12, జూన్ 2021, శనివారం

రాజీనామాలు, ఆమోదాలు - భండారు శ్రీనివాసరావు

 

వాయువేగంతో ఆమోదించబడిన రాజీనామాల్లో, నాకు తెలిసి,  నందమూరి హరికృష్ణదే మొదటిది అనుకుంటాను. రాష్ట్రాన్ని విభజించాలనే కాంగ్రెస్  అధిష్టానం నిర్ణయానికి  నిరసనగా హరికృష్ణ తన  రాజ్యసభ  సభ్యత్వానికి రాజీనామా లేఖను చైర్మన్ ఛాంబర్ లో ఇచ్చి బయటకు వస్తుండగానే పార్లమెంటులోని టీవీ చానళ్లలో రాజీనామా ఆమోదం వార్త స్క్రోలింగుల రూపంలో దర్శనం ఇచ్చింది.

ఇక ‘నా రాజీనామాను ఆమోదించండి బాబూ’ అని,   స్వాతిముత్యం  సినిమాలో కమల్ హసన్ ఉద్యోగం కోసం శంకరాభరణం శంకరశాస్త్రిగా పేరుపొందిన సోమయాజులు ధరించిన పాత్రను పదేపదే  వెంటపడే దృశ్యాన్ని గుర్తుకు తెచ్చిన ఉదంతం  డాక్టర్ జనార్ధన రెడ్డి  (మహబూబ్ నగర్)ది.  అప్పుడు స్పీకర్ నాదెండ్ల మనోహర్.  ప్రత్యేక తెలంగాణా వాదానికి మద్దతుగా  డాక్టర్  నాగం తన టీడీపీ  శాసన సభ్యత్వానికి  రాజీనామా చేశారు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం  వరకు  ఆయన స్పీకర్ ని  కలుస్తూ తన రాజీనామా సంగతి ఏం చేశారు అంటూ  వారాల తరబడి వెంటపడేవారు. ఆయనే ఈ స్వాతిముత్యం సంగతి విలేకరుల చెవిన వేశారు. తన రాజీనామాను ఆమోదించకుండా స్పీకర్ తప్పించుకుని తిరుగుతున్నారు అని ఆరోపణ చేయడమే కాకుండా స్పీకర్ మిస్సింగ్ అంటూ పోలీసులకు లిఖిత పూర్వక ఫిర్యాదు కూడా చేశారు. ఆఖరికి అసెంబ్లీ ఆవరణలో ధర్నా చేశారు. చిట్టచివరికి, ఎట్టకేలకు ఆ రాజీనామాను స్పీకర్ ఆమోదించారు.

రాజీనామాల పర్వంలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది 2011 లో ఆనాటి పాలకపక్షం నుంచి విడిపోయిన 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలు. సీబీఐ చార్జ్ షీట్ లో పూర్వ ముఖ్యమంత్రి వై.ఎస్.ఆర్. పేరు ప్రస్తావించడానికి నిరసనగా వాళ్ళు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. శాసన  సభలో నిలబడి ‘మా రాజీనామాలను ఆమోదించండి’ అని నాటి స్పీకర్ నాదెండ్ల మనోహర్ ని ఎన్నోసార్లు వేడుకున్నారు. ఫలితం పూజ్యం.

చివరికి చాలా కాలం తర్వాత, కాంగ్రెస్ అధిష్టానం పచ్చ జెండా ఊపిన పిదప ఆ రాజీనామాలకు మోక్షం లభించింది. 

ఆ తర్వాత ఎన్నాల్టికో ఉప ఎన్నికలు జరిగాయి. పదిహేడు అసెంబ్లీ సీట్లతో పాటు చిరంజీవి రాజీనామాతో ఖాళీ అయిన తిరుపతి సీటు, కాంగ్రెస్ లోక సభ్యుడు మేకపాటి రాజమోహన రెడ్డి రాజీనామా వల్ల ఏర్పడ్డ లోక్ సభ స్థానానికి కూడా  ఎన్నికలు జరిగాయి. పద్దెనిమిది అసెంబ్లీ సీట్లలో పదిహేను వైసేపీ గెలుచుకుంది. రెండు కాంగ్రెస్, ఒకటి టీఆర్ఎస్ ఖాతాలో పడ్డాయి. లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో నిలబడ్డ  వైసీపీ  అభ్యర్ధి మేకపాటి రాజమోహన్ రెడ్డి, తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి  టి. సుబ్బరామిరెడ్డి పై  రెండు లక్షల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఉపఎన్నికల్లో అన్ని సీట్లుకోల్పోవడం  ఆ పార్టీ  భవిష్యత్ ఎలా ఉండబోతోంది అనేదానికి సంకేతంగా చెప్పుకున్నారు.  టీడీపికి ఆ ఉపఎన్నికలలో ఒక్క సీటు కూడా రాలేదు. కానీ తర్వాత  అదే టీడీపీ, రాష్ట్ర విభజన అనంతరం, 2014 లో నూతన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చింది.      

ఈ నేపధ్యాల నడుమ  తెలంగాణా  మాజీమంత్రి ఈటెల రాజేందర్ ఈ  ఉదయం ఇచ్చిన రాజీనామాను కొన్ని గంటల్లోనే స్పీకర్  పోచారం   శ్రీనివాసరెడ్డి ఆమోదించడం విశేషమే!    

(12-06-2021)   

కామెంట్‌లు లేవు: