18, సెప్టెంబర్ 2021, శనివారం

ఎవరీ పీకే – భండారు శ్రీనివాసరావు


(Published in ANDHRAPRABHA Daily)

Larger than life, Bigger than life అని ఇంగ్లీష్ లో ఈ వాక్యాలను తెగ వాడేస్తుంటారు. వీటికి అసలు అర్ధం మారిపోయి, ఉన్న మనిషిని ఉన్నదానికన్నా పెంచి చూపించడం అనే కోణంలో ఉపయోగిస్తున్నట్టుగా అనిపిస్తోంది. మనిషిలోని గొప్పతనాన్ని మరింత పెంచి చూపించడం అంటే ఇమేజ్ బిల్డింగ్ అని అర్ధం చెప్పుకోవచ్చు. ఇప్పుడు దేశంలో ఒక స్థాయికి ఎదిగిన రాజకీయ నాయకులు అందరూ ఈ ఇమేజ్ బిల్డింగ్ తాపత్రయంలో పడిపోతున్నారు. బహుశా ఇదంతా ప్రశాంత్ కిషోర్ (పీకే) మహిమ కాబోలు.
కొన్ని వారాల క్రితం ఒక వెబ్ ఛానల్ వాళ్ళు ఈ ప్రశాంత్ కిషోర్ గురించి మాట్లాడమని అడిగారు. ‘ఎవరీ పీకే? ఈయన వెనక ఎవరున్నారు?’ అనేది మొదటి ప్రశ్న.
‘ఆయన వెనుక ‘ఆయనే’ వున్నారు’ అనేది నా జవాబు.
ఇంకొకరు వెనక ఉండడానికి ఆయన అల్లాటప్పా రకం కాదు. బాహుబలి డైరెక్టర్ రాజమౌళి లాగా ప్రశాంత్ కిషోర్ ఖాతాలో కూడా వరస విజయాలు వున్నాయి. ఒక వ్యక్తిని లేదా వ్యవస్థను అంచనా వేయడానికి ఈనాటి వాణిజ్య ప్రపంచంలో విజయాన్ని మించిన కొలమానం లేదు. ఆ విజేతలు పట్టింది బంగారం. చెప్పింది వేదం. వారి మాటకు ఎదురు చెప్పేవారు వుండరు. చెప్పరు కూడా. అది విజయంలో దాగున్న అసలు రహస్యం.
బీహార్ లోని రోహతాస్ జిల్లా కోనార్ గ్రామానికి చెందిన ప్రశాంత్ కిషోర్ వైద్యుడైన తన తండ్రితోపాటు బక్సర్ కు వెళ్లి అక్కడే స్కూలు చదువు ముగించాడు. ఆరోగ్యరంగంలో ఉన్నత విద్య అభ్యసించి అమెరికాలో ఐక్యరాజ్యసమితిలో ఎనిమిదేళ్లు పనిచేసి భారత దేశానికి తిరిగివచ్చారు. అందరు నడిచేదారిలో కాకుండా రాజకీయ వ్యూహకర్తగా తన వృత్తిని ఎంచుకున్నారు.
మొదటి విజయానికి పునాది గుజరాత్ లో పడింది. ప్రస్తుత ప్రధాని 2012లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మూడో పర్యాయం ఎన్నికలను ఎదుర్కుంటున్న తరుణంలో పీకే తన వ్యూహ చాతుర్యాన్ని ప్రదర్శించి ఆయన గెలుపుకు కారణం అయ్యారు. తిరిగి రెండేళ్ల తరువాత 2014 లో బీజేపీ తరపున ప్రధాని అభ్యర్ధిగా పోటీ చేస్తున్నప్పుడు కూడా పీకే ‘చాయ్ పె చర్చా’ వంటి వినూత్న కార్యక్రమాలతో దేశ ప్రజల దృష్టిలో నరేంద్ర మోడీకి ఒక ప్రత్యేక స్థానం కల్పించడంలో విశేష కృషి చేశారు. అ ఎన్నికలలో బీజేపీ సాధించిన విజయం దరిమిలా ఆ పార్టీ జాతీయ స్థాయిలో స్థిర పడడానికి, వివిధ రాష్ట్రాలలో అధికార పీఠం ఎక్కడానికి తోడ్పడింది. రెండు ఎన్నికలలో బీజేపీతో కలిసి పనిచేసిన పీకే 2015 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి సహాయ సహకారాలు అందించారు. అంతే! అక్కడ కూడా పీకే వ్యూహం అద్భుతంగా పనిచేసింది. అమరేంద్ర సింగ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారు. తరువాత పీకే తన సొంత రాష్ట్రం అయిన బీహార్ లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. అక్కడా ఆయనకు ఎదురు లేకుండా పోయింది.
‘నన్నెవ్వరాపరీవేళా’ మాదిరిగా పీకే ప్రభలు దేశ వ్యాప్తంగా వెలుగులు విరజిమ్ముతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన రెడ్డి నుంచి ఆహ్వానం అందింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుని ఎదుర్కోవడం, ఎదుర్కుని గెలవడం అనేవి జగన్ మోహన రెడ్డికి చావోరేవో అనే తరుణంలో పీకే ఆయనతో జట్టు కట్టారు. అంతవరకూ సాంప్రదాయక ప్రచార పద్ధతులకు అలవాటు పడిన రాష్ట్ర రాజకీయ నాయకులకు ఈ వ్యూహకర్తల పాత్ర ఏమిటన్నది అర్ధం కాలేదు. పైగా ఈ పీకే అనే పెద్దమనిషి ఎవరో ఏమిటో కూడా చాలామందికి తెలవదు. ఎన్నికలకు ముందు జగన్ మోహన రెడ్డి ఒక బహిరంగ సభలో ఆయన్ని వేదిక మీదకు ఆహ్వానించి, పక్కన నిలబెట్టుకుని ఇదిగో వీరే ప్రశాంత్ కిషోర్ అని పరిచయం చేసేవరకు ఆయన ఎలా ఉంటాడో కూడా తెలియదు.
అలాగే ఈ ఏడాది జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీ ఎం కె విజయానికి దోహదం చేసింది కూడా పీకే వ్యూహ చాతుర్యమే.
అల్లాంటి పీకే మళ్ళీ ఇప్పుడు వార్తల్లో వ్యక్తి అయ్యాడు. ఎవరీ పీకే అని ఆరాలు తీస్తున్నారు. పీకే అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని తెలుగునాట ప్రచారంలో ఉండడం ఓ కారణం.
ఒకటి మాత్రం నిజం. పీకే వల్ల అధికార పగ్గాలు చేజిక్కించుకున్నవాళ్ళు ఆ మాట ఒప్పుకోకపోవచ్చు. కానీ ఆయన వల్ల పరాజయం పాలయిన వాళ్ళు మాత్రం ఏదో ఒక రోజు ఆయన సాయం తీసుకోరని అనుకోవడానికి లేదు. ఇందుకోసం క్యూలో నిలబడి వున్నా ఆశ్చర్యం లేదు.
ఎందుకంటే ఆయన పెద్ద బిజినెస్ మాన్. తను చేసిన పనికి తన ఫీజు తాను తీసుకుని కమిటెడ్ గా పనిచేస్తాడు. రిజల్ట్ చూపిస్తున్నాడు బాహుబలి రాజమౌళి లాగా. రాజకీయ పార్టీలు కూడా వ్యాపార పార్టీలే. లాభం లేదు అనుకుంటే ఒక పైసా విదిల్చవు.
ఇక ఎవరికీ పట్టని నైతిక విలువలు ఓటర్లకు మాత్రం ఎందుకు? టీవీ చర్చల్లోకి తప్ప.
(19-09-2021)


(ప్రశాంత్ కిషోర్ )


7 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ఈయన్ని ప్లానింగ్ కమీషన్ చీఫ్ గా వ్యూహకర్త గా వేస్తే దేశానికి సాఫల్యం వస్తుందేమోనండీ

bonagiri చెప్పారు...

ప్లానింగ్ కమిషనా?.. అదెక్కడుంది??

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

వ్యవస్థలను “పీకి” పాకాన పెట్టడానికి దోహద పడుతున్నవాడు. వేదికలెక్కి బూతులు మాట్లాడడం కూడా ప్రచారానికి బలం చేకూరుస్తుందని వ్యూహరచనలో భాగం కాబోలు?

నీహారిక చెప్పారు...

>>>వేదికలెక్కి బూతులు మాట్లాడడం కూడా ప్రచారానికి బలం చేకూరుస్తుందని వ్యూహరచనలో భాగం కాబోలు?>>
జగన్ చేతులు తిప్పడం చూసా కానీ బూతులు మాట్లాడడం చూడలేదు.ఎవరి గురించి అంటున్నారు ?

నీహారిక చెప్పారు...

>>ఎవరికీ పట్టని నైతిక విలువలు ఓటర్లకు మాత్రం ఎందుకు?>>
నైతిక విలువల గురించి మాట్లాడే నైతిక హక్కు ఎవరికైనా ఉందంటారా ?

bonagiri చెప్పారు...

కోడిగుడ్డు కి ఈకలు పీకే వాడే ఈ పీకే...

Chiru Dreams చెప్పారు...

ఫస్ట్ పీకేని చంద్రబాబునాయుడు కన్సల్ట్ చేశాడట. ఆ రేటు తట్టుకోలేక వద్దనుకున్నాడు. అని అంద్రజ్యోతిలో రాసుకొచ్చారు