13, సెప్టెంబర్ 2021, సోమవారం

మాస్కో చలికి గడ్డకట్టిన రోజు– భండారు శ్రీనివాసరావు

 

ముప్పయ్యేళ్ళ పై మాటే
మాస్కో రేడియోలో పనిచేసే విదేశీ ఉద్యోగులకోసం ఊలిత్స వావిలోవాలో ఒక పదమూడు అంతస్తుల భవనాన్ని కేటాయించారు. మన దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వెళ్ళిన చాలామందిమి అక్కడే వుండేవాళ్ళం. వేరే దేశాల వాళ్ళ బస కూడా ఆ భవనంలోనే, ఏదో ఐక్యరాజ్యసమితిలో వున్నట్టు వుండేది.
మా ఇంటి నుంచి మాస్కో రేడియోకి వెళ్ళడానికి రెండు మార్గాలు. ఒకటి మెట్రో. చాలా తొందరగా వెళ్లిపోవచ్చు. కానీ మెట్రో స్టేషన్ కిలోమీటరు పైన దూరం. ఇంటి వెనుక ఉన్న విశాలమైన ఖాళీ జాగా లోంచి నడుచుకుంటూ వెడితే తొందరగానే చేరుకోవచ్చు. నా సహోద్యోగులు శ్రీయుతులు రామకృష్ణ (కన్నడ న్యూస్ రీడర్), చంద్ర కాంత్ వ్యాస్ (గుజరాతీ న్యూస్ రీడర్), జస్వంత్ సింగ్, వాలియా సింగ్ (పంజాబీ), దాసన్ (మలయాళం), అరుణ్ మహంతి (ఒడియా) ఇలా వీళ్ళందరితో కలిసి మాస్కో వెళ్ళిన కొత్తలో నేనూ మెట్రోలో వెళ్ళేవాడిని. అయితే ఖాళీ జాగా అంతా రాత్రంతా కురిసిన మంచుతో నిండిపోయేది. బురదలో మోకాళ్ళ లోతు కూరుకుపోయినట్టు ఆ మంచులో దిగబడ్డ కాళ్ళని పైకి లాక్కుంటూ నడవడం నాకు కష్టంగా అనిపించి రెండో మార్గం అయిన ట్రాముని ఎంచుకున్నాను. అది ఆగే స్టాపు ఇంటికి దగ్గరలో వుండడం, అందులో ఎక్కితే నేరుగా మాస్కో రేడియో ఎదట దిగడం వంటి సులువులు ఇందుకు కారణం. రోడ్డుమీద సిటీ బస్సులు, ఇతర వాహనాలతో పాటే ఒక పక్కగా ఈ ట్రాములువెడుతుండేవి. నగరం చూసుకుంటూ ఎంచక్కా ప్రయాణం చేయవచ్చు. అదే మెట్రో అయితే భూగర్భ మార్గం.
సరే! అందర్నీ ఒదిలి నేను ఒక్కడినే వెళ్ళడం మొదలెట్టాక మొదట్లో హాయిగానే వుండేది. మెట్రోలో వెడితే ఠ౦ చనుగా ఇరవై నిమిషాల్లో చేరుకోవచ్చు. అదే ట్రాములో అయితే నలభయ్ నిమిషాలకు పైగా పట్టేది. తొందరగా వెళ్లి చేసే రాచకార్యాలు యేమున్నాయని నేను ట్రాములోనే వెళ్ళే వాడిని. రోజులన్నీ ఒకేలాగా గడిస్తే జీవితం ఎలా అవుతుంది?
ఒకరోజు ట్రాము ఎక్కి కిటికీ పక్కన సీటు చూసుకుని కోటు సర్దుకుని దర్జాగా కూర్చుని పుస్తకం చదువుకుంటూ కూర్చున్నాను. బయలు దేరిన కాసేపటి తర్వాత చూస్తే ట్రాము దారి మధ్యలో ఉన్న మరో స్టేషన్ వద్దకే వచ్చి ఆగింది. అంటే వెనక్కి వచ్చిందన్నమాట. మరో ట్రాము ఎక్కితే దానిదీ అదే వరస. రేడియో స్టేషన్ వైపు వెళ్ళకుండా ఎటుఎటో తిరిగి వెనక్కి ఎందుకు మళ్ళుతున్నట్టు? ఎవరిని అడగాలి ఎలా అడగాలి. రష్యన్లు ఎవరికీ ఒక్కముక్కంటే ఒక్క ముక్క ఇంగ్లీష్ రాదు. మరి మెట్రో అనే పదం ఎలా తట్టిందో ఎలా ఆ పేరు పెట్టారో తెలవదు.
ముందు ఈ విషయం మా ఆవిడకి చెబుదామని పబ్లిక్ బూత్ వద్దకు వెళ్లాను. ఈ హడావిడిలో చేతి గ్లౌస్ తీసిన సంగతి మరచిపోయాను. క్షణం కంటే తక్కువలో చేతి వేళ్ళు కొంకర్లు తిరిగిపోయాయి. ఎట్లాగో తిప్పలు పడి రెండు పైసల నాణెం వేసి ఫోను చేశాను. మీరు ఆగిన మెట్రో రౌండ్ లైన్ స్టేషన్ దగ్గర్లో శ్రీధర్ కుమార్ గారి ఇల్లు వుండాలి. నేను ఫోను చేసి విశాలకు చెబుతాను’ అన్నది మా ఆవిడ. గడ్డ కట్టుకు పోయిన చేయి స్వాధీనంలోకి రాలేదు. గ్లౌస్ వేసుకోవడం కుదరలేదు. అలాగే ఒక్క పెట్టున ఉరుక్కుంటూ శ్రీధర్ కుమార్ వుండే అపార్ట్ మెంటు చేరాను. ఆయన ఇండియన్ ఎంబసీ లో పనిచేస్తారు. బెల్లు కొట్టగానే విశాల గారు తలుపు తీసారు. మా ఆవిడ విషయం చెప్పిందేమో ఆవిడ వేడి వేడి కాఫీ సిద్ధం చేసి ఉంచారు. హీటర్ దగ్గర కాసేపు ఉంచిన తర్వాత నా చేయి స్వాధీనంలోకి వచ్చింది. కాఫీ తాగిన తర్వాత మొత్తం ఒళ్ళంతా తేలిక పడింది.
కొస మెరుపు ఏమిటంటే తర్వాత మెట్రోలో ఆఫీసుకు వెళ్లాను. నా సహోద్యోగి గీర్మన్, కొంచెం కొంచెం తెలుగు తెలిసిన రష్యన్. తెలుగు విభాగంలో నాకు తోడ్పాటు అందించేవాడు. అతడికి నేను జరిగిన సంగతులు వివరించాను.
‘ఎందుకు తమరు ఆ విధముగా కష్టములు పడి వచ్చితిరి, గృహములో విశ్రాంతి అవసరము కదా!’ అన్నాడు సానుభూతిగా.
‘నేను విశ్రాంతి తీసుకుంటే ఇక్కడ బులెటిన్ ఎలాగా?’ అన్నాను.
అప్పుడతను చెప్పిన జవాబు విన్నతరువాత ఆశ్చర్యంతో నాకు శరీరమంతా గడ్డకట్టుకుని పోయింది.
‘నిన్న రికార్డు చేసిన వార్తలు ఉండినవి, వాటినే రీ ప్లే చేద్దుము’


(మాస్కో మంచులో మా చిన్నవాడు సంతోష్)


కామెంట్‌లు లేవు: