16, సెప్టెంబర్ 2013, సోమవారం

అనువాద వాదసంవాదాలు


అనువాద సమస్యలు వుండవచ్చు కాని అనువాదమే చదువరికి ఓ సమస్యగా మారకూడదు.
ఇటీవల కొందరు అనువాదం గురించి వెల్లడిస్తున్న అభిప్రాయాలు చదువుతున్నప్పుడు నేనూ కొన్ని భావాలను పంచుకోవాలని అనిపించింది.


కీర్తి శేషులు రాచమల్లు రామచంద్రారెడ్డి గారు లోగడ ’అనువాద సమస్యలు’ అనే పుస్తకం రాశారు. నేను పాతికేళ్ళ క్రితం మాస్కోలో రేడియో మాస్కోలో పనిచేసేటప్పుడు ఈ అనువాద సమస్యలు నాకూ ఎదురయ్యాయి. ఎందుకంటే ప్రతిరోజూ ఓ గంట వ్యవధికి సరిపోను రేడియో కార్యక్రమాలను తెలుగులో రూపొందించాల్సిన బాధ్యత నాపై వుండేది. రష్యన్ రేడియో అధికారులు కార్యక్రమాల మూలప్రతిని ఇంగ్లీష్ లో ఇచ్చేవారు. దాదాపు ఎనభయ్ కి పైగా  ప్రపంచ భాషలకు ప్రాతినిధ్యం  వహిస్తూ అక్కడ పనిచేసే మేమందరం వాటిని ఎవరి భాషలోకి వాళ్ళం  అనువాదం చేసుకుని రికార్డ్ చేసేవాళ్ళం. నాటి కమ్యూనిస్టు ప్రభుత్వం వారి భావజాలాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేసుకోవడం కోసం ఈ ఏర్పాటు.  అందువల్ల కొన్ని కొరుకుడు పడని వాక్య నిర్మాణాలు, పదజాలాలు అక్కడ  పనిచేసే వాళ్లకు కాస్త ఇబ్బందికరంగా వుండేవి. ఈ నేపధ్యంలో మాస్కో ‘రాదుగ’  ప్రచురణ సంస్థలో పనిచేసే ఆర్వీయార్ గారు ( ఈ మధ్యనే ఆయన చనిపోయారు)  నాకు ఈ పుస్తకాన్ని కానుకగా ఇచ్చారు. ‘రారా’ గా ప్రసిద్ధులయిన రెడ్డి గారు రాసిన ఈ పుస్తకానికి సాహిత్య అకాడమీ పురస్కారం కూడా లభించింది. అనువాద సమస్యలు అన్నింటికీ ఈ పుస్తకం పరిష్కారం చూపలేకపోవచ్చు కాని అనువాదాల పట్ల అనురక్తి వున్న ప్రతి ఒక్కరు చదవదగ్గ పుస్తకం అని నా ఉద్దేశ్యం. విశాలాంద్ర ప్రచురణ సంస్థలో ఈ పుస్తకం దొరికే అవకాశం వుంది.
పోతే, అనువాదాలకు సంబంధించి సంస్మరించుకోవాల్సిన మరో మహనీయుడు ‘కలం కూలీ’ జీ.కృష్ణ గారు. అనువాదం చేసేటప్పుడు తెలుగులో ఆలోచించమని చెప్పేవారు. ఒక భాషలో వుండే పదాలు ఆయా ప్రాంతాల లేదా సంస్కృతుల ప్రాతిపదికగా ఆ భాషల్లోకి  చొరబడతాయి. మరో భాషలోకి అనువదించేటప్పుడు వాటి సమానార్ధక పదాలు లభ్యం కాకపోవచ్చు. అప్పుడు ఇంగ్లీష్ తెలియని పల్లెపట్టుల్లో ప్రజలు ఇలాటి భావాలను వ్యక్తం చేసేటప్పుడు ఎటువంటి పదాలు వాడతారు అని కాసేపు ఆలోచిస్తే చక్కటి సమానార్ధకాలు దొరికితీరుతాయి. కాని మన అనువాద నిపుణులకు ఆ తీరిక వుండదు. వారికి అప్పటికప్పుడు తట్టిన పదాలను జనం మీద  ప్రయోగించి అవే ప్రామాణికం పొమ్మంటారు. అందువల్లనే అలాటి వాటి గురించి నవ్వులాటగా మాట్లాడుకునే పరిస్తితి ఎదురవుతోంది. పిల్లి అంటే మార్జాలం అంటూ  సరిపెట్టుకోమంటున్నారు.
నెట్ ప్రపంచం ఆవిష్కరణ అనంతరం తెలుగు వినియోగం వేగంగా పెరుగుతోంది. ఈ నేపధ్యంలో అనువాద సమస్యలు మరింత పెరిగే అవకాశం వుంది. వీటిని ఎదుర్కోలేక సమాధానపడితే, పుట్టతేనె వంటి  తియ్యటి తెనుగు  తన స్వరూపాన్నే కోల్పోయే ప్రమాదం వుంటుంది.

కాబట్టి, రాసేది  అనుసృజన అయినా అనువాదం అయినా తెలుగులో ఆలోచించి తెలుగులో రాయాలి. (16-09-2013)                     

కామెంట్‌లు లేవు: