ఆరేళ్ల క్రితం వరకు నాది ఊరుకుల పరుగుల జీవితమే. కాలు ఒకచోట పెట్టి నిలబడింది లేదు. ఇలా సాగిన జీవితంలో రేడియో ఉద్యోగం అనేది ఒక అరాచక పర్వం. నేను పనిచేసింది కేంద్ర ప్రభుత్వ సంస్థలో. కానీ ఏ ఒక్కరోజు నియమ నిబంధనలకు కట్టుబడి కానీ, లోబడి కానీ పనిచేయలేదు. విలేకరి ఉద్యోగం కావడం వల్ల ఆఫీసు టైములూ గట్రా లేవు. ఆఫీసులో మొహం చూపిస్తే ఆ రోజు వచ్చినట్టు. చూపక పోతే బయట ఎక్కడో ఆఫీసు పని మీద, వార్తా సేకరణలో వున్నట్టు. ఇలా అందరికీ సాధ్యం అవుతుందా. కాదు. అలా వీలుండదు కూడా. నూటికో కోటికో కూడా అసాధ్యం. మరి నా విషయంలో అలా ఎందుకు సాధ్యపడింది? అందుకే అరాచక పర్వం అన్నది. ఇలా మినహాయింపులు పొందడానికి నా తత్వం కూడా ఉపయోగపడింది.
ఆలిండియా రేడియో ఒక పెద్ద సామ్రాజ్యం అనుకుంటే అందులో మా న్యూస్ యూనిట్ (ప్రాంతీయ వార్తా విభాగం) సర్వసత్తాక ప్రతిపత్తి కలిగిన సామంత రాజ్యం. సామంత రాజ్యం అని ఎందుకు అన్నాను అంటే మేము చేసే పని లేదా చూసే పని రేడియో వార్తలు. సేకరించడం, వాటిని గుదిగుచ్చడం, బులెటిన్లు తయారు చేయడం, వాటి అనువాదం సరిగా వుందా లేదా చూసుకోవడం, సరిగ్గా వేళకు వార్తా ప్రసారం జరిగేలా జాగ్రత్త పడడం ఇవీ క్లుప్తంగా మా విభాగం బాధ్యతలు. వీటిల్లో స్థానికంగా వుండే ఇతర రేడియో పెద్దలకు సంబంధం వుండదు. మరి ఇందులో నా పాత్ర ఏమిటి? అధికారిక విధులను బట్టి చూస్తే నిజానికి ఏమీ లేదు, వార్తా సేకరణ తప్పిస్తే. ఢిల్లీలో వుండే కేంద్ర వార్తా విభాగానికి మాత్రమే జవాబుదారీ. శ్రీయుతులు పన్నాల రంగనాధ రావు గారు, నర్రావుల సుబ్బారావు గారు, మల్లాది రామారావు గారు, ఆర్ వీ వీ కృష్ణారావు గారు, ఆకిరి రామకృష్ణారావు గారు, ఆసయ్య గారు ఇలా చాలామంది న్యూస్ ఎడిటర్లు మితిమించిన వాత్సల్యం చూపి నా విశృంఖలతను పెంచి పోషించారు.
అయితే,
తత్వం అని చెప్పాను కదా! అదే ఇంత ఆరాచకానికి కారణం.
హైదరాబాదు
కేంద్రం నుంచి రోజుకు ఉదయం, మధ్యాన్నం, సాయంత్రం మూడు న్యూస్ బులెటిన్లు ప్రసారం అవుతాయి. వాటిని ఎడిట్
చేయడం ఎడిటర్ల పని. ఒక్కోసారి ఆ బాధ్యత నాకు అప్పగించేవారు. క్రమంగా నా పని ఉమ్మడి
కుటుంబంలో కాపురానికి వచ్చిన కొత్త కోడలు మాదిరిగా తయారయింది. వారానికి మూడు రోజులు
ఉదయం రేడియో స్టేషన్ కు వెళ్ళి వార్తలు ఎడిట్ చేసేవాడిని. ఇంటి నుంచి రానూ పోనూ ఆఫీసు
వాహన సౌకర్యం వుండేది. ఉదయం పూట రెగ్యులర్ న్యూస్ రీడర్లు రాకపోతే క్యాజువల్ న్యూస్ రీడర్లను బుక్ చేసేవారు,
సురమౌళి , గుడిపూడి శ్రీహరి, పీ ఎస్ ఆర్ ఆంజనేయ శాస్త్రి గార్లు అప్పటికే రేడియో వార్తల
పఠనంలో ఉద్ధండులు. ఇక రెగ్యులర్ న్యూస్ రీడర్లు తిరుమలశెట్టి శ్రీరాములు, డి. వెంకట్రామయ్య, జ్యోత్స్న దేవి గార్లు
సరేసరి. వాళ్ళు చదివే వార్తలు వింటూ పెరిగిన వాడిని. శ్రీనివాసరావు అన్నీ పనులు చేయగలడు
అని అనిపించుకునే నా తాపత్రయంతో వాళ్ళలో కొందరు తమ బాధ్యతలను నాకు వదిలేసేవాళ్ళు.
ఎడిట్ చేసే బాధ్యత క్రమంగా అనువాదం చేయడం వరకు పెరిగింది. ఆంధ్రజ్యోతిలో కాలాలకు కాలాలు
అనువాదం చేసిన అనుభవం ఇలా అక్కరకు వచ్చింది. అదే క్రమంలో జీవన స్రవంతి, వార్తా వాహిని
కార్యక్రమాల నిర్వహణ, వ్యాఖ్యానం, పఠనం అలా బాధ్యతలు భుజానికి ఎక్కి కూర్చున్నాయి.
ఇలా రోజుకు
ముప్పూటలా ఆఫీసు పనులు చేసుకుంటూ కాలం దొర్లిస్తున్న సమయంలో ..
ఒకానొక
రోజు ఉదయం.
రేడియో
వార్తల సమయం దగ్గర పడుతోంది. నా పనిలో నేనున్నాను. న్యూస్ రీడర్ జాడలేదు. అప్పటికే బులెటిన్ మూడువంతులు
సిద్ధం చేశాను. ఫోను మోగింది. అనివార్యకారణాల వల్ల రాలేకపోతున్నాను అని సంజాయిషీ. ఫోను
పెట్టేసి బులెటిన్ కాగితాలు క్రమపద్దతిలో సర్దుకుని పూనకం పూనినట్టు స్టూడియోకి బయలుదేరాను. ఆ రోజుల్లో మా వార్తా విభాగం
మెయిన్ స్టూడియోకి దూరంగా రేడియో ఆవరణలో ఒక పక్కగా వుండేది. అప్పటికి ఇప్పుడు వున్న
స్టూడియో కట్టలేదు. ఎవరైనా అనౌన్సర్‌లు ఖాళీగా
వున్నారేమో అని వాకబు చేశాను. ఎవ్వరూ దొరకలేదు. వార్తల టైము పది నిమిషాలు వాళ్ళకి ఖాళీ
సమయం. నేను ఒక్కడినే స్టూడియోకి వెళ్ళడం చూసి డ్యూటీ ఆఫీసరు పరిగెత్తుకుని వచ్చారు.
నేను లైవ్ ప్రోగ్రాములకి కొత్త అని ఆయనకు తెలుసు. జీవన స్రవంతి, వార్తా వాహిని లైవ్
కాదు. ముందుగా రికార్డు చేసి ప్రసారం చేస్తారు. వార్తలు ఒక్కటే మొత్తం రేడియో కార్యక్రమాల్లో
లైవ్ గా ప్రసారం చేస్తారు. డ్యూటీ ఆఫీసరు నాకు చెప్పాల్సిన జాగ్రత్తలు చెప్పాడు. దగ్గు
వస్తే ఫేడర్ కిందికి లాగాలని, మళ్ళీ పైకి జరుపుకుని
వార్తలు చదవాలని చెప్పి వెళ్ళి పోయాడు.
నేను న్యూస్
రిపోర్టర్ ని. వార్తలు చదవడం నా డ్యూటీ కాదు. పైపెచ్చు వార్తలు చదివే వాళ్ళు ఆడిషన్
టెస్టులో పాసవ్వావాలి. పై అధికారుల అనుమతులు కావాలి. చెప్పాకదా! నా తత్వం
గురించి. ఇవన్నీ ఏమీ ఆలోచించలేదు. సమయం మించకుండా వార్తా ప్రసారం మొదలు కావాలి. అంతే
!
ఫేడర్
అంటారో ఇంకేమీ అంటారో నాకు తెలియదు. దాన్ని పైకి లాగి మొదలు పెట్టాను.
“ ఆకాశవాణి,
హైదరాబాదు కేంద్రం. ప్రాంతీయ వార్తలు చదువుతున్నది భండారు శ్రీనివాసరావు ..”
ఆ విధంగా
మొదలయిన నా అరాచక పర్వం ఆకాశవాణిలో ఏళ్ల తరబడి సాగింది.
అరాచకం
అంటూ మొదలవ్వాలి కానీ అది కొనసాగుతూనే వుంటుంది. ఆ విశేషాలు మరోసారి.
(25-08-2024)
3 కామెంట్‌లు:
అరాచక బ్రహ్మ :)
మీరు వార్తలు చదివిన ఆడియో క్లిప్స్ ఉంటే పోస్ట్ చెయ్యండి. విని ఆనందిస్తాము.
వార్తలు ఒక్కటే మొత్తం రేడియో కార్యక్రమాల్లో LIVE program. Record చేయరు. క్లిప్పింగులు దొరకవు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి