21, జూన్ 2021, సోమవారం

అర్ధరాత్రి సూర్యుడు - భండారు శ్రీనివాసరావు

ఈ రోజు జూన్ ఇరవై ఒకటి ‘సుదీర్ఘ దినం’ (పగటి సమయం సాధారణంగా కంటే ఎక్కువగా వుండడం).
నాకు మా మాస్కో రోజుల్లోని ఓ అనుభవం గుర్తుకు వచ్చింది.
కమ్యూనిష్టుల ఏలుబడిలో లెనిన్ గ్రాడ్ గా పేరు మార్చుకున్న ఆ రష్యన్ నగరం మళ్ళీ తొంభయ్యవ దశకం మొదట్లో సెంట్ పీటర్స్ బర్గ్ గా తన పూర్వ నామాన్ని ధరించింది.
మార్చి మొదటి వారం నుంచి జులై చివరి వరకు దాదాపు ఎనభయి రోజులు అనుకుంటాను ఆ నగరంలో ‘శ్వేత రాత్రులు’ పేరిట ఉత్సవాలు జరుగుతాయి. ప్రపంచం నలుమూల నుంచి పర్యాటకులు అక్కడికి చేరుకుంటారు. ఆ విశేషం ఏమిటంటే అన్ని రోజులూ అక్కడ పగలూ, రాత్రీ ఇరవై నాలుగు గంటలు పట్టపగలే. చీకటి పడదు. అర్ధరాత్రి కూడా నడి బజార్లో నిలుచుని పుస్తకాలు చదువుకోవచ్చు. అందుకే వీటిని వాళ్ళు ‘శ్వేత రాత్రులు’ అని ముద్దుగా పిలుచుకుంటారు.
వైట్ నైట్స్ చూడడానికి వచ్చే పర్యాటకులతో ఇప్పుడా నగరం మూడు బార్లు, ఆరు హోటళ్ళ చందంగా వెలిగిపోతోంది(ట)
కింది ఫోటో: ఒకనాటి లెనిన్ గ్రాడ్ లో ముసలి గుర్రం మీద ఓ వయసు కుర్రోడు. అంటే నేనే. ముప్పయ్యేళ్ళ క్రితం నేను పడుచువాడినే కదా!



కామెంట్‌లు లేవు: