25, జూన్ 2021, శుక్రవారం

ఎమర్జెన్సీ గుణపాఠాలు - భండారు శ్రీనివాసరావు

 (ఈరోజు ఆంధ్ర ప్రభ దినపత్రికలో ప్రచురితం)

1975 జూన్ 25
దేశంలో ఎమర్జెన్సీ విధించిన చీకటి రోజది.
బెజవాడ ఆంధ్రజ్యోతిలో చేరి అప్పటికి నాలుగేళ్ళు గడిచాయి. వున్నట్టుండి 'ఎమర్జెన్సీ' అనే కొత్త పదం పత్రికాపారిభాషిక పదకోశంలో చేరింది. ఇంగ్లీష్ పత్రికలకు పరవాలేదు. తెలుగులో ఏమి రాయాలి. కొన్ని తెలుగు దినపత్రికలు 'అత్యవసర పరిస్తితి' అని అనువాదం చేసాయి. కానీ ఆంధ్రజ్యోతి ఎడిటర్ నార్ల వేంకటేశ్వర రావు గారిది ప్రత్యేక బాణీ. అందుకే ఆయన, అ కు దీర్ఘం పెట్టి, 'ఆత్యయిక పరిస్తితి' అని నామకరణం చేశారు.
జరిగి నలభయ్ ఆరేడేళ్ళయినా ఇంకా ఆనాటి జ్ఞాపకాలు మనసులో పదిలంగానే వున్నాయి.
ఆనాటి రాజకీయ పరిణామాల నేపధ్యంలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో అత్యవసర పరిస్తితి విధించాలని నిర్ణయించారు. కేంద్ర మంత్రిమండలి జూన్ ఇరవై ఐదో తేదీ రాత్రి అత్యవసరంగా సమావేశమై ఎమర్జెన్సీ విధిస్తూ తీర్మానించింది. మంత్రివర్గ తీర్మానానికి అనుగుణంగా రూపొందించిన ఆర్డినెన్స్ పై నాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ జూన్ ఇరవై అయిదు అర్ధరాత్రి అంటే మరి కాసేపట్లో ఇరవై ఆరో తేదీ ప్రవేశించే ఘడియకు కొన్ని నిమిషాల ముందు దానిపై సంతకం చేశారు. ఆ రోజుల్లో ఇప్పటిలా టీవీ ఛానల్లు లేవు. 'ఆకస్మిక సమాచారం' లేదా 'ఇప్పుడే అందిన వార్త' తెలుసుకోవాలన్నా, వినాలన్నా రేడియో ఒక్కటే దిక్కు. అంచేత ఆ అర్ధరాత్రి నిర్ణయం గురించి మరునాడు ఉదయం ఆరుగంటలకు ప్రసారం అయ్యే రేడియో ఇంగ్లీష్ వార్తల్లో కాని యావత్ దేశానికి తెలియని పరిస్తితి. మరునాడు పత్రికలన్నింటిలో 'ఎమర్జెన్సీ' అనేదే పతాక శీర్షిక. బెజవాడలో చాలామంది మిలిటరీ ప్రభుత్వం వచ్చిందని అనుకున్నారు కూడా.
దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులను వేల సంఖ్యలో అరెస్టు చేసి జైళ్ళలో పెట్టారు. పత్రికా వార్తలపై సెన్సార్ షిప్ విధించారు. పత్రికల సెన్సార్ షిప్ అంటే ఏమిటో అప్పటిదాకా పత్రికలకీ తెలియదు. అధికారులకీ తెలియదు. ఆ రోజుల్లో పత్రికలకి ప్రత్యేకించి తెలుగు దినపత్రికలకి నేటి మాదిరిగా అధునాతన ముద్రణాయంత్రాలు లేవు. ప్రతి అక్షరం ఏర్చి కూర్చి అచ్చుకు పంపాల్సిన రోజులు. కృష్ణా జిల్లా కలెక్టర్ గారి పనుపున ఆనాటి సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అయిన మా పెద్దన్నయ్య భండారు పర్వతాలరావు సెన్సార్ పనులు పర్యవేక్షించేవారు. ఏవార్త పత్రికలో ముద్రించాలి ఏది రాకూడదు అని ఆయనే నిర్ణయించేవారు. ఆ అధికారి కార్యాలయం గాంధీ నగర్ లో వుండేది. ఆంధ్రజ్యోతి ఆఫీసు లబ్బీపేటలో. ప్రతిరోజూ సాయంత్రం ప్రచురించే వార్తల్ని అచ్చులో కూర్చి అక్కడికి పట్టుకెళ్ళేవాళ్లు. కొన్నాళ్ళ తరువాత ఏది వేయాలో ఏది వేయకూడదో పత్రికలకే అలవాటు కావడంతో రోజూ తీసికెళ్ళే శ్రమ తగ్గిపోయింది. ఈలోపల ఇండియన్ ఎక్స్ ప్రెస్ అందరికీ ఓ దోవ చూపింది. వాళ్లు సంపాదకీయం ప్రచురించే జాగాను ఖాళీగా ఒదిలేయడం మొదలెట్టారు. దాంతో మిగిలిన వాళ్లు అందిపుచ్చుకుని సెన్సార్ అయిన వార్తల జాగాను ఖాళీగా తెల్లగా కనబడేట్టు ఒదిలేసి పత్రికలు ప్రచురించడం ప్రారంభించారు. ఈ నిరసన సులభంగానే ప్రజల్లోకి చేరింది. పత్రికలపై సెన్సార్ షిప్ గురించి జనం మాట్లాడుకోవడం మొదలెట్టారు. ఇదో కధ.
మరో వైపు ఎమర్జెన్సీ దమన కాండ ఉత్తర భారతంలో అమలు జరుగుతున్న తీరు గురించి పుంఖానుపుంఖాలుగా వదంతులు వ్యాపించేవి. దక్షిణ భారతంలో ప్రత్యేకించి కాంగ్రెస్ పాలనలో వున్న ఆంధ్ర ప్రదేశ్, కర్నాటకల్లో పరిస్తితి కొంత మెరుగు. ఈ రాష్ట్రాల్లో కూడా రాజకీయ అరెస్టులు బాగానే జరిగాయి. కానీ ఉత్తర భారతంలో మాదిరిగా నిర్బంధ కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు, ఇళ్ళ కూల్చి వేతలు జరగలేదు. పైపెచ్చు, ప్రజానీకంలో ముఖ్యంగా బీదాబిక్కీకి అసలీ గొడవే పట్టలేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం అడగడానికీ, తీసుకోవడానికీ భయపడిపోయేవాళ్ళు. ఫైళ్ళు చకచకా కదిలేవి. తెల్లవారుతూనే రోడ్లు శుభ్రంగా వూడ్చేవాళ్ళు. రోడ్డుపక్కన మూత్రవిసర్జన అనేది కలికానికి కూడా కానరాకుండా పోయింది. ఎమర్జెన్సీ బాగా వుందని కూడా జనం అనుకోవడం ప్రారంభించారు. మొదట్లో ధరవరలు కూడా ఆకాశం నుంచి దిగివచ్చాయి. బ్లాకు మార్కెట్ మాయమయింది.
అయితే ఏ భయం అన్నా కొన్నాళ్ళే అని తర్వాత తేలిపోయింది. జనంలో అంతకు ముందు వున్న బెరుకు పోయింది. అధికారుల్లో అది అంతకు ముందే పోయింది. దాంతో కధ మళ్ళీ మొదటికి వచ్చింది. ఇదో కధ. ఒదిలేద్దాం.
అసలీ ఎమర్జెన్సీ ఏమిటి? ఏమిటి దీని కదాకమామిషు అని ప్రశ్నించుకుంటే-
భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి నాటి సోవియట్ యూనియన్ తాష్కెంట్ లో గుండెపోటుతో ఆకస్మికంగా మరణించడంతో నెహ్రూ ఏకైక కుమార్తె ఇందిరాగాంధి ఆయన స్తానంలో ప్రధాని బాధ్యతలు స్వీకరించారు. మొరార్జీ దేశాయ్ వంటి కాకలు తీరిన కాంగ్రెస్ అగ్ర నాయకులు ఇష్టం లేకపోయినా ఆమె కింద పనిచేయాల్సిన పరిస్తితి. 1969 లో కాంగ్రెస్ పార్టీ నిట్టనిలువుగా చీలిపోయింది. అయినా శ్రీమతి గాంధి తనదే పైచేయి అనిపించుకుంది.
1971 మార్చిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరాగాంధి ప్రజల్లోకి ఒదిలిన 'గరీభీ హఠావో' నినాదం పాశుపతాస్త్రం మాదిరిగా పనిచేసి ఆమె నాయకత్వం లోని కాంగ్రెస్ (ఆర్) కు అఖండ విజయాన్ని కట్టబెట్టింది. మొత్తం లోకసభలోని 518 సీట్లలో 352 సీట్లు గెలుచుకుని రికార్డు సృష్టించారు. ఆ తదుపరి అదే ఏడు డిసెంబరులో బంగ్లాదేశ్ (తూర్పు పాకిస్తాన్) విమోచన యుద్ధంలో సాధించిన అపూర్వ విజయం కూడా ఆమె ఖాతాలోకే చేరింది. అనంతరం ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి ప్రభలు యావత్ విశ్వంలో మిన్నంటాయి. అపర కాళికగా ఆమెను దేశంలో జనం కీర్తించడం మొదలెట్టారు. దానితో అధికారం మొత్తం తన చెప్పుచేతల్లోకి తీసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తనకు అడ్డువచ్చే కాంగ్రెస్ శక్తుల్ని అడ్డు తొలగించుకోవడం కూడా ఇందిరా గాంధి వ్యూహాల్లో భాగం. ప్రధానికి ప్రిన్సిపల్ సెక్రెటరీ గా వున్న పీ.ఎన్. హక్సర్ తోడుగా నిలిచారు. అంతవరకూ ప్రభుత్వాధికారులకి రాజకీయనాయకుల పట్ల ప్రత్యేకించి వ్యక్తిగత అభిమానాలు వుండేవి కావు. హక్సర్ ఆ సంస్కృతికి మంగళం పాడి ఇందిరాగాంధీకి వ్యక్తిగతంగా విధేయులుగా వుండే అధికారులని ఎంపిక చేసి ప్రోత్సహించడం మొదలు పెట్టారు. ఆ విష సంస్కృతి ఈనాడు వేళ్ళూనుకుని పోయి, అడిగింది చేయించుకునే రాజకీయనాయకులు, వాళ్లకు చెప్పింది చేసిపెట్టే అదికారగణం కింద మారిపోయి మొత్తం వ్యవస్థ భ్రష్టుపట్టిపోయింది. దీనికి బీజాలు వేసింది హక్సర్ మహాశయులు.
అధికారం చెడగొడుతుంది. అపరిమితమైన అధికారం తిరిగి బాగుచేయలేనంతగా చెడగొడుతుంది. ఇందిరా గాంధి విషయంలో అదే జరిగింది. 'ఇందిరా అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిర' అంటూ నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు బారువా పొగిడే స్థాయికి భజన బృందాలు ఎదిగిపోయాయి. దీనికి మొదటి అడ్డుకట్ట రాజ్ నారాయణ్ అనే సోషలిష్టు నేత రూపంలో పడింది. ఇందిరపై పోటీ చేసి ఓడిపోయిన ఆ పెద్దమనిషి ఆ ఎన్నిక చెల్లదంటూ కోర్టులో కేసు వేసాడు. అధికార దుర్వినియోగం చేసి ఇందిర గెలిచిందని ఆయన వాదన. ఇప్పుడు ప్రముఖ న్యాయవాదిగా వున్న శాంతి భూషణ్ అప్పుడు రాజ్ నారాయణ్ తరపున వకాల్తా పుచ్చుకున్నారు. ఇందిరాగాంధీ ఎన్నికల సభలకు పోలీసులు వేదికలు నిర్మించారనీ, యశ్ పాల్ కపూర్ అనే ప్రభుత్వ ఉద్యోగి సేవలను ప్రధాని ఎన్నికల సమయంలో వాడుకున్నారని అభియోగాలు మోపారు. ఇప్పుడు రాజకీయ నాయకుల మీద వస్తున్న ఆరోపణలతో పోలిస్తే ఇవి ఏపాటి. కానీ, తాడే పామై కరుస్తుందంటారు కదా! ఈ అభియోగాలనే ఆనాటి అలహాబాదు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జగ్ మోహన్ సిన్హా నమ్మారు. 1975 జూన్ 12 వతేదీన చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారు. ఇందిరా గాంధి ఎన్నిక చెల్లదని కొట్టివేశారు. ఆ స్థానం ఖాళీ అయినట్టు ప్రకటించారు. అంతే కాదు ఆరేళ్ళ పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇందిరాగాంధీపై నిషేధపు వేటు వేసారు. ఇంత పెద్ద శిక్ష వేయడానికి చూపిన కారణాలు వివాదాస్పదం అయ్యాయి. 'ట్రాఫిక్ నిబంధన ఉల్లఘించిన చిన్న తప్పుకు ప్రధానిని పదవి నుంచి తొలగించినట్టుగా ఈ తీర్పు వుంద'ని 'ది టైమ్స్' పత్రిక ఎద్దేవా చేసింది.
ఇందిరా గాంధీ హయాములో ఎమర్జెన్సీ అమలు జరిగిన తీరు, దానివల్ల కలిగిన లాభాలను ఆమె అనుయాయులు నోరారా పొగిడారు. అందులో ఆశ్చర్యం లేదు. కానీ వినోబా భావే అంతటి మహనీయుడు ఎమర్జెన్సీ కాలాన్ని అనుశాసన పర్వంగా అభివర్ణించడం మామూలు విషయం కాదు.
కోర్టు తీర్పు రాజకీయ తుపాను సృష్టించింది. లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ నేతృత్వంలో యావత్ పతిపక్ష నాయకులందరూ ఇందిర రాజీనామా చేయాలని పట్టుబట్టారు. వారికి మద్దతుగా విద్యార్ధులు ఆందోళనలతో వీధుల్లోకి దిగారు.
అలహాబాదు హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ప్రధాని ఇందిర సుప్రీం కోర్టు తలుపు తట్టారు. అక్కడా ఆమెకు చుక్కెదురయింది. కేసు విచారించిన జస్టిస్ వీ.ఆర్. కృష్ణయ్యర్, జూన్ ఇరవై నాలుగున కింది కోర్టు తీర్పును సమర్ధిస్తూ ఉత్తర్వులు ఇవ్వడంతో ఇందిరాగాంధీకి అన్ని దారులూ మూసుకుపోయాయి. కృష్ణయ్యర్ తీర్పు మరింత ఘాటుగా వుంది. ఒక పార్లమెంటు సభ్యురాలిగా ఇందిరాగాంధీ అనుభవిస్తున్న అన్ని ప్రత్యేక సౌకర్యాలను రద్దుచేసారు. అంతే కాదు ఎన్నికల్లో ఓటు చేసే హక్కును కూడా తొలగించారు. అయితే విచిత్రంగా ప్రధాని పదవిలో కొనసాగడానికి న్యాయమూర్తి ఆమెను అనుమతించారు.
మరునాడు జయప్రకాష్ నారాయణ్ ఢిల్లీలో పెద్ద ర్యాలీ నిర్వహించారు. 'ఏ పోలీసు అధికారి కూడా ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను శిరసావహించరాద'ని పిలుపు ఇచ్చారు.
ఆ తరువాత ఇందిరాగాంధీ తన నమ్మకస్తులతో సమావేశమై చక చకా పావులు కదిపారు. రాష్ట్రపతిని ఎమర్జెన్సీ విధింపు విషయంలో సంప్రదించారు. ఈ విషయాన్ని తన మంత్రివర్గ సహచరులకు తెలియచేసారు. వారి ఆమోదాన్ని మరునాడు లాంఛనంగా తీసుకున్నారు. ఎమర్జెన్సీ ముసాయిదాను సిద్ధార్ద్ శంకర్ రాయ్ తయారు చేశారు. అర్ధరాత్రి రాష్ట్రపతి ఆమోదం కోసం రాష్ట్రపతి భవన్ కు పంపారు. పన్నెండు గంటలు కొట్టడానికి కొన్ని నిమిషాలు ముందు ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ దానిపై సంతకం చేశారు. అంతకు ముందు మధ్యాన్నం ఢిల్లీలోని పత్రికా కార్యాలయాలకు కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తల అరెస్టుకు ఆదేశాలు వెళ్ళాయి.
ఎమర్జెన్సీ ప్రకటనతో రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన కొన్ని ప్రాధమిక హక్కులకు భంగం వాటిల్లింది. పత్రికలపై సెన్సార్ షిప్ విధించారు. కేవలం కార్టూన్లతో పత్రిక నడుపుతూ జవహర్ లాల్ నెహ్రూ మన్ననలు పొందిన ప్రముఖ కార్టూనిష్ట్ శంకర్, ప్రభుత్వ అనుకూల కార్టూన్లు వేయలేనని ప్రకటించి 'శంకర్స్ వీక్లీ' అనే పేరుతొ వెలువడుతున్న తన పత్రిక ప్రచురణను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు.
ఇక ఎమర్జెన్సీ కాలంలో ప్రభుత్వపరంగా సాగిన దాష్టీకం ఉత్తర భారతానికి పరిమితమయింది. దక్షిణ భారతంలో దాని ప్రభావం స్వల్పమేనని చెప్పాలి. ప్రధాని రెండో కుమారుడు సంజయ్ గాంధీ ఆ కాలంలో రాజ్యాంగేతర శక్తిగా భాసిల్లాడు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులందరూ ఆయన ఆదేశాలకోసం మోకరిల్లేవారని రకరకాల వదంతులు షికారు చేసేవి.
మనదేశం స్వాతంత్రం పొందిన తరువాత మూడు ఎమర్జెన్సీ దశలను చవిచూసింది.1962 అక్టోబర్ 26 నుంచి 1968 జనవరి 10 వరకు భారత్ చైనాల నడుమ చెలరేగిన యుద్ధం కారణంగా ఎమర్జెన్సీ విధించారు. అలాగే, 1971 డిసెంబర్ 3 నుంచి 1977 మార్చి 21 వరకు ఇండో పాక్ యుద్ధం సందర్భంగా విదేశీ దురాక్రమణ బెదిరింపు కారణంగా. అయితే ఇక మూడోసారి ఇందిరాగాంధి హయాములో దేశ భద్రతను, ఆంతరంగిక కల్లోలాలను బూచిగాచూపించి 1975 జూన్ 25 నుంచి 1977 మార్చి 21 వరకు విధించింది ఆంతరంగిక ఎమర్జెన్సీ. మొదటి రెండూ అంతగా ప్రాచుర్యం పొందలేదు. రాజకీయం ఇమిడి వుండడంవల్ల మూడోది బాగా ప్రచారం పొందింది.
ఎమర్జెన్సీ పేరుతొ ఇందిరాగాంధీ తాత్కాలికంగా కొన్నాళ్ళు అధికారంలో కొనసాగి వుండవచ్చు కాని, అంతకు పూర్వం ఆమె సంపాదించుకున్న పేరు ప్రతిష్టలన్నీ మసకబారాయి. తెలివిన పడిన తరువాత ఆమె ఎమర్జెన్సీ ఎత్తి వేసారు. ప్రజాస్వామ్యబద్ధంగా సార్వత్రిక ఎన్నికలకు పచ్చ జెండా చూపారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇందిరను ఓడించడానికి పార్టీలన్నీ ఏకమై, ఒకే పేరుతొ, ఒకే ఎన్నికల గుర్తుతో బరిలోకి దిగాయి. జనత పార్టీ రూపంలో పెల్లుబికిన జనాభిప్రాయం ఇందిరకు ఘోర పరాజయాన్ని కట్టబెట్టింది. స్వయంకృతం అంటారే దానికి ఇది మంచి ఉదాహరణ.
ఇక ఇందిరను ఓడించి అధికారానికి వచ్చిన జనత పార్టీ, మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా, స్వాతంత్ర్యానంతరం మొట్టమొదటి కాంగ్రెసేతర కేంద్ర ప్రభుత్వం ఏర్పడింది. రాజకీయ విలువలకూ, విలువల రాహిత్యానికీ నడుమ సాగిన పోరాటంలో విలువల్ని నిలువు పాతర వేసారు. జయప్రకాష్ నారాయణ్ కలలు కన్న సంపూర్ణ విప్లవం వాస్తవ రూపం ధరించకుండానే 'జనత ప్రయోగం' విఫలం అయింది. రాజకీయ స్వలాభాలకోసం చేతులు కలిపిన వివిధ పార్టీలన్నీ అవే చేతులతో కత్తులు దూసుకోవడానికి ఎక్కువ కాలం పట్టలేదు. ఫలితం రాజకీయంగా పూర్తిగా మసకబారిన ఇందిరాగాంధీకి రాజకీయ పునర్జన్మ లభించింది. ముక్కలు చెక్కలయిన జనతా పార్టీని ఆ తరువాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మట్టి కరిపించారు. స్వయంకృతానికి ఇది మరో మంచి ఉదాహరణ.
ఏ ప్రజలైతే తిరస్కరించారో, వారే తిరిగి ఇందిరాగాంధీకి అధికారం అప్పగించారు. ప్రధాని అయిన తరువాత ఇందిరాగాంధీలో మునుపటి తెంపరితనం తగ్గిపోయింది. కర్కశ రాజకీయం కూడా ఆమెలో కానరాకుండా పోయింది. ప్రతీకార రాజకీయాలకు స్వస్తి చెప్పారు. ఆమె దురదృష్టం. పదవిలో పూర్తికాలం గడపక ముందే అంగరక్షకుల తుపాకీ తూటాలకు బలి అయిపోయారు. ఆవిధంగా భారత రాజకీయాలను తనదయిన రీతిలో ప్రభావితం చేసిన ఇందిరాగాంధీ, తన జీవితకాలంలోనే అనేక ఎగుడుదిగుళ్ళను కళ్ళారా చూసి కన్ను మూశారు.
ఈనాటి రాజకీయ నాయకులు ఎమర్జెన్సీ నుంచి, ఇందిరాగాంధీ అనుభవాలనుంచి, జనత ప్రయోగం నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో వుంది. ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందని విర్రవీగే వాళ్ళకు గుణపాఠం. అధికారం ఎప్పటికీ శాశ్వితం అనుకునే వాళ్లకు నీతిపాఠం.

ప్రజలు కొందర్ని కొన్నాళ్ళు నమ్ముతారు. అందర్నీ ఎల్లకాలం నమ్మరు.

కామెంట్‌లు లేవు: