19, జనవరి 2019, శనివారం

ఏపీలో రాజకీయ భోగిమంటలు – భండారు శ్రీనివాసరావు


(Published in SURYA telugu daily on 20-01-2019, SUNDAY)
రాజకీయ నాయకులు ఒకరినొకరు కలుసుకోవడం విడ్డూరమేమీ కాదు. ఉత్తర ధృవం, దక్షిణ ధృవం వంటి నేతలు కలుసుకున్నా, ఎదురుపడ్డా, పలకరించుకున్నా మీడియాకు అది వార్తే. అదే వారిద్దరూ  ఒకటవుతున్నారు, కలిసిపోవాలని అనుకుంటున్నారు అన్నప్పుడు అది సంచలన వార్త కూడా అవుతుంది.
ఎక్కడి ఉదాహరణలో ఎందుకు? తెలుగు రాష్ట్రాల సంగతే చూద్దాం.
తెలంగాణా ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు, ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్నేళ్ళ క్రితం రాజ భవన్ లో గవర్నర్ ఇచ్చిన తేనీటి విందుకు హాజరయ్యారు. ఇదే వార్త సంచలనం అయికూర్చుంది. రోజల్లా మీడియాలో గిరికీలు కొట్టింది. ముందు ఎవరు ఎవర్ని పలకరించారు? కరచాలనం చేయడానికి ముందు ఎవరు చేయి చాపారు? ఏమి మాట్లాడుకున్నారు? ఇలా సాగిపోయాయి వార్తాకధనాలు. ఇందులో తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. ప్రజల్లో పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తులు, వాళ్ళు సినిమా రంగానికి చెందినవాళ్ళు కావచ్చు, రాజకీయ రంగానికి చెందినవాళ్ళు కావచ్చు, వాళ్ళ ప్రతి కదలిక మీదా మీడియా కన్ను వుంటుంది. అందుకు సంబంధించిన మీడియా కధనాలపై ప్రజలకు ఆసక్తి వుంటుంది. ఈ కధనాలను వండి వార్చడంలో కొన్ని ఉత్ప్రేక్షాలంకారాలు దొర్లినా అవి ఆ వార్తలకు కొత్త సొగసు అద్దుతాయి తప్పిస్తే సమాజానికి జరిగే హాని ఏమీ వుండదు.
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు వుండరు అనే సామెతను రాజకీయ నాయకులే పదేపదే ప్రస్తావిస్తూ పార్టీల కలయికలు, విడిపోవడాలు అత్యంత సహజం అనే  నిర్ధారణకు జనం వచ్చేలా వారివంతు వారి ప్రయత్నం చేస్తూనే వున్నారు. అంచేత రాజకీయాల్లో శత్రువులు, మిత్రులు అంటూ విడిగా వుండరు, రాజకీయాలు చేసే వాళ్ళే రాజకీయాల్లో వుంటారనే అభిప్రాయం ప్రజల్లో కూడా బలపడి పోయి పార్టీల కలయికలు, విడిపోవడాలు ఇవన్నీ ఆటలో అరటిపండు అనే రీతిలో  తేలిగ్గా తీసుకునే పరిస్తితి ఏర్పడింది.
ఈ నేపధ్యంలో, మొన్నీమధ్య తెలంగాణా రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షులు, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కే. తారకరామారావు కొందరు పార్టీ ముఖ్యులను వెంటబెట్టుకుని హైదరాబాదులోని వైసీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహనరెడ్డి నివాసానికి వెళ్లి గంటల తరబడి చర్చలు జరిపారు. ఇదేమీ రహస్యంగా జరిగింది కాదు. ఈ భేటీ గురించి అంతకు ముందు రోజు నుంచీ మీడియాలో వార్తలు వస్తూనే వున్నాయి. ఈ పార్టీల నేపధ్యం గమనంలో పెట్టుకుని చూస్తే ఖచ్చితంగా  ఈ సమావేశం మీడియా దృష్టిలో ఒక సంచలన సమాచారమే. ఈ రెండు పార్టీలు తమ ఆవిర్భావం నుంచి విభిన్న ద్రువాలే. తెలంగాణా సాధన కోసం టీఆర్ఎస్  పుష్కర కాలంగా సాగించిన  ఉద్యమం తుది దశకు చేరుకున్న సమయంలో పురుడు పోసుకున్న వై.ఎస్.ఆర్.సి.పీ. సమైక్య రాష్ట్ర నినాదాన్నే ఆదినుంచీ అందుకుంది. ఆ రకంగా ఈ రెండు పార్టీలకు పొసగడం అనేది గగన కుసుమం అని తీర్మానించుకున్న రోజులు కూడా వున్నాయి.
ఇదిగో ఈ నేపధ్యంలో జరిగిన భేటీ కాబట్టే అటు మీడియా కన్ను, రాజకీయుల దృష్టి దీనివైపు మళ్ళింది.
ఈ ఇద్దరూ రహస్య సమాలోచనలు చేసినట్టు లేదు. ఈ సమావేశంలో రెండు పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు కూడా పాల్గొన్నారు. భేటీ ముగిసిన తర్వాత ఇద్దరు నాయకులు మీడియాను కలిసి చర్చల సారాంశం చెప్పారు.
జగన్ సమక్షంలోనే విలేకరులతో ముందు కేటీఆర్ మాట్లాడారు. ఉన్న విషయం చెప్పారు. టీఆర్ఎస్ అధినేత ఆదేశాల ప్రకారం తానూ జగన్ మోహన రెడ్డిని కలుసుకున్నానని వెల్లడించారు. జాతీయ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు తీసుకురావడానికి  ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు గురించి  చాలారోజులుగా కేసీఆర్ ఆలోచిస్తూవస్తున్నారని, దానికి మద్దతు కోరడానికి జగన్ మోహన రెడ్డిని కలుసుకోవడం జరిగిందని  మదిలో కదలాడుతున్న ఫెడరల్ ఫ్రంట్ గురించి చర్చించామని వివరించారు. భావసారూప్యత కలిగిన  ప్రాంతీయ పార్టీల నడుమ సఖ్యతను పెంపొందించి వాటి బలాన్ని పెంచేలా చేయడం, తద్వారా ఆయా ప్రాంతీయ ప్రయోజనాలను సాధించుకోవడం అనేది ఫెడరల్ ఫ్రంట్ ఉద్దేశ్యమని అన్నారు. కేంద్ర రాజకీయాల్లో ఈ ఫ్రంట్ అటు బీజేపీకి, ఇటుకాంగ్రెస్ కు దూరంగా ఉంటుందని చెప్పారు. ఈనాటి చర్చల్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి తమ అధినాయకుడు, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో ఆంద్రప్రదేశ్ వెళ్లి వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఈ అంశంపై మరింత లోతుగా చర్చలు జరుపుతారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా డిమాండ్ ను తమ పార్టీ బలపరుస్తుందని కేటీ ఆర్ స్పష్టం చేశారు.
ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనలో ఎవరు కలిసివచ్చినా కలుపుకుపోవడానికి తమ పార్టీ ఎల్లప్పుడు సిద్ధమేనని చెబుతూ, ఇరుగు పొరుగు రాష్ట్రాలయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణాకు చెందిన మొత్తం నలభయ్ రెండుమంది ఎంపీలు ముక్త కంఠంతో పట్టుబడితే కేంద్రం పై ఒత్తిడి పెంచడం సాధ్యం కాగలదని జగన్ మోహన రెడ్డి అన్నారు. కేసీఆర్  ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదనని ఎలా ముందుకు తీసుకుపోవాలి అనే విషయాన్ని  గురించి తమ పార్టీ వారితో చర్చిస్తానని  ఆయన  చెప్పారు.
ఒకప్పుడు రాజకీయంగా, సైద్ధాంతికంగా విబేధించిన ఈ రెండు పార్టీల నాయకులు కేంద్ర రాజకీయాల్లో తీసుకుకురావాల్సిన మార్పులు గురించి ఒక అవగాహనకు వచ్చే ప్రయత్నం చేయడం ఆహ్వానించదగ్గ విషయమే. కొత్తగా విడిపోయిన రాష్ట్రాల నడుమ పరిష్కరించుకోవాల్సిన అనేక అంశాలు వుంటాయి. తెలంగాణా వైపు నుంచి అధికార పక్షమే ముందు చొరవ తీసుకుంది. పైగా మరో అయిదేళ్ళు అధికారంలో వుండే పార్టీ. మరో వైపు వైసీపీ ఆ రాష్ట్రంలో పాలక పక్షం కాకపోయినా ప్రధాన ప్రతిపక్షం. అక్కడి అధికార పార్టీ టీడీపీ మరో ఫ్రంటు యూపీఏతో కొత్త బంధం ఏర్పరచుకుంది. కాబట్టి ప్రధాన  ప్రతిపక్షాన్ని  ఫెడరల్ ఫ్రంట్ దిశగా ఆకర్షించే ప్రయత్నం టీఆర్ఎస్ చేస్తోందని అనుకోవాలి.   ఇందులో రాజకీయం లేకపోలేదు, కానీ అది జాతీయ రాజకీయాలకు పరిమితం అని భేటీలో పాల్గొన్న నాయకులు చెప్పారు.
కానీ అసలు రాజకీయం అక్కడే, అప్పుడే మొదలయింది.
నాయకులు ఇరువురూ మీడియా ఎదుట మాట్లాడి వెనుతిరిగారో లేదో, వెనువెంటనే ఈ భేటీ భేరీలు అటు అమరావతిలో మోగాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు కేటీఆర్, జగన్ భేటీని తప్పుపడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను దెబ్బతీసే కుట్రగా అభివర్ణించారు. రాష్ట్ర ప్రయోజనాలను అడుగడుగునా అడ్డుకుంటున్న టీఆర్ఎస్ తో జగన్ మోహన రెడ్డి దోస్తీ చేయడం ద్వారా రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు.
మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఒక అడుగు ముందుకు వేసి గతంలో కేసీఆర్ ఏయే సందర్భాలలో ఆంధ్రప్రజలను, వారి ఆచార వ్యవహారాలను, సాంప్రదాయాలను, వంటకాలను సయితం వదలకుండా ఎలా కించపరుస్తూ వ్యాఖ్యలు చేసారో వాటినన్నిటినీ గుదిగుచ్చి ఒక పెద్ద జాబితా చదివారు. అంటే జగన్ తో కేటీఆర్ సమావేశం ముగియగానే ఎదురుదాడికి టీడీపీ శ్రేణులు సర్వ సంసిద్ధంగా ఉన్నాయనుకోవాలి. ఈ ఆరోపణలు, విమర్శలు, వ్యాఖ్యలు వీటన్నిటి టీకా తాత్పర్యం ఒక్కటే.
‘ఆంద్ర ప్రదేశ్ ప్రయోజనాలకు టీఆర్ఎస్ ఆగర్భ శత్రువు. ఆ శత్రువుతో కలిసేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ కు ప్రప్రధమ  శత్రువు’
అంటే ఏమన్నమాట. వై ఎస్ ఆర్ సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు భంగం కలిగేలా వైరి పక్షంతో చేతులు కలుపుతున్నారు అని.
కొద్దికాలం క్రితం చంద్రబాబునాయుడు కేసీఆర్ కు స్నేహ హస్తం అందించాలని కోరుకున్నారు. కానీ ఆయన తిరస్కరించారు. ఈ విషయాన్ని చంద్రబాబే స్వయంగా వెల్లడించేదాకా బయట ప్రపంచానికి తెలియదు.
ఒకవేళ చంద్రబాబు కోరుకున్నట్టే టీడీపీ, టీఆర్ఎస్ కలయిక సాధ్యం అయిన పక్షంలో ఇప్పుడు మంత్రి ఉమామహేశ్వరరావు వాక్రుచ్చిన జాబితా యావత్తూ వైసీపీ వాళ్ళు పఠించేవారేమో! ఇక్కడ అన్ని పార్టీలు ఒక విషయం గమనంలో పెట్టుకోవాలి. మీమీ ప్రయోజనాలకోసం మీకెలాగూ రాజకీయాలు చేయక తప్పదు. చేసుకోండి నిరభ్యంతరంగా. కానీ అందులో అటూ ఇటూ వున్న అమాయక ప్రజలని భాగం చేయకండి. వారి వేష భాషలను, ఆహార వ్యవహారాలను చిన్నబుచ్చే పద్దతిలో మాటల తూటాలు విసరకండి.
నిజానికి  కేటీఆర్, జగన్మోహనరెడ్డిని  కలిసింది జాతీయ స్థాయిలో ఎన్డీయే, యూపీఏ కూటములకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ అనే తృతీయ రాజకీయ కూటమి అవకాశాలు గురించి చర్చించడానికి. గతంలో ఇదే పనిమీద కేసీఆర్ పలు రాష్ట్రాలకు వెళ్లి వచ్చారు కూడా. అలాగే చంద్రబాబునాయుడు కూడా ఎన్డీయే కు వ్యతిరేకంగా, ఇంకా నిక్కచ్చిగా చెప్పాలంటే ప్రధాని మోడీని గద్దె దించే ధ్యేయంతో వివిధ రాష్ట్రాలకు వెళ్లి అనేక రాజకీయ పార్టీల అధినాయకులతో సంప్రదింపులు జరిపారు కూడా.  నిజానికి, కేటీఆర్, జగన్ భేటీలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటూ ఏమీ లేవు. కానీ  ఎన్నికలు ముంగిట్లో ఉన్న వేళ. ప్రత్యర్ధులు ఒకచోట చేరితే అలక్ష్యం చేయరాదు అనే రాజ(కీయ)నీతి వారిచేత అలా మాట్లాడించి ఉండవచ్చు.  
టీడీపీ నాయకులు చేసిన ఆరోపణలు అన్నీ కొట్టివేయదగ్గవి కావు. తెలంగాణా ఉద్యమం తీవ్ర స్థాయిలో వున్నప్పుడు ఆంధ్రులు, ముఖ్యంగా తెలంగాణా ప్రాంతంలో స్థిరపడ్డ సీమాంధ్ర ప్రజల మనసులు గాయపడిన మాట కూడా వాస్తవం. ఆ రకంగా వారికి టీఆర్ఎస్ అంటే ద్వేష భావం వుండిఉండొచ్చన్న భావన ఒకటుంది. అయితే హైదరాబాదు మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికలు,  నిరుడు చివరాఖర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం చూసిన తర్వాత తెలంగాణలో నివసిస్తున్న సీమాంధ్రుల మనసులు తేలికపడినట్టే భావించాలి.
అయితే, అటు ఆంధ్రప్రదేశ్ లో విభజన జరిగిన తీరు బాగాలేదని బాధపడేవారు, బాధ పడుతున్నవారు ఇప్పటికీ కానవస్తారు. అయితే వారి కోపం అల్లా అడ్డగోలుగా రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీ మీద. ఆ కోపాన్ని గత ఎన్నికల్లోనే  వాళ్ళు తీర్చుకుని బేబాకీ చేసుకున్నారు.
కాకపొతే ఇప్పుడు కొత్తగా తెరమీదకు వచ్చిన అంశం ప్రత్యేక హోదా. ఒక్క బీజేపీని మినహాయిస్తే ఈ హోదా అంశాన్ని ఏ ఒక్క పార్టీ కూడా వ్యతిరేకించడం లేదు. ఇప్పుడు టీఆర్ఎస్ కూడా తమకు అభ్యంతరం లేదని తేల్చి చెప్పింది. కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి రాగానే తొలి సంతకం ప్రత్యేక హోదా మీదనే అని కాంగ్రెస్ అధినాయకులతో సహా బల్ల గుద్ది చెబుతున్నారు. కాంగ్రెస్ తో కొత్తగా చెలిమి చేస్తున్న టీడీపీ కూడా వారి హామీనే సమర్ధిస్తోంది. బీజేపీనా, కాంగ్రెసా అనేదానితో తమకు నిమిత్తం లేదనీ, ఎవరు ప్రత్యేక హోదా ఇస్తే వారికే తమ మద్దతు అని వై.ఎస్.ఆర్.సి.పీ. అంటోంది. జనసేనాని పవన్ కళ్యాణ్ ధ్యేయం కూడా ప్రత్యేక హోదా సాధనే. రాష్ట్రంలోని అన్ని పార్టీలకి ఇదొకటే  లక్ష్యం. కానీ వాటన్నిటికీ  మరో ధ్యేయం వుంది. అది అధికారం. దానికోసం తాము గట్టిగా కోరుకుంటున్న ప్రత్యేకహోదా కోసం గట్టిగా గొంతులు కలపలేకపోతున్నాయి.
అందుకే ఇన్ని పిల్లిమొగ్గలు. ఇన్ని కొత్త స్నేహాలు. ఇన్నికొత్త  వ్యూహాలు. ఇన్ని ఎత్తులు, ఇన్ని పై ఎత్తులు.  
          

1 కామెంట్‌:

సూర్య చెప్పారు...

ఎన్నికలప్పుడు ఏపార్టీ కూడా వ్యతిరేకించదు. ఎన్నికలయ్యాక తెలుస్తుంది వాటి అసలురంగు.
ఒకప్పుడు భండారువారు చెప్పిన ఒరులేయవియొనరించిన పద్యం KCR కి చెప్తే బావుంటుంది!