17, జూన్ 2021, గురువారం

గుడిలో ఏముంది? – భండారు శ్రీనివాసరావు

గుడిలో దేవుడి విగ్రహం ఒక్కటే కళ్ళకు కనిపించేది. అంతకు మించి సామాజిక స్పృహ కలిగిన సూత్రం ఒకటి గుడిలో దాగి వుంది.

వెనుకటి కాలంలో అవిద్య, అనారోగ్యం, దారిద్యం తాండవిస్తున్న రోజుల్లో గుళ్ళల్లో పూజారులు మాత్రమే నాలుగు అక్షరం ముక్కలు తెలిసిన వాళ్లు. వూళ్ళో రోగం రొస్టు వస్తే వాళ్ళే దిక్కు. ఏదో కషాయాలు, చూర్ణాలతో వైద్యం చేసేవాళ్ళు. ఆరోజుల్లో జనాలకు అదే పెద్ద వూరట.
కష్టం,సుఖం చెప్పుకుని స్వాంతన పొందాలంటే పూజారులే జనాలకు ‘కౌన్సిలర్లు’’గా కానవచ్చేవారు. నాలుగు మంచిమాటలు చెప్పో , తెలియని దేవుడి పేరు చెప్పో, మానసికంగా అవసరమయిన స్వాంతన వారికి కలిగించేవారు.
ఇక, మనిషికి కావాల్సింది ఆహారం. దానికి మిక్కిలి కొరతగా వుండే ఆ రోజుల్లో గుళ్ళో పులిహారో, పాయసమో చేసి జనాలకు ప్రసాదంగా పంచేవారు. కూటికీ, గుడ్డకూ మొహం వాచిన ఆ రోజుల్లో అదే మహా ప్రసాదం.
వూళ్ళల్లో వయోవృద్దులకు, అభాగ్యులకు గుడి ప్రసాదమే మహా భాగ్యం. ఈ రోజుల్లో ప్రభుత్వాలు అలాటి పేద వృద్ధులకు నెలకు ఇంత అని డబ్బు చెల్లించి తమ బాధ్యత దులుపుకుంటున్నాయి. నా అనేవాళ్ళు ఎవ్వరూ లేని, వంటావార్పూ సొంతంగా చేసుకోలేని ఆ అభాగ్యులకు డబ్బు ఇస్తే ఏం ప్రయోజనం. వండి వార్చేవాళ్ళు లేని నిస్సహాయులకు గుడిలో లభించే పులిహారో, దద్దోజనమో మించింది ఏముంటుంది. ఆ రోజుల్లో గుళ్ళు ఈ సామాజిక బాధ్యతను గొప్పగా పోషించాయి. మరి ఇప్పుడో! ఓ పక్క పేదలకు ఉచితంగా పంచాల్సిన ప్రసాదాలను అమ్ముకుంటూ, మరో పక్క వీ.ఐ.పీ.ల సేవలో తరిస్తున్నాయి.
ఈరోజుల్లో చదువుకునే పిల్లలకు ప్రభుత్వాలు ఎంతో డబ్బు ఖర్చు చేసి మధ్యాహ్న భోజన పధకాలు అమలు చేస్తున్నాయి. పూర్వపు రోజుల్లో ప్రభుత్వాలపై భారం లేకుండా దేవాలయాలే ఈ పని చూసుకునేవి. నిలవవుండే పులిహోర, పోషకాలు సమృద్ధిగా వుండే దద్దోజనం, పాయసం వీటికి మించిన మధ్యాహ్న భోజనం ఏముంటుంది.
గుళ్ళు, గోపురాలు అంటే కేవలం ఆస్తికత్వానికి ప్రతిరూపం అనుకోకూడదు. వాటిని సరిగా వాడుకోగలిగితే, ఎన్నో సామాజిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ‘గుడిలో ఏముందీ’ అని వ్యంగ్యంగా పాటలు పాడుకునే అవసరం వుండదు.
అయితే, ప్రతిదీ రాజకీయమయమయిపోతున్న ఈ రోజుల్లో ఇది సాధ్యమా అంటే అనుమానమే.
ఇక్కడ గుడి అంటే దేవాలయం మాత్రమే కాదు, అది ఒక మసీదు కావచ్చు, ఒక చర్చి కావచ్చు, ఒక గురుద్వారా కావచ్చు. ఏదయినా అవి నెరవేర్చే సామాజిక బాధ్యత మాత్రం ఒక్కటే.

4 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

దేవాలయాల ప్రశస్తి బాగానే ఉంది కానీ గుళ్ళో ప్రసాదం అంటే ఏదో కాస్త విదులుస్తారు గానీ మరీ కడుపు నిండేటంత పెడతారాండీ?

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@విన్నకోట నరసింహారావు: నేను చెప్పింది పాత రోజుల మాట.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@ విన్నకోట నరసింహా రావు : "....పూర్వపు రోజుల్లో ప్రభుత్వాలపై భారం లేకుండా దేవాలయాలే ఈ పని చూసుకునేవి. నిలవవుండే పులిహోర, పోషకాలు సమృద్ధిగా వుండే దద్దోజనం, పాయసం వీటికి మించిన ...."

Chiru Dreams చెప్పారు...

పూర్వం ఆకలితో బాధపడిన వారు అంటరానివారే అనుకుంట. మరి వాళ్ళని, గుడిలోకి పిలిచి మరీ కడుపునిండా అన్నం పెట్టారంటే.. చరిత్ర తిరగ చదువుకుందాం.