11, జూన్ 2021, శుక్రవారం

ఆర్బీఐ గవర్నరుకు అప్పిచ్చిన ఆసామి - భండారు శ్రీనివాసరావు

 ఆర్బీఐ గవర్నరుగా పనిచేసిన వ్యక్తికి అప్పివ్వడం మామూలు వ్యవహారమా!

ఆర్వీవీ గారు నేను రేడియోలో చాలాకాలం కలిసి పనిచేసాము. ఆయనిప్పుడు బహుముఖ వ్యాపకాలు పెట్టుకుని నెగ్గుకు వస్తున్నారు. వాటిల్లో చాలావరకు ఆధ్యాత్మిక కార్యకలాపాలే. ఆయన చెప్పిన కధ కాని కధ ఇది.
సీనియర్ ఐ.ఏ.ఎస్. దువ్వూరి సుబ్బారావు గారి పేరు వినని వారుండరు. రిజర్వ్ బ్యాంక్ గవర్నరుగా చాలాకాలం పనిచేసారు. కానీ ఆయన్ని కొత్తవాళ్ళు ముఖతః చప్పున గుర్తు పట్టడం కష్టం. చేతిలో ఓ మామూలు సంచి పట్టుకుని రోడ్లమీద సాదా సీదాగా నడుచుకుంటూ వెడుతుంటారు. అప్పుడెప్పుడో జ్వాలా వాళ్ళ ఇంటికి సతీ సమేతంగా కలిసివచ్చినప్పుడు చూశాను, చాలా రోజుల తర్వాత. భార్య ఊర్మిళా సుబ్బారావు కూడా ఐఏఎస్సే. బెజవాడలో పనిచేసినప్పుడు మంచి పేరు తెచ్చుకున్నారు. అంచేతే కాబోలు ఆ ఊళ్ళో పేద ప్రజలు ఊర్మిళా నగర్ కట్టుకున్నారు. సుబ్బారావు గారి గురించి చెప్పేదే లేదు. ఆలిండియా ఐఏఎస్ టాపర్. కొన్ని దశాబ్దాల తరువాత కానీ మరో తెలుగు తేజం ముత్యాల రాజు ఐఏఎస్ టాపరుగా నిలిచేంతవరకు సుబ్బారావు గారి రికార్డు పదిలంగానే వుంది. ఆ రోజుల్లో కాంపిటీషన్ సక్సెస్ మేగజైన్ వాళ్ళు సుబ్బారావు గారి ఫోటోను కవర్ పేజీగా వేస్తె విచిత్రంగా చెప్పుకున్నారు.
సరే! విషయానికి వస్తాను. సుబ్బారావు గారు, భారత్ టుడే ఛానల్ చీఫ్ ఎడిటర్ జి. వల్లీశ్వర్ బాల్య స్నేహితులు. చిన్ననాటి స్నేహం కాబట్టి ఆయన్ని చూడడానికి సుబ్బారావు గారు అప్పుడప్పుడూ ఆ టీవీ ఆఫీసుకు వెడుతుంటారు. ఆ అలవాటు చొప్పునే కొన్నేళ్ళ క్రితం భారత్ టుడే కార్యాలయానికి వెళ్ళారు. ఆ సమయంలో స్టాఫ్ మీటింగులో వున్న వల్లీశ్వర్ ఆయన్ని కాసేపు కృష్ణారావు గారి గదిలో కూర్చోబెట్టి వెళ్ళారు. వారిద్దరూ మాట్లాడుతుండగానే పని పూర్తి చేసుకుని వల్లీశ్వర్ తిరిగి వచ్చారు. సుబ్బారావు గారు వల్లీశ్వర్ ని మొహమాట పడుతూ ఏదో అడుగుతుండడం ఆర్వీవీ కంటపడింది. విచారిస్తే విషయం తెలిసింది. సుబ్బారావు గారికి అర్జంటుగా ఇరవై వేలు అవసరమయ్యాయి. ఎన్ని ఏటీఎం లు తిరిగినా ‘నో క్యాష్’ బోర్డులు దర్శనమిచ్చాయి. బ్యాంకులకు కూడా సెలవు.
వల్లీశ్వర్ దగ్గర కూడా అంత డబ్బులేదు. కృష్ణారావు గారి వైపు చూశాడు. ఆయనకి విషయం అర్ధం అయింది. మూడు రోజుల క్రితం బ్యాంకు నుంచి డ్రా చేసిన పైకం వుంది. అది సుబ్బారావు గారి అక్కరకు పనికి వచ్చింది. మరునాడో, ఆ మర్నాడో సుబ్బారావు గారు ఆ బాకీ చెల్లువేశారు. అది అప్రస్తుతం.
ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఆయన దేశం మొత్తానికి కరెన్సీ సరఫరా చేసే ఆర్బీఐ కి అత్యున్నత అధికారిగా పనిచేసారు. పెద్ద నోట్ల రద్దు వ్యవహారం గురించి పార్లమెంటులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ దువ్వూరి సుబ్బారావు గారు రాసిన ఆంగ్లగ్రంధం లోని కొన్ని పేరాలను ఉటంకించారు. ఈ ఉదంతం చాలు ఆయన గొప్పతనం తెలుసుకోవడానికి.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కృష్ణారావు గారి దగ్గర డబ్బు తీసుకుంటున్నప్పుడు సుబ్బారావు గారు ఓ కోరిక కోరారు, అన్నీ అయిదువందల నోట్లు కాకుండా కొన్ని వంద నోట్లు కావాలని. ఆర్వీవీ ఆయనకు కొన్ని వంద నోట్లు కూడా ఇచ్చారు. వాటిల్లో కొన్నింటి మీద ఆర్బీఐ గవర్నర్ గా సుబ్బారావు గారు సంతకం చేసిన నోట్లు కూడా వున్నాయి.
ఉపశ్రుతి:
“మీరు ఎవరు? మీ సంతకం పోల్చి చెప్పడానికి ఈ బ్యాంకులో మీకు తెలిసిన ఖాతాదారులెవరయినా వున్నారా?”
కౌంటర్ లోని ఉద్యోగి అడిగిన ప్రశ్నకు భూతలింగం అనే పెద్ద మనిషికి ఏం జవాబు చెప్పాలో ఒక క్షణం తోచలేదు. కాసేపట్లో తేరుకుని ‘మీ దగ్గర రూపాయి నోటు ఉందా?’ అని కౌంటర్ లో ఉద్యోగిని అడిగాడు. నివ్వెరపోవడం ఇప్పుడు అతని వంతయింది, ‘తెలిసిన వాళ్ళు వున్నారా అంటే రూపాయి నోటు అడుగుతాడేమిటి చెప్మా’ అని.
ఇంతకీ అసలు విషయం ఏమిటంటే-
ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన తరువాత చెన్నై నగరానికి వచ్చి స్థిరపడ్డారు భూతలింగం అనే ఆ పెద్దమనిషి. ఆ వూరికి వచ్చిన కొత్తల్లో డ్రాఫ్ట్ మార్చుకోవడానికి బ్యాంకుకి వెడితే జరిగిన కధ అది.
భూతలింగం గారు ఉద్యోగ విరమణ చేయడానికి పూర్వం చేసిన ఉద్యోగం, కేంద్ర ప్రభుత్వంలో ఆర్ధిక శాఖ కార్యదర్శి. రిజర్వ్ బ్యాంకు ముద్రించే ప్రతి రూపాయి నోటు మీదా కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంతకం వుంటుంది.
అయన సంతకంతో వున్న రూపాయి నోట్లు చెలామణీలో వున్నాయి కాని, ఆయన సంతకాన్ని పోల్చి చెప్పడానికి ఆ భూతలింగం గారికి వేరేవారి సాయం కావాల్సివచ్చింది.
ఆయన డ్రాఫ్ట్ మార్చుకున్నారా లేదా ఇక్కడ అప్రస్తుతం. అంత పెద్ద ఉద్యోగం చేసిన భూతలింగం గారు, సాధారణ వ్యక్తిగా కౌంటర్ క్యూలో నిలబడి వ్యక్తిగత పనులు చక్కబెట్టుకోవడం అన్నది ఇక్కడ గమనంలో పెట్టుకోవాల్సిన విషయం.
ఈ విషయం స్టేట్ బాంక్ సీ జీ ఎం గా పనిచేసిన మా రెండో అన్నయ్య భండారు రామచంద్రరావు గారి ద్వారా తెలిసింది.

కామెంట్‌లు లేవు: