'చిట్టి డెలివర్డ్ మేల్ చైల్డ్ - గోపాలరావు '
1973 ఆగస్టు అయిదో తేదీన మద్రాసు నుంచి మా మామగారు ఇచ్చిన టెలిగ్రాం బెజవాడలో వున్న నాకు మరునాడు చేరింది.
నాడు పుట్టిన నా పెద్ద కొడుకే ఈ సందీప్. సండే నాడు పుట్టాడు కనుక సందీప్ అని పిలవడం మొదలు పెట్టాము. బాలసారలు, నామకరణాలు గట్రా లేవు.
ఇప్పుడు పెరిగి పెద్దవాడు అయి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. వాడి యాభయ్యవ పుట్టిన రోజునాడు నేను కాకతాళీయంగా అమెరికాలో వుండడం తటస్థించింది.
వాడి ఫ్రెండ్స్ ఓ పదిమంది తమ కుటుంబాలతో కలసి పుట్టిన రోజు వేడుకను సియాటిల్ లోని నదిలో నౌకా విహారం చేస్తూ ఘనంగా, సందడిగా నిర్వహించారు. నా కోడలు భావన, మనుమరాళ్ళు సఖి, సృష్ఠి ఈ వేడుకకు తగిన ప్రణాళిక చాలా ముందుగానే సిద్ధం చేశారు.
సందీప్ గురించి మాట్లాడమంటే నాకు మాటలు కరువయ్యాయి.
' 2019 లో నా భార్య నిర్మల కన్నుమూసేవరకు వాడికి నేను తండ్రిని. అప్పటినుంచి వాడు నాకు తండ్రిగా మారి కడుపులో పెట్టుకుని చూస్తున్నాడు '
ఇంతకు మించి నా నోరు పెగల్లేదు.
మాట్లాడిన వారందరూ చక్కటి తెలుగులో మాట్లాడి, సందీప్ తో తమ పరిచయాన్ని, స్నేహాన్ని, వాడి మంచితనాన్ని గొప్పగా ప్రశంసించారు.
ఇంటికి వచ్చిన తర్వాత తల్లి ఫోటో ముందు మళ్ళీ కేకు కట్ చేసి దణ్ణం పెట్టి ఆశీస్సులు తీసుకున్నాడు.
ఒకరకంగా వాడు నా కంటే రెండు రోజులు పెద్ద. నా పుట్టిన రోజు ఆగష్టు ఏడు అయితే వాడిది ఆగష్టు అయిదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి