22, మే 2014, గురువారం

రివైండ్ - 2010 (పద్నాలుగో భాగం)


విన్నంతలో కన్నంతలో అమెరికా
కలల లోకంలో కాసేపు -
పాడు ఉద్యోగం ఎన్నాళ్ళు చేస్తాంఅని ఈసురోమనే వాళ్ళు కూడా పదవీ విరమణ ఘడియ దగ్గరపడేటప్పుడు – ‘పొడిగింపుకోసం నానా తంటాలు పడడం కద్దు. ఏడుపదుల వయస్సు వచ్చేవరకూ ఏమి జీవితమూ దుర్భరమూ అని తత్వాలు పాడుకున్నవాళ్ళు తరవాత్తరవాత తత్వం మార్చుకుని - కొద్దిగా మనుషుల్ని ఆనవాలు పట్టే చూపు దేవుడు ఇస్తే బాగుండుఅనుకుంటూ బతుకు మీద మళ్ళీ తీపి పెంచుకునేవాళ్ళు సయితం కనబడుతుంటారు. ఇప్పుడు ఆరుపదులు దాటిన తరవాత అమెరికావచ్చి- బెల్ వ్యూ లో  మా మనుమరాళ్ళు చదువుకునే ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల చూసిన తరవాత నాకూ అలాటి అభిలాషే ఒకటి కలిగింది. ‘మరుసటి జన్మలో అమెరికాలో పుట్టి ఇక్కడే చదువుకుంటే యెంత బాగుంటుందో కదా!అన్నదే ఆ కోరిక. అలాటి స్కూల్లో చదువుకుంటున్న మా మనుమరాళ్ళని చూసి కాస్తంత అసూయ పడ్డానేమో అని కూడా అనుమానం.
మన దేశంలో కూడా ఈ మాదిరి స్కూళ్ళు లేకపోలేదు. కానీ అవి పెట్టి పుట్టిన వాళ్ళకే పరిమితం. కూలీ నాలీ చేసుకుంటూ కలో గంజో తాగి పిల్లలను మంచి స్కూళ్ళల్లో చదివించే పేదలు కూడా మన దగ్గరవున్నారు. కానీ ఇంగ్లీష్ మీడియం కాన్వెంటు స్కూళ్ళ పేరుతొపల్లెటూళ్ళల్లో సయితం కాలు  పెడుతున్న అలాటి స్కూళ్ళన్నీ డబ్బు చేసుకునేందుకు, డబ్బు దోచుకునేందుకు తప్ప అసలు సిసలు చదువుకు పనికొచ్చేవి కావు.
ఇక్కడి విద్యాలయాల్లో చదువుకన్నా వ్యక్తిత్వవికాసానికి (personality Development) ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టు అనిపించింది. గట్టిగా చదివించి- ట్యూషన్లు పెట్టించి – “ఎమ్సెట్ఒక్కటీ గట్టెక్కితే చాలనుకునే ధోరణి ఇక్కడి పేరెంట్లలో కానరాదు. ఆ అవసరం కూడా వారికి లేదనుకోండి. మరో విశేషం ఏమిటంటే సర్కారు బళ్ళల్లో (ఇక్కడ పబ్లిక్ స్కూళ్ళు అంటారు.ఇవి పూర్తిగా ప్రభుత్వ ఆజమాయిషీలో నడుస్తాయి) హైస్కూలు స్థాయి వరకూ సెంట్ ఖర్చులేకుండా చదువుకునే వీలుంది.

సమాజంలో ఉన్నత స్తాయి వర్గాలవాళ్ళు కూడా తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్ళలో కాకుండా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చేర్పించడానికి ప్రాధాన్యం ఇస్తారు. ఎందుకంటే - వసతుల విషయంలో, నిపుణత కలిగిన అధ్యాపకుల విషయంలో కొండొకచో సర్కారు బడులే ప్రైవేటు స్కూళ్ళను తలదన్నేలా వుంటాయి. (2010)

కామెంట్‌లు లేవు: