9, జూన్ 2021, బుధవారం

సినీ నటి మామిడికాయ తింటే! – భండారు శ్రీనివాసరావు

 

“ప్రముఖ వర్ధమాన సినీ తార జలజా దేవి ఈ ఉదయం ఒంటరిగా కూర్చుని పచ్చి మామిడికాయ కొరుక్కుని తింటున్నట్టు ట్విట్టర్ లో ఓ ఫోటో పోస్టు చేశారు. దీన్ని గురించి మా ప్రత్యేక ప్రతినిధి నిజలింగప్ప ఏమి చెబుతున్నారో విందాం!
“నిజలింగప్పా! ఈ ఫోటోకి సంబంధించి మీకు తెలిసిన నిజమేమిటో మన శ్రోతలకు వివరిస్తారా!”
“త్తప్పకుండా ల్లతా! త్తప్పకుండా!
“జలజా దేవి కరోనా కారణంగా షూటింగులు లేక మూతికి గుడ్డకట్టుకుని ఇంటిపట్టునే వుంటున్నారు. ఎండాకాలం దొరికేవి కాబట్టి మామిడికాయ తిని ఉండవచ్చు. పని లేక తీరిక, చేతిలో ఫోను వున్నాయి కనుక ఫోటో తీసి పెట్టి ఉండవచ్చు. అది మామిడికాయ అని కూడా ఆవిడకి తెలిసి ఉండక పోవచ్చు. కానీ మన బ్యూరో చేసిన పరిశోధన ప్రకారం ఈ ఫోటో ద్వారా తనకు నెల తప్పింది అనే విషయాన్ని ఆవిడ దృశ్యశోభితంగా వ్యక్తపరచినట్టు భావిస్తున్నాను”
“ఈ విషయం ధృవపరచుకోవడం కోసం మెటర్నిటీ ఆసుపత్రిలోని డాక్టర్ మాతా దేవిని అడిగితే ఆవిడ తను చదువుకున్న వైద్య గ్రంధాలలో ఎక్కడా ఈ మామిడికాయ కొరుకుడు ప్రసక్తి లేదని ఘంటా పదంగా చెప్పారు”
“మరయితే మీ పరిశోధనకు ప్రాతిపదిక ఏమిటి నిజలింగప్పా!”
“అక్కడికే వస్తున్నాను ల్లతా! అక్కడికే వస్తున్నాను”
“మీరు అక్కడే వుండండి నిజలింగప్పా! అక్కడే వుండండి. మన బ్యూరో చీఫ్ సత్యపాల్ లైవ్ లో ఈ మామిడి కొరుకుడు గురించి మరిన్ని వివరాలు అందించడానికి లైవ్ లో మైకు పట్టుకుని సిద్ధంగా వుండి చాలాసేపు అయింది. ముందు ఆయన్ని అడుగుదాం. మీరు చెప్పండి సత్య! మీరేమి అనుకుంటున్నారు?”
“సత్య! కాదు, సత్యపాల్ ల్లతా! నిజాన్ని అబద్దాన్ని నీళ్ళూ పాలూ మాదిరిగా విడదీసి చెప్పగలనని నాకు సత్యపాల్ అని పేరు పెట్టారు. ఆ పేరు నిలబెట్టుకోవడానికి నేను ఈ మామిడి కొరుకుడు మీద గత నాలుగు గంటలుగా కంప్యూటర్ ముందు కూర్చుని పెద్ద రీసెర్చ్ చేశాను.
“దాని ప్రకారం ఆమ్రోపనిషత్ లో ఆరవ అధ్యాయం మూడో ఖండికలో ఈ ఆమ్ర ఫలం గురించి సవిస్తరంగా రాయబడి వుంది. కానీ కడుపుతో ఉన్న వాళ్ళు మామిడికాయ కొరుక్కుతింటారని అనే విషయం కలికానికి కూడా కనబడలేదు. గర్భిణి అయిన సీతాదేవి వాల్మీకి ఆశ్రమంలో ఉంటూ మామిడి పండ్లు తిన్నట్టు దాఖలా వుంది కానీ ఆ విషయం వాల్మీకి రామాయణంలో లేదని తలనెరిసిన పండితులు చెబుతున్నారు. పాత తెలుగు సినిమాల్లో తరచుగా కానవచ్చే ఇటువంటి దృశ్యాలని, జలజాదేవి కరోనా కాలంలో పొద్దుపోక టీవీల్లో చూసి ముచ్చటపడి, తానూ అలా మామిడి కాయ తింటున్నట్టుగా ఫోటో తీసి పోస్టు చేసి ఉండవచ్చని నా అభిప్రాయం”
“సత్య! సారీ సత్యా! సారీ పాలా! సత్యపాలా! మీరు అలాగే మైకు చేతిలో పట్టుకుని అలాగే వుండండి, సమయం వచ్చినప్పుడు మరిన్ని వివరాల కోసం మిమ్మల్ని లైవ్ లో తీసుకునే ప్రయత్నం చేస్తాము”
“నిజలింగప్పా! ఇప్పుడు చెప్పండి మరిన్ని ఆసక్తికరమైన నిజాలు. ఇంతకీ జలజాదేవి నెల తప్పినట్టా లేదా! తప్పక పొతే మామిడికాయ ఎందుకు కొరుక్కుతిన్నట్టు?”
“ల్లతా! నేను ఇప్పుడు జలజాదేవి ఫ్లాట్ లోనే వున్నాను. మామిడి కొరుకుడు మీద మన ప్రోగ్రాం చూస్తూ కొంత ఆనందంగా, కొంత కోపంగా వున్నారు. పెళ్ళే కాని తనకు నెల తప్పడం ఏమిటని ఆగ్రహంగా వున్నారు. కానీ, ఆమె హావభావాలు చూస్తుంటే, సినిమాలు లేని ఈ కరోనా రోజుల్లో కూడా తన గురించి టీవీలో చూపిస్తున్నందుకు ఆనందమే ఎక్కువ కనబడుతోంది. ఇప్పుడు నేరుగా ఆవిడనే అడిగి తెలుసుకుందాము ఎందుకు మామిడికాయ కొరుక్కు తిన్నారో! టీవీ షో అనగానే హడావిడిగా లోపలకు వెళ్ళారు, మేకప్ చేసుకోవడానికి. అదిగో వచ్చారు.
“చూడండి జలజ గారూ! మామిడికాయ అంటే మీకు అంత ఇష్టమా! లేక ఆ ఫోటో పోస్టు చేయడానికి వేరే ఏదైనా కారణం ఉందా!”
“చూడండి లింగం గారు, అదే నిజలింగప్పగారు. సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేయడానికి వేరే కారణాలు ఉంటాయని ఇప్పుడే మీవల్ల తెలుసుకుంటున్నాను. పత్రికల్లో మా ఫోటోలు రావాలంటే అధికారికంగా యాడ్స్ రూపంలో కొంతా, అనధికారికంగా మరికొంతా పైకం వదిలించుకోవాలనే సంగతి మీకు తెలియంది కాదు. కానీ ఈ సోషల్ మీడియా బుజ్జాయి వుంది చూశారు, ఎంత ముద్దొస్తోందో! ఒక్క మామిడికాయ కొరుకుడు ఏమిటి, వంట రాకపోయినా అద్భుతమైన వంటకాలు పరమాద్బుతంగా స్వయంగా చేస్తున్నట్టు ఎన్ని ఫోటోలయినా, వీడియోలు అయినా ఎంచక్కా ఇట్టే పోస్ట్ చేసుకోవచ్చు. కాచుకుని వుండే మా అభిమానులు, వాటిని అందిపుచ్చుకుని లైకుల మీద లైకులు కొట్టుకుంటూ, షేర్లు చేసుకుంటూ ప్రపంచమంతా తిప్పుతారు. పైగా అంతా పూర్తిగా ఉచితం, ప్రభుత్వ పధకాలమల్లే! ఇక టీవీల పబ్లిసిటీ అంతా ఇంతా కాదు. మీరు మామూలుగా అయితే మా ఇళ్లకు వస్తారా, ఎక్కడో ఫైవ్ స్టార్ హోటల్లోనో, లేదా ప్రైవేట్ గెస్ట్ హౌసుల్లోనో గిఫ్టుబాటు ప్రెస్ మీట్లు పెట్టి పిలిస్తేనే కాని రాని మీరు, ఇప్పుడు చూడండి, మీ అంతట మీరే పరిగెత్తుకుంటూ వచ్చారు, కెమెరా మాన్ ని కూడా వెంటేసుకుని. పైగా లైవ్ టెలికాస్ట్ కూడా. మీయాంఖరమ్మే ఇందాక చెప్పింది కదా! నేను ఓ వర్ధమాన నటిని అని. అందుకే నెమ్మదిగా ఈ కరోనా కాలంలో పబ్లిసిటీ గుట్టుమట్లన్నీ తెలుసుకుంటున్నాను.
“తెలిసిందాండీ నిజ లింగప్ప గారు.
“అదిగో ఆ బుట్టలు పట్టుకుపొండి. వాటిల్లో మంచి రకం బేనిషా కొల్లాపూర్ మామిడిపళ్ళు వున్నాయి. తీసుకుపోయి మీ టీవీ వాళ్ళకు కూడా ఇవ్వండి. తింటూ తింటూ ఇలాంటి మంచి ప్రోగ్రాములు ఇంకా కొన్ని చేయవచ్చు.
“ధన్యవాద్! షుక్రియా, థాంక్స్, కృతజ్ఞతలు”
(09-06-2021)

1 కామెంట్‌:

నీహారిక చెప్పారు...

త్తప్పకుండా ల్లతా! త్తప్పకుండా!
😊