ఆయనకిప్పుడు కొంచెం అటూఇటూగా ఎనభై ఏళ్ళు. నలభై ఏళ్ళ కిందట క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు. అనేక ముఖ్యమైన శాఖలు నిర్వహించారు. రెండు మూడేళ్ళ క్రితం కలిసినప్పుడు జరిగిన మాటామంతిలో ఒక విషయం చెప్పారు. ఆయన రోడ్లు భవనాల శాఖ మంత్రిగా వున్నప్పుడు ఓ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ గెస్ట్ హౌస్ నిర్మించి ఆయన చేతులమీదుగా ప్రారంభోత్సవం చేశారట. మాజీ మంత్రి అవతారంలో మళ్ళీ అదే వూరికి సొంత పని మీద వెళుతూ తెలిసిన ఎమ్మెల్యేతో చెప్పించుకుని అదే గెస్ట్ హౌస్ లో గది బుక్ చేసుకున్నారు. తీరా వెడితే గదులు ఖాళీ లేవంటూ, మీరెవరని ప్రశ్నించారట. అడిగినవాడిని కాలరు పుచ్చుకుని లాక్కెళ్ళి గెస్ట్ హౌస్ బయట శిలాఫలకంపై వున్న తన పేరు చూపించాలన్నంత కోపం వచ్చిందట. కానీ తమాయించుకుని అక్కడ నుంచి బయటపడి ఏదో హోటల్లో ఆ రాత్రి బస చేసి వచ్చేశారట.
చివరకు ఆయన చెప్పిందేమిటంటే శిలాఫలకాలమీద పేరు వేశారని సంతోషపడడమే కానీ ప్రజలకు అదేమీ పట్టదు.
2 కామెంట్‌లు:
బుక్ చేసుకుని ఉన్నా గది ఇవ్వకపోవడం సరికాదు. ఎప్పుడో శిలా ఫలకం లో పేరు ఉంటే ఇప్పుడు గది డిమాండ్ చేయడం అనే సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ కూడా అవసరం లేదు. గదులు కేటాయింపులో అధికారంలో ఉన్నవాళ్లకు ప్రాధాన్యం ఉంటుంది.
" అధికారాంతమందు చూడవలె గదా ఆ అయ్య సౌభాగ్యముల్ " అని పెద్దలు ఏనాడో అన్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి