21, మే 2014, బుధవారం

రివైండ్ -2010 (పదకొండో భాగం)


విన్నంతలో కన్నంతలో అమెరికా :
 అసలు ఆబ్దీకాలవంటి కర్మకాండలపై అంతగా నమ్మకం లేని స్తితిలో  గత యాభయి సంవత్సరాలకు పైగా మా నాన్న గారి తద్దినాలు  పెడుతూ వస్తున్నాము. ఒక పండగ మాదిరిగా ఏటా జరిగే ఈ కార్యక్రమానికి చుట్టపక్కాలందరూ వచ్చేవాళ్ళు. ఏడాదికొకసారి కుటుంబ సభ్యులందరూ ఒకచోట కలుసుకునే సందర్భంగా భావిస్తూ దాన్ని ఒక క్రతువులా జరిపే ఆనవాయితీగా మారిపోయింది.
ఈ కర్మ కాండ మొత్తంలో ఒక ఆసక్తికరమయిన విషయం నేను గమనిస్తూ వచ్చాను. అదేమిటంటే మనకు జన్మ నిచ్చిన తలిదండ్రులతో పాటు మూడు తరాల పూర్వీకులను సయితం పేర్లతో సహా స్మరించుకునే సందర్భం ఇది. తండ్రి, తండ్రి తండ్రి పేరు చెప్పగలిగినవాళ్ళు కూడా తాత తండ్రి పేరు గుర్తుకుతెచ్చుకోవడానికి ఇబ్బంది పడతారు. వంశాన్ని ఉద్ధరించడం సంగతి ఏమో కానీ  వంశస్తులను ఏడాదికి ఒక్కమారయినా స్మరించుకునే అవకాశం  ఇచ్చే తద్దినాలు పెట్టడంలో తప్పేమీ లేదన్న అభిప్రాయం క్రమంగా మనస్సులో పడిపోయింది.


(కాకి ప్రసాదం కోసం వాయసాన్వేషణ)


 ఉత్తరాది పద్దతిలో నిర్వహించినా సుధీర్ ఝా గారు - ఎంతో సంతృప్తికరంగా మా తల్లిగారు వెంకట్రావమ్మ, పితామహి రుక్మిణమ్మ, ప్రపితామహి చెల్లాయమ్మలకు తర్పణ క్రియలు నాచేత జరిపించారు. ఇతర లాంఛనాలు పూర్తయిన తరవాత ఇంటి నుంచి తయారు చేసుకొచ్చిన గారెలు, పరవాన్నం ఇతర పదార్ధాలను  గుడికి వచ్చిన వారికి ప్రసాదంగా అందచేసి అమెరికాలో ఇటువంటి క్రతువులు సాధ్యమా అని మొదట్లో  కలిగిన సందేహాలను పటాపంచలు చేసుకుని ఇంటి దారి పట్టాము.

చెప్పడం మరిచాను. ఇటువంటి కార్యక్రమాలకు అవసరమయిన సమస్త సామాగ్రి సియాటిల్ లో వున్న ఒక ఇండియన్ స్టోర్ లో లభించింది.