22, నవంబర్ 2013, శుక్రవారం

ఎవరీ అంకుల్ టామ్ ? -5


అన్న ప్రశ్నకు టెలివిజన్ రంగంలో నిష్ణాతులయిన తోట భావనారాయణ గారు సవివరమైన సమాధానం ఇచ్చారు. నలుగురూ తెలుసుకోవాల్సిన విషయాలు ఇందులో వున్నాయన్న  ఉద్దేశ్యంతో, ఆయనతో నాకున్న పరిచయాన్ని ఉపయోగించుకుని ఆయన రాసిన ఈ  వ్యాసాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను. దీనిపై ‘కాపీ రైట్లు’,  ‘కాపీ కొట్టే రైట్లు’  సమస్తం ఆయనవే.


(శ్రీ తోట భావనారాయణ)
 

రేటింగ్స్ విశ్లేషణ, భిన్న వాదనలు
వస్తువుల ప్రకటనల కోసం కొన్ని టార్గెట్ గ్రూపులను ఎంచుకోవటం ఆనవాయితీ గనుక ఆ వస్తువు స్వభావాన్ని బట్టి మార్కెట్ పరిధిని కూడా అంచనా వేసుకోటానికి వీలుగా TAM తన సర్వే ఫలితాలను జనాభా ప్రాతిపదికన మూడు వర్గాలుగా విభజిస్తుంది. హైదరాబాద్ నగరంలో సేకరించే వివరాలను ఒక విభాగంలో అందజేస్తుంది. పదిలక్షలు పై బడిన జనాభా ఉన్న విజయవాడ, విశాఖపట్టణం నగరాలను మరో వర్గంలో చేరుస్తుంది. లక్ష నుంచి పదిలక్షలలోపు జనాభా ఉన్న పట్టణ ప్రాంతాలు మూడవ విభాగంలో చేరతాయి. అయితే, లక్షలోపు జనాభా గల ప్రాంతాలను రేటింగ్స్ కోసం సర్వే పరిధిలో చేర్చకపోవటం వల్ల నిజమైన రేటింగ్స్ రావటం లేదనే విమర్శలున్నాయి. ప్రకటనదారులు కోరుకునే మార్కెట్ గ్రామాలలో లేనందున ఆ ప్రాంతాన్ని చేర్చకపోయినా ఫరవాలేదనేది యాడ్ ఏజెన్సీల వాదన.
నిజానికి రేటింగ్స్ అనేవి ఆ కార్యక్రమం గొప్పదనం, నాణ్యత మీదనే ఆధారపడి ఉంటాయని చెప్పటానికి వీల్లేదు. అదే సమయంలో ఇతర ఛానల్స్ లో ఇంకా మెరుగైన కార్యక్రమాలు ఉన్న పక్షంలో రేటింగ్స్ వాటంతట అవే పడిపోతాయి. అంతమాత్రాన ఈ కార్యక్రమం బాగాలేదని భావించడానికి వీల్లేదు. పైగా ప్రతిరోజూ పరిస్థితి ఒకే విధంగా ఉంటుందని కూడా చెప్పలేం. ఎప్పటికప్పుడు రేటింగ్స్ ను కాపాడుకునేందుకు తగిన వ్యూహం అనుసరించడంలోనే విజయ రహస్యం దాగి ఉంది. వారం మొత్తంలో అన్ని ఛానల్స్ లో ప్రసారమవుతున్న కార్యక్రమాలకు ర్యాంకులు ఇవ్వడం ద్వారా ప్రకటన కర్తలు తగిన నిర్ణయం తీసుకునేందుకు టామ్ వీలు కల్పిస్తుంది. ముందే చెప్పినట్లు హైదరాబాద్ నగరంలోనూ, 10 లక్షల పైబడిన జనాభా గల నగరాలలోనూ, లక్ష నుంచి 10 లక్షల లోపు జనాభా గల పట్టణాల్లోనూ టీవీ ఛానల్స్ లో ప్రసారమవుతున్న కార్యక్రమాలకు ర్యాంకులు ఇస్తారు.
వయో వర్గాల వారీగానూ, పురుషులు, మహిళలె వేరు వేరుగానూ ఎంతమంది ఏయే ఛానల్ ఎంత సేపు చూస్తున్నారో లెక్కిస్తారు. ఆ విధంగా ఏ ఛానల్ వాటా ఎంత ఉందో తెలుస్తుంది. ఛానల్ వాటాను తెలియజేసే ఈ నాలుగు పట్టికలలో వరసగా హైదరాబాద్ ఫలితాలు, విజయవాడ, విశాఖ నగరాల పరిస్థితి, చిన్న పట్టణాల ఫలితాలు మొత్తం ఆంధ్రప్రదేశ్ లలో ఛానల్స్ మార్కెట్ వాటా వరసగా తెలుస్తాయి. ఈ పరిశీలనలో కేవలం న్యూస్  ఛానల్స్ పరిస్థితిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారు.
రేటింగ్స్ ప్రభావం
ఎంటర్ టైన్ మెంట్ ఛానల్స్ తో పోలిస్తే న్యూస్ ఛానల్స్ వాటా చాలా తక్కువగా ఉంటుంది. వార్తల పట్ల ఆసక్తిచూపే వాళ్లు తక్కువగా ఉండటం ఒక కారణమైతే, పత్రికలు అందుబాటులో ఉండటం మరో కారణం. దృశ్య ప్రధానమైన టీవీని వినోద సాధనంగా పరిగణించడం ఒక కోణమైతే నిరక్షరాస్యులకు కూడా అందుబాటులో ఉండటం మరో కారణం. అన్నింటికంటే ప్రధానమైన అంశం పిల్లలు, మహిళలు ఎక్కువగా టీవీలలో వినోద కార్యక్రమాల పట్ల బాగా మొగ్గుచూపటం. ఎంటర్ టైన్ మెంట్ ఛానల్స్ లో కార్యక్రమాల వైవిధ్యం ఉండటం వలన ప్రేక్షకులను టీవీలకు అతుక్కుపోయేలా చేయటం సులభమవుతుంది. న్యూస్ ఛానల్స్ కు అటువంటి లక్షణం లేదు. ఏదైనా ప్రత్యేకమైన సంఘటన జరిగినప్పుడు తప్ప ప్రతి బులెటిన్ లో ప్రత్యేకత చూపించడం సాధ్యం కాదు. ప్రజలకు అవసరమైన సమాచారం అందించాలన్నది న్యూస్ ఛానల్స్ తపన కావచ్చు గానీ ప్రజలు కోరుకుంటున్నది అందించాలనుకుంటున్న ఎంటర్ టైన్ మెంట్ ఛానల్స్ ఆలోచనే మంచి ఫలితాలనివ్వడం చూస్తున్నాం. అందువల్లనే 24 గంటల న్యూస్ ఛానల్స్ వాటా చాలా పరిమితంగా ఉంటోంది.
లక్ష నుంచి పదిలక్షలలోపు జనాభా ఉన్న ప్రాంతాలను గ్రామీణ ప్రాంతాలుగా టామ్ చెబుతున్నప్పటికీ ఇవి కూడా ఒక మోస్తరు నుంచి భారీ సైజు పట్టణాలే. నిజానికి ఇక్కడి మార్కెట్ మీదనే ప్రకటన కర్తలు ఎక్కువగా దృష్టిసారిస్తారు. నగరాలలో ప్రకటించాల్సిన వస్తువులకు, ఇటువంటి semi-urban ప్రాంతాలలో ప్రకటించాల్సిన వస్తువులకు తేడా ఉంటుంది గనుక ఆ విషయాన్ని ఎప్పుడూ దృష్టిలో పెట్టుకుంటారు. పెరుగుతున్న ఆర్థిక స్థోమత దృష్ట్యా ఇక్కడి ప్రజలకు ఎలాంటి ఆధునిక సౌకర్యాలను పరిచయం చేయాలో గమనించి ఆయా ఉత్పత్తుల ప్రకటనలు జారీ చేస్తారు.
తెలుగు న్యూస్ ఛానల్స్ కు నగరాల్లో కంటే చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ ఆదరణ ఉన్నట్టు అర్ధమవుతుంది. న్యూస్ ఛానల్స్ కు ున్న మార్కెట్ వాటా చాలా తక్కువే అయినప్పటికీ ప్రకటనలు ఎలా వస్తాయి? అన్ని న్యూస్ ఛానల్స్ కలిపి కేవలం నాలుగున్నర శాతం మార్కెట్ వాటా సంపదించుకుంటున్నప్పటికీ ప్రకటనకర్తలు ఎందుకు మొగ్గుచూపుతున్నారు?  ఈ ప్రశ్నలు తలెత్తడం చాలా సహజం. అయితే ఇందుకు సమాధానం ప్రేక్షకుల పరిమాణంతో బాటు నాణ్యతను విశ్లేషించడమే. వార్తలు చూసేది ఎక్కువగా పురుషులేనన్నది అందరూ అంగీకరించాల్సిన నిజం. కొనుగోళ్లను మహిళలు, పిల్లలు కొంత మేరకు ప్రభావితం చేయవచ్చునే తప్ప చాలా సందర్భాల్లో నిర్ణయాధికారం పురుషులదేనని, అందువలన పురుషులను ఆకట్టుకోవడం ముఖ్యమని ప్రకటనకర్తలు భావిస్తున్నారు.  కుటుంబంలో ఐదుగురు సభ్యులుంటే వాళ్లలో కీలకమైన కుటుంబ యజమానిని ఆకట్టుకుంటే చాలునన్న అభిప్రాయమే ఇందుకు కారణం. పురుషులకు మాత్రమే పనికొచ్చే వస్తువుల గురించి ప్రకటనలు ప్రసారం చేయాలన్నా న్యూస్ ఛానల్స్ లో రేటింగ్స్, మార్కెట్ వాటా గురించి పెద్దగా పట్టించుకోకుండానే ప్రకటనలిస్తారు.

ఛానల్స్ ఆలోచనా విధానాన్ని రేటింగ్స్ ఎంతగా ప్రభావితం చేస్తున్నాయంటే రేటింగ్స్ రాని కార్యక్రమాన్ని వెంటనే తొలగిస్తున్నాయి. ఒక  చిన్న ఉదాహరణ చూద్దాం. ఒకప్పుడు జెమినీ టీవీలో శుభోదయం పేరుతో ఒక కార్యక్రమం ప్రసారమయ్యేది. చాలా మంది ఆ ప్రయత్నాన్ని మెచ్చుకున్నారు. ఉదయాన్నేఒక చక్కటి కార్యక్రమాన్ని ఇస్తున్నారంటూ అభినందనలు వచ్చాయే తప్ప రేటింగ్స్ రాలేదు. దాదాపు ఏడాది పాటు ఓపిక పట్టిన యాజమాన్యం యువర్స్ లవింగ్లీలాంటి కార్యక్రమానే పునరుద్ధరించాల్సి వచ్చింది. వాళ్లు అంచనా వేసినట్టే దానికి  మంచి రేటింగ్ వచ్చింది. అయితే, రేటింగ్స్ ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించడం లేదా అనే ప్రశ్న ఎదురవుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే వార్తలు చూసే వాళ్లు పదిశఆతం మాత్రమే. వాళ్లకు మాత్రమే శుభోదయం లాంటి కార్యక్రమం నచ్చింది. వినోద కార్యక్రమాలు  చూసే 90శాతం మందికి పెద్దగా నచ్చలేదు. అందుకే రేటింగ్ రాలేదు. (ఇంకా వుంది)

కామెంట్‌లు లేవు: