14, జనవరి 2019, సోమవారం

తొందరపడ్డదాన్ని కాదు (కధానిక) – భండారు శ్రీనివాసరావు


ఆదివారం. లిఫ్ట్ అలుపూ సొలుపూ లేకుండా పైకీ కిందికీ తిరుగుతోంది. చిన్నా పెద్దా సామాన్లు ఖాలేగా ఉన్న  మా పక్క పోర్షన్ లోకి చేరుతున్నాయి. నలుగురు పనివాళ్ళు పెద్ద పెద్ద టీవీలను , మంచాలను, అరమరాలను మెట్ల మీదుగా తెస్తున్నారు. సాయంత్రానికల్లా ఇల్లు పట్టనంత సామానును ఇంట్లో అమర్చిపోయారు. తీరా చూస్తే ఒక వయసుమళ్ళినావిడ, రిటైర్ అయిన మొగుడు.
వుండేది ఇద్దరే. పిల్లలు అమెరికాలో వుంటారట. ఇరవై నాలుగ్గంటలు వుండే పనిమనిషి, వంటకు ఇంకో మనిషి. పెద్ద టీవీలు ఉన్నాయన్న మాటే కానీ ఆవిడ ఎప్పుడూ పూజాపునస్కారాలతోటో, రామకోటి రాస్తూనో వుండేది. ఇక ఆయన పొద్దున్న ఇంగ్లీష్ పేపర్లో తలదూరిస్తే మళ్ళీ మధ్యాన్న భోజనం వరకు ఆ  వార్తలే ఆయనగారికి భోజనం అన్నట్టుగా వుంటారు.
వంట మనిషి రోజూ ఆరున్నొక్క తీరుగా రకరకాల చిరుతిండ్లు చేసిపెడుతుంటుంది. కానీ ఏనాడూ ఆవిడ నోరు తెరిచి ‘ఈ మిఠాయి ఉండ నోట్లో వేసుకుని చెప్పమ్మా మరదలా’ అంటుందేమో అని చాలా రోజులుగా అనుకుంటూ వుండేదాన్ని. కానీ ఏనాడూ ఆమె నోటంట ఈ మాట రాలేదు. దాంతో నేనే  కావాలని మా ఇంట్లో చేసిన వాటిని తీసుకుపోయి ఇస్తుండేదాన్ని. తిని తెగ మెచ్చుకునేది. ‘నీ చేతితో ఏం చేసినా అమృతం సుమా’ అనేది.
సంక్రాంతి వచ్చింది. ‘చూడు మరదలా! రేపు నువ్వూ తమ్ముడూ మా ఇంటికి భోజనానికి రావాలి. మరచిపోవద్దు’ అంటే ఆశ్చర్యపోయాను.
పండగనాడు రకరకాల వంటకాలు వడ్డించింది. స్విగ్గీ నుంచి ఆర్డర్ చేసిఉండొచ్చు అనుకున్నా.
‘ఏదీ మీ వంటమ్మాయి కనిపించడం లేదు’ అన్నాను అటూ ఇటూ చూస్తూ ఆవిడ ఇచ్చిన తాంబూలం నోట్లో వేసుకుంటూ.
‘పండక్కి వాళ్ళ ఊరుకు వెళ్ళింది. రేపు సాయంత్రం వస్తుంది. ఇన్నాళ్ళు ఆమె చేసి పెడితే మేము తింటున్నాము. ఇరుగూ పొరుగును పిలిచి ఆమె మీద భారం వేయడం ఎందుకని ఊరుకున్నాను. ఇదిగో! ఈరోజు  ఇవన్నీ నా చేత్తో చేసినవే. ఎలా వున్నాయో చెప్పు. వంటింట్లోకి పోయి చాలా కాలం అయింది. ఇది తెలిస్తే మా పిల్లలు ఊరుకోరు’
ఏం చెప్పను?
ఆవిడ వయసే కాదు, మనసుకూడా పెద్దది.          

7 కామెంట్‌లు:

Kishore చెప్పారు...

small, simple and sweet.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

మీరు కథకులు కూడానా !!

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@విన్నకోట నరసింహారావు : "మీడియా, రాజకీయాలు, మరెన్నో...." కధానికలు గట్రా ఈ 'మరెన్నో' బాపతు.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

అలా అంటారా? etc లాగా అన్నమాట. అలాక్కానివ్వండి 🙂.
కథానిక బాగుంది. కథలో పక్కింటి పెద్దావిడ చాలా gracious గా ప్రవర్తించారు 👌.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

అన్నట్లు “మాలిక” సంకలినిలో మీ బ్లాగ్ పోస్ట్ లు కనబడతాయి గానీ పోస్ట్ ల క్రింద వచ్చిన వ్యాఖ్యలు కనబడడం లేదు. సెట్టింగులేమన్నా సరిచేయాలా?

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@విన్నకోట నరసింహారావు: తెలియదండీ. సెట్టింగ్స్ అవీ మార్చడం. మీరే ఏదైనా సలహా చెప్పాలి.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ఇటీవల వరకు వ్యాఖ్యలు కూడా కనబడేవి. ఈమధ్యే మొహం చాటెయ్యడం మొదలెట్టాయి. కాబట్టి "మాలిక" వారికి మెయిల్ ఇచ్చి చూడండి.