7, సెప్టెంబర్ 2013, శనివారం

రేడియో రోజులు - 2


వెనుకటి రోజుల్లో ఇతర ప్రాంతాలనుంచి విద్యార్ధులు హైదరాబాదు ఎక్స్ కర్షన్ కు వస్తే వాళ్లకు చూపించే ప్రదేశాల్లో రేడియో స్టేషన్ కూడా వుండేది. బేగం పేట ఏరోడ్రోం (విమానాశ్రయం అనే వాళ్ళు కాదు  ఏరోడ్రోం అంటేనే చెప్పుకోవడానికి గొప్పగా వుండేది. ఆరోజుల్లో ఇప్పట్లా కాదు, రోజు మొత్తంలో కలిపి ఒకటీ అరా  విమానాలే హైదరాబాదు వచ్చి వెళ్ళేవి. కొన్ని నైట్ హాల్ట్ బస్సుల మాదిరిగా రాత్రంతా అక్కడే వుండి మరునాడు బయలుదేరి వెళ్ళేవి.  అందుకని స్కూలు పిల్లల్ని తీసుకువచ్చిన మాస్టర్లు కూడా ఏదో ఒక విమానం వచ్చే టైమో, వెళ్ళే టైమో ముందుగా కనుక్కుని అక్కడికి తీసుకువెళ్ళేవాళ్ళు. విమానాశ్రయం మేడ మీద అద్దాల కిటికీల్లో  నుంచి విమానం దిగివస్తున్న వాళ్ళను చూసి సంతోషంతో కేరింతలు కొట్టేవాళ్ళు), అల్లాగే అసెంబ్లీ బిల్డింగ్, దానిపక్కనే పబ్లిక్ గార్డెన్, చార్మినార్, సాలార్ జంగ్ మ్యూజియం ఇలా అన్ని చోట్లకీ తిప్పి వెనక్కి తీసుకుపోయేవాళ్ళు. తరువాత తరువాత ఈ జాబితాలో నెహ్రూ జూ పార్కు, రవీంద్రభారతి వచ్చి చేరాయి.
ఇంతకుముందే చెప్పినట్టు గొప్ప సంస్థల్లో పనిచేసే అవకాశం రావడం వల్ల అంతవరకూ చాలా గొప్పవాళ్ళు, వీళ్ళను ఒక్కసారి కలిస్తే చాలు అనుకున్నవాళ్ళతో కలిసి పనిచేసే గొప్ప అవకాశం లభిస్తుంది. రేడియోలో చేరడం వల్లనే,  పన్యాల రంగనాధ రావు గారు, తిరుమలశెట్టి శ్రీరాములు గారు, మాడపాటి సత్యవతి గారు, డి.వెంకట్రామయ్య గారు ఇలాటి గొప్ప స్వర సంపన్నులతో సహోద్యోగిగా సాంగత్యం చేసే స్వానుభవం సొంతం అయింది. (నిజానికి రేడియో వార్తల్లో ‘గారు’ వాడరు ‘శ్రీ’ తప్ప. కానీ ఈ గొప్పవారిపట్ల పెంచుకున్న గౌరవంతో ‘గారు’ చేర్చి గౌరవించుకుంటున్నాను. జర్నలిజం వృత్తిలో చేరినప్పుడే సీనియర్లు, జూనియర్లు అనే తేడా వొదులుకోవాలని, ‘హోదాలతో’ సమకూరే పెద్దరికాలను పక్కనబెట్టాలని నా పెద్దలు నాకు నేర్పిన పాఠం. అందుకే నా వృత్తి జీవితంలో నాకు ఎవ్వరూ ‘బాసులు’ కారు, నేను ఎవ్వరికీ ‘బాసును’ కాను. ఇదే సూత్రాన్ని నేను మూడు దశాబ్దాలపాటు పాటించాను. ఆచరించాను. 

(07-09-2013)

కామెంట్‌లు లేవు: