20, సెప్టెంబర్ 2013, శుక్రవారం

చాణక్య సూక్తులు


‘మరీ అంత నిజాయితీగా వుండడం కూడా మంచిది కాదేమో. చెట్లు కొట్టడానికి వెళ్ళేవాడు ముందు నరికేది నిటారుగా సాఫీగా  వున్న చెట్లనే కదా!

‘అన్ని  పాములు విషప్పురుగులు కావు.  విషపూరితం కాకపోయినా  పైకి అలా  కనబడే తీరాలి. లేకపోతే ఆ పాములు బతికి బట్టకట్టి కుబుసం విడవడం కష్టం.’ 

‘ఎవ్వడు కూడా  ఎలాటి స్వార్ధం లేకుండా మరొకడితో  జట్టు కట్టడు.  ఏ ప్రయోజం ఆశించకుండా  వుట్టిగా స్నేహం  చేస్తున్నానని ఎవడయినా  చెబితే దాన్ని నమ్మినవాడే  శుద్ద  అప్రయోజకుడు.’

‘యెందుకు ఈ పని చేస్తున్నాను? దీనివల్ల  ఫలితం ఏమిటి? ఇందులో విజయం సాధించగలనా? - ఈ మూడు ప్రశ్నలు వేసుకోకుండా ఏపనీ మొదలు పెట్టవద్దు.’  

‘అధైర్యం ఆవహిస్తోందని లేశమాత్రం  అనుమానం వచ్చినా సరే, యెంతమాత్రం ఉపేక్షించవద్దు. దాన్ని మొగ్గలోనే తుంచేయండి.లేకపోతే మొదటికే మోసం.’

‘ఈ ప్రపంచంలో రెండే రెండు ప్రబలమైన, తిరుగులేని  శక్తులు. ఒకటి యువశక్తి. రెండోది ఆడదాని అందం.’

‘పని మొదలు పెడితే ఆపవద్దు. మధ్యలో వొదిలిపెట్టవద్దు. ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి పని.’

‘పూల వాసన గాలి వాలును బట్టి వ్యాపిస్తుంది. కాని మనిషి మంచితనం మాత్రం  నాలుగు దిక్కులకూ వ్యాపిస్తుంది.’

‘భగవంతుడు విగ్రహాల్లో వుండడు. మీ భావాలే భగవత్ స్వరూపం. మీ మనసే దేవాలయం.’

‘మనిషి తన చేతలతో గొప్పవాడు అవుతాడు కాని జన్మతః  కాదు.’

‘మీ సంతానానికి  అయిదేళ్ళు వచ్చేవరకు వారిని చాలా   ప్రేమగా చూసుకోండి.  ఆతరువాత అయిదేళ్ళు ఏదయినా  తప్పుచేస్తే వారిని  కఠినంగా దండించండి.  కానీ  పదహారేళ్ళు రాగానే మీ  స్నేహితుడి మాదిరిగా చూసుకోండి. అలా పెరిగి పెద్దయిన పిల్లలే మీ  జీవితంలో మీకు  అత్యంత ఆత్మీయులయిన  సన్నిహితులుగా మీ జీవితాంతం కలసి వుంటారు.'

‘మంచి పుస్తకాలు మనిషికి జ్ఞానాన్ని కలిగిస్తాయి. చెత్త పుస్తకాలు చదవడం వల్ల ఉపయోగం వుండదు. అంధుడి ముందు వుంచిన  అద్దం మాదిరిగా.’

‘విద్యాధనం అన్నింటికీ మించిన గొప్ప ఆస్తి. అది వుంటే సంఘంలో గౌరవం లభిస్తుంది. విద్యాగంధం కలిగివుంటే అందం లేదనీ, వయస్సు మళ్లుతోందనీ మధన పడాల్సిన పని వుండదు. ఎందుకంటే , అది అన్నింటినీ కప్పిపెడుతుంది.’