు. మురికి వాడలు ఎక్కడా కానరాలేదు. 

మళ్ళీ ఫ్రెండ్ కి ఫోన్ చేసింది. ప్రత్యేకంగా ఒక చోట అంటూ వుండవు. అక్కడక్కడా పేవ్ మెంట్లపై టార్పాలిన్ టెంట్లు వేసుకుని వుంటారు. బాగా వెతికితే కనపడవచ్చు అని మా డాడీ చెబుతున్నారు అని జవాబు వచ్చింది. ఆ ఫ్రెండ్ ఓ హెచ్చరిక కూడా చేసినట్టు వుంది, వాళ్ళతో జాగ్రత్త , ఏ అఘాయిత్యం అయినా చేయవచ్చు అని.

అలా రోడ్ల వెంట తిరగ్గా తిరగ్గా ఒక చోట అలాంటి టెంట్ కనిపించింది. కానీ అక్కడ కారు ఆపడానికి వీలు లేదు. అంచేత పక్క రోడ్డులో వున్న జాక్ ఇన్ ది బాక్స్ అనే బర్గర్లు దొరికే హోటల్ దగ్గర కారు పార్కు చేసి పదహారు డాలర్లు పెట్టి ఓ బర్గర్, కోక్ కొని, ఆ టెంట్ దగ్గరికి నడిచి వెళ్ళాము. ఉత్త చేతులతో అలాంటి వారి దగ్గరకు పోకూడదన్న సృష్టి ఆలోచన నాకు నచ్చింది.

ఆ టార్పాలిన్ టెంటు ముందు డెబ్బయ్ ఏళ్ల మనిషి కూర్చుని వున్నాడు. నెత్తి మీద హ్యాట్, కూలింగ్ గ్లాసెస్, మంచి దుస్తులు, టెంట్ నిండా ఏదో సామాను, మడత పెట్టిన వీల్ చైర్, ముందు రెండు సూటు కేసులు, చేతిలో సిగారు. మరో చేతిలో మొబైల్.

సృష్టి వెళ్లి విష్ చేసి చెప్పింది, 'మీ కోసం మీల్ తెచ్చాము, ఏమైనా అభ్యంతరమా' అని.

వారి ఇద్దరి మధ్య సంభాషణ ఇంగ్లీష్ లో ఇలా జరిగింది. అది యధాతధంగా :

" Hello, we brought some food for you!"

" Wow, thank you!"

"My  grandfather is a journalist in India, he was wondering if you’d mind if he took a photo with you. he’s writing about homelessness in Seattle"
 
"No, thank you"

"That’s okay!"

" My sister doesn’t know that I am homeless, she would have a stroke. I know the odds are low that she’ll see it.. but you know"

"We completely understand, don’t worry about it.
How long have you been here?"

"They ( may be Civic Authorities)move us every 3-4 days. I used to be down by the greenbelt. if it’s just me alone, they usually don’t say anything,  but if it’s multiple RVs and tents and stuff, they call it an 'encampment' and shut it all down. This whole area, they call it the industrial area now, it doesn’t even make the list of worst 10 areas in Seattle. And they’ll probably clear it out in time for seahawks season, that’s how it usually is"
 
"How long have you been homeless?"

"I lived with my brother until he died of covid"
 
" I am sorry to hear that"

"So yeah,  I didn’t really have any second option"
 
"How do you spend your time?"

 (He holds up cell phone and we all laugh)

"I  spin a sign down by the kfc and taco bell down the road twice a week. that’s pretty much it. just getting by"

And he asked us.

"How many people have you talked to?"

"You’re the first!"

"Alright, I am just saying, you know what I mean, you got pretty lucky talking to me. there’s a lot of people out here who you don’t know how they’ll react because they’re off something (drugs) half the time.  Like take this guy next to me (points to the tent set up ~15 feet away) he pretty much keeps to himself, but he’s got bipolar. anything can set him off, you know you just don’t know how people will react. so thank you for the conversation but be careful out there"

" Alright, I appreciate it. Thank you. We will let you be now. Enjoy your meal! 
Thank you. And namaste!"

"Thank YOU. namaste 🙏"

ఈ విధంగా అమెరికా దేశంలో గుడిసెలో నివసించే ఒక వ్యక్తిని కలిసి మాట్లాడాలి అనే ఓ కోరిక నెరవేరింది 
థాంక్స్ సృష్టి!

కింది ఫోటోలు:

సియాటిల్ డౌన్ టౌన్ లో మురికి వాడల కోసం గాలిస్తూ ...

28, ఆగస్టు 2024, బుధవారం

చనిపోయిన వాడి కళ్ళు చారడేసి

చనిపోయిన వాడి కళ్ళు చారడేసి 

నాకో తీరని కోరిక. ఇక తీరదు కూడా.
కుటుంబంలోని వారందరూ అంటే నేనూ మా ఆవిడా పిల్లలు  రోజులో ఒక్క పూటయినా కలిసి కూర్చుని భోజనం చేయాలని. ఈ కోరిక తీరక పోవడానికి నేనే కారణం. ప్రెస్ మీట్లు, డిన్నర్ల పేరుతో ఏ అర్ధరాత్రికో ఇంటికి చేరే వాడిని. అప్పటికి పిల్లలు గాఢ నిద్రలో వుండేవాళ్ళు. బారెడు పొద్దెక్కి నేను లేచేసరికి వాళ్ళు స్కూలుకు పోయేవాళ్ళు. ఈ విషయాన్ని నేను మిత్రులతో ఓ జోక్ గా చెప్పుకుని మురిసిపోయే వాడిని. రాత్రి పొద్దుపోయి ఇంటికి వెళ్లి కాలింగ్ బెల్ కొడితే మా పిల్లలు తలుపు తీయకుండా, మా నాన్న ఇంట్లో లేరని జవాబు చెబుతారని,  ఆదివారం నాడు భోజనాల సమయంలో మా ఆవిడ నన్ను చూపిస్తూ ఇదిగో ఈయనే మీ నాన్న అని మా పిల్లలకు పరిచయం చేస్తుందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాడిని. 
ఇప్పుడు అమెరికాలో మా పెద్దబ్బాయి సందీప్ ను చూస్తుంటే, నా కోరికను వాడు తీరుస్తున్నాడు అనే భావన కలిగింది. ఎంచక్కా వున్న నలుగురు భోజనాల బల్ల వద్ద కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ చేస్తారు. నాకు చూడ ముచ్చటగా వుంటుంది.
పోతే అసలు విషయానికి వస్తాను.
ఈరోజు పొద్దున హిందూ టెంపుల్ లో మా రెండో కుమారుడు సంతోష్  ఏడో మాసికం కార్యక్రమం పూర్తి చేసుకున్న తర్వాత రాత్రికి భోజనాల బల్ల వద్ద,  మా కుటుంబం అర్థాంతరంగా పోగొట్టుకున్న మా ఆవిడ నిర్మల, రెండో కుమారుడు సంతోష్ ప్రసక్తి వచ్చింది. 
మా కోడలు భావన రాంచీ అమ్మాయి. పెళ్ళి నాటికి తెలుగు ఒక్క ముక్క రాదు. ఇంట్లో అందరూ గలగలా తెలుగులో మాట్లాడుతుంటే ఆ అమ్మాయి బిక్క మొగం వేసుకునేది. ఈ సంగతి గుర్తు చేసుకుంటూ  భావన చెప్పింది. "అప్పుడు అత్తయ్యే నాకు తోడు నిలిచింది. ప్రతివారం ఒక తెలుగు సినిమాకు తీసుకు వెళ్ళే వారు. తను నాకు హిందీలో చెబుతూ నాకు అర్థమైంది తెలుగులో చెప్పమనే వారు. ఆ విధంగా నాకు కొద్దికొద్దిగా తెలుగు నేర్పించారు. అలాగే ఇంట్లో పనిచేసే కళ నాకు మరో తెలుగు టీచరు. ఇక సంతోష్ మరిది అయినా చాలా చనువుగా బహురాణి అంటూ తెలుగు విషయంలో చాలా సాయం చేసేవాడు. నేను సఖిని కడుపుతో ఉన్నప్పుడు వేవిళ్ళు. ఆ రోజుల్లో అత్తయ్య నన్ను కడుపులో పెట్టి చూసుకున్నారు. "మామయ్య కోసం కానీ , ఇంకా ఎవరికోసం కానీ వెయిట్ చేయవద్దు. వేళకు అన్నం తిను. వాళ్ళకు వీలైనప్పుడు వాళ్ళు తింటారు" అంటూ నాకు అన్నం పెట్టేవారు. సంతోష్ అయితే, కాళ్ళు పీకుతున్నాయి అంటే ఏమాత్రం సంకోచించకుండా నా కాళ్ళు పట్టేవాడు. బంగారం లాంటి మరిది. వాడు పోయాడు అంటే నాకు ఈ నాటికీ నమ్మకం కుదరడం లేదు. దేవత లాంటి అత్తయ్య పోయింది. వజ్రం లాంటి సంతోష్ పోయాడు "
అని భావన కళ్ళ నీళ్ళు పెట్టుకుంది.
నా కళ్ళల్లో నీళ్ళు ఎప్పుడో ఇంకి పోయాయి.
కింది ఫొటో:
పక్కన వున్న ఇద్దరూ ఇప్పుడు లేరు.

" ద్వితీయ పుత్ర.. సంతోష్ నామ..."

... అనాల్సివచ్చినప్పుడు గొంతు పూడుకు పోతుంది. మనస్సు మెలికలు తిరుగుతుంది. 
అమెరికా వచ్చి అప్పుడే నెల అవుతుందా. ఎవరో తోసుకువచ్చినట్టు వచ్చింది నా రెండో పిల్లవాడి ఏడో మాసికం.
ఉదయం మా పెద్దవాడు సందీప్ నన్నూ, కోడల్నీ, పిల్లల్నీ తీసుకుని  Bothell లోని హిందూ టెంపుల్ కి తీసుకువెళ్ళాడు. పూజారి హేమంత్ శర్మ వయసులో చాలా చిన్నవాడు. అమెరికా వచ్చి అయిదు నెలలే అయింది. అంతకు ముందు మారిషస్ హిందూ టెంపుల్ లో నాలుగేళ్లు పనిచేశాడు. ప్రకాశం జిల్లా అద్దంకి ప్రాంతం వాడు. గుడికి వెళ్ళే ముందు మిల్ క్రీక్ ప్రాంతంలో వున్న ఆయన ఇంటికి వెళ్ళాము. ఆ కాలనీ చెట్ల గుంపుల నడుమ చాలా పొందికగా వుంది. ఆయన్ను కారులో ఎక్కించుకుని గుడికి వెళ్ళాము. డ్రైవింగ్ లైసెన్స్ రాగానే కారు కొనుక్కుంటానని దారిలో చెప్పారు.
కార్యక్రమాన్ని చాలా నిష్టగా జరిపించారు హేమంత్ శర్మ గారు. 
పదకొండేళ్ల క్రితం ఇదే దేవాలయంలో మా అమ్మగారి ఆబ్డీకం పెట్టిన విషయం జ్ఞాపకం చేసుకున్నాము. 
నెల రోజుల ముందే మా వాడు పూజారితో మాట్లాడి పెట్టడం, కోడలు భావన ఒకరోజు ముందే ఇండియన్ స్టోర్ నుంచి కావాల్సిన సంభారాలు తెచ్చి సిద్ధం చేయడం ఇవన్నీ, దేశం కాని దేశంలో ఇటువంటి కార్యక్రమం నిర్విఘ్నంగా జరపడానికి సాయపడ్డాయి.

26, ఆగస్టు 2024, సోమవారం

జన్మాష్టమి

' అమ్మా సృష్టి '
' టెల్ మి తాతా '
' కృష్ణుడి పుట్టిన రోజు '
' హు ఈజ్ కృష్ణ '
' మురళి వాయిస్తాడు. నెత్తి మీద నెమలి పింఛం వుంటుంది ' అని ఇంగ్లీషు లో చెప్పాను, కొంత వర్ణించి.
అంతే!
ఈ చిత్రం తయారు చేసింది.
నా అమెరికా యాత్ర ధన్యం అయింది అనిపించింది.
ధన్యోస్మి కృష్ణా!
Thanks Srishti

ప్రాంతీయ వార్తలు చదువుతున్నది భండారు శ్రీనివాస రావు


ఆరేళ్ల క్రితం వరకు నాది ఊరుకుల పరుగుల జీవితమే. కాలు ఒకచోట పెట్టి నిలబడింది లేదు.   ఇలా సాగిన జీవితంలో రేడియో ఉద్యోగం అనేది ఒక అరాచక పర్వం. నేను పనిచేసింది కేంద్ర ప్రభుత్వ సంస్థలో. కానీ ఏ ఒక్కరోజు నియమ నిబంధనలకు కట్టుబడి కానీ
, లోబడి కానీ పనిచేయలేదు. విలేకరి ఉద్యోగం కావడం వల్ల ఆఫీసు టైములూ  గట్రా లేవు. ఆఫీసులో మొహం చూపిస్తే ఆ రోజు వచ్చినట్టు. చూపక పోతే బయట ఎక్కడో ఆఫీసు పని మీద, వార్తా సేకరణలో వున్నట్టు. ఇలా అందరికీ సాధ్యం అవుతుందా. కాదు. అలా వీలుండదు కూడా. నూటికో కోటికో కూడా అసాధ్యం. మరి నా విషయంలో అలా ఎందుకు సాధ్యపడింది? అందుకే అరాచక పర్వం అన్నది. ఇలా మినహాయింపులు పొందడానికి నా తత్వం కూడా ఉపయోగపడింది.

ఆలిండియా రేడియో ఒక పెద్ద సామ్రాజ్యం అనుకుంటే అందులో మా న్యూస్ యూనిట్ (ప్రాంతీయ వార్తా విభాగం) సర్వసత్తాక ప్రతిపత్తి కలిగిన సామంత రాజ్యం. సామంత రాజ్యం అని ఎందుకు అన్నాను అంటే మేము చేసే పని లేదా చూసే పని రేడియో వార్తలు. సేకరించడం, వాటిని గుదిగుచ్చడం, బులెటిన్లు తయారు చేయడం, వాటి అనువాదం సరిగా వుందా లేదా చూసుకోవడం, సరిగ్గా వేళకు  వార్తా ప్రసారం జరిగేలా జాగ్రత్త పడడం ఇవీ క్లుప్తంగా మా విభాగం బాధ్యతలు. వీటిల్లో స్థానికంగా వుండే ఇతర రేడియో పెద్దలకు సంబంధం వుండదు.     మరి ఇందులో నా పాత్ర ఏమిటి? అధికారిక విధులను బట్టి చూస్తే నిజానికి ఏమీ లేదు, వార్తా సేకరణ తప్పిస్తే. ఢిల్లీలో వుండే కేంద్ర వార్తా విభాగానికి మాత్రమే జవాబుదారీ. శ్రీయుతులు  పన్నాల  రంగనాధ రావు గారు, నర్రావుల సుబ్బారావు గారు, మల్లాది రామారావు గారు, ఆర్ వీ వీ కృష్ణారావు గారు, ఆకిరి రామకృష్ణారావు గారు, ఆసయ్య  గారు ఇలా చాలామంది న్యూస్ ఎడిటర్లు మితిమించిన  వాత్సల్యం చూపి నా విశృంఖలతను పెంచి పోషించారు. 

అయితే, తత్వం అని చెప్పాను కదా! అదే ఇంత ఆరాచకానికి కారణం.

హైదరాబాదు కేంద్రం నుంచి రోజుకు ఉదయం, మధ్యాన్నం, సాయంత్రం మూడు  న్యూస్ బులెటిన్లు ప్రసారం అవుతాయి. వాటిని ఎడిట్ చేయడం ఎడిటర్ల పని. ఒక్కోసారి ఆ బాధ్యత నాకు అప్పగించేవారు. క్రమంగా నా పని ఉమ్మడి కుటుంబంలో కాపురానికి వచ్చిన కొత్త కోడలు మాదిరిగా తయారయింది. వారానికి మూడు రోజులు ఉదయం రేడియో స్టేషన్ కు వెళ్ళి వార్తలు ఎడిట్ చేసేవాడిని. ఇంటి నుంచి రానూ పోనూ ఆఫీసు వాహన సౌకర్యం వుండేది. ఉదయం పూట రెగ్యులర్ న్యూస్ రీడర్లు  రాకపోతే క్యాజువల్ న్యూస్ రీడర్లను బుక్ చేసేవారు, సురమౌళి , గుడిపూడి శ్రీహరి, పీ ఎస్ ఆర్ ఆంజనేయ శాస్త్రి గార్లు అప్పటికే రేడియో వార్తల పఠనంలో ఉద్ధండులు. ఇక రెగ్యులర్ న్యూస్ రీడర్లు  తిరుమలశెట్టి  శ్రీరాములు, డి. వెంకట్రామయ్య, జ్యోత్స్న దేవి గార్లు సరేసరి. వాళ్ళు చదివే వార్తలు వింటూ పెరిగిన వాడిని. శ్రీనివాసరావు అన్నీ పనులు చేయగలడు  అని అనిపించుకునే నా తాపత్రయంతో  వాళ్ళలో కొందరు తమ బాధ్యతలను నాకు వదిలేసేవాళ్ళు. ఎడిట్ చేసే బాధ్యత క్రమంగా అనువాదం చేయడం వరకు పెరిగింది. ఆంధ్రజ్యోతిలో కాలాలకు కాలాలు అనువాదం చేసిన అనుభవం ఇలా అక్కరకు వచ్చింది. అదే క్రమంలో జీవన స్రవంతి, వార్తా వాహిని కార్యక్రమాల నిర్వహణ, వ్యాఖ్యానం, పఠనం అలా బాధ్యతలు భుజానికి ఎక్కి కూర్చున్నాయి.

ఇలా రోజుకు ముప్పూటలా ఆఫీసు పనులు చేసుకుంటూ కాలం దొర్లిస్తున్న  సమయంలో ..

ఒకానొక రోజు ఉదయం.

రేడియో వార్తల సమయం దగ్గర పడుతోంది. నా పనిలో నేనున్నాను.  న్యూస్ రీడర్ జాడలేదు. అప్పటికే బులెటిన్ మూడువంతులు సిద్ధం చేశాను. ఫోను మోగింది. అనివార్యకారణాల వల్ల రాలేకపోతున్నాను అని సంజాయిషీ. ఫోను పెట్టేసి బులెటిన్ కాగితాలు క్రమపద్దతిలో సర్దుకుని పూనకం పూనినట్టు  స్టూడియోకి బయలుదేరాను. ఆ రోజుల్లో మా వార్తా విభాగం మెయిన్ స్టూడియోకి దూరంగా రేడియో ఆవరణలో ఒక పక్కగా వుండేది. అప్పటికి ఇప్పుడు వున్న స్టూడియో కట్టలేదు.  ఎవరైనా అనౌన్సర్‌లు ఖాళీగా వున్నారేమో అని వాకబు చేశాను. ఎవ్వరూ దొరకలేదు. వార్తల టైము పది నిమిషాలు వాళ్ళకి ఖాళీ సమయం. నేను ఒక్కడినే స్టూడియోకి వెళ్ళడం చూసి డ్యూటీ ఆఫీసరు పరిగెత్తుకుని వచ్చారు. నేను లైవ్ ప్రోగ్రాములకి కొత్త అని ఆయనకు తెలుసు. జీవన స్రవంతి, వార్తా వాహిని లైవ్ కాదు. ముందుగా రికార్డు చేసి ప్రసారం చేస్తారు. వార్తలు ఒక్కటే మొత్తం రేడియో కార్యక్రమాల్లో లైవ్ గా ప్రసారం చేస్తారు. డ్యూటీ ఆఫీసరు నాకు చెప్పాల్సిన జాగ్రత్తలు చెప్పాడు. దగ్గు వస్తే ఫేడర్  కిందికి లాగాలని, మళ్ళీ పైకి జరుపుకుని వార్తలు చదవాలని చెప్పి వెళ్ళి పోయాడు.

నేను న్యూస్ రిపోర్టర్ ని. వార్తలు చదవడం నా డ్యూటీ కాదు. పైపెచ్చు వార్తలు చదివే వాళ్ళు ఆడిషన్  టెస్టులో పాసవ్వావాలి.  పై అధికారుల అనుమతులు కావాలి. చెప్పాకదా! నా తత్వం గురించి. ఇవన్నీ ఏమీ ఆలోచించలేదు. సమయం మించకుండా వార్తా ప్రసారం మొదలు కావాలి. అంతే !

ఫేడర్ అంటారో ఇంకేమీ అంటారో నాకు తెలియదు. దాన్ని పైకి లాగి మొదలు పెట్టాను.

“ ఆకాశవాణి, హైదరాబాదు కేంద్రం. ప్రాంతీయ వార్తలు చదువుతున్నది  భండారు శ్రీనివాసరావు ..”

ఆ విధంగా మొదలయిన నా అరాచక పర్వం ఆకాశవాణిలో ఏళ్ల తరబడి సాగింది.

అరాచకం అంటూ మొదలవ్వాలి కానీ అది కొనసాగుతూనే వుంటుంది. ఆ విశేషాలు మరోసారి.

(25-08-2024)

23, ఆగస్టు 2024, శుక్రవారం

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ముగిసిన ప్రధాన ఘట్టం

నవంబర్ లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ తరపున అభ్యర్థిగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ నామినేషన్ ను చికాగోలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఆ పార్టీ జాతీయ సదస్సులో ఈరోజు చివరి రోజున ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. కాకతాళీయం కావచ్చు, యాదృచ్చికం కావచ్చు ఇది కమలా హారిస్ పెళ్ళి రోజు కూడా. పార్టీ ఆమెకు ఇచ్చిన పెళ్ళి కానుక.
సరే! ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే ఈ దేశంలో కూడా ఎన్నికల ప్రసంగాలు కొంచెం డిగ్రీ తేడా కానీ మన దేశంలో మాదిరిగానే సాగాయి. అమెరికా మాజీ ప్రెసిడెంట్లు ఇద్దరు ఒబామా, బిల్ క్లింటన్ లు భార్యలతో సహా హాజరై కమలా హారిస్ కు మద్దతు పలికారు. కమ్లానా కమలానా అనే శంక తీరుస్తూ CNN channel ఆమె పేరు ను KAMALA HARRIS అని రాసింది. 
మన దగ్గర IAS, IPS అధికారులు, అధికార పార్టీలకు పరోక్షంగా మద్దతు ఇస్తుంటారు. ఇక్కడ ఏకంగా తమ యూనిఫారాల్లోనే వచ్చి కొందరు పోలీసు అధికారులు బహిరంగంగానే డెమొక్రాటిక్ పార్టీకి మద్దతు తెలుపుతూ వేదికపై ప్రసంగాలు చేసారు. ఇది ఇక్కడ ఆక్షేపణీయం కాదంటున్నారు. 
ముసుగు మనుషుల కంటే ఇదే బెటరేమో!
ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ ను తమ ప్రెసిడెంటు అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ ఇద్దరి భవిష్యత్తు రెండు నెలల్లో తేలుతుంది.
ప్రసంగాలను బట్టి నాకు అర్థం అయింది ఏమిటంటే free and fair elections పట్ల రాజకీయ పార్టీలకి ఏదో సందేహం వున్నట్టు వుంది.

21, ఆగస్టు 2024, బుధవారం

ఆధ్యాత్మిక అధికారి

ఆధ్యాత్మిక అధికారి శ్రీ పీ.వీ.ఆర్.కే. – భండారు శ్రీనివాసరావు 
(ఆగస్టు 21 ఆయన వర్ధంతి)

ఒక ఉన్నతాధికారి, ఆయన ఓ జిల్లా కలెక్టర్ కావచ్చు, సచివాలయంలో ఉప కార్యదర్శి కావచ్చు, ఎక్సైజ్ కమీషనర్ కావచ్చు, టీటీడీ ఈవో కావచ్చు, విశాఖ పోర్టు ట్రస్ట్ చైర్మన్ కావచ్చు, ఏకంగా భారత ప్రధానమంత్రి సలహాదారు కావచ్చు, మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ కావచ్చు, ధర్మ పరిరక్షణ సంస్థ గౌరవ అధ్యక్షులు కావచ్చు, అది ఏ ఉద్యోగం అయినా కానివ్వండి, ఏ హోదా వున్నదయినా కానివ్వండి, ఎంతటి బాధ్యత కలిగినదయినా కానివ్వండి దాన్ని ఒకే నిబద్ధతతో, ఒకే అంకితభావంతో, అంతే సమర్ధంగా నిర్వహించుకుని, నిభాయించుకుని సెహభాష్ అనిపించుకోగల అధికారులను వేళ్ళమీద లెక్క పెట్టవచ్చు. ఆ లెక్క తీసుకుంటే ఆ వరుసలో మొదట్లో కానవచ్చే వ్యక్తి, తన డెబ్బయి ఏడో ఏట స్వల్పఅస్వస్థత అనంతరం 2017, ఆగస్టు ఇరవై ఒకటో తేదీ తెల్లవారుఝామున కన్నుమూసిన పీ.వీ. ఆర్. కే. ప్రసాద్. (వారి పూర్తి పేరు పత్రి వేంకట రామకృష్ణ ప్రసాద్)
నలుగురికే కాదు, ప్రపంచం నలుమూలల తెలిసిన మనిషి ఆయన. శనివారం తెల్లవారుఝామున ఆస్పత్రిలో చేరారు. అస్వస్వతకు గురయిన సంగతి నలుగురికీ తెలిసేలోగానే, ఇరవైనాలుగు గంటలు గడిచీ గడవక ముందే, సోమవారం తెల్లవారుఝామున ఆయన ఈ ప్రపంచాన్ని వీడిపోయారనే కబురు నేల నాలుగు చెరగులా తెలిసిపోయింది. మరణం అలా ముంచుకురావడం పుణ్యాత్ముల విషయంలోనే జరుగుతుందంటారు. అలాగే జరిగింది కూడా. 
అంతకుముందు రాత్రి జ్వాలా, నేనూ కలిసి బంజారా కేర్ ఆసుపత్రికి వెళ్ళాము. ఐ.సి.యూ. లో ప్రసాద్ గారిని చూశాము. జీవితంలో ఎలాంటి బంధాలు లేకుండా బతికిన మనిషిని, ముక్కుకు, నోటికి బంధనాలతో చూస్తుంటే ఎంతో బాధ వేసింది. ఈ రాత్రి గడవడం కష్టం అనే భావన డాక్టర్ల అభిప్రాయంగా తోచింది. అయ్యో అనిపించింది. ఆ తెల్లవారుఝామున ఫోను మోగింది. పెద్దాయన దాటిపోయారు అని చెప్పారు. ప్రసాద్ గారి భార్య, కొడుకు, కుమార్తె అంతిమ ఘడియల్లో ఆయన చెంతనే వున్నారు. అదొక ఊరట.
అప్పటికి ఆయన వయస్సు డెబ్బయి ఏడు సంవత్సరాలు. ఆగస్టు ఇరవై రెండు ఆయన పుట్టిన రోజు. అదేమిటో ఆ రోజుకు ఒక్క రోజుముందే ఆగస్టు ఇరవై ఒకటో తేదీనే పీవీఆర్కే మరణించడం దైవలీల. 
ఒక్క రోజు గడిచి వుంటే డెబ్బయి ఎనిమిదిలో ప్రవేశించి వుండేవారు. ఈరోజులలో ఇదేమంత పెద్ద వయస్సేమీ కాదు. కానీ ఆయన నమ్ముకున్న తిరుపతి వెంకటేశ్వరుడికి ఆయన్ని తన దగ్గరకు పిలిపించుకోవాలనే కోరిక కలిగిందేమో. అందుకే ప్రసాద్ గారు ఎవరినీ కష్ట పెట్టకుండా, తను మరీ కష్టపడకుండా దాటిపోయారు. ఆధ్యాత్మిక అంశాలతో కూడిన చక్కటి రచనలను మనకు మిగిల్చిపోయారు.
ఎన్నెన్నో బాధ్యతాయుతమైన ఉద్యోగాలు చేసినా ఎలాటి మచ్చ పడకుండా నెగ్గుకువచ్చారు. తన పైవారికి కానీ, కింది సిబ్బందికి కానీ మాట రాకుండా నిప్పులాంటి నిజాయితీతో విధులను నిర్వహించారు. ఎన్ని గిరులు గీసుకున్నా,మరెన్నో బరులు తన చుట్టూ బారులు తీరినా, ఏదైనా విషయం సమాజానికి మేలు చేసేది అని తను మనసారా నమ్మితే చాలు, అంతే! ఎలాంటి సంకోచాలు లేకుండా, ఎలాటి భేషజాలకు పోకుండా, అడ్డొచ్చే నిబంధనలను తోసిరాజనికూడా ప్రజాక్షేమానికి పెద్దపీట వేసే గుండెధైర్యం ఆయన సొంతం. ఇలాటి విషయాల్లో యువ ఐ.ఏ.ఎస్. అధికారులకు ఆయన చక్కని స్పూర్తి ప్రదాత. నిబంధనల పేరుతొ అధికారుల్లో వుండే చొరవను చిదిమేయవద్దని ప్రసాద్ గారు తరచుగా అంటుండేవారని ఆయన కింద పనిచేసిన ఓ అధికారి గుర్తు చేసుకున్నారు. యువ అధికారులు చొరవ తీసుకుని చక్కని ఫలితాలు రాబట్టే క్రమంలో కొన్ని కొన్ని పొరబాట్లు చేసినప్పుడు ఆయన పెద్ద మనసుతో సర్దిపుచ్చేవారు. నల్గొండ జిల్లాలో ఎస్.ఎఫ్.డి.ఏ. అధికారిగా పనిచేస్తున్నప్పుడు సన్నకారు రైతులకు ప్రయోజనం కల్పించే ఒక పధకం అమల్లో ఆయన అలాంటి చొరవనే ప్రదర్శించారు. ఆ జిల్లాలో అయన వేసిన కొత్త బాటకు దేశవ్యాప్త ప్రచారం లభించింది. ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధానమంత్రి స్వయంగా నల్గొండ ప్రయోగం గురించి ప్రస్తావించిన విషయాన్ని నాటి ముఖ్యమంత్రి శ్రీ పీ.వీ. నరసింహారావు గారు స్వయంగా పీవీఆర్కే చెవిన వేశారు. ఈ సంగతిని ఆయన తన అనుభవాల గ్రంధంలో రాసుకున్నారు కూడా.
“అకీర్తిం చాపి భూతాని కధయిష్యంతి తేవ్యయామ్
సంభావితస్యచా కీర్తిర్మరణా దతిరిచ్యతే” 
“ప్రజలెప్పుడూ నీ అపకీర్తి గురించే చెప్పుకుంటారు. ఆత్మగౌరవం కలిగిన వ్యక్తికి అపకీర్తి అనేది మరణం కంటే దుర్భరమైనది”
భగవద్గీతలో గీతాకారుడు చెప్పిన ఈ సూక్తిని శ్రీ పీ.వీ.ఆర్.కే. ప్రసాద్ తన జీవిత పర్యంతం మనసా వాచా కర్మణా గుర్తుంచుకుని జీవనయానం సాగించారేమో అనిపిస్తుంది ఆయన జీవితాన్ని తరచి చూస్తే.
“నాహం కర్తా హరి:కర్తా”
(నేను కాదు కర్తని. చేసేది చేయించేది అంతా శ్రీహరే!) 
ఇదీ శ్రీ ప్రసాద్ గారి నమ్మకం. అందుకే కాబోలు తన తిరుపతి అనుభవాల గ్రంధానికి దీన్నే మకుటంగా పెట్టుకున్నారు.
పుణ్యజీవితం గడిపిన ధన్యజీవి శ్రీ పీ.వీ.ఆర్.కే. ప్రసాద్.

శిలాక్షరం - భండారు శ్రీనివాసరావు



ఆయనకిప్పుడు కొంచెం అటూఇటూగా ఎనభై ఏళ్ళు. నలభై ఏళ్ళ కిందట క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు. అనేక ముఖ్యమైన శాఖలు నిర్వహించారు. రెండు మూడేళ్ళ క్రితం కలిసినప్పుడు జరిగిన మాటామంతిలో ఒక విషయం చెప్పారు.  ఆయన రోడ్లు భవనాల శాఖ మంత్రిగా వున్నప్పుడు ఓ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ గెస్ట్ హౌస్ నిర్మించి ఆయన చేతులమీదుగా ప్రారంభోత్సవం చేశారట. మాజీ మంత్రి అవతారంలో మళ్ళీ అదే వూరికి సొంత పని మీద వెళుతూ తెలిసిన ఎమ్మెల్యేతో చెప్పించుకుని అదే గెస్ట్ హౌస్ లో గది బుక్ చేసుకున్నారు. తీరా వెడితే గదులు ఖాళీ లేవంటూ, మీరెవరని ప్రశ్నించారట. అడిగినవాడిని కాలరు పుచ్చుకుని లాక్కెళ్ళి గెస్ట్ హౌస్ బయట శిలాఫలకంపై వున్న తన పేరు చూపించాలన్నంత కోపం వచ్చిందట. కానీ తమాయించుకుని అక్కడ నుంచి బయటపడి ఏదో హోటల్లో ఆ రాత్రి బస చేసి వచ్చేశారట.
చివరకు ఆయన చెప్పిందేమిటంటే శిలాఫలకాలమీద పేరు వేశారని సంతోషపడడమే కానీ ప్రజలకు అదేమీ పట్టదు.

20, ఆగస్టు 2024, మంగళవారం

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారం


అమెరికాలో నవంబర్ లో  జరిగే ప్రెసిడెంట్ ఎన్నికల హోరు క్రమంగా ఊపందుకుంటోంది.
ఈరోజు చికాగోలో డెమొక్రాటిక్ పార్టీ నేషనల్ కన్వెన్షన్ మొదలయింది. 
ప్రెసిడెంట్ పదవికి ఆ పార్టీ తరఫున పోటీ పడుతున్న కమ్లా హారిస్ (ప్రసంగించిన వక్తలలో చాలా మంది ఆమె పేరుని ఇలాగే ఉచ్చరించారు) తో పాటు, గత నాలుగేళ్లుగా అమెరికాను పాలించిన ప్రెసిడెంట్ జో బైడెన్ కూడా హాజరై ప్రసంగించారు. 
ఒకరకంగా ఇది ఆయనకు వీడ్కోలు కార్యక్రమం అనిపించింది. ఆయన మైకు పట్టుకోగానే హాలు లోని వేలాది మంది వుయ్ లవ్ బైడెన్ అనే ప్లే కార్డు పట్టుకుని లేచి నిలబడి హర్షధ్వానాలు చేశారు. 
ప్రస్తుత వైస్ ప్రెసిడెంటు కమ్లా హారిస్ కూడా హాజరయ్యారు. కాకపోతే ఆమె ప్రసంగం ఈ రాత్రి వుండక పోవచ్చు.
రెండు ప్రధాన పార్టీలు ఇలాగే సభలు సమావేశాలు నిర్వహిస్తాయి కానీ బహిరంగంగా కాదు. ఏదో ఒక నగరంలో, అదీ ఒక సమావేశ మందిరంలో.
దేశ ప్రెసిడెంటు పాల్గొంటున్న సభను  టీవీలో వీక్షిస్తున్న నా కంటికి ఎక్కడా సెక్యూరిటీ సిబ్బంది కనపడలేదు. సీక్రెట్ సర్వీసు వాళ్ళు వుంటే వుండవచ్చు. కానీ ఆ వ్యవహారం అంతా సీక్రెట్.
ఇలాంటి పద్ధతులు మన దేశంలో కూడా రావాలని ఆశించడం అత్యాశ కాదు కదా!

19, ఆగస్టు 2024, సోమవారం

ఫొటో

 

నా చిన్ననాటి స్నేహితుడు, సహాధ్యాయి ప్లస్ మేనల్లుడు అయిన తుర్లపాటి సాంబశివరావు (శాయిబాబు, ఇప్పుడు లేడు) దగ్గర ఒక డబ్బా డొక్కు కెమెరా వుండేది. అది పనిచేసేదా కాదా తెలుసుకోవాలి అంటే పదో పదిహేనో రూపాయలు కావాలి. రీలు కొనడానికి ఓ పది, కడిగించి ప్రింట్లు వేయడానికి మళ్ళీ కొంతా ఇల్లాగన్న మాట.  అంత మొత్తం మాదగ్గర ఎలాగూ వుండదు కాబట్టి, అదో టాయ్ కెమేరాలాగా శాయిబాబు వద్ద చాలా కాలం ఉండిపోయింది.
ఒకరోజు దాని అవసరం వచ్చింది. అప్పటికి చదువు  పూర్తి కాకుండా, ఉద్యోగం సద్యోగం కనుచూపుమేరలో లేదన్న సంగతి నిర్ధారణగా తెలిసిన రోజుల్లో అన్నమాట, పక్కింటి అమ్మాయితో (అంటే తదనంతర కాలంలో మా ఆవిడ) నా ప్రేమ వ్యవహారం నిరాఘాటంగా సాగిపోతున్న అద్భుత కాలంలో నాకు ఆ కెమెరా కావాల్సి వచ్చింది. కృష్ణా  బ్యారేజి దాకా నడుచుకుంటూ వెళ్లి అక్కడి నుంచి గూడు రిక్షాలో మంగళగిరి పానకాల స్వామి దర్శనం చేసుకుని రావాలనేది నా ప్లాను. మరో మేనల్లుడు రామచంద్రం మన కూడా వస్తేనే తను వస్తానని నాకు కాబోయే ఆవిడ  షరతు పెట్టడంతో,  ముగ్గురం కలిసి వెళ్ళాము.  దర్శనం అదీ అయిన తర్వాత అక్కడి కొండపై ఇదిగో ఈ కింది ఫోటో దిగాము. తీసింది రామచంద్రం. కెమెరా ఇచ్చేటప్పుడే చెప్పాడు శాయి బాబు, రీల్లో ఆల్రెడీ తీసిన ఫోటోలు కొన్ని వున్నాయి. డబ్బులు లేక కడిగించలేదు, కాబట్టి ఒకటీ లేదంటే రెండు, అంతే! అంతకంటే ఎక్కువ దిగకండి అని. దాంతో ఒక్కటంటే ఒక్క ఫొటోనే దిగి కెమెరా తిరిగి ఇచ్చేశాను. 
ఆ రీలు కడిగించే డబ్బులు కూడబెట్టడానికి మరి కొన్ని నెలలు ఆగాల్సివచ్చింది. వీరన్న స్టూడియోలో ఇచ్చాము. రెండు రోజుల తర్వాత చూస్తే రీల్లో చాలా ఫోటోలు  ప్రింటుకు పనికిరానివని తేలింది. చివరికి ఐదో ఆరో బాగున్నాయి. కానీ అన్నీ ప్రింటు వేయించాలి అంటే డబ్బులు సరిపోవు. అంచేత ఓ మూడు వేయించాము. అందులో ఇదొకటి.
పెళ్ళికి ముందు ఫోటో కదా! అదో స్వీట్ మెమొరి.
(ఆగస్టు 19, వరల్డ్  ఫోటోగ్రఫీ డే అట కదా!)

17, ఆగస్టు 2024, శనివారం

నువ్వు లేని నేను


అప్పుడే ఐదేళ్ల కాలం నువ్వు లేకుండా గడిచి పోయింది.  మరి కొన్ని యేళ్ళు ఇలాగే గడిచి పోతాయి. ఎన్నాళ్లు అన్నదే తెలియదు. 
అమెరికాలో   పదేళ్ల  క్రితం,  మనిద్దరం  కలిసి తిరిగిన దారుల్లో నీ అడుగు జాడలు వెతుక్కుంటూ.. నా పిచ్చి కానీ కాంక్రీట్ దారిలో అవి ఎలా కనపడతాయి?

 (17/18-08-2019 - 17/18-08- 2024)

16, ఆగస్టు 2024, శుక్రవారం

జయ జయ జయ భారత జనయిత్రీ


అందరూ ఆఫీసుల నుండి వచ్చి బయలు దేరి వెళ్ళేసరికి, బెల్ వ్యూ సిటీ హాల్ పార్కింగ్ లాట్ వందలాది కార్లతో నిండి పోయి ఉంది.
దాంతో పక్క వీధిలో వున్న పెయిడ్ పార్కింగ్ లో కారు పెట్టి తిరిగి వస్తుంటే పేవ్ మెంట్ మీద గుంపులు గుంపులుగా రకరకాల భారతీయ వస్త్ర ధారణతో ఆడా మగ ఉత్సాహంగా నడుస్తూ కనిపించారు. త్రివర్ణ పతాకాలతో సిటీ హాల్ ప్రాంగణం నిండి పోయింది. జాతీయ జెండా కట్టుకుని వెడుతున్న ఒక సిటీ బస్సు కనిపించింది.
వచ్చిన జనం మూడు నాలుగు వేల మంది వుండ వచ్చు. ప్రధాన రహదారిలో ప్రదర్శన. ఆ రోడ్డును కొన్ని గంటల పాటు మూసివేశారు. చాలా మంది సాయుధులు అయిన పోలీసులు వున్నారు కానీ వాహనాలు, పాద చారుల రాకపోకల క్రమబద్ధీకరణకు మాత్రమే పరిమితం అయ్యారు. ఫైర్ సర్వీసు వారు తమ భారీ వాహనాలతో సిద్ధం అయ్యారు. వ్యక్తిగత తనిఖీలు లేవు. అమెరికాలో ప్రవేశించే ముందే ఏ తనిఖీ అయినా. ఒక్కసారి ఆ దేశంలో ప్రవేశించిన తర్వాత మాల్స్, సినిమా హాల్స్ ఎక్కడా ఏవిధమైన చెకింగులు ఉండకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. రోడ్డు దాటేటప్పుడు జాన్ సన్ అనే పోలీసు అధికారి నా చేయి పట్టుకుని దాటించాడు. ఇండియా అంటే సౌతా అని అడిగి, ఓహ్ స్పైసీ అంటూ నవ్వాడు. 
మా అబ్బాయి బోయింగ్ లో పనిచేసేటప్పుడు సహోద్యోగి ఇప్పుడు డిప్యూటీ మేయర్. అంత హడావిడిలో కూడా సందీప్ తో తీరిగ్గా మాట్లాడారు. నన్ను పరిచయం చేస్తే భారతీయ పద్ధతిలో చేతులు జోడించి నమస్కారం చేసారు. 
రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన వేదికపై ఇండియన్ కాన్సులేట్ ఉన్నతాధికారులు ఆసీనులు అయ్యారు.  వేదికపై ఒక పక్కగా కూర్చుని రెండు గంటలు ఆసక్తిగా ప్రదర్శన తిలకించిన వారిలో ఒకరిని మాత్రం నేను గుర్తు పట్ట గలిగాను. ఆయన ఎవరో కాదు, ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్. తరువాత వివిధ రాష్ట్రాల వారు తమ సంస్కృతిని ప్రతిబింబించే వాహనాల ప్రదర్శన జరిగింది. వీటిల్లో తెలంగాణా, ఆంధ్రా లకు చెందినవి కూడా వుండడం సంతోషం కలిగించింది. ప్రదర్శన ముగిసిన తర్వాత వారితో ఫోటోలు దిగాము.
వచ్చిన వారందరికీ స్టార్ బక్స్ వారు తీయటి పానీయాలు అందించారు.
ఇంటికి వెళ్ళే ముందు దగ్గర్లోని ఓ అమెరికన్ రెస్టారెంట్లో భోజనం చేసాము. ఆగష్టు 15 ఇండియన్ రెస్టారెంట్ లకు సెలవు.
మెన్యు కార్డులో కుడి వైపు చూడవద్దు, ఎడమవైపు వున్న వాటిలో మీకు ఇష్టమైనవి ఆర్థర్ చేయండి అనేది మొదటి రోజే మా అబ్బాయి చేసిన సూచన. ఎంత ఖరీదు అనేది పట్టించుకోవద్దు అనేది దాని టీకా తాత్పర్యము.

15, ఆగస్టు 2024, గురువారం

ఆ రోజు ఏం జరిగింది అంటే...



ఆగస్టు 15 అనగానే చటుక్కున అందరికీ గుర్తుకు వచ్చేది ఢిల్లీలోని ఎర్రకోట బురుజులపై భారత ప్రధాన మంత్రి జాతీయ పతాకాన్ని ఎగురవేయడం. దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. అయితే
మన దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు అంటే 1947 ఆగస్టు 15 న జరిగిన మొదటి జెండా వందనం ఎర్రకోట బురుజుల నుంచి జరగలేదు. పండిట్ నెహ్రూ పదిహేనవ తేదీనే ఢిల్లీలోని ఇండియా గేటు సమీపంలోని ప్రిన్సెస్ పార్కులో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఆయన వెంట ఆ నాటి భారత గవర్నర్ జనరల్ మౌంట్ బాటెన్ కూడా వున్నారు. ఆ బహిరంగ కార్యక్రమానికి ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చారు. సుమారు అయిదు లక్షల మంది ఆ ప్రాంతానికి ఉత్సాహంగా చేరుకున్నారు. వారిని నిలువరించడానికి చేసిన ప్రయత్నాలన్నీ వమ్ము కావడంతో పోలీసులు చేతులు ఎత్తేసారు. కార్యక్రమానికి అతిధులుగా వచ్చిన అనేకమంది విదేశీ దౌత్య వేత్తలు, మంత్రులు, ఇతర ప్రముఖులు, జన సందోహంతో నిండిపోయిన ఆ ప్రదేశానికి చేరుకోలేక వెనక్కి మళ్ళాల్సి వచ్చింది. ఆ జన సమ్మర్దంలో తప్పిపోయిన పిల్లలను వెతికే కార్యక్రమంలో నెహ్రూ, మౌంట్ బాటెన్ కూడా ఎంతో శ్రమ పడాల్సి వచ్చిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
ఆ మరునాడు అంటే 1947 ఆగస్టు 16 వ తేదీన నాటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఎర్రకోట వద్ద జరిగిన జెండా వందన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన ఆ కార్యక్రమానికి హాజరయ్యారు కానీ పతాకాన్ని ఎగురవేయలేదు. మరో నమ్మ లేని నిజం ఏమిటంటే ఆనాడు ఎర్రకోటపై పతాకాన్ని ఎగురవేసింది ఆ పనికోసం నియోగించబడ్డ ఒక ఆర్మీ అధికారి. అప్పుడు జరిగిన ఏర్పాట్ల గురించి ఒక ఆర్మీ అధికారి రాసిన పుస్తకంలో ఈ వివరాలు వున్నాయి. బురుజుపై నిలబడి ప్రధాని నెహ్రూ ఒక స్విచ్చి నొక్కగానే బురుజు కింద గంట మోగే ఏర్పాటు చేసారు. నెహ్రూ స్విచ్చి నొక్కి గంట మోగించగానే ఆ సంకేతాన్ని అందుకుని ఆర్మీ అధికారి వెంటనే జాతీయ జెండాను ఎగురవేశారని ఆయన ఆ పుస్తకంలో తెలిపారు.
మరో విశేషం ఏమిటంటే త్రివర్ణశోభితమైన జాతీయ పతాకం వినువీధుల్లోకి ఎగరగానే చిరుజల్లులు కురిశాయి. గగన తలంలో ఇంద్రధనుస్సు దర్శనమిచ్చింది. ఒకవైపు త్రివర్ణ పతాకం, మరో వైపు రంగురంగుల ఇంద్ర ధనుస్సు. నయనానందకరమైన ఆ దృశ్యాన్ని చక్కటి శుభసూచనగా ప్రజలు భావించారు.
1947 దాదిగా స్వతంత్ర దినోత్సవం రోజున ప్రధానమంత్రి ఎర్రకోట బురుజులపై జాతీయ పతాకాన్ని ఎగురవేసే సాంప్రదాయం ఈనాటికీ కొనసాగుతోంది. అయితే ఈ కార్యక్రమానికి మొఘల్ చక్రవర్తుల కోటను ఎందుకు ఎంపిక చేసుకున్నారు అనే విషయంపై సరయిన వివరాలు లభించడం లేదు. 1857లో జరిగిన ప్రధమ స్వాతంత్ర పోరాటాన్ని బహదూర్ షా జాఫర్ ఈ లాల్ ఖిలా నుంచే మొదలుపెట్టారని, అందుచేత స్వాతంత్ర దినోత్సవం నాడు జాతీయ పతాకాన్ని ఎర్రకోట నుంచి ఎగురవేయడం సముచితంగా ఉంటుందన్న భావనతో ఈ సాంప్రదాయం మొదలయిందని కొందరు వివరిస్తున్నారు.
ఆగస్టు పద్నాలుగవ తేదీ అర్ధరాత్రి (తెల్లవారితే పదిహేనవ తేదీ) పార్లమెంటు హౌస్ లో జరిగిన భారత రాజ్యాంగపరిషత్తు ఐదో సమావేశంలో, భారత దేశానికి స్వతంత్రం ఇస్తూ బ్రిటిష్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన అధికారిక ప్రకటన జరిగింది. ఈ సమావేశం పద్నాలుగో తేదీ రాత్రి పదకొండు గంటలకు సుచేతా కృపాలాని వందేమాతరం గీతాలాపనతో మొదలయింది. రాజ్యాంగ పరిషత్తు చైర్మన్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ అధ్యక్షత వహించారు. పండిట్ నెహ్రూ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది “ప్రపంచం యావత్తూ నిద్రిస్తున్న వేళ, స్వతంత్ర వాయువులు పీలుస్తూ భారత దేశం మేలుకుంటోంది” అనే అర్ధం వచ్చేలా చేసిన ప్రసంగం ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’ గా చరిత్ర పుటల్లో నిలిచిపోయింది.
అనంతరం బొంబాయి (ఇప్పుడు ముంబై) కి చెందిన విద్యావేత్త, ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు హంసా మెహతా, దేశంలోని మహిళలు అందరి తరపున భారత జాతీయ పతాకాన్ని జాతికి సమర్పించారు. సుచేతా కృపాలానీ ‘సారే జహాసే అచ్చా’ గేయం పాడి అలరించారు. ‘జనగణమన’ (అప్పటికి అది జాతీయ గీతం కాదు) గీతాలాపనతో నాటి సమావేశం ముగిసింది.
మరునాడు అంటే ఆగస్టు పదిహేనవ తేదీన ఉదయం ఫెడరల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ హరిలాల్ కనియా, నూతన గవర్నర్ జనరల్ మౌంట్ బాటెన్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మౌంట్ బాటెన్ నెహ్రూ మంత్రివర్గంతో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. జగ్జీవన్ రాం ఆసుపత్రిలో చేరిన కారణంగా ఆయన ఆ రోజున ప్రమాణస్వీకారం చేయలేకపోయారు.

13, ఆగస్టు 2024, మంగళవారం

ఆగస్టు అంటేనే జ్ఞాపకాలు



అందించడం అంటే మాటలు కాదు.
రెండూ రెండున్నర గంటల కార్యక్రమమే అయినా ఇల్లాలు మాత్రం  శతావధానం చేయాల్సిందే.
‘ఆవు నెయ్యి, నల్ల నువ్వులు చెప్పాను, తెచ్చి ఇక్కడ పెట్టండి. భోక్తలు భోజనాలు చేసే చోట తడిగుడ్డతో తుడవండి, ఓ నిమ్మకాయంత అన్నం తెచ్చి విస్తట్లో ఆ మూల వుంచండి, చిల్లర డబ్బులు అక్కడ పెట్టండి, ఆధరువులు అన్నీ వరసగా తెచ్చి వడ్డించండి. జాగ్రత్తగా కనుక్కుని మారు వడ్డన చేయండి’ 
కార్యక్రమం నిర్వహించడానికి వచ్చిన బ్రహ్మగారు ఇలా విరామం లేకుండా ఏదో ఒకటి   అడుగుతూనే వుంటారు. తడిపొడి మడిచీర కట్టుకున్న ఇంటి ఇల్లాలు మరో ముచ్చట లేకుండా వాటిని చప్పున తెచ్చి అందిస్తుండాలి. పేరుకు ఆరోజున ఓ వంటమ్మగారు వచ్చి వంటలు చేసినా, ఈ అందింపు, వడ్డింపుల  బాధ్యత మాత్రం ఇల్లాలిదే. తద్దినానికి కర్తగా కూర్చొన్న భర్త మాత్రం  సవ్యం, అపసవ్యం అంటూ పురోహితుల వారు చెప్పినప్పుడల్లా భుజం మీది  జంధ్యాన్ని మారుస్తూ ఉంటాడు. 
మా అమ్మానాన్నల ఆబ్డీకాల సమయంలో కొన్ని దశాబ్దాలుగా మా ఇళ్ళల్లో జరుగుతూ వచ్చిన తంతు ఇదే.
 డ్రెస్సులకు అలవాటు పడిన యువతరం  కోడలు అయినా అలవాటులేని  చీరకట్టుతో  పడిన ఇబ్బందినీ,  కష్టాన్ని కళ్ళారా చూసినప్పుడు కానీ,  ఇన్నేళ్ళుగా మా ఆవిడ ఇంతగా  కష్టపడిందా అనే ఎరుక నాకు కలగకపోవడం ఆశ్చర్యం. 
నిజానికి ఇందులో  విడ్డూరం ఏముంది! ఆడవాళ్ళ కష్టాలు మగవాళ్లు  తెలుసుకోగలిగితేనే ఆశ్చర్యపడాలి.    
   
 
నిరుడు అయినా ఈ ఏడాది అయినా, వచ్చే యేడు అయినా  మరచిపోవాలని అనుకుని మరచిపోలేని  ఈ జ్ఞాపకాలు బతికి వున్నంత కాలం వెంటాడుతూనే వుంటాయి.

12, ఆగస్టు 2024, సోమవారం

చేతిలో చెయ్యేసి


Puget sound అనేది మైళ్ళ పొడవున విస్తరించిన అపారమైన జలరాశి.
 దీని వొడ్డున ఉక్కు తీగెల కంచె యేమిటి? కంచెకు వేసిన ఆ తాళాలు యేమిటి?

మన దేశంలో 
ప్రేయసీ ప్రియులు తమ ప్రేమ వ్యక్తీకరణ కోసం చెట్ల బెరడుల మీద, పాడుపడిన కోట గోడల మీద తమ పేర్లు చెక్కుకుని సంతోష పడినట్టే, ఇక్కడ అమెరికాలో ఇలా ఇనుప కంచెలకి తాళాలు వేసి, తాళం చెవులు ఎక్కడో పారేసి, గుండెల్లో దాచుకున్న తమ ప్రేమ పదిలం అనుకుంటూ  సంతుష్టి పడుతుంటారు (ట).
ఇలా వేసిన తాళాల్లో తుప్పుపట్టిపోయినవి, తాజాగా వేసినవి కూడా కనిపించాయి.
ఇంటికి వచ్చి గూగుల్ ని అడిగితే అమెరికాలో విడాకులు తీసుకునే వారి సంఖ్య 42 శాతం అని చెప్పింది.

వాషింగ్ టన్ లేక్ వడ్డున ఓ సాయంత్రం

సియాటిల్ వాషింగ్ టన్ లేక్ నడుమ సూర్యాస్తమయవేళ. చెక్క అంచున అంగుళం వెనక్కి జరిగితే లోతు ఎంతో తెలియనంత జలరాశి. అక్కడ కూచుని లేవడమే గగనం అనుకుంటే, ఇదిగో ఇలా దూకడాలు, గెంతడాలు. 
అంచేత ఇలా ఓ గూడు వేసి, ఫ్యాను పెట్టి చూస్తూ వుండమని కూర్చోబెట్టారు. అచ్చం గోవాలో వున్నట్టు అనిపించింది. ఆడా మగ అంతా పచ్చని పచ్చికపై ఒళ్ళు ఆరబెట్టుకుంటూ.
మన ఒళ్ళు జలదరించేలా ఈతలు మరోపక్క.

11, ఆగస్టు 2024, ఆదివారం

లోకం అంటే స్వచ్చత, పచ్చదనం

ఈ పాటి ఎత్తు ఎదగడానికి నాకు 78 ఏళ్ల టైమ్ పట్టింది. ఈ వృక్షం ఇంత ఎత్తు ఎదగడానికి ఎన్ని దశాబ్దాలు గడిచిపోయాయో మరి. ఇంత కాలం దానిని నరకకుండా కాపాడిన వారిని మెచ్చుకోవాలి. సియాటిల్  లో ఎటు పోయినా కనిపించే వాషింగ్టన్ లేక్  లో నీటి స్వచ్ఛతని చూస్తుంటే అక్కడే  వుండిపోవాలని అనిపించింది.

10, ఆగస్టు 2024, శనివారం

ఆగష్టు అంటే అయిష్టత


102 డిగ్రీలు ఒక జ్వరమా?

రాసిన నోట్స్ అన్నీ దాచుకోవడం అవసరమా!

కాకపోవచ్చు. 
కానీ ఏదో ఒక రాత్రి, నిద్ర పట్టని రాత్రి ఆ రాతలే అవసరం అవుతాయేమో ఏం చెప్పగలం.

2019 ఆగస్టు 15 రాత్రి ఎనిమిది గంటల 15 నిమిషాలకు 102.3 డిగ్రీలు 
ఆగస్టు 16 ఉదయం ఆరున్నరకు 99.2 డిగ్రీలు 
ఆగస్టు 16 మధ్యాన్నం ఒకటిన్నరకు 100 డిగ్రీలు

పిన్నికి ఒంట్లో బాగా లేదని జూబ్లీ హిల్స్ అపోలో లో పనిచేస్తున్న మా కజిన్ డాక్టరు బాబీ (సుసర్ల కామేశ్వర రావు) కి ఫోన్ చేస్తే, ఏదో టాబ్ లెట్ చెప్పి,  టెంపరేచర్ నోట్ చేయమని చెప్పాడు.

ఆగస్టు 17 కల్లా నెమ్మదించింది. ఓకే అనుకున్నాను. బాబీ ఇంటికి వచ్చి చూసి పరవాలేదు అన్నాడు. 
ఆ మర్నాడు అంటే 18 రాత్రి చెప్పాపెట్టకుండా దాటిపోయింది. 
ఆమెది అదృష్టం. నాది దురదృష్టం.
అందుకే ఆగస్టు అంటే, నేను పుట్టిన రోజు ఆ నెలలోనే అయినా,  ఒక రకమైన అయిష్టత. అకారణ ద్వేషం.

9, ఆగస్టు 2024, శుక్రవారం

శనగల మంగళ వారం - భండారు శ్రీనివాసరావు



టైం మేనేజ్ మెంట్ (సమయ పాలన), మెన్ మేనేజ్ మెంట్ (ఇక్కడ మెన్ అంటే మగవాళ్ళని కాదు, నిజానికి ఉమెన్ మేనేజ్ మెంట్) కు ఏదయినా ప్రపంచస్థాయి పెద్ద పురస్కారానికి గ్రహీతలను నిర్ణయించే బాధ్యత నాకిస్తే, నేను ఖచ్చితంగా ఆ బహుమతిని గంపగుత్తగా వరలక్ష్మీ వ్రతం నోముకునే ఆడవాళ్ళందరికి కలిపి ఇచ్చేస్తాను.

ఏటేటా ఈ వ్రతం నిర్వహించడంలో ఆడవాళ్ళు పడే శ్రమదమాదుల మాట అటుంచి, పేరంటాళ్ళను మేనేజ్ చేసే విధానం గమనించినప్పుడు నాకీ ఆలోచన కలిగింది. దాదాపు ఒకే రోజు ఒకే సమయంలో ఒకరింటికి తాము పేరంటానికి వెళ్ళాలి. మళ్ళీ తమ ఇంటికి వచ్చే పేరంటాళ్ళను కనుక్కుని వాయినాలు ఇవ్వాలి. సమయం ఎలా సర్దుబాటు చేసుకుంటారో ఎన్నిసార్లు బద్దలు కొట్టుకుంటున్నా, నా చిన్న బుర్రకు ఎంతమాత్రం అర్ధం కాదు. కార్లూ డ్రైవర్లు వుండే మగ మహారాజులు కూడా అనుకున్న సమయానికి అనుకున్న చోటుకు వెళ్ళలేక సతమతమవుతారు.
అలాటిది, వానయినా వంగిడి అయినా, కార్లూ డ్రయివర్లూ లేకున్నా, ఆటోల్లో తిరుగుతూ అందరి ఇళ్ళను అనుకున్న సమయానికి అనుకున్న వ్యవధిలో చుట్టబెడుతూ, మళ్ళీ తమ ఇంట్లో కూడా ఏమాత్రం తభావతు రాకుండా చూసుకుంటున్న విధానాన్ని ఒకసారి గమనిస్తే నాతో మీరూ ఏకీభవిస్తారు.
ఇక పూజలూ వ్రతాలు అంటారా, అది వాళ్ళ ఇష్టం. ప్రసాదాలు అంటారా, అది మన ప్రాప్తం.

ఉపశృతి:

శనగల మంగళ వారం
'ప్రతి శ్రావణ బుధవారం ఉదయం
వేయించిన శనగలతో
తప్పనిసరి పలహారం'

8, ఆగస్టు 2024, గురువారం

పుట్టిన రోజున దేవుడి కానుక



ఈరోజు తొలి వెలుగు రేఖలు విచ్చుకుంటూవుంటే,  నా కంటి ముందు మరో వెలుగు కనబడింది. కనబడడమే కాదు నాతో మాట్లాడింది కూడా.
‘నా పొరబాటో, నీ గ్రహపాటో తెలియదు. మొత్తం మీద  78 దాటుతున్నావు.  నువ్వు అడగకుండానే నీకో  అపూర్వమైన వరం ఇవ్వాలని అనిపించి వచ్చాను. అయితే ఓ షరతు. దానికి ఒప్పుకుంటేనే సుమా!’
‘.............’
‘చెబుతా విను. ఇక నుంచయినా నువ్వు  ఆనందంగా వుండు. ఇతరులని సంతోషంగా ఉంచు. ఇలా చేస్తే నేనిచ్చే  వరమేమిటో తెలుసా? సంతృప్తి. ఇంగ్లీషులో  కంటెంట్ మెంట్ అంటారుట. అది సాధిస్తే,  ఇక నాకిది కావాలి, అది కావాలి అని నన్ను ఎప్పుడూ సాధించవు. ఇలా తెల్లవారకుండానే వచ్చి  నీకు వరాలు ఇచ్చే పని నాకూ వుండదు. తెలిసిందా! డెబ్బయి ఎనిమిదేళ్లు వచ్చిన తర్వాత కూడా తెలియకపోతే నీ ఖర్మ. వస్తా!’

5, ఆగస్టు 2024, సోమవారం

కొడుకే తండ్రిగా మారిన వేళ


'చిట్టి డెలివర్డ్ మేల్ చైల్డ్ - గోపాలరావు '

1973 ఆగస్టు అయిదో తేదీన మద్రాసు నుంచి మా మామగారు ఇచ్చిన టెలిగ్రాం బెజవాడలో వున్న నాకు మరునాడు చేరింది.
నాడు పుట్టిన నా పెద్ద కొడుకే ఈ సందీప్. సండే నాడు పుట్టాడు కనుక సందీప్ అని పిలవడం మొదలు పెట్టాము. బాలసారలు, నామకరణాలు గట్రా లేవు.
ఇప్పుడు పెరిగి పెద్దవాడు అయి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. వాడి యాభయ్యవ పుట్టిన రోజునాడు నేను కాకతాళీయంగా అమెరికాలో వుండడం తటస్థించింది.
వాడి ఫ్రెండ్స్ ఓ పదిమంది తమ కుటుంబాలతో కలసి  పుట్టిన రోజు వేడుకను సియాటిల్ లోని నదిలో నౌకా విహారం చేస్తూ ఘనంగా, సందడిగా నిర్వహించారు. నా కోడలు భావన, మనుమరాళ్ళు సఖి, సృష్ఠి ఈ వేడుకకు తగిన ప్రణాళిక చాలా ముందుగానే సిద్ధం చేశారు. 
సందీప్ గురించి మాట్లాడమంటే నాకు మాటలు కరువయ్యాయి. 

' 2019 లో నా భార్య నిర్మల కన్నుమూసేవరకు వాడికి నేను తండ్రిని. అప్పటినుంచి వాడు నాకు తండ్రిగా మారి కడుపులో పెట్టుకుని చూస్తున్నాడు '

ఇంతకు మించి నా నోరు పెగల్లేదు.
మాట్లాడిన వారందరూ చక్కటి తెలుగులో మాట్లాడి, సందీప్ తో తమ పరిచయాన్ని, స్నేహాన్ని, వాడి మంచితనాన్ని గొప్పగా ప్రశంసించారు.

ఇంటికి వచ్చిన తర్వాత  తల్లి ఫోటో ముందు మళ్ళీ కేకు కట్ చేసి దణ్ణం పెట్టి ఆశీస్సులు తీసుకున్నాడు.

ఒకరకంగా వాడు నా కంటే రెండు రోజులు పెద్ద. నా పుట్టిన రోజు ఆగష్టు ఏడు అయితే వాడిది ఆగష్టు అయిదు.