23, నవంబర్ 2013, శనివారం

ఎవరీ అంకుల్ టామ్ ? - 6


ఎవరీ అంకుల్ టామ్ ? అన్న ప్రశ్నకు టెలివిజన్ రంగంలో నిష్ణాతులయిన తోట భావనారాయణ గారు సవివరమైన సమాధానం ఇచ్చారు. నలుగురూ తెలుసుకోవాల్సిన విషయాలు ఇందులో వున్నాయన్న  ఉద్దేశ్యంతో, ఆయనతో నాకున్న పరిచయాన్ని ఉపయోగించుకుని ఆయన రాసిన ఈ  వ్యాసాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను. దీనిపై ‘కాపీ రైట్లు’,  ‘కాపీ కొట్టే రైట్లు’  సమస్తం ఆయనవే.
 

(శ్రీ తోట భావనారాయణ)


టీవీ రేటింగ్ ప్రజాభిప్రాయమా?
రేటింగ్స్ ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించడం లేదా అనేది... రేటింగ్స్ లెక్కించే పరిభాషలో ప్రజలు అంట నగరాలు, పట్ణణాల్లో ఉంటూ కేబుల్ కనెక్షన్ ఉన్న ఇళ్లలో నివసించేవారని అర్థం. ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ మహానగరంతో పాటు పదిలక్షల జనాభా పైబడిన విజయవాడ, విశాఖపట్టణం, నగరాలు లక్ష నుంచి పది లక్షల మధ్య జనాభా ఉన్న 12 పట్టణాలను మాత్రమే రేటింగ్స్ లెక్కింపులో పరిగణిస్తారు. వాటిలో కొన్ని పట్టణాలు అప్పుడప్పుడూ మారుతూ ఉంటాయి. గ్రామీణ ప్రాంతాలను ఎంత మాత్రమూ పట్టించుకోవటం లేదనీ, వారి అభిప్రాయాలను రేటింగ్స్ ప్రతిబింబించటం లేదనీ స్పష్టంగానే తెలుస్తుంది. అటువంటి పరిస్థితుల్లో రేటింగ్స్ ఆధారంగా కార్యక్రమాలు రూపొందిస్తున్నారంటే నిజంగా ప్రజలు కోరుకుంటున్న విధంగా ఛానల్స్  నడుచుచుంటున్నాయని చెప్పగలమా? గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఎక్కువగా అందుబాటులో ఉండే దూరదర్శన్ రేటింగ్స్ లో ఎక్కువగా కనపడకపోవటం గమనించవచ్చు. ఇది కూడా  TAM సంస్థ పరిధి పరిమితంగా ఉండటం వల్లే.

రేటింగ్స్ ఆధారంగా కార్యక్రమాలు తయారవ్వడం అంటే ఎక్కువ శాతం పట్టణ ప్రాంత ప్రజలను..ఇంకా స్పష్టంగా చెప్పాలంటే రేటింగ్స్ లెక్కించే నగరాలు, పట్టణాల ప్రజలనే టార్గెట్ చేసుకోవడమన్నమాట. ఆ విధంగా కొన్ని సక్సెస్ ఫార్ములాలు తయారుచేసుకుని ఛానల్స్ తమ కార్యక్రమాలను రూపొందిస్తున్నాయి. వీలైతే ఇతర భాషల్లో సక్సెస్ అయిన (ఎక్కువ రేటింగ్స్ సంపాదించిన) కాన్సెప్ట్స్ ను ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా మార్పులతో తీర్చి దిద్దటమూ చూస్తున్నాం. మంచి కరా్యక్రమాలతో ప్రజలకు మేలు చేయటానికి బదులు ప్రజలను తాత్కాలికంగా రెచ్చగొట్టి ఆకర్షించేందుకే ప్రయత్నించటానికి కారణం రేటింగ్స్ మాయాజాలమే. ప్రసారాల మీద ప్రేక్షకుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఛానల్స్ ప్రయత్నించటం లేదు. ఎలాంటి శాస్త్రీయమైన సర్వేలూ లేవు. TAM కు చందా కట్టి డేటా తెప్పించుకోవటమే తప్ప స్వయంగా రీసెర్చి జరిపేందుకు ఎవరూ పూనుకోవటం లేదు. ప్రేక్షకుల అభిప్రాయాలకు అనుగుణంగా కార్యక్రమాలు తయారుచేయటానికి బదులుగా తాము ఇచ్చిన వాటిలో ఏది బాగా చూస్తారో అలాంటివే చూపించే ప్రయత్నం చేస్తున్నారు. తనకు ఏం కావాలో చెప్పుకునే అవకాశం లేనప్పుడు ప్రేక్షకుడు సహజంగానే ఉన్నంతలో నచచింది చూడక తప్పదు. ఆ క్రమంలో చేతిలో రిమోట్ కు పనిచెప్పడం మరింత పెరుగుతుంది. రేటింగ్స్ వలలో పడిన ఛానల్స్ ఈ నిజాన్ని గుర్తించకపోతే భిన్నంగా ఆలోచించడానికే సాహసించవు. స్వల్పకాలిక ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తే ఎంత అనర్థమో ముందు ముందు తెలుస్తుంది. ఛానల్స్ ను  నియంత్రించాలని ప్రయత్నించే ట్రాయ్ ఈ రేటింగ్స్ వేలం వెర్రి నుంచి వాటిని కాపాడగలిగితే ప్రేక్షకులు సంతోషిస్తారు. (ఇంకా వుంది)

కామెంట్‌లు లేవు: