17, జూన్ 2021, గురువారం

రాజకీయాల్లో అధినాయకత్వం పవర్ – భండారు శ్రీనివాసరావు

 అశోక్ గజపతి రాజు రాజవంశం వాడయినా రాచరికపు లక్షణాలను వంటబట్టించుకోలేదు. ఆయన సుదీర్ఘ కాలం రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నప్పటికీ రాజకీయ కాలుష్యానికి దూరంగానే ఉంటూ వచ్చారు. ఆయన సచ్చీలత, నిరాడంబరత లోకవిదితం.

మాన్సాస్ ట్రస్ట్ తాజా పరిణామాల తర్వాత అశోక్ గజపతి రాజు మనసులో ఖేద పడుతున్నట్టు టీవీల్లో వచ్చింది. వంశపారంపర్యంగా ధర్మకర్తగా ఉంటున్న సింహాచలం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా తనను కలవడానికి ఇష్టపడడం లేదని ఆయన బాధ పడుతున్నారు. ఇది సహజం. ఆయన బాధ పడడం కాదు, అధికారులు అలా ప్రవర్తించడం.

ఒక్కసారి పీవీ గారెని గుర్తు చేసుకుందాం. కాంగ్రెస్ నాయకత్వంలో మైనారిటీ ప్రభుత్వాన్ని కేంద్రంలో అయిదేళ్ళ పాటు నడిపిన కార్యదక్షుడు. దేశాన్ని ఆర్ధికసంక్షోభం నుంచి బయట పడేసిన ధీమంతుడు. చివరికి ఆయన చనిపోతే, మాజీ ప్రధానిగా ఆయనకు దక్కాల్సిన గౌరవం దేశ రాజధానిలో దక్కలేదు. కారణం, ఆయన పార్టీ అధినాయకురాలి అనుకూల దృక్కుల్లో లేకపోవడం.

సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చి, మరో దఫా అధికారం కూడా పార్టీకి కట్టబెట్టిన డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి చనిపోయిన తరువాత ఆయన భార్య శ్రీమతి వై.ఎస్. విజయమ్మ రాష్ట్ర రాజధానిలో  పేవ్ మెంటు మీద ధర్నా చేస్తుంటే, ఒక్కరంటే ఒక్క మంత్రి ఆమెను చూడడానికి కూడా సాహసించలేదు. అధికారంలో వున్నప్పుడు ఆమె చుట్టూ చేరి ఫోటోలు దిగడానికి ఉబలాట పడిన వారెవ్వరూ ఆమెకు కనీసం సానుభూతి చూపించలేదు.

ఇక ఎన్టీఆర్. తనను పార్టీ నుంచి తొలగించిన తర్వాత నిండు (శాసన) సభలో ‘నాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వండని’ ప్రాధేయ పడితే, ఆయన బొమ్మ పెట్టుకుని గెలిచిన వారెవ్వరూ ఆయనకు మద్దతుగా నిలబడలేదు.

ఇలాంటి ఉదాహరణలు చరిత్రలో కోకొల్లలు.

ప్రజాస్వామ్యంలో పార్టీ అధినాయకత్వం పవర్ అది.

(17-06-2021)    

కామెంట్‌లు లేవు: