7, నవంబర్ 2013, గురువారం

రారండోయ్ రారండోయ్ రేడియో విందాం రారండోయ్ - 1


ఏ ముహూర్తాన మార్కొనీ మహాశయులు రేడియో కనిపెట్టారో కాని అనేక దశాబ్దాలపాటు అది ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది ఇళ్ళల్లో అదో అపూర్వ వస్తువుగా వెలిగిపోయింది. కాలక్రమంలో వచ్చిన మార్పులనే  కారుమబ్బుల క్రీనీడల్లో ప్రస్తుతం కొట్టుమిట్టాడుతూ ఉనికిని కాపాడుకునే విఫల ప్రయత్నం చేస్తున్న రేడియో కదాకమామిషు:

మొత్తం దేశం సంగతి యేమో కాని దక్షిణ భారత దేశంలో రేడియో ప్రసారాలు ప్రారంభం కావడానికి కారకులు ఓ తెలుగు వ్యక్తి అంటే ఒక పట్టాన నమ్మడం కష్టమే. ఆయనే  రావు బహదూర్ సీ.వీ. కృష్ణ స్వామి సెట్టి.  1914 లో మద్రాసు నగర పాలక సంస్థలో ఎలక్త్రికల్ ఇంజినీర్ గా చేరారు. తొలిసారి విమానం ఎక్కిన భారతీయుల జాబితాలో పేరు దక్కిచ్చుకున్న వ్యక్తి. 1924లో మద్రాసు రేడియో క్లబ్ ద్వారా ఆయన రేడియో ప్రసారాలు మొదలుపెట్టారు.  1924 మే 16 న ఏర్పడిన ఈ మద్రాసు ప్రెసిడెన్సీ రేడియో క్లబ్, 1924 జులై  31 నాడు ప్రసారాలు మొదలు పెట్టింది. అయితే ఆ ప్రసారాలలో సంగీతానికే ఎక్కువ ప్రాధాన్యం వుండేది. కాకపొతే ఇది మూడేళ్లలోనే మూతపడింది. అయితే  కృష్ణ స్వామి సెట్టి గారి పూనికతో 1930 ఏప్రిల్ 1 వ తేదీ నుంచి మద్రాసు నగర పాలక సంస్థ రేడియో ప్రసారాలు ప్రారంభించింది.   కాని ఆ పరిమిత ప్రసారాల్లో తెలుగు పాటలు విన్పించినా తెలుగు నాటకాలు వంటివి ప్రసారం అయిన ఆధారాలు లేవనీ ఆకాశవాణి విశ్రాంత సంచాలకులు డాక్టర్ పీఎస్ గోపాలకృష్ణ ఉవాచ. పోలీసువారి ప్రకటనలు, ఆరోగ్య విశేషాలు కొన్ని ప్రసారం చేసేవారు. బడి పిల్లలకోసం  కొన్ని కార్యక్రమాలు వినిపించేవారు. ఈ ప్రసారాలు  చిత్తూరు, వేంకటగిరి మొదలయిన  చోట్ల వినిపించేవి. వాతావరణం అనుకూలించినప్పుడు బంగాళాఖాతం తీరం వెంబడి వున్న వూళ్ళల్లో విశాఖపట్నం దాకా వినిపించేవని గోపాలకృష్ణ ఒక వ్యాసంలో రాశారు.(1920 ప్రాంతంలో రేడియో వినడానికి  ఇంత శ్రమ పడేవారు) 

NOTE: COURTESY OWNER OF THE PHOTOGRAPH 

కామెంట్‌లు లేవు: