20, డిసెంబర్ 2014, శనివారం

గాంధీభవన్ పంతులు గారు


"ఆంద్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయాక  ఆయన జీవనం చాలా దుర్భరంగా గడిచేది. మద్రాసులో న్యాయవాదిగా సంపాదించిన అపార ధన రాశులు, అంతులేని ఆస్తిపాస్తులు స్వాతంత్రోద్యమ కాలంలో హారతి కర్పూరంలా కరిగిపోయాయి. రాజకీయాల్లో సమస్తం పొగొట్టుకున్న ఆంద్ర కేసరి చివరి రోజుల్లో కనాకష్టమైన జీవితం గడిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రతినెలా గౌరవ వేతనం కింద అందించే 750 రూపాయలను నేనే (గాంధీ భవన్ పంతులు గారు) స్వయంగా తీసుకెళ్ళి ఆయనకు అందించేవాడిని. సిరి  సంపదలతో తులతూగిన ప్రకాశం పంతులు గారిని ఆ స్తితిలో చూస్తుంటే కడుపు తరుక్కుపోయేది"
హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం అయిన  గాంధీభవన్ లో శేషజీవితం గడిపిన ఎస్వీ పంతులు గారు ఒకప్పుడు  గుర్తుచేసుకున్న విషయాలు ఇవి. ముఖ్యమంత్రులుగా పనిచేసిన శ్రీయుతులు  నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్య, కాసు బ్రహ్మానంద రెడ్డి, పీవీ నరసింహారావు, జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి, టంగుటూరి అంజయ్య, భవనం వెంకట్రాం, కోట్ల విజయ భాస్కర రెడ్డి, నేదురుమల్లి జనార్ధనరెడ్డి, వై యస్ రాజశేఖర రెడ్డి, రోశయ్య, వీరందరికీ గాంధీ భవన్ లో  'తలలో నాలుక' పంతులు  గారే. 'నేనూ కోట్లు కొల్లగొట్టే వాడినయితే ఇంతమంది గొప్పవాళ్ళ స్నేహం నాకు దొరికేదా' అనుకునే అల్ప సంతోషి  పంతులు గారు మాత్రం సాయంత్రం  సిటీ బస్సెక్కి ఇంటికి పోయేవారు. వీరిలో రోశయ్యగారితో పంతులు గారి అనుబంధం సుదీర్ఘ కాలం సాగింది. ఉదయం నుంచీ రాత్రి పొద్దుపోయే వరకు రోశయ్య గారితోనే వుండి  ఇంటికి వెళ్ళేటప్పుడు ఎవరినన్నా  రెండు రూపాయలు అడిగి తీసుకుని సిటీ బస్సెక్కి పోయేవారు. 'మళ్ళీ రేపు రావాలి కదా ఈ పదీ వుంచండి' అని ఏ ధర్మాత్ముడన్నా అంటే 'టిక్కెట్టుకు రెండు రూపాయలు చాలు,  రేపటి సంగతి రేపే' అనేసి వెళ్ళిపోయేవారట. దటీజ్ పంతులు గారు. అలాటి పంతులు గారు ఈ మధ్యనే, ఎవర్నీ టిక్కెట్టుకు డబ్బులు అడక్కుండా  ఈ లోకం విడిచి వెళ్ళిపోయారు. నాకాయనతో నలభయ్ ఏళ్ళ అనుబంధం.


   
హైదరాబాదు బషీర్ బాగ్ లోని పాత ప్రెస్ క్లబ్ ఆడిటోరియంలో నిన్న  పంతులు గారి సంస్మరణ కార్యక్రమం జరిగింది. గాంధీ భవన్ ఈ సందర్భానికి వేదిక కాకపోవడం వచ్చిన వారిని కలత పరిచింది. పట్టుమని పాతిక మంది కూడా కానరాలేదు. అయితే ఏమిటట? వచ్చిన వారందరూ పంతులు గారికి ఆత్మీయులు. ఎన్నో పనులున్నా పంతులు గారి కార్యక్రమానికి రావడమే ఒక పనిగా పెట్టుకుని వచ్చినవారు.  శాసన మండలి సమావేశాలు ఓ పక్క జరుగుతున్నప్పటికీ, మండలి చైర్మన్ శ్రీ చక్రపాణి గారు పంతులుగారి మీద వున్న వాత్సల్యంతో వచ్చి చాలాసేపు గడిపి, పంతులు గారిని గురించి చాలామందికి తెలియని చాలా మంచి సంగతులను  అందరితో పంచుకున్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన సీనియర్ నాయకుడు శ్రీ వడ్డే శోభనాద్రీశ్వర రావు గారు ప్రత్యేకంగా ఇందుకోసం విజయవాడ నుంచి బయలుదేరి వచ్చారు. పంతులు గారితో తమకున్న అనుబంధాన్ని సజల నయనాలతో నెమరు వేసుకున్నారు. అధ్యక్షత వహించిన రాజ్యసభ మాజీ సభ్యులు డాక్టర్ యలమంచిలి  శివాజీ చరిత్రపుటల్లో మరుగుపడిపోయిన ఎన్నో సంగతులను పంతులుగారి జీవితంతో ముడిపెట్టి వివరంగా తెలియచేసారు. మాజీ మంత్రి డొక్క మాణిక్య వరప్రసాద్, ఎమ్మెల్సీ శ్రీ పుల్లయ్య, గాంధీ భవన్ మరో  మూల స్థంభం, గతంలో మద్యనిషేధ కమిటీ చైర్మన్ గా  పనిచేసిన శ్రీ  ఉప్పులూరి మల్లిఖార్జున శర్మ,  గిరిజన సంక్షేమ సంఘం మాజీ చైర్మన్ శ్రీ సూర్య నాయక్, ఆంద్ర మేధావుల ఫోరం కన్వీనర్ శ్రీ చలసాని శ్రీనివాస్, ఐజేయూ సెక్రెటరీ జనరల్ దేవులపల్లి అమర్,  తెలంగాణా కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి శ్రీ  అద్దంకి దయాకర్ తమ ప్రసంగాలలో    ఎస్వీ పంతులు గారి  గుణగణాలను ప్రస్తుతించారు.  పంతులు గారి కుటుంబ సభ్యులు జ్యోతిశ్రీ, సీతాపతి, రాజేష్, సుబ్రమణ్య శర్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పంతులు గారి జ్ఞాపకాలతో ఒక పుస్తకం ప్రచురించాలని సమావేశంలో నిర్ణయించారు.  
పీ ఎస్: ప్రకాశం పంతులు గారి చివరి రోజులు ఎలా గడిచాయో కళ్ళారా చూసిన సంకా వియ్యన్న పంతులు గారి  చివరి అధ్యాయం కూడా అలాగే ముగియడం విధి విచిత్రం. (20-12-2014)

1 కామెంట్‌:

hari.S.babu చెప్పారు...

పీ ఎస్: ప్రకాశం పంతులు గారి చివరి రోజులు ఎలా గడిచాయో కళ్ళారా చూసిన సంకా వియ్యన్న పంతులు గారి చివరి అధ్యాయం కూడా అలాగే ముగియడం విధి విచిత్రం. (20-12-2014)
?
ఇంతేలే త్యాగధనుల జీవితాలు!
వారేనాడూ కోరనివి వైభవాలు?