1, ఆగస్టు 2024, గురువారం

భూమంటే చేదా !

 కన్నంతలో, విన్నంతలో అమెరికా భండారు శ్రీనివాసరావు

అమెరికా అనేది అవకాశాల దేశమే కాదు, వింతలు, విశేషాల దేశం కూడా.

నేను అమెరికా రావడం ఇది ఐదో సారి. మా మూడో అన్నయ్య కుమారుడు సత్య సాయి ఉంటున్న ఉడ్ స్టాక్ పట్టణంలో వాళ్ళ ఇంటికి దగ్గరలోనే హోవార్డ్ కౌంటీ కన్సర్వెన్సీ కొన్ని వందల ఎకరాల్లో విస్తరించి వుంది.

పచ్చదనం పరచుకున్న కొండలు, గుట్టలతో నిండి వుండి, తాటి ప్రమాణంలో  గుబురుగా పెరిగిన చెట్ల మాటున చిన్న చిన్న కాలిబాటలు, సెలయేళ్ళు, క్రమంగా మాయమవుతున్న జాబితాలో చేరుతున్న జంతుజాలం, పాత కాలపు వ్యవసాయపు పనిముట్లు, పరికరాలు   ఇవన్నీ చూస్తుంటే, పెద్దనామాత్యులు రచించిన మనుచరిత్రలోని,

‘అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ
పటల ముహుర్ముహుర్ లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్
గటక చరత్కరేణు కర కంపిత సాలము శీతశైలమున్’ అనే పద్యం గుర్తుకు రాకమానదు.

ఎప్పటినుంచో నూట అరవై అయిదు సంవత్సరాలుగా ఒక కుటుంబం హక్కుభుక్తంలో వుంటూ, సామ్యుయేల్ బ్రౌన్ అనే పెద్దమనిషికి ఈ అపారమైన విలువగలిగిన ఆస్తి, తండ్రి తాతల నుంచి వంశపారంపర్యంగా లభించింది. బ్రౌన్ మహాశయుల  మరణానంతరం ఆయన కుమారుడికి అది దఖలు కాగా, ఆయన చనిపోతూ మూడోవంతు భూమిని తన ఇద్దరు చెల్లెళ్లకు రాసిపోయాడు. వృత్తి రీత్యా ఉపాధ్యాయులైన రూత్ బ్రౌన్,  ఫ్రాన్సెస్ బ్రౌన్ లు, వన్య, జంతు సంపదతో కూడిన, మౌంట్ ప్లెజెంట్ గా ప్రసిద్ధి చెందిన తమ సువిశాల భూ సంపదను సమాజం బాగుకోసం త్యాగం చేశారు. పిల్లలకు చిన్నతనం నుంచే వన్య, జంతు ప్రాణి సంరక్షణ విషయంలో అవగాహన, ఆసక్తితోపాటు ప్రకృతి సంరక్షణ పట్ల భవిష్యత్ తరాలకు తెలియచెప్పే కార్యక్రమాలు నిర్వహించేందుకు ఈ యావత్ ఆస్తిని ఒక ట్రస్టుకు ఒప్పచెప్పారు.

మొక్కలు, జంతువులు, పక్షులు గురించి చిన్నతనం నుంచి బోధించే ప్రత్యేక తరగతులను ఆ ట్రస్టు నిర్వహిస్తోంది. ప్రకృతి ప్రేమికులకు ప్రోత్సాహం కలిగించే అనేక కార్యక్రమాలు అక్కడ జరుగుతుంటాయి. అక్కడ ప్రవేశం ఉచితం. ఎవరైనా సరే  పౌరులు కూరగాయలు సొంతంగా పండించుకోవాలి అనుకుకుంటే అందుకు కావాల్సిన భూమిని ఉచితంగా ఇస్తారు.

ఇక్కడ పాఠాలు చెప్పేవాళ్ళు, ఇతర వ్యవహారాలు చూసేవాళ్ళు అంతా జీత భత్యాలు లేకుండా వాలంటీర్లుగా పనిచేస్తున్నట్టు అనిపించింది. తిరిగి వచ్చేటప్పుడు కారు పార్కింగ్ దగ్గర ఒక వృద్ధ మహిళతో మాట్లాడాము. మిసెస్ ఆద్రే  అనే ఆవిడ వయస్సు 81 సంవత్సరాలు.  2007 రిటైర్ అయ్యారు. భర్త చనిపోయాడు.  ప్రవృత్తి రీత్యా ప్రకృతి ప్రేమికురాలు అయిన ఆవిడ తన ముదిమి వయసులో కాలక్షేపం కోసం కాకుండా స్వచ్చందంగా సిద్ధపడి ఇక్కడ పనిచేస్తున్నారు. మేము ఇండియా నుంచి వచ్చాము అని చెబితే చాలా సంతోష పడ్డారు. చెట్లను, జంతువులను, పక్షులను భగవత్ స్వరూపాలుగా భావించే భారతీయ సంస్కృతి అంటే తనకు చాలా గౌరవమని అన్నారు. ఆవిడ అలా అంటూ వుంటే నేను సిగ్గుతో ముడుచుకు పోయాను. కారణం మీకూ తెలుసు.

వందల ఎకరాల భూమిని ప్రకృతి సంరక్షణ కోసం అతి సులభంగా త్యాగం చేయడం నిజంగా గొప్ప విషయమే.

పెంపుడు పిల్లులకు, కుక్కలకు కోట్లాది డాలర్ల సంపదను వీలునామా రాసే సంపన్నుల దేశం కనుక ఇక్కడ ఇదొక వింత కాకపోవచ్చు.

కానీ, హైదరాబాదు జూబిలీ హిల్స్, బంజారా హిల్స్ వంటి ప్రాంతాలలో కొన్ని వందల గజాల జాగాలో సువిశాలమైన భవంతులు నిర్మించుకున్న సంపన్న ఆసాములు, రోడ్ల వెడల్పు వంటి ప్రజోపయోగ కార్యక్రమాలకు హీనపక్షం కొద్ది అడుగుల భూమిని వదులుకోవడానికి ఇష్టంలేక, కోర్టులను ఆశ్రయించిన ఉదంతాలు తెలిసిన దేశం నుంచి వచ్చాను కనుక, ఈ సోదరీమణుల వదాన్యం వింతల్లో వింతగానే నాకు  అనిపించింది.  















(01-08-2024)          

 

8 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

అమెరికాలో Land Ceiling Act లేదా?
🤣🤣

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

విన్నకోట నరసింహా రావు గారికి ఇక్కడ అలాంటి చట్టం వుందో లేదో తెలియదు. ఓ రెండు గంటలు చూసి, ఓ గంట విని రాసే పోస్టులు ఇవి. అందుకే కన్నంతలో, విన్నంతలో అమెరికా అనే శీర్షిక - నమస్కారాలతో - భండారు శ్రీనివాసరావు

Zilebi చెప్పారు...

మీకు తెలియనిదా :)

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

నాలాంటి అమాయకుడిని పట్టుకుని అలా అంటారా, "జిలేబి" గారు?

raamudu చెప్పారు...

there is no land ceiling in USA.

Zilebi చెప్పారు...

పదండి అమెరికా పోదాం :)

అజ్ఞాత చెప్పారు...

అప్పుడు అక్కడ ల్యాండ్ ఉండదు, సీలింగుని చూస్తూ కూచోవడమే :)

Zilebi చెప్పారు...

సూపర్ :)