20, సెప్టెంబర్ 2013, శుక్రవారం

మహాభారతయుధ్దం గురించి భండారు వారి వ్యాసంలో పొరపాటు అభిప్రాయాలు


‘శ్యామలీయం’ అన్న బ్లాగులో వచ్చిన వ్యాసం పూర్తి పాఠం ఇది. ‘భండారు వారి వ్యాసంలో పొరబాటు అభిప్రాయాలు’ అనే అభిప్రాయంతో నాకు పేచీ ఏమీ లేదు. ఎందుకంటే దీనికి మూలం పలానా అని ముందే మనవి చేసుకున్నాను కాబట్టి. పాఠకుల సౌలభ్యం కోసం దాన్ని మరోసారి ఉటంకిస్తూ – ‘శ్యామలీయం’ బ్లాగు కధనం పూర్తి పాఠం పొందుపరుస్తున్నాను. పైగా నేను దీన్ని తెనిగించిన తేదీని మరోమారు గమనించవలసిందిగా కోరుతున్నాను. ‘శ్యామలీయం’ బ్లాగువారికి కృతజ్ఞతలు.     
– Originally published in Tatwa Prakasha News Letter in English -   
25-10-2011- రచయిత /అనువాదకుడు

ఈ వ్యాసం భండారు శ్రీనివాస రావు - వార్తా వ్యాఖ్య బ్లాగు లోని గురువారం 19 సెప్టెంబర్ 2013 నాటిమహాభారత యుద్ధం కవుల కల్పనా? అన్న వ్యాసానికి సమాధానంగా వ్రాసినది.   నా వ్యాఖ్యానం పెద్దగా ఉండటం వలన ఆ మహాభారత యుద్ధం కవుల కల్పనా? వ్యాసం క్రింద వ్యాఖ్యాగా జతపరిచేందుకు అనువుగా లేక ఈ బ్లాగులో ప్రచురిస్తున్నాను.  దయచేసి ఈ విషయం గమనించ గలరు. 

భండారు వారి వ్యాసంలోని పంక్తులు ఇలా ఎర్ర రంగులో ఇటాలియన్ స్టైల్‌లో ఉటంకిస్తున్నాను.
భండారు వారి మాటలకు నా వ్యాఖ్యానాన్ని ఇలా నీలి రంగులో పొందు పరుస్తున్నాను.  ఇక విషయం లోనికి వద్దాం.
  
యుద్ధానికి సంబంధించి కానీ, దాని ఫలితానికి సంబంధించి కానీ ఏ ఒక్క ఖచ్చితమయిన  కబురు ఆయా దేశాలకు చేరలేదని స్పష్టమవుతుంది.

అలా అంత ఖచ్చితంగా నిర్ణయం చేయలేము.  వార్తాహరులు, చారులు మొదలైన వాళ్ళతో కూడిన ఉపవ్యవస్థలు వేరేగా ఉంటాయి.  వాళ్ళు యుధ్ధంలో పాల్గొనే వీరులు కాదు. అందుచేత ప్రతిదేశానికి ఆయా రాజ్యాలకు చెందిన ఆయా వ్యవస్థలు సమాచారం ఇస్తాయనే భావించటం సముచితం.

రాజు యుద్ధానికి వెళ్లాడు. తిరిగి రాలేదు. అతడి వెంట వెళ్ళిన సైన్యం అతీగతీ లేకుండా అదృశ్యం అయిపొయింది. పన్నులు వసూలు చేసే వాళ్లు లేరు. అథవా చేసినా  ఆ మొత్తంలోనుంచి కప్పం సొమ్మును చక్రవర్తి ఖజానాకు  దఖలు పరిచే యంత్రాంగం లేదు...దాంతో  హఠాత్తుగా ఈ చిన్న రాజ్యాలకు వూహించని రీతిలో స్వేచ్చ లభిస్తుంది.

ఇదంతా కేవలం తప్పుడు ఊహాగానం.  ఎవరైనా రాజు యుధ్ధానికి వెళ్ళగానే రాజ్యం అరాచకం కాదు. యువరాజు అనే  deputy ఉంటాడు రాజ్యానికి. అదీ కాక, పరమ సందేహాస్పదమైన యుధ్ధాదులకి వెళ్ళే‌ రాజులు వారసుడికి రాజ్యం ఇచ్చి పూర్తిగా వ్యవస్థితం చేసి మరీ కాలు బయట పెడతారు. అదీ కాక సైన్యం మొత్తం దూరదేశానికి యుధ్ధానికి పోవటం రాజనీతి కాదు.  తగినంత మూలసైన్యం ఎప్పుడూ రాజ్యంలోనే ఉండి తీరుతుంది.  ఉదాహరణకు జరాసంధవధ చూడండి.  భీముడితో యుధ్ధం తరువాత తన ఉనికి సంశయం కాబట్టి, తన కొడుకు సహదేవుడికి రాజ్యం అప్పచెప్పి మరీ అతడితో యుధ్ధం చేశాడు జరాసంధుడు.

నాటి  అస్త్ర శస్త్రాల ప్రయోగ ఫలితంగా ఆవిర్భ వించిన మహానలం  తాలూకు  అగోచర శక్తి యావత్ భూమండలాన్ని చుట్టుముట్టి  మనుషుల మనసులను  కలుషితం చేసివుండాలి.  

ఇది కూడా ఊహాగానమే! శస్త్రాలు అనేవి మంత్రసంబంధ ఉన్నవి కాదు - కత్తులూ, శూలాలు వగైరా వంటి ఆ శస్త్రాల వల్ల ఏ మహానలమూ ఉత్పన్నం కావటం అన్న ప్రశ్నే రాదు. పోతే అస్త్రాలు కేవలం మంత్రబలంఅధారంగా ప్రయుక్తం అయ్యే ఆయుధాలు - వాటిలో ఆయుధం కేవలం వాహిక మాత్రమే. రాముడు ఒక దర్భపుల్లకు బ్రహ్మాస్త్రం అనుసంధించి వదిలిన రామాయణఘట్టం ప్రసిధ్ధమే.  ఐతే అస్త్రం అనేది కేవల ఉద్దేశించిన ప్రత్యర్థిని మాత్రమే ఎదుర్కుంటుంది సాధారణంగా. చివరికి బ్రహ్మాస్త్రం ఐనా అంతే.  కాని నారాయణ, పాశుపతాది అస్త్రాలు ప్రత్యేకలక్షణాలు కలవి.  అశ్వత్థామ నారాయణాస్త్రం వేసినప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిన మాట ఏమిటంటే దానికి ఎదురుగా ఎవరు ఆయుధంతో కనిపించినా వదలక కేవలం నమస్కరించిన వారినీ, నిరాయుధుల్నీ అది మన్నిస్తుందని.  పాశుపతం లోకసంహారం చేసేందుకు సమర్థం - దానిని అర్జునుడు కేవల ఒక్కసారే కార్యర్థం ప్రయోగించాడు. సారాంశం ఏమిటంటే మహాభారతయుధ్ధంలో సామూహిక హననంకోఎవరూ దివ్యస్త్రాలు ప్రయోగించలేదు కాబట్టి యావత్ భూమండలాన్ని చుట్టుముట్టి  మనుషులను శిక్షించటం అవి చేయటం ప్రసక్తి లేదు.

మహాభారత యుద్దానంతరం కొన్నిలక్షల  సంవత్సరాల వరకు తీవ్రమయిన స్తబ్ధత చోటుచేసుకుంది. దీన్ని చీకటి కాలంగా భావించారని  అనుకోవడానికి  కొన్ని ఆధారాలు వున్నాయి... ప్రాచీన తమిళ సాహిత్యంలో సైతం ఈ చీకటి ఘట్టం గురించిన ప్రస్తావన వుంది. ఆ భాషలో ఈ కాలాన్ని కలపిరార్ కాలంఅంటారు....దాదాపు యాభయ్ రెండు లక్షల ఏళ్లకు  పైగా ఈ చీకటి యుగం  సాగిందని చెబుతారు.   

ముద్రారాక్షసం కాదు. నిజంగా లక్షలనే వ్రాసారు.  చాలా ఆశ్చర్యకరమైన సంగతి.  ఈ మాట శుధ్ధతప్పు.

ప్రస్తుత కలియుగం  3102 BCE లో ప్రారంభం అయింది.  కలి ప్రారంభానికి 36 సంవత్సరాలకు ముందు మహాభారత యుధ్ధం జరిగింది ద్వాపరయుగాంతంలో.  అంటే మహాభారతయుధ్ధం జరిగి ఇప్పటికి 3102+2013+36 = 5151 సంవత్సరాల కాలం గడిచింది.  అంతే కాని మహాభారత యుధ్ధం జరిగి కొన్ని లక్షల సంవత్సరాలు కాలేదు!

తమిళభాషపై మీకున్న అభిమానం దొడ్డదే కావచ్చు.  కాని, ఆ భాష మాత్రం కొన్ని లక్షల సంవత్సరాల పూర్వం నుండి ఉన్నది కాదు సుమా! అత్యంత ప్రాచీన తమిళసాహిత్యం -300BCE కాలానికి చెందినదిగా భావిస్తున్నారు.  అంతకు రెండువందల సంవత్సరాలకు పూర్వపు శిలాశాసనాలు ఉన్నాయని చెబుతున్నారు.  అంతే కాని తమిళం కొన్ని లక్షల సంవత్సరాల నుండీ ఉన్న భాష కాదు.   అధునికి విజ్ఞానశాస్త్రం ప్రకారం నరులు ఉద్భవించి రెండు లక్షల ఏళ్ళు కావచ్చును. అంతే. 

ఆ రోజుల్లో సుదీర్ఘ కాలం యుద్ధంలో పాల్గొనే సైనికులను అనుదినం  ఉల్లాస పరచడానికి నాట్య, నటీనట బృందాలను,  విదూషకులను ఆయా  రాజులు తమ తమ దేశాలనుంచి  వెంటబెట్టుకు వెళ్ళేవాళ్ళు....  ఈ కళాకారుల ప్రాణాలకొచ్చే ముప్పేమీ వుండదు.కానీ యుద్ధానంతరం వీరి పరిస్తితి దయనీయం. తమను తీసుకొచ్చిన రాజులు, వారి సైన్యాలలో ఏ ఒక్కరూ మిగలక పోవడంతో దిక్కులేనివాళ్లు గా మిగిలిపోతారు. వీరికి తమ దేశం దరి చేరడానికి దారీ తెన్నూ తెలియదు. ఆ నాటి యుద్ధనియమాల ప్రకారం ఇలాటివారందరూ గెలిచిన రాజుకు వశమవుతారు.

ఈ మాటలూ సరైనవి కావు.  రాజు చచ్చి, సైన్యమూ దాదాపుగా నశించినంత మత్రాన కళాకారులకు తమ దేశం దరి చేరడానికి దారీ తెన్నూ తెలియని పరిస్థితి ఎందుకు వస్తుంది.  వాళ్ళ కళ్ళకు గంతలు కట్టి ఎవరూ యుధ్ధప్రాంతానికి తరలించ లేదు కదాఅదీ కాక, అప్పట్లో ప్రయాణం అంతా భూమార్గం గుండానే కదా? అందరితో పాటు వారు గుర్రాలు, బండ్ల మీద రోజుల తరబడి ప్రయాణం చేసి వచ్చిన వారే కదా? దారి తెలియక పోవటం చిక్కేమిటి తిరిగి పోవటానికి?  

ఆనాటి యుధ్ధనియమాల ప్రకారం హతశేషులైన ఆయుధదారులైన సైనికులూ, రాజపురుషులూ విజేతలకు వశం అవుతారు.  అంతే కాని వార్తాహరులు, కళాకారులు వంటి ఆయుధం చేత పట్టి యుధ్ధం చేయని వాళ్ళను ఏ విజేతా నిర్బంధించే ప్రసక్తి ఉండదు. 

అస్త్రాలనేవి మునులను, దేవతలను మెప్పించి వీరులు  సంపాదించుకునేవి.  వాటిని పొందిన వారు యుద్ధంలో మరణించిన తరువాత  ఆ అస్త్రాలన్నీ తిరిగి స్వస్తానాలకు చేరుకుంటాయి.

అస్త్రాలు మంత్రాల రూపంలో ఉండే యుధ్ధసాధనాలు.  మరణించిన వీరుడు ఏ అస్త్రాన్నీ ప్రయోగించ లేడు.  అంతే కాని అస్త్రాలు స్వస్థానానికి పోవటం అనేది ఏమీ ఉండదు.   అనేక అస్త్రాలు ఒకరి కంటె ఎక్కువ మంది వీరులకు స్వాధీనంలో ఉంటాయి.  వారిలో, మరణించిన వారు కాక మిగిలిన వారు ఆయా అస్త్రాల్ని నిక్షేపంగా ప్రయోగించ గలరు.

అస్త్రాలకు కాక వాటికన్న తక్కువ తరగతి మారణాయుధాలు శక్తులు అని పిలువబడేవి ఉన్నాయి.  ఇవి అస్త్రాలకు తక్కువ, శస్త్రాలకు ఎక్కువ అన్నమాట.  శక్తి అంటే అప్పటికే మంత్రపూతమైన శస్త్రం.  సాధారణంగా, దేవతలు మంత్రించి ఇచ్చే ఆయుధాలు అన్న మాట.   అవి ఏ వీరుని కొరకు దేవతలు అనుగ్రహించారో వారికి మాత్రమే పని చేస్తాయి.   ఆ వీరుడు మరణిస్తే ఆ శక్తి కేవలం సామాన్యమైన శస్త్రమే అవుతుంది.  అలాగే శక్తి ఆయుధాలు అన్నీ ఒక్కసారి మాత్రమే పని చేస్తాయి. ఒక శక్తిని, అది పొందిని వీరుడు ఒకసారి ప్రయోగించాక, అది ఐతే శత్రువుని వధిస్తుంది లేదా అది భూపతనం పొంది దానిని ఆవేశించి ఉన్న మంత్రబలం మాయమై నిర్వీర్యం ఐపోతుంది.   రామాయణ యుధ్ధంలో రావణాదులు శక్తి ఆయుధాలు ప్రయోగించారు. భారత కథలో కర్ణుడికి ఇంద్రుడు ఒక శక్తిని ఇచ్చాడు.  ఏ శక్తి ఐనా ఒక్క సారి మాత్రమే వాడటానికి పనికి వస్తుంది.  అంతే కాని అస్త్రాలు స్వస్థానానికి చేరుకోవటం అన్న మాట అవగాహనా రాహిత్యంతో అన్నది.

సుమేరియన్ సంస్కృతిలో వెల్లడయిన మరో విశేషాన్ని మహా భారత యుద్ధం కవుల కల్పన కాదనడానికి  ఆధారంగా కొన్ని వెబ్  సైట్లు  పేర్కొంటున్నాయి.  వేదాలు వేద విజ్ఞానం గురించిన ఒక ఇంగ్లీష్ వెబ్  సైట్ లో ఇచ్చిన వివరాలు ఈ వ్యాసానికి ఆధారం.

సుమేరియన్ సంస్కృతికి భారతయుధ్ధంతో ఎలా ముడివేస్తారు? సుమేరియన్లు భారతదేశంలో వాళ్ళు కాదు కదా?
సుమేరియన్ స్కృతి మెసొపొటామియా  (ప్రస్తుత ఇరాక్) భూభాగానికి చెందినది.   సుమేరియన్ సంస్కృతి ప్రసక్తి అనవసరం.

అదీ కాక వెబ్  సైట్లు  ఇచ్చే సమాచారం ప్రామాణికం అనుకోవటం కష్టం కదాఇలా వెబ్ సైట్లు ఇచ్చే సమాచారం ఆధారంగా రచనలు చేయటం వాటిని జనసామాన్యంలో ప్రచారంలోనికి తేవటానికి పత్రికలలో ప్రచురించటం దుస్సంప్రదాయం.  ఆలాంటి పనుల వలన తప్పుడు సమాచారం ప్రజల్లో వ్యాప్తికి వచ్చే ప్రమాదం చాలా హెచ్చుగా ఉంది.  దానికి మనం విశ్లేషిస్తున్న వ్యాసమే ఒక చక్కని ఉదాహరణగా నిలుస్తుంది.

ముఖ్యంగా భండారు వారి వ్యాసం పేరు మహాభారత యుద్ధం కవుల కల్పనా? అని.  అన్నింటి కంటే ఈ విషయంలో ఎక్కువ ఆశ్చర్యం కలుగుతుంది.  అసలు వ్యాసంలో ఈ ప్రశ్నపై చర్చ జరగనే లేదు.  అది కల్పన కాదు లెండి.  ఆ విషయంలో చర్చించ వలసినది కూడా లేదు. (20-09-2013)


11 కామెంట్‌లు:

శ్యామలీయం చెప్పారు...

నా ఈ వ్యాసాన్ని యథాతథంగా దొడ్డమనసుతో మీ బ్లాగులో పునఃప్రకటనం చేసినందుకు చాలా సంతోషం.

అజ్ఞాత చెప్పారు...

Your action is much appreciated

Nag చెప్పారు...

నేను మీ బ్లాగుని చదువుతూ ఉంటాను. బ్లాగులో పొస్ట్ కి సమాధానం గా మరో పోస్ట్ చూసినప్పుడు(అది ఎవరికైనా) ఎందుకిలా అనుకుంటాను(కామెంట్స్ ఇతే పెద్దగా పట్టించుకోను). శ్యామలీయం గారి పోస్ట్ ని చదివినప్పుడు అది కరక్టే అయినా నచ్చలెదు(sorry శ్యామలీయం గారు). కాని మీరు ఆ పోస్ట్ ని ఇక్కడ పబ్లిష్ చేసినపుడు some good feeling.

May be this is the way to express correctly.

You got more respect then before sir.

I am not denying శ్యామలీయం's way of expression.

అజ్ఞాత చెప్పారు...

అక్షరాలు ఏటవాలుగా ఉండేటట్లు రాస్తే అవి మీరు అన్నట్లుగా "ఇటాలియన్ స్టైల్" అనరు. అవి "ఇటాలిక్స్" లేదా "ఐటాలిక్స్" అని అంటారు.

Jai Gottimukkala చెప్పారు...

Sir,

A very good practice to print the rejoinder in full.

One suggestion: it would have been better if you included to Mr. Syamalarao's rejoinder (http://syamaliyam.blogspot.in/2013/09/blog-post_19.html)

This would have helped readers to visit his blog also.

శ్యామలీయం చెప్పారు...

Nag గారికి నేను నా జవాబును వేరే టపాగా నా బ్లాగులో వ్రాయటం‌ నచ్చలేదని భావిస్తున్నాను. అదే కారణం ఐతే, నేను వ్రాయవలసినది ఒక వ్యాఖ్యకు నప్పేటంత చిన్నగా ఉండక పోవటంతో‌ అలా చేయక తప్పలేదని మరొక సారి విన్నవించుకుంటున్నాను. క్షమించాలి.

అలాగే ఒక అజ్ఞాతగారు అన్నట్లు, ఇటాలియన్ స్టైల్" అని కాక "ఇటాలిక్స్" అనటమే‌సబబుగా ఉంటుంది. నాదే పొరపాటు. ఇలాంటి చిన్న విషయాల మీదా రచయితలు దృష్టి పెట్టాలన్నది మంచి సూచనే.

గొట్టిముక్కలవారికి నా కృతజ్ఞతలు. నేను ఏదైన టపాకు జవాబుగా మరొక టపా వ్రాస్తే తప్పకుండా ఆ టపా లింకు ఇస్తాను నా టపాలో. అలాగే సదరు టపాలో నా టపాను తెలియజేస్తూ వ్యాఖ్య ఉంచుతాను. ఐతే భండారువారు నా బ్లాగుపేరును ఉదహరించారు కదా, అది సరిపోతుందని వారు భావించి ఉంటారు.

చదువరి చెప్పారు...

ఓహ్.. భండారు శ్రీనివాసరావు గారూ, అరుదైన సంగతిది. స్ఫూర్తిదాయకంగా ఉంది ఇలా ప్రచురించడం. అభినందనలు.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@శ్యామలీయం - కేవలం అజ్ఞానాంధకారం అంతకంటే ఏమీ లేదు. వయస్సులో(కేవలం 68 మాత్రమే) నేను పెద్దేమో తెలవదు కానీ ఈ కంప్యూటర్ పరిజ్ఞానం విషయంలో నిజంగా అంగుష్ఠమాత్రుడినే. మొత్తం మీ వ్యాసాన్ని పోస్ట్ చేయగలిగాను కానీ లింకులు ఇంకా కొత్తే. సాయం చేయండి. ఇకనుంచి లింకులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అంతే కాని అన్యదా భావించకండి. - భండారు శ్రీనివాసరావు

Jai Gottimukkala చెప్పారు...

@శ్యామలీయం:

"గొట్టిముక్కలవారికి నా కృతజ్ఞతలు. నేను ఏదైన టపాకు జవాబుగా మరొక టపా వ్రాస్తే తప్పకుండా ఆ టపా లింకు ఇస్తాను నా టపాలో"

Yes, sir. My request was for Mr. BSR. Having started a very good practice, it would have been even better if he had provided a link to your own post.

@భండారు శ్రీనివాస రావు:

"కానీ లింకులు ఇంకా కొత్తే"

Sir you can just mention the post URL even hyperlink is difficult. For example, you could have written:

‘శ్యామలీయం’ అన్న బ్లాగులో వచ్చిన వ్యాసం (http://syamaliyam.blogspot.in/2013/09/blog-post_19.html) పూర్తి పాఠం ఇది.

Jai Gottimukkala చెప్పారు...

BSR sir deserves the appreciation of all netizens for starting a very good precedent. Thank you sir.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@ ధన్యవాదాలు. మరోసారి ప్రయత్నం చేస్తాను. ఈసారికి వొదిలిపెట్టండి. పోతే ఆ మరోసారి అనేది రాకూడదని ఆకాంక్ష