27, జనవరి 2022, గురువారం

విత్ మీ ఆర్ విత్ మై ఎన్మీ – భండారు శ్రీనివాసరావు

"వుంటే నాతొ వుండు, లేదా నా శత్రువుతో వుండు" అని అర్ధం వచ్చే ఈ మాట అన్నది ఒక అమెరికన్ ప్రెసిడెంటు. పేరు గుర్తుకు రావడం లేదు.

"వుంటే నాతో వుండు. పోతే నీ దేశం పోరా" అనే సినిమా పాట అప్పుడప్పుడూ వినబడుతూ వుంటుంది. ఏ సినిమాలోదో, ఎవరు రాశారో అదీ గుర్తులేదు.
ఇప్పుడవి గుర్తుకువచ్చిన సందర్భం మాత్రం గుర్తుంది.
2005 నుంచి 2019 వరకు రోజుకు ఒకటి రెండు సార్లు ఒకటి రెండు టీవీ చర్చలకు వారలబ్బాయిగా హాజరు వేయించుకునే కాలం నాటి ముచ్చట ఇది.
ప్రతిరోజూ, రెండు తెలుగు రాష్ట్రాల లోని వివిధ పార్టీల అధికార ప్రతినిధుల నడుమ సాగుతున్న మాటల యుద్ధం గమనిస్తూ, వాటిని గురించి విశ్లేషణ చేసే సందర్భంలో మహా విసుగు వచ్చేది. ఈ పార్టీలకి ప్రాతినిధ్యం వహించే వ్యక్తుల సముఖంలో ఇలాటి చర్చ జరిగినప్పుడు మరీ ఇబ్బందిగా వుండేది.
ఏ విషయానికయినా బొమ్మా బొరుసూ మాదిరిగా 'మంచీ చెడూ' అనే రెండు పార్శ్వాలు వుంటాయి. ఏ అంశం తీసుకున్నా, ఈ విషయంలో 'మాదే రైటు' అనే మొండి ధోరణి తప్ప ఒక అంగుళం దిగివచ్చి మంచేదో చెడేదో మాట్లాడుకుందాం అన్న ధోరణి కానరావడం లేదు. ఏ విధానం అయినా, ఏ ప్రణాళిక అయినా నూటికి నూరు శాతం కరక్టుగా వుండే అవకాశం వుండదు. మొత్తం మీద బాగున్నా ఏవో కొన్ని లోటుపాట్లు వుండడం సహజం. కానీ, ఒక్క చిన్న విషయంలో కూడా అవతలవాళ్ళు చెప్పింది అంగీకరించడానికి ఇవతలవాళ్ళు సిద్ధంగా వుండరు. వాళ్ల నాయకుల విధానాలను సమర్ధించుకుంటూ పోవాలనే ఏకైక లక్ష్యం ఒక్కటే కనబడుతుంటుంది. ప్రజాస్వామ్య దేశంలో ఇంత గుడ్డిగా సమర్ధించుకుంటూ పోవడం ఏమేరకు మేలు చేస్తుందో అర్ధం కావడం లేదు. పార్టీలతో ప్రమేయం లేని వ్యక్తులు కూడా వుంటారని వాళ్లు మరచిపోతున్నారు. చాలా దురదృష్టకరం.
ప్రస్తుతం ఈ ధోరణి కాఫీ డికాక్షన్ దిగినట్టు సోషల్ మీడియాలో విశృంఖలంగా వీర విహారం చేస్తోంది. సినీ రంగానికే గతంలో పరిమితమైన ఈ మూఢ అభిమానం రాజకీయ పార్టీల విషయంలో కూడా ఊడలు దిగుతోంది. ప్రశ్నించేవారిని ప్రత్యర్దులుగా పరిగణించి మాట తూలే తత్వం ప్రబలుతోంది. విమర్శను, సద్విమర్శను ఒకే గాటన కట్టే సంస్కృతి పెచ్చరిల్లుతోంది. ఏ ప్రజాస్వామ్యం కోసం అయితే తమ పార్టీలు కంకణం కట్టుకుని ప్రజాక్షేత్రంలో వున్నాయో అనుదినం వల్లెవేసే ఈ వీరాభిమానులు, తమ రాతలు, వ్యాఖ్యలు ఆ ప్రజాస్వామ్య మూల సూత్రాలకే చేటు అనే విషయాన్ని విస్మరిస్తున్నారు.
అందుకే, అన్ని పార్టీల్లో ఉన్న ఆయా పార్టీల అభిమానులకి నా విజ్ఞప్తి.
మీ రాతలు, చేష్టలు, ఇంతవరకు ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా లేని తటస్థులను మీ పార్టీ వైపు ఆకర్షించే విధంగా వుండాలి. ఇప్పటికే మీ పార్టీలో ఉన్నవారిని మరింతగా ఆకట్టుకోవడానికి పనికివస్తాయేమో తప్ప, మీ పార్టీకి లేని కొత్త జవసత్వాలను అవి సమకూర్చలేవు.
కన్ను పోయే కాటుక కూడదు. (27-01-2022)

కామెంట్‌లు లేవు: