19, సెప్టెంబర్ 2021, ఆదివారం

టీటీడీ కొత్త కమిటీ – భండారు శ్రీనివాసరావు

రాజకీయ పార్టీలు రాజకీయ నిర్ణయాలే తీసుకుంటాయని గతంలో ఓ తలపండిన రాజకీయవేత్త చెప్పారు. కాబట్టి ఏ రాజకీయ పార్టీ ఆధ్వర్యంలో సాగే ఏ ప్రభుత్వమైనా రాజకీయ నిర్ణయాలకే పెద్ద పీట వేస్తుంది. ఇది నిర్వివాదాంశం. కాకపొతే, కొందరు మాంసం తింటున్నామని ఎముకలు మెళ్ళో వేసుకోరు, కొందరికి ఆ పట్టింపు కూడా వుండదు.

కాబట్టి, టీటీడీ కొత్త జంబో బోర్డు నిర్ణయం కూడా అదే బాపతు అనుకోవాలి.
రాజకీయ పార్టీలే కాదు బ్యూరోక్రాట్లు కూడా అవసరాలకు (ఇక్కడ తమ అవసరాలకు తగ్గట్టుగా అని అర్ధం) హోదాలు పెంచుకుంటూ పోయిన సందర్భాలు వున్నాయి. ఆ నిర్ణయాలు ప్రభుత్వానివి అని సమర్థించుకుంటే చేసేది ఏమీ లేదు. రాజకీయ నాయకుల్ని కనీసం అయిదేళ్లకోసారి మార్చే వెసులుబాటు అన్నా వుంది.
పూర్వం అంటే 1970 ప్రాంతాల్లో మొత్తం ఉమ్మడి రాష్ట్రానికి కలిపి, నంబియార్ అని ఒకే ఒక పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్ వుండేవారు. ఇప్పుడు ఎంతమంది వున్నారు అంటే చప్పున చెప్పలేము. అప్పుడు డీజీ అనే పోస్టే లేదు. మరి ఇప్పుడో. అలాగే చీఫ్ సెక్రెటరీ హోదా కలిగిన వాళ్ళ సంఖ్య ఎంత పెరిగిందో కూడా చెప్పలేము.
గతంలో అంటే నలభయ్ ఏళ్ళ క్రితం ఆరణాల కూలీగా ప్రసిద్ధి చెందిన టి. అంజయ్య గారు తన మంత్రివర్గాన్ని అరవై మందితో విస్తరించినప్పుడు ఇలాగే నొసళ్ళు నొక్కుకున్నారు. జంబో మంత్రివర్గం అంటూ పత్రికలు ఎద్దేవా చేసాయి. అసమ్మతి వర్గం ఈ అంశాన్ని అధిష్టానం దగ్గర తమకు అనుకూలంగా మార్చుకుని అంజయ్య గారు దిగిపోయేదాకా నిద్ర పోలేదు. సరే. ఆయన నిష్క్రమణకు రాజీవ్ గాంధి వ్యవహార శైలి కూడా దోహదం చేసింది అనుకోండి.
ముఖ్యమంత్రి అంజయ్యకు భోలా మనిషి అనే పేరు. ఏదీ కడుపులో దాచుకునే రకం కాదు. ఆయనే స్వయంగా నాతొ అన్నమాటలు ఇవి.
“చూసావా శ్రీనివాసూ. ఒక జిల్లాలో ఇద్దరు ముగ్గురు ఐ.ఏ.ఎస్. అధికారులు ఉండవచ్చు. కానీ ఒక జిల్లాలో ఇద్దరు మంత్రులు వుండకూడదు అంటున్నారు. ఇదెక్కడి న్యాయం”
రాజకీయాల్లో న్యాయం ప్రసక్తి ఏముంటుంది?
ఇక టీటీడీ విషయానికి వస్తే,
ఆ జంబో బోర్డు సభ్యులకు ఓ విజ్ఞప్తి.
“మీ మొట్టమొదటి సమావేశంలోనే ఓ తీర్మానం చేయండి. మీ మీద వచ్చిన నీలాపనిందలు అన్నీ తొలగిపోతాయి.
“మేము సభ్యులుగా వుండగా మా చుట్టపక్కాలకు కానీ, అనుచర వర్గాలకు కానీ, స్వామి దర్శనం కోసం సిఫారసు లేఖలు ఇచ్చే అధికారాన్ని స్వచ్చందంగా వదులుకుంటున్నాము. మా పరిధిని కేవలం దేవస్థానం అభివృద్ధికి, యాత్రీకుల సేవల అభివృద్ధికి మాత్రమే పరిమితం చేసుకుని వ్యవహరిస్తాము”
ఆ చేత్తోనే మరో తీర్మానం చేసి పుణ్యం కట్టుకోండి.
“దేవాలయ పరిసరాల్లో టీవీ కెమెరాలను అనుమతించం. రాష్ట్రపతి వంటి పెద్దలు వస్తే ఎలాగూ ఎస్వీ ఛానల్ చూసుకుంటుంది.”



NOTE: Courtesy Image Owner

(19-09-2021)

4 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...



స్వామి దర్శనం కోసం సిఫారసు ఎంత మంచి సదవకాశము ! దాన్ని వదులుకోమంటారా?

మిమ్మల్ని బోర్డు లో తీసుకోలేదని ఉడుకుమోత్తనమాండీ?

అజ్ఞాత చెప్పారు...

ముందుముందు కాలంలో ఇంకా మంచివిస్తరణలు జరుగుతాయి టీటీడీ బోర్డుకు.
* ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంత్రిమండలిలోని అందరూ టీటీడీ బోర్డు సభ్యులే.
* తెలంగాణా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారూ ఆయన నామినేట్ చేసిన మంత్రులూ (ఎందరైనా కావచ్చును) అందరూ టీటీడీ బోర్డు సభ్యులే.
* దేశ ప్రధానమంత్రి గారూ నామినేట్ చేసిన కేంద్రమంత్రులూ (ఎందరైనా కావచ్చును) అందరూ టీటీడీ బోర్డు సభ్యులే.
* అంతర్జాతీయంగా ఉన్న ప్రవాస భారతీయప్రముఖులలో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రిగారు నామినాట్ చేసిన వారు (ఎందరైనా కావచ్చును) అందరూ టీటీడీ బోర్డు సభ్యులే.
* టిటీడీ బోర్డు తీర్మానం చేసినంత సొమ్మును స్వామివారికి విరాళంగా ఇచ్చిన వారు (ఎందరైనా కావచ్చును) అందరూ టీటీడీ బోర్డు సభ్యులే.
* ఏదైనా దేశంలోని ప్రముఖులను (భారతీయులే కానక్కరలేదు) ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు టీటీడీ బోర్డు సభ్యులుగా నామినేట్ చేయవచ్చును.
* టీటీడీ బోర్డు సభ్యుల సంఖ్యకు పరిమితి అంటూ‌ఏమీ ఉండదు. అలాగే వారి సభ్యత్వానికి కాలపరిమితి కూడా ఉండదు.
* టీటీడీ బోర్డు సభ్యులను ఆంద్రప్రదేశ్ ముఖమంత్రి గారు ఎప్పుడైనా మార్చవచ్చును. కొత్తవారిని చేర్చటం, ఉన్నవారిని తొలగించటం/కొనసాగించటం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇష్టం.

ఈదో ఒకరోజున టీటీడీ బోర్డు సభ్యుల సంఖ్య ఒక వేయి ఐనా అశ్చర్యపోవలసిన అవసరం లేదు.

అజ్ఞాత చెప్పారు...

మరొక రెండు ముఖ్య విషయాలు.
* టీటీడీ బోర్ఢు ఎప్పుడు సమావేశం కావాలో అక్కరలేదో ఆంద్రప్రదేశ్ ముఖమంత్రి గారు నిర్ణయిస్తారు.
* టీటీడీ బోర్ఢు ఏమి నిర్ణయాలను ప్రకటించాలన్నా వాటిని ఆంద్రప్రదేశ్ ముఖమంత్రి గారు నిర్ణయిస్తారు.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

పై ముగ్గురు అజ్ఞాత రచయితలకి: పేర్లకి ముసుగులు వేసుకున్నా, మీ మనసులోని అభిప్రాయాలను చక్కగా విడమరిచి చెప్పారు. స్థూలంగా చూస్తే ముగ్గురూ ఒకరే అనే అభిప్రాయం కలుగుతోంది. ధన్యవాదాలు. పోస్టు పూర్తిగా చదివి కామెంట్స్ పెడితే బాగుంటుంది అనేది నా చిన్న సూచన. ఎలాగూ మన్నించరని తెలుసు అనుకోండి