1, ఆగస్టు 2024, గురువారం

బార్ అండ్ రెస్టారెంట్ గా మారిన రైల్వే స్టేషన్ – భండారు శ్రీనివాసరావు

 

 

కన్నంతలో, విన్నంతలో అమెరికా 


అమెరికన్లకు మార్పు ఇష్టం. స్తబ్దతను ఇష్టపడరు. ప్రతిక్షణం కదలికలో ప్రగతిని కోరుకుంటారు. నేను గమనించిన మరో విషయం ఏమిటంటే మార్పును ఎంత గాఢoగా కోరుకుంటారో గతాన్ని అంతగా ప్రేమిస్తారు. గతం గుర్తులను పదిలంగా దాచుకుంటారు. భావితరాల కోసం వాటిని భద్రపరుస్తారు.

ప్రస్తుతం నేను ఉంటున్న మేరీ లాండ్ రాష్ట్రంలోని ఉడ్ స్టాక్ నగరానికి దాపులో సైక్స్ విల్  (Sykes Ville) అనే చోట ఒక రైల్వే స్టేషన్ వుంది. దీన్ని 1831 లో ఏర్పాటు చేశారు. 1863 లో జరిగిన  రైల్వే కార్మికుల సమ్మె హింసాత్మకంగా మారింది. ఆ విధ్వంసకాండలో రైలు మార్గంతో పాటు నగరంలోని ఆస్తులు కూడా దెబ్బతిన్నాయి.  1883 లో తిరిగి ఈ రైల్వే స్టేషన్ ను ఇప్పుడున్న రూపంలో పునరుద్ధరించారు. మరుసటి ఏడాది నుంచి రైళ్ళ రాకపోకలు మొదలయ్యాయి. కానీ పరిణామక్రమంలో భాగంగా 1950 లో ఈ స్టేషన్ ను మూసివేశారు. కొన్ని గూడ్స్ రైళ్లు నడుపుతున్నారు. స్టేషన్ భవనంలో ప్రస్తుతం బార్ అండ్ రెస్టారెంట్ నడుపుతున్నారు. అక్కడ విందు వినోదాలతో కాలక్షేపం చేస్తూ, వచ్చి పోయే గూడ్స్ రైళ్ళను తిలకించడానికి సెలవు దినాల్లో అనేకమంది పర్యాటకులు ఆ ప్రాంతాన్ని సందర్శిస్తూ వుంటారు. సుమారు రెండువందల ఏళ్ళ నాటి రైలు బోగీలను, రైలు ఇంజన్ ను మ్యూజియంగా మార్చి అలనాటి రైళ్ళ స్వరూప స్వభావాలను నేటి తరానికి పరిచయం చేస్తున్నారు. అలనాటి రైల్వే స్టేషన్ ఆవరణలో ప్రతి శనివారం, ఆదివారాల్లో రైతు బజార్లు నిర్వహిస్తున్నారు. (బెజవాడలో ఇలాగే సత్యనారాయణ పురం రైల్వే స్టేషన్ ను మూసివేశారు. ఇప్పుడు ఆ ప్రదేశం రద్దీ రోడ్లతో సమూలంగా రూపం మార్చుకుంది. స్టేషన్ అవశేషాలు మచ్చుకు కూడా లేవు. ఒకప్పుడు అక్కడ ఓ రైల్వే స్టేషన్ వుందంటే ఈ తరం వారెవ్వరూ నమ్మరు)

స్టేషన్ దాపుల్లో రోడ్డుకు ఇరువైపులా హోటల్లు, రెస్టారెంట్లు, విడిది గృహాలు లెక్కకు మిక్కిలిగా వున్నాయి.

కాశ్యప్ వాహిని ఇంట్లో భోజనాల అనంతరం తిన్నది అరగడానికి తిరగడానికి మళ్ళీ బయలు దేరాం.

చుట్టుపక్కల అంతా దట్టమైన అడవులు. వాటిగుండా వేసిన చక్కటి రహదారుల వెంట పొతే, చిట్టడవి నడుమ గలగలా పారుతున్న సెలయేరు. దాని మధ్య చిన్నాపెద్ద బండరాళ్ళు. వాటి మీద దుముకుతూ, కేరింతలు కొడుతూ  పిల్లలు చాలాసేపు కాలక్షేపం చేశారు. నిజానికి అరకు లోయలో కూడా ఇలాంటి సెలయేరు వుంది. కానీ ఇంత గొప్ప రహదారి సౌకర్యం ఉందా అంటే అనుమానమే. ఏటి వొడ్డున  నలుచదరంగా ఉన్న ఓ బండరాయిపై నేను విశ్రాంతి తీసుకుంటూ పిల్లలు చేస్తున్న  తమాషాలను చూస్తుండిపోయాను. రమణీయమైన ప్రకృతి అందాలను, నింగిని తాకుతున్న ఎత్తైన వృక్షాలు చూస్తూ కాలక్షేపం చేశాను.

ఇదే ఊర్లో మా అన్నయ్య, మేనల్లుడు, మేనకోడలి పిల్లలు దగ్గర దగ్గరగానే (వుడ్ స్టాక్, సైక్స్ విల్, టర్ఫ్ వ్యాలీ) ఇండిపెండెంట్ ఇళ్ళు కొనుక్కుని  వుంటున్నారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో తప్పిస్తే, ఉన్న పద్దెనిమిది మందిమీ కలిసి ఎవరో ఒకరి ఇంట్లో  మధ్యాహ్నభోజనాలు, రాత్రి డిన్నర్లు. ఎక్కడకు వెళ్ళినా నాలుగు కార్లు కదలాల్సిందే.

పరాయిదేశంలో కూడా కుటుంబ ఆప్యాయతలు అలాగే వున్నాయి. అందరూ వర్క్ ఫ్రం హోం బాపతే కాబట్టి లాప్ టాపుల్లో ఆఫీసు పని. పనిలోపనిగా కాలక్షేపం కబుర్లు. మధ్య మధ్య వేడి వేడి పకోడీలు, కాఫీలు సరేసరి.

(30-07-2024)

(అమెరికాలో రెండో రోజు కొన్ని ఫోటోలు, వీడియోల లింకులు)

  










  

 

కామెంట్‌లు లేవు: