14, సెప్టెంబర్ 2013, శనివారం

మార్పు దిశగా అడుగులు పడాలి


పక్కింట్లో ఏం జరిగినా పట్టించుకోని మౌన భారతం అన్న అపప్రధ నుంచి దేశం బయట పడింది.
దేశరాజధానిలో జరిగిన ఒక సంఘటన జాతి యావత్తును కుదిపివేసింది. స్పందించే గుణం ఇంకా మిగిలే వుందని యువ భారతం నిరూపించింది. వీధులకెక్కిన జనాగ్రహం పాలకుల మెడ వంచింది. ఒక సంఘటన  మూలంగా ఏకంగా  ఒక చట్టమే రూపుదిద్దుకోవడడం అనే అరుదయిన ప్రక్రియకు నాంది పలికింది.
ఎల్లలు మరిచి, విభేదాలు విడిచి  జాతి యావత్తు  ఒక్క తాటిపై నిలబడి  స్పందించడం అన్నది స్వతంత్ర భారతంలో కనీ వినీ ఎరుగని విషయం.  ఇటువంటి సందర్భాలలో బాధితుల పట్ల సాధారణంగా అనుసరించే నిర్దాక్షిణ్య వైఖరికి భిన్నంగా మీడియా బాధితుల పేర్లను బహిరంగపరిచే విధానానికి ముగింపు పలికి కొత్తవొరవడికి శ్రీకారం చుట్టడం అనేది స్వాగతించతగ్గ మరో పరిణామం.        
ఆనాటి దురదృష్టకర క్షణాల్లో బాధితురాలు పడిన క్షోభకు, అనుభవించిన మానసిక క్లేశానికి,  పోగొట్టుకున్న ప్రాణాలకు ఢిల్లీ కోర్టు తీర్పు పరిహారం కాకపోవచ్చు కాని, స్థాలీపులాకన్యాయం మాదిరిగా ఈ కేసు దర్యాప్తు త్వరితగతిన జరిగిన తీరు మాత్రం ‘భయం లేదు’  అన్న భరోసాను ప్రజలకు కలిగించింది.
మానసికంగా  భౌతికంగా ఒక అమాయకురాలిని పరమ దారుణంగా హింసించి,  అత్యంత  కిరాతకంగా ఈ ఘోరానికి  పాల్పడి, ఆమె మరణానికి కారణభూతులయిన నేరస్తులకు తగిన శిక్ష పడింది. చనిపోయేవరకూ వారిని ఉరి తీయాలని న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
అయితే, కేవలం కఠిన శిక్షలు మాత్రమే  పెచ్చరిల్లుతున్న హింసా ప్రవృత్తికి అడ్డుకట్టవేయలేవు అన్న వాస్తవాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాల్సిన అవసరం వుంది. చట్టాలకు పదును పెట్టి కఠిన శిక్షలు వేయడం అన్న ఒక్క ప్రక్రియే ఈ సమస్యలకు పరిష్కారం కాదు.
అసలు సిసలు మార్పు ఇళ్లనుంచి  మొదలు కావాలి. పిల్లల పెంపకం పట్ల తలితండ్రులు  తీసుకునే జాగ్రత్తలు కూడా సానుకూల మార్పుకు దోహదం చేస్తాయి. గతంలో పాఠశాలల్లో నైతిక ప్రవర్తనకు సంబంధిన పాఠాలు బోధించే పద్దతి వుండేది. యేది మంచి యేది చెడు అన్నది చిన్నతనం నుంచే అవగాహన చేసుకోవడానికి అవకాశం వుండేది. ఉమ్మడి కుటుంబాలకు మూలస్తంభాలు అయిన బామ్మలు, తాతయ్యలు పసితనం నుంచే పిల్లలకు నడత, నడవడిక గురించిన మార్గదర్శనం చేసేవాళ్ళు. ఎదిగే దశల్లో మనసును నియంత్రించుకోవడానికి అవసరమయిన నీతి పాఠాలు కుమార శతకం, కుమారి శతకాల్లో లభ్యం అయ్యేవి. అవన్నీ ఇప్పుడు కలికానికి కూడా కానరావడం లేదు. అధవా ఎవరయినా కలిగించుకుని చెప్పే నీతి వాక్యాలను  పాత చింతకాయ పచ్చడిలా పరిగణిస్తున్నారు.
అలాగే,   ఇప్పటి వేగ యుగంలో, పోటీ ప్రపంచంలో వాణిజ్యరూపం సంతరించుకున్న విద్యాసంస్థలకు నైతిక పాఠాలు బోధించే వ్యవధానం వుంటుందని ఆశించడం వృధా.   అటు కుటుంబాలలో కూడా పిల్లలకు  మంచీచెడూ చెప్పే వాళ్లు లేకుండా పోతున్నారు. ఆధునిక సాంకేతిక పరికరాలు జీవన శైలి మెరుగుదలకు ఓపక్క దోహదం చేస్తూనే మరోపక్క యువత పెడదారులు తొక్కటానికి మార్గాలను  సులువు చేస్తున్నాయి. అందుకే  సమస్య మూలాల్లోకి పోయి పరిష్కారాలను కనుగొనాల్సిన అవసరం ఏర్పడింది.  
ఏ సమాజనికయినా విలువల పతనాన్ని మించిన అధోగతి వుండబోదు.
దాన్ని నిరోధించకుండా చేసే ఏ ప్రయత్నాలయినా పై పూత మందులే అవుతాయికాని  అసలు రోగాన్ని సమూలంగా  నిర్మూలించలేవు.

(14-09-2013)

కామెంట్‌లు లేవు: