31, మే 2025, శనివారం

అయాం ఎ బిగ్ జీరో (172) – భండారు శ్రీనివాసరావు

 బెడ్ రూమ్ కు డ్రాయింగ్ రూమ్ కు తేడా లేకుండా పోతోంది

2006
అంటే సుమారు పందొమ్మిది సంవత్సరాల కిందటి మాట.
ఇంటర్నెట్ వినియోగం ఇంత విస్తృతంగా లేని రోజులనాటి ముచ్చట.
ఆంధ్రుల ఆహ్లాద రచయితగా పేరుపొందిన మల్లాది వెంకట కృష్ణమూర్తి ఆ రోజుల్లోనే ఒక వెబ్ పత్రికకు సంపాదకత్వ బాధ్యతలు నిర్వహించేవారు. దానిపేరు ‘శృంగారం డాట్ కామ్’ (www.srungaram.com). ఇప్పుడు లేదు. రోజులు ఇలా మారిపోతాయి అని ఎవరూ ఊహించని రోజుల్లోనే ఆయన ఈ సాహసానికి పూనుకున్నారు. మల్లాది గారి కోయిల ముందే కూసింది అనుకోవాలి.
వెతకబోయిన తీగె కాలికి తగిలిందన్న సామెత జీవితంలో అతి కొద్ది సందర్భాలలో మాత్రమే నిజమవుతుంది. నా విషయంలో మాత్రం ఈ మినహాయింపు వున్న దాఖలా నాకెప్పుడూ కనబడలేదు. అదేమిటో ఇంటి తాళాలు కూడా వెతక్కుండా ఏనాడూ కళ్లబడలేదు. అయితే ఈ వెతుకులాటలో కూడా ఒక ప్రయోజనం లేక పోలేదు. వెతికేవి కనబడవు కానీ, ఎప్పుడో, ఎక్కడో దాచినవి, దాచి మరచిపోయినవి హఠాత్తుగా దర్శనమిస్తుంటాయి. అల్లా దొరికిందే ఆ పత్రికలో పడిన నా ఈ ఇంటర్వ్యూ.
ప్రసిద్ధ రచయిత శ్రీ మల్లాది వెంకట కృష్ణమూర్తి పనుపున, సీనియర్ పాత్రికేయులు శ్రీ దోర్బల శర్మ నాతో జరిపిన ఇంటర్వ్యూ అది. వృత్తి జీవితంలో నేను అనేకమందిని ఇంటర్వ్యూ చేసివుంటాను కాని నన్ను మరొకరు చేయడం మాత్రం అదే తొలిసారి. అప్పట్లో ఇంట్లో కంప్యూటర్, ఇంటర్నెట్ లేని కారణంగా దాన్ని కళ్ళారా చూసే భాగ్యం కలగలేదు. కాకపొతే, ఆ వెబ్ పత్రిక ఎగ్జిక్యూటివ్ ఇంచార్జ్ శ్రీ ఎస్. రామకృష్ణ పోస్ట్ లో ఆ ఇంటర్వ్యూ ప్రతిని పంపారు. చాలా ఏళ్ల తరువాత దేనికోసమో వెతుకుతుంటే అది నా కళ్ళబడింది. మానవ సహజమయిన బలహీనతతో దాన్ని యధాతధంగా వుంచుతున్నాను. ఇందులోని మంచిచెడ్డలు చదువరులకే వొదిలేస్తున్నాను. - భండారు శ్రీనివాసరావు
ఇంటర్వ్యూకు ముందు దోర్బల శర్మ గారి ఉపోద్ఘాతం :
తెలుగు పత్రికారంగంలో దిగ్గజం వంటివారయిన నార్ల వేంకటేశ్వర రావుతో కలసి పనిచేసిన ప్రముఖ పాత్రికేయుల్లో ఒకరు భండారు శ్రీనివాసరావు. ప్రస్తుతం దూరదర్శన్ లో న్యూస్ ఎడిటర్ గా వున్న ఆయన 1945 లో కృష్ణాజిల్లా కంభంపాడులో జన్మించారు. జగమెరిగిన భండారు పర్వతాలరావు ఆయనకు స్వయానా పెద్దన్నయ్య. జర్నలిస్టుగా మూడున్నర దశాబ్దాల అనుభవం కలిగిన శ్రీనివాసరావు, రేడియో, దూరదర్శన్ లలో అనేక ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించి ఎందరో జాతీయ స్తాయి నాయకులను ఇంటర్వ్యూ చేశారు.
సుదీర్ఘమయిన తన పాత్రికేయ వృత్తిలో మరచిపోలేని అనుభవంగా మదర్ థెరిస్సాతో తన ఇంటర్వ్యూను ఆయన పేర్కొంటారు. మదర్ థెరిస్సా హైదరాబాద్ సందర్శించినప్పుడు ఆమెను ఇంటర్వ్యూ చేసే అదృష్టం కలిగిందని, అల్లాగే ఎన్టీయార్ ముఖ్యమంత్రిగా వుండగా, భద్రాచలం అడవుల్లో అప్పటి ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీతో ఒక డొక్కు జీపులో జరిపిన ప్రత్యేక యాత్ర కవరేజీని మరచిపోలేనని ఆయన అంటారు.
ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఐ.ఐ.ఎస్.) అధికారి అయిన శ్రీనివాసరావు విద్యాభ్యాసం ఖమ్మం, విజయవాడల్లో జరిగింది. ఖమ్మం ఎస్.ఆర్.అండ్ బీ.జీ.ఎన్.ఆర్. డిగ్రీ కాలేజీలో పీయూసీ చదివారు. బీకాం విజయవాడ ఎస్.ఆర్. ఆర్. కాలేజీలో. ప్రసిద్ధ సినీ దర్శకుడు, జంధ్యాల కాలేజీలో తనకు బెంచ్ మేట్ గా గుర్తుచేసుకున్నారు. 1971 లో విజయవాడ ఆంధ్రజ్యోతిలో సబ్ ఎడిటర్ గా చేరి 1975 దాకా అక్కడే పని చేశారు. అప్పటినుంచి 1987 దాకా హైదరాబాద్ ఆకాశవాణిలో న్యూస్ కరస్పాండెంట్ గా పనిచేశారు. తరువాత నాటి యు.ఎస్.ఎస్.ఆర్. (సోవియట్ రష్యా)కు చెందిన మాస్కో రేడియో తెలుగు విభాగంలో న్యూస్ రీడర్ గా పని చేయడానికి మాస్కో వెళ్లారు. సుమారు అయిదేళ్ళు అక్కడేవున్న ఆయన నాటి సోవియట్ యూనియన్ పతనాన్ని స్వయంగా చూశారు. తర్వాత తిరిగి హైదరాబాద్ వచ్చి ఆకాశవాణిలో చేరి న్యూస్ ఎడిటర్ గా 2004 దాకా కొనసాగారు. అప్పటినుంచి దూరదర్శన్ లో న్యూస్ ఎడిటర్ గా విధులు నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా దేశ విదేశాల్లో అనేక ప్రాంతాలు సందర్శించిన ఆయనకు అన్ని సామాజిక, దేశీయ సమస్యలపై మంచి అవగాహన వుంది. మలేషియా, సింగపూర్, అమెరికా వంటి దేశాలు సందర్శించారు.
పత్రికా రచయితగా భండారు శ్రీనివాసరావు
1974 – 75 మధ్య కాలంలోనే ఆంధ్రజ్యోతిలో ‘వాక్టూనులు’ పేర నిర్వహించిన శీర్షిక మంచి పాఠక జనాదరణ పొందింది. ఆకాశవాణిలో ఆయన పదేళ్ళపాటు నడిపిన ‘జీవన స్రవంతి’ కార్యక్రమం విననివాళ్లు వుండరు. ‘ప్రజాతంత్ర’ వారపత్రికలో ‘అమెరికా అనుభవాలు-అనుభూతులు’ శీర్షికన ఆయన ఒక సీరియల్ రాశారు. ‘నడచి వచ్చిన దారి’ శీర్షికన ఒక ఆటోబయాగ్రఫీని, ‘మార్పు చూసిన కళ్ళు’ పేరుతొ తాను చూసిన ఆ నాటి సోవియట్ యూనియన్ అనుభవాలను సీరియల్ గా రాయాలన్న తలంపు వున్నట్టు తన మనసులోని మాటను వెల్లడించారు. పెద్దన్నయ్య భండారు పర్వతాలరావే తనకు వృత్తిలో స్పూర్తినిచ్చారని చెప్పే శ్రీనివాసరావు ‘శృంగారం డాట్ కామ్’ కోసం- ‘బెడ్ రూమ్ కు డ్రాయింగ్ రూమ్ కు తేడా లేకుండా పోయిందం’టూ సీనియర్ పాత్రికేయుడు దోర్బల శర్మకు ఇచ్చిన ఇంటర్వ్యూ ని ఇక్కడ చదవండి – సంపాదకుడు.
“హైదరాబాదులోని ఎర్రమంజిల్ ప్రాంతంలో ప్రధాన రహదారి పక్కనే వున్న క్వార్టర్ అది. ఇంటి ముందు ‘భండారు శ్రీనివాసరావు, దూరదర్శన్’ అనే నేమ్ ప్లేట్ వుంది. ఆ రోజు ఉదయం పదిన్నర గంటలకల్లా ఆ ఇంటికున్న చిన్న గేటు తీసుకుని లోనికి వెళ్లి కాలింగ్ బెల్ నొక్కగానే ఆయనే వచ్చి నన్ను ఆహ్వానించారు. నన్ను నేను పరిచయం చేసుకున్నాక ఇంటర్వ్యూ ప్రారంభించాను.
‘శృంగారం గురించి నేనేం మాట్లాడగలను?’ అని తొలుత సందేహించిన భండారు, ఆ తరువాత నేను అడిగిన ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలు లోతయిన విశ్లేషణతో కూడుకుని వున్నాయి. ఈ తరం విధిగా తెలుసుకోవాల్సిన విషయాలను ఆయన వెల్లడించారు.
ప్ర) శృంగారం అనగానే ఎందుకంత వెనుకంజ వేసారు?
జ) నేనే కాదు. సాధారణంగా ఆ మాట వినగానే మనలో చాలామంది వెనుకంజ వేస్తారు. ఎందుకంటె మన మైండ్ సెట్ ఆ విధంగా తయారయింది. చిన్నతనం, యుక్త వయస్సు, వృద్ధాప్యం – ఇలా యే ప్రాయంలోనయినా సరే దాని గురించి స్వేచ్చగా మాట్లాడే తెగువని చాలామంది చూపలేరు. కనుకే వెంటనే మాట్లాడడానికి కాసింత భయమేసింది.
ప్ర) దాన్ని భయమంటారా?
జ) జంకు కావచ్చు. శృంగార విషయాలను స్వేచ్చగా చర్చించుకునే అవకాశం మన సంస్కృతిలో లేకపోవడమే దీనికి కారణం. దాన్ని గోప్యంగా వుంచేలా మనమంతా ‘ట్యూన్’ అయివున్నాం. ఈ నేపధ్యంలో ‘తెర’ తీసేదెవరు? ‘తెర తీయగరాదా’ అనే ధైర్యం కూడా సాంప్రదాయపరులలో చాలామందికి లేదు.
ప్ర) దీన్నిబట్టి సెక్స్ గురించి చాలామందికి తెలియదనుకోవచ్చా?
జ) సెక్స్ గురించి మన సమాజంలో చాలామందికి సంపూర్ణంగా తెలియని మాట నిజమే. దీన్ని ఇలా గోప్యంగా వుంచడం వల్లనే అలా తెలియకుండా పోతుందన్నది ఒక కారణం కావచ్చు. అయితే మన చుట్టూ వున్న చాలామందికి ‘సెన్సెక్స్’ గురించి తెలిసినంతగా ‘సెక్స్’ గురించి తెలియదనవచ్చు. వ్యాపారానికి సంబంధించిన లావాదేవీల్లో ‘సెన్సెక్స్’ అనే మాటను మనం చాలాసార్లు వింటూ వుంటాం. కానీ ‘సెక్స్’ అన్న మాటను అనడానికీ, వినడానికీ అనేకులు మొహమాట పడతారు.
ప్ర) మనం సెక్స్ ప్రాధాన్యాన్ని తెలుసుకోవడం లేదా?
జ) అనే చెప్పాలి. మనిషి జీవితానికి సెక్స్ యెంత అవసరమో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒక విశ్లేషణ ప్రకారం మానవుని ఆయుర్దాయం నూరేళ్ళు అనుకుంటే అందులో సగటున ఒక ఇరవై ఏళ్లకు మించిన కాలమయినా శృంగారానికి కేటాయిస్తున్నట్టు లేదు. ఎవరికయినా యుక్త వయస్సు వచ్చేసరికి పరిస్తితి ఎలా వుంటుందంటే – ‘అప్పటికి ఒక పదేళ్ళ కిందటి వరకు సెక్స్ గురించి తెలవదు. ఆ తరువాత పదేళ్లకు సెక్స్ అవసరం వుండదు.’ దీన్ని బట్టి శృంగారానికి లభిస్తున్న ప్రాధాన్యం అర్ధం అవుతోంది.
ప్ర) మధ్య వయస్కులు శృంగారానికి దూరం అవుతున్నారంటారా?
జ) అలా అని నిర్దిష్టంగా చెప్పలేం. సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. ఈ మధ్య ‘ప్లస్ ఫార్టీ’ శృంగారం అని ఒకటి వచ్చింది. ఇది నలభై నుంచి యాభై ఏళ్ళ వయస్సులోని వారికి వర్తిస్తుంది. ఈ రకమయిన శృంగార పోకడ భార్యాభర్తల మధ్య వున్నప్పుడు ఓకే. కానీ ఇది అలా కాకుండా వివాహేతర సంబంధాలకు దారి తీస్తున్నట్టు వింటున్నాం. ఒక పెళ్ళయిన వ్యక్తి, చివరికి పిల్లాపాపలున్న స్త్రీలు సైతం సమాజం లోని నియమాలను తోసిరాజంటూ ఇలాటి శృంగార సంబంధాలకు సిద్ధపడుతున్నట్టు వినవస్తోంది. శృంగారం లోని ఆనందాలను అనుభవించడానికి అదొక మంచి అవకాశంగా వారు భావిస్తున్నట్టున్నారు.
ప్ర) ఇలా వివాహేతర సంబంధాలను పెట్టుకోవడం ఎంతవరకు మంచిది?
జ) మంచీ చెడు నిర్ణయం అన్నది ఎవరికి వారు చేసుకోవాల్సిందే. ఒకరికి మంచి మరొకరికి చెడు కావచ్చు. ఆయా వ్యక్తుల విచక్షణ, పరిస్తితులకు దీన్ని వొదిలేయాల్సిందే. మంచి చెడుల విచక్షణలో ఆయా వ్యక్తుల అభిరుచులు, కాలమాన స్తితిగతులు ఇవన్నీ పరిగణనలోకి వస్తాయి. ఉదాహరణకు ఒకప్పుడు నాగయ్య నటించిన సినిమాలే మంచివి, నిన్నటి నాగేశ్వరరావు సినిమాలు చెడ్డవి అనలేం. యే కాలానికి తగ్గట్టు ఆ రకమయిన పద్ధతులు, నియమాలు వుండడం సహజం. కాకపొతే అన్నింటికీ విలువలు ముఖ్యం అని మరచిపోకూడదు. విలువలకు అతీతంగా, వాటికి భంగం కలగకుండా చూసుకోవడం ప్రధానం.
ప్ర) పై పరిస్తితిని విలువలు దిగజారడంగా భావించవచ్చా?
జ) అలా జనరలైజ్ చేయడానికి లేదు. అప్పట్లో విలువలతో కూడిన సంపాదనలు వుండేవి. ఇప్పుడు ప్రతిదానికి డబ్బు సంపాదనే ప్రధానమయినది. విలువలు లేని సంపాదనలు ఎక్కువయ్యాయి. ఇలాటి చోట సెక్స్ లోను విలువలు వుంటాయని అనుకోలేం.
ప్ర) సెక్స్ పట్ల నేటి యువత స్పందన యెలా వుంటోంది?
జ) ఇప్పుడు ఓ మోటార్ బైకు పై ఓ అమ్మాయి, ఓ అబ్బాయి చాలా తేలిగ్గా తిరిగేస్తున్నారు. వారిలో అపోజిట్ సెక్స్ పట్ల, స్పర్శ పట్ల ఒక సున్నితత్వం లేకుండా పోయింది. అప్పట్లో అబ్బాయి అమ్మాయి ఒకరినొకరు తాకడానికే జంకేవారు. శారీరకంగా స్పర్శిస్తే ఒక గగుర్పాటు కలిగేది. కానీ ఇప్పటివారిలో ఈ స్పందన కానరావడం లేదు. చాలా ఈజీగా ఒకరికొకరు షేక్ హాండ్లు ఇచ్చుకోవడం, ఇద్దరు మగవాళ్ళ మధ్య ఒక అమ్మాయి స్వేచ్చగా తిరగడం జరుగుతోంది. పాతకాలంతో పోల్చుకుని దీన్ని తప్పుపట్టడం కూడా సరికాదు.
ప్ర) అసలు నేటి యువత ప్రధాన లక్ష్యం ఏమిటి?
జ) వారి ప్రధాన లక్ష్యం డబ్బు. దాన్ని యెలా సంపాదించాలి? ఇంతే. వారి ప్రాధాన్యాలు ఇప్పుడు కెరీర్, సంపాదన. ఇవే. వీటి గొడవలో పడి అసలు సెక్స్ కు ఇవ్వాల్సిన గౌరవం, స్థానం ఇవ్వడం లేదు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి తేలిగ్గా ప్రేమించుకోవడం, కలసి తిరగడం, పెళ్ళయితే సరి. లేకపోతే అంతకంటే తేలిగ్గా మరచిపోవడం. ఇదంతా చాలా సులభంగా చేసేస్తున్నారు. ఒకరికోసం ఒకరు తపించడాలు, మనసులు బరువెక్కడాలు వంటి సన్నివేశాలు లేనే లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే నేటి యువతరానిది టేకిట్ ఈజీ పాలసీ. ప్రతి దాన్నీ తేలిగ్గానే తీసుకుంటారు, ఒక్క సంపాదన విషయాన్ని మినహాయిస్తే.
ప్ర) పెళ్లి కాకుండా భార్యాభర్తల్లా వుండడం ఎంతవరకు సబబు?
జ) ‘పెళ్లి’ అనేది ఇద్దరు స్త్రీ పురుషులు కలసి వుండడానికి చేసుకునే ఒప్పందం అనుకున్నప్పుడు సమాజం పెట్టిన వివాహం అనే కట్టుబాటు కొందరికి నచ్చకపోవచ్చు. అలాటివారు పెళ్లి చేసుకోకుండానే భార్యాభర్తల్లా కలసి వుంటారు. అందులో తప్పు పట్టడానికి ఏమీ వుండదు.
ప్ర) మీరు పెళ్లి ఆర్భాటాలకు వ్యతిరేకం అని విన్నాను. నిజమేనా?
జ) నిజమే! నాకు టీనేజ్ వచ్చేసరికే దాదాపు పదిహేను ఇరవై మంది మేనకోడళ్లను బుట్టల్లో ఎత్తుకెళ్ళి పెళ్లి పీటల మీద కూర్చోబెట్టాను. నాకు ఏడుగురు అక్కయ్యలు. వాళ్ళలో చాలామంది ఆడపిల్లల పెళ్ళిళ్ళను నేను దగ్గరుండి మరీ గమనించాను. నాకు ఇరవై ఏళ్ళ వయస్సు వచ్చేదాకా అనేక పెళ్ళిళ్ళు చూసి చూసి ఒకరకంగా చికాకు ఏర్పడింది. నా పెళ్లి వరకు వచ్చేసరికి ఆ పెళ్లి తంతు శుద్ద దండగమారి ఆర్భాటంలా అనిపించింది. అందుకే నేను ఆ రకమయిన అట్టహాసమేదీ జరుపుకోలేదు.
ప్ర) వివాహ వేడుక లోని అనుభూతిని కోల్పోయినట్టు ఫీలవుతున్నారా?
జ) బాపు తీసిన ‘పెళ్లి పుస్తకం’ లాటి కళాత్మక సినిమాలు చూస్తున్నప్పుడు ఆ తంతులో ఇంత గొప్ప అనుభూతి వున్నదా అనిపిస్తుంది. నిజమే. ఇప్పుడు అలా అనిపిస్తున్న సంగతి ఒప్పుకుని తీరాల్సిందే. కానీ, నాకు అప్పట్లో పెళ్లి లోని అనవసర ఖర్చులు, ఆర్భాటాలు కనిపించినంతగా, శాస్త్రోక్తమయిన ఆ శుభ కార్యంలో వధూవరులకు లభించే అనుభూతి కానరాలేదు. దానిని మిస్ అయ్యానేమోనని ఇప్పుడు అనిపిస్తున్న మాట నిజమే.
ప్ర) పెళ్లి వద్దనుకున్న వాళ్లకు పెళ్ళాం మాత్రం ఎందుకంటారు?
జ) మేం వద్దనుకున్నది ఆ ఆడంబరాలు, అట్టహాసాలనే కాని మొత్తంగా పెళ్లిని, పెళ్ళాన్ని కాదుగా. అందుకే నేను అప్పట్లో ‘పెళ్లి వద్దు, పెళ్ళాం కావాలి’ అనే నినాదాన్ని కూడా వినిపించాను. అలాగే దీనితో పాటు ‘ఉద్యోగం వద్దు, ఉపాధి కావాలి’ అనీ అన్నాను. అప్పట్లో మామీద ఆనాటి సమకాలీన సమాజ స్తితిగతుల ప్రభావం ఎక్కువగా వుండేది. నాలాటి యువతలో ఇలాటి భావాలు రావడానికి అదే కారణం. అందుకే ఈ నాటి తరం భావజాలాన్ని సమర్ధించడానికి కూడా అప్పట్లో నాలాటి వాళ్లు ప్రదర్శించిన తిరుగుబాటు ధోరణే కారణం కావచ్చు. నేను లేవనెత్తిన ఈ రెండు నినాదాల్లో ఒకదాన్ని పాటించగలిగాను. రెండో దాని విషయంలో పాక్షిక సర్దుబాటు చేసుకుని జర్నలిజం లోకి దిగాను.
ప్ర) ప్రేమ ప్రణయం, వీటిపట్ల మీ కవితాత్మక భావనలు కొన్ని చెబుతారా?
జ) వృత్తి రీత్యా జర్నలిస్ట్ నే అయినా నేనూ కొంత ప్రేమ కవిత్వం రాశాను. అంతా వయసు మహిమ. ఉదాహరణకు:
“రాత్రి ఒక నక్షత్రం రాలి పడింది.
తెల్లారి చూస్తే అది నువ్వే”
“ఊహల్లో నేనూ
వూహించుకుంటూ నువ్వూ
వర్తమానాన్ని నష్ట పోతున్నాం”
వీటికి ఒక అర్ధం అంటూ లేదు. మనసుకు తోచింది ఇలా రాస్తూ పోయాను.
ప్ర) అప్పటికీ ఇప్పటికీ వచ్చిన సాంస్కృతిక మార్పు ఏమిటి?
జ) ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు బెడ్రూం కు డ్రాయింగ్ రూమ్ కు తేడాలేదు. బెడ్ రూమ్ విషయాలన్నీ టీవీ ద్వారా డ్రాయింగ్ రూమ్ లోకి వచ్చేశాయి.
మార్పు సహజమే. ఒప్పుకోవాలి. మాట వరసకు ఇప్పుడు జర్నలిష్టులు పది రూపాయలు ఇస్తే కానీ పేరా వార్త రాయడం లేదని వింటున్నాం. ఇలాటి పెడధోరణి ఇదివరకూ లేకపోలేదు. అప్పట్లోనే పెగ్గు పడితే కాని వార్త రాయని వాళ్ళను ఎందర్ని చూడలేదు. అప్పుడూ ప్రమాణాలు పడిపోవడం చూసాము. కాకపొతే, ఇప్పుడు ప్రమాణాలే లేవు. ఇది యెంత దూరం పోతుంది అంటే, పెండ్యులం అన్నది వూగి వూగి ఎక్కడో ఒకచోట ఆగుతుంది. అంతదాకా ఎదురుచూడక తప్పదు.”
అంటూ ఆయన తన ఇంటర్వ్యూ ముగించారు. (19-02-2006)
కింది ఫోటోలు: శ్రీ దోర్బల శర్మ, ఆలోచనాలోచనంలో నేను
Like
Comment
Share
Facebook
Facebook

30, మే 2025, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో (171) – భండారు శ్రీనివాసరావు

 సృష్టి జననం

2003 సెప్టెంబర్ 15 వ తేదీన మా పెద్ద కుమారుడి చిన్న కుమార్తె సృష్టి, రెంటన్ లోని వ్యాలీ మెడికల్ సెంటర్ లో జన్మించింది. అందుకోసమే నేను మా ఆవిడ నిర్మల ఇద్దరం పురిటి సమయానికి కొద్ది రోజులు ముందుగానే సియాటిల్ చేరుకున్నాము. ఆడపిల్ల అనగానే మా ఆవిడ సంతోషం ఇంతా అంతా కాదు.
బారసాల రోజున శాన్ ఫ్రాన్సిస్కోలో వుంటున్న మా రెండో అన్నయ్య కుమారుడు లాల్ బహదూర్, కోడలు దీప, దీప తండ్రి, నా మేనల్లుడు రామచంద్రం, అతడి భార్య కరుణ, కుమార్తె స్పురిత సియాటిల్ వచ్చారు. బాలసారకు ముందే సృష్టి అనే పేరు హాస్పిటల్ రికార్డులలో నమోదు అయింది. బియ్యంలో పేరు రాయడం అనేది కేవలం లాంఛనమే.
ఒక రోజు స్నోకాల్మీ ఫాల్స్ (SNOQUALME FALLS) కి కారులో వెళ్ళాము. సియాటిల్ నుంచి సుమారు గంటన్నర ప్రయాణం.
ఎత్తయిన పర్వతాలు,లోతయిన లోయల మీదుగా విశాలమయిన రహదారి. రోడ్డుకు రెండువైపులా నింగిని తాకుతున్నాయా అనిపించేంత పొడవయిన చెట్లు. వాటిని నరికి అడవులను ధ్వంసం చేస్తున్న దాఖలాలు మచ్చుకు కూడా కనిపించవు. చెట్లను నరకడంపై గట్టి నిషేధాలు వున్నాయి. కార్చిచ్చుల కారణంగా అడవులు తగలబడి పోవడం తప్పిస్తే దొంగతనంగా చెట్లను నరకడం అన్నది జరగదు.(ఇటీవల కాలిఫోర్నియాలో ఇలాటివి జరిగి వందల ఎకరాల విస్తీర్ణంలో అడవులు కాలిపోయాయి.)
నిజానికి స్నోకాల్మీ ఫాల్స్ అన్నది ఒక కృత్రిమ జలపాతం. లోయల్లో పారుతున్న నీటిని ఒక ఎత్తయిన ప్రదేశం మీదుగా మళ్లించి ఈ జలపాతం ఏర్పడేలా చూసారు. పర్యాటకులకు అవసరమయిన వసతులు అద్భుతంగా కల్పించారు. కాలిబాట మీదుగా లోయలోకి దిగి వెళ్లి ధారగా దూకుతున్న జలపాతాన్ని చూడవచ్చు. పైనుంచి పడుతున్న జలధారలతో కింది భాగంలో నీటి మడుగు ఒక సరస్సు మాదిరిగా తయారయింది. దానిలో బోటింగ్ చేయడానికి రోజూ వందలాదిమంది అక్కడకు వస్తుంటారు. నిజానికి ఇది మన నాగార్జునసాగర్ సమీపంలో వున్న ఎత్తిపోతల జలపాతం కంటే పెద్దదేమీకాదు. అయినా పర్యాటకులను ఆకర్షించడానికి చేసిన ఏర్పాట్లు, రహదారి సౌకర్యాలు అద్భుతం.
మరో రోజు మౌంట్ రేనియర్ అనే అగ్ని పర్వతం చూడడానికి వెళ్ళాము. అక్కడకు చేరడానికి కొన్ని వందల అడుగుల ఎత్తున నిర్మించిన విశాలమయిన ఘాట్ రోడ్డులో ప్రయాణం చేయాలి. ఇక్కడ ఘాట్ రోడ్డు అంటే మలుపులు తిరుగుతూ వెళ్లే రోడ్డు కాదు. ఏటవాలుగా సరాసరి కొండమీదికే రోడ్డు నిర్మిస్తారు. ఒక దాని వెంట మరొకటిగా వందలాది కార్లు అమిత వేగంతో ఆ రోడ్లపై పరుగులు తీయడం గమనిస్తే కళ్ళు తిరిగిపోతాయి.
మౌంట్ రేనియర్ సజీవ అగ్ని పర్వతం. ఇంకా రగులుతూనే వుంది. ఏదో ఒకనాడు ఇది బద్దలు కాగలదని భావిస్తున్నారు. సియాటిల్ కి ఈ పర్వతం ఒక కొండ గుర్తు. చాలా దూరంలో వున్నా నగరంలో పలుచోట్ల నుంచి ఈ అగ్ని పర్వతం కనిపిస్తూనే వుంటుంది. సందర్శకులకు ఇక్కడ కూడా బ్రహ్మాండమయిన ఏర్పాట్లు చేసారు. అగ్ని పర్వతమే అయినా సంవత్సరంలో చాలా రోజులు మంచుతో కప్పబడే వుంటుంది. ఆ మంచుపై స్కీయింగ్ చేయడానికి సీజనులో పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఈ అగ్ని పర్వతం చరిత్రను వివరించే పెద్ద ప్రదర్శనశాల కూడా వుంది.
ఇండియా నుంచి వచ్చి ఈ అగ్ని పర్వతం చూసేవారికి ఒక అదనపు ఆకర్షణ కూడా వుంది. దీనికి వెళ్లే దోవలో ‘నారద ఫాల్స్’ కనిపిస్తాయి. నిజానికి మన ‘నారద మహర్షి’ పేరు పెట్టారో లేదా కాకతాళీయమో కానీ ఆ పేరు చూడగానే ఎంతో సంతోషమనిపించింది.
మళ్ళీ ఇన్నేళ్లకి నిరుడు (2024) నా మనుమరాలు సృష్టి పుట్టిన రోజున నేను అమెరికాలో వుండడం యాదృచ్చికం.
ఈసారి నగరంలో ఎక్కడైనా తిరగాలి అంటే సృష్టే నాకు సమస్తం. తోడు, గైడు, సారధి (డ్రైవర్) అన్నీ తానే. సియాటిల్ లో నన్ను తిప్పని ప్రదేశం లేదు. కానీ నేను అడిగిన ఒక చోటుకు తీసుకువెళ్ళమని కోరినప్పుడు మాత్రం కొంత గందరగోళంలో పడింది.
‘స్లమ్ అంటే ఏమిటి తాతా?’
అని ఎదురు ప్రశ్నించింది నా మనుమరాలు సృష్టి.
ఆ రోజు మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత సృష్టి అడిగింది, ఈరోజు ఎక్కడికి పోదామని. అదే ఒక జాబితా చదివింది స్నో కాల్మీ ఫాల్స్, ఇంకా ఏవేవో మాల్స్, పార్కులు వగైరా.
" నాకు ఈరోజు సియాటిల్ లో ఏదైనా ఒక స్లమ్ ఏరియా చూపిస్తావా " అని అడిగాను.
" నేను ఎప్పుడూ చూడలేదు, మా ఫ్రెండ్స్ ని అడుగుతాను, అదేమిటో " అంటూ ఒకరిద్దరికి ఫోన్ చేసింది.
‘ఎవరికీ తెలియదట, ఒక ఫ్రెండేమో డౌన్ టౌన్ లో ట్రై చేయమంది. వెంటనే పద పోదాం’ అని బయలుదేరతీసింది.
ఈసారి రెంటన్ మీదుగా వెళ్ళాము. ఎప్పుడూ లేనంతగా ఫ్రీ వే మీద కూడా ట్రాఫిక్ జామ్.
పదిహేనేళ్ళ క్రితం సియాటిల్ వచ్చినప్పుడు రోడ్ల మీద ఇన్ని కార్లు లేవు. విశాలమైన రహదారులు. వాటిని కొన్ని చోట్ల మరింత విశాలంగా వెడల్పు చేసే పనులు సాగుతున్నాయి. కానీ ఎక్కడా చెట్లు కొట్టి వేస్తున్న దృశ్యాలు కనపడలేదు. రెండు వైపులా గుబురుగా, అడవిలా పెరిగిన చెట్లు. క్రితంసారి రోడ్డు మీద పోతుంటే జింకలు రోడ్డు దాటుతూ కనిపించేవి. అవి తిరిగే చోట్లలో హెచ్చరిక బోర్డులు పెట్టారు. అవి ఇప్పటికీ వున్నాయి కానీ జింకల జాడ లేదు.
మొత్తం మీద సియాటిల్ డౌన్ టౌన్ చేరాము. కొండల మీద కట్టిన నగరంలా అనిపించింది. ఎగుడు దిగుడు రోడ్లపై కారులో దాదాపు రెండు గంటల పాటు కలయతిరిగాము. ఎత్తైన పొడవాటి రమ్య హర్మ్య భవంతులు. మురికి వాడలు ఎక్కడా కానరాలేదు.
మళ్ళీ ఫ్రెండ్ కి ఫోన్ చేసింది. ప్రత్యేకంగా ఒక చోట అంటూ వుండవు. అక్కడక్కడా పేవ్ మెంట్లపై టార్పాలిన్ టెంట్లు వేసుకుని వుంటారు. బాగా వెతికితే కనపడవచ్చు అని మా డాడీ చెబుతున్నారు అని జవాబు వచ్చింది. ఆ ఫ్రెండ్ ఓ హెచ్చరిక కూడా చేసినట్టు వుంది, వాళ్ళతో జాగ్రత్త , ఏ అఘాయిత్యం అయినా చేయవచ్చు అని.
అలా రోడ్ల వెంట తిరగ్గా తిరగ్గా ఒక చోట అలాంటి టెంట్ కనిపించింది. కానీ అక్కడ కారు ఆపడానికి వీలు లేదు. అంచేత పక్క రోడ్డులో వున్న జాక్ ఇన్ ది బాక్స్ అనే బర్గర్లు దొరికే హోటల్ దగ్గర కారు పార్కు చేసి, పదహారు డాలర్లు పెట్టి ఓ బర్గర్, కోక్ కొని, ఆ టెంట్ దగ్గరికి నడిచి వెళ్ళాము. ఉత్త చేతులతో అలాంటి వారి దగ్గరకు పోకూడదన్న సృష్టి ఆలోచన నాకు నచ్చింది.
ఆ టార్పాలిన్ టెంటు ముందు డెబ్బయ్ ఏళ్ల మనిషి కూర్చుని వున్నాడు. నెత్తి మీద హ్యాట్, కూలింగ్ గ్లాసెస్, మంచి దుస్తులు, టెంట్ నిండా ఏదో సామాను, మడత పెట్టిన వీల్ చైర్, ముందు రెండు సూటు కేసులు, చేతిలో సిగారు. మరో చేతిలో మొబైల్.
సృష్టి వెళ్లి విష్ చేసి చెప్పింది, 'మీ కోసం మీల్ తెచ్చాము, ఏమైనా అభ్యంతరమా' అని.
వారి ఇద్దరి మధ్య సంభాషణ ఇంగ్లీష్ లో ఇలా జరిగింది. అది యధాతధంగా తెలుగులో:
"హలో, మేము మీకోసం కొంత ఫుడ్ తీసుకొచ్చాం!"
"వావ్, ధన్యవాదాలు!"
"నా తాతగారు భారతదేశంలో ఒక జర్నలిస్టు. ఆయన మీతో ఫోటో దిగాలని అనుకుంటున్నారు. ఆయన సియాటిల్‌లోని నిరాశ్రయుల గురించి రాస్తున్నారు. మీకు అభ్యంతరమేమైనా ఉందా అని అడగమన్నారు."
"అలా రాయడం నాకు ఇష్టం వుండదు. వద్దు. అయినా ధన్యవాదాలు."
"పర్లేదా!"
"నా సోదరికి నాకు ఇల్లు లేదని తెలీదు. ఆమెకి ఇది తెలిస్తే షాక్ తింటుంది. మీకు అర్థం అవుతుందిగా."
"మాకు పూర్తిగా అర్థమయింది. మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ ఎంతకాలంగా ఉన్నారు?"
"వాళ్లు (బహుశా మున్సిపల్ అధికారులుకావచ్చు) మమ్మల్ని ప్రతి 3-4 రోజులకూ ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మంటారు. నేను ముందు గ్రీన్‌బెల్ట్ దగ్గర ఉండేవాడిని. ఒక్క నన్ను మాత్రమే అయితే వాళ్లు అంతగా పట్టించుకోరు. కానీ చాలా RVలు, గుడారాలు వంటివి ఉంటే దాన్ని 'ఎంకాంప్‌మెంట్' అంటారు. అప్పుడు మొత్తం తొలగించేస్తారు. ఈ మొత్తం ప్రాంతాన్ని ఇప్పుడు ‘ఇండస్ట్రియల్ ఏరియా’ అని పిలుస్తారు. ఇది సియాటిల్‌లోని అత్యంత దయనీయ 10 ప్రదేశాల జాబితాలో లేదు. అయినా సరే! సీహాక్స్ సీజన్‌ కోసం దీనిని కూడా క్లియర్ (ఖాళీ) చేస్తారు, ఎప్పుడూ అలానే చేస్తారు."
"మీరు ఎంతకాలంగా ఇల్లు లేకుండా ఉన్నారు?"
"నా అన్నతో ఉండేవాడిని. ఆయన కోవిడ్‌తో చనిపోయారు."
" ఈ వార్త వినడం నాకు బాధగా వుంది"
"అందుకే నాకు మరో ప్రత్యామ్నాయం లేదు."
"మీ సమయాన్ని ఎలా గడుపుతారు?"
(అతను తన చేతిలో వున్నసెల్‌ఫోన్ చూపించాడు. మేమంతా నవ్వుకున్నాం)
అతడు మమ్మల్ని అడిగాడు ఇలా:
"ఇంతవరకు మీరు (నాలాంటి) ఎంతమందితో మాట్లాడారు?"
"మీరే మొదటివారు!"
"సరే, మంచి పనిచేశారు. మీరు ఇంతవరకూ అదృష్టవంతులే! ఇక్కడ చాలా మంది ఉంటారు. వాళ్ల రియాక్షన్ ఎలా ఉంటుందో చెప్పలేం. ఎందుకంటే వాళ్లు చాలా సార్లు మత్తులోనే ఉంటారు. ఇదిగో ఈ పక్కనే ఉన్నవాడిని చూసారు కదా ( దగ్గరలో వున్న మరో గుడారం వైపు చూపుతూ), అతను సాధారణంగా తన పనిలోనే ఉంటాడు. కానీ అతనికి బైపోలార్ డిసార్డర్ ఉంది. ఏ చిన్న విషయానికి అయినా అతను రెచ్చిపోవచ్చు. ఎవరెవరు ఎలా స్పందిస్తారో తెలియదు. కనుక మీ జాగ్రత్తలో మీరు ఉండండి. మీరు తెచ్చిన మీల్ కి ధన్యవాదాలు."
("సరే, మీకు మా కృతజ్ఞతలు. మేము ఇప్పుడు వెళ్తాం. మీరు భోజనం చేయండి. ధన్యవాదాలు. నమస్తే!")
"మీకు ధన్యవాదాలు. నమస్తే "
ఈ విధంగా అమెరికా దేశంలో గుడిసెలో నివసించే ఒక వ్యక్తిని కలిసి మాట్లాడాలి అనే ఓ కోరిక నెరవేరింది
థాంక్స్ సృష్టి!
కింది ఫోటోలు:
2003 లో సృష్టి జననం, సృష్టి నామకరణం, లాల్, దీప, రామచంద్రం, కరుణలతో మా కుటుంబం
స్నో కాల్మీ ఫాల్స్, మండే కొండల మీద మా షికార్లు. తన ఇరవై ఒకటో ఏట సృష్టి. వెనుక ఫోటోలో ఉన్న మా ఆవిడ తన ముద్దుల మనుమరాలికి ఆశీస్సులు అందిస్తోందని నా నమ్మకం.
(ఇంకావుంది)
All reactions:
Mandarapu Nageshwararao, Chennuri Ganesh and 5 others
2
Like
Comment
Share
View more comments
  • Like
  • Reply
  • See translation
Facebook