18, జనవరి 2022, మంగళవారం

మాస్కోలో మా ఆవిడ విగ్రహం వేయాలనేది నటాషా

కొన్ని వింటున్నప్పుడు, మరి కొన్ని చూస్తున్నప్పుడు ఎప్పుడో విన్న, ఎన్నడో కన్న సంగతులు, విన్న వింతలు గుర్తుకు వస్తుంటాయి, మూగమనసులు సినిమాలాగా.

1964 లో అనుకుంటాను బెజవాడ లీలామహల్లో చూశాను క్లియోపాట్రా సినిమా. ఒక్కసారి కాదు అనేకసార్లు చూసాను అనేకమంది మాదిరిగానే. అప్పుడే విన్నాను ఆ రెండు పేర్లు, ఎలిజబెత్ టేలర్, రిచర్డ్ బర్టన్. ఆ సినిమా సెట్లపై వారిరువురి నడుమ పుష్పించిన ప్రేమ పెళ్ళికి దారితీసిందని పత్రికలు రాసాయి. (ఆ సినిమాలో ఆ ఇద్దరి నడుమా ఒక ముద్దు సీను వుంది. పెదవులు కలుపుకుని గట్టిగా ముద్దు పెట్టుకునే ఆ దృశ్యంలో ఇద్దరూ ఎంతగా ఒళ్ళు మరిచిపోయారంటే, దర్శకుడు కల్పించుకుని ‘కట్ కట్’ అని అంతకంటే గట్టిగా అరవాల్సి వచ్చిందట) అప్పట్లో అదో సంచలనం. కారణం ఆ ఇద్దరికీ అది మొదటి పెళ్లి కాకపోవడం. అప్పటికే పెళ్లి చేసుకుని సంసారాలు చేస్తున్న ఆ ఇరువురూ విడాకులు తీసుకుని తమ జీవిత సహచరులతో విడిపోయి మళ్ళీ పెళ్ళాడారు. హాలీవుడ్ లో అదో కొత్త విషయం కాదు కాని ఇండియాలో ఇలాంటి కబుర్లు వింతగానే చెప్పుకుంటారు. అలాగే చెప్పుకున్నారు కూడా. ఒక పదేళ్ళు వారి సంసారం బాగానే సాగింది. పాతొక రోత సామెత మాదిరిగా ఇద్దరికీ సరిపడక విడాకులు తీసేసుకుని మళ్ళీ తమకు నచ్చిన పెళ్ళిళ్ళు ఎంచక్కా చేసుకున్నారు. కధ అంతటితో ఆగలేదు. అలా విడిపోయిన వీరిరువురూ ఏదో సందర్భంలో మళ్ళీ కలుసుకున్నారు. పాత ప్రేమ మళ్ళీ మారాకు తొడిగింది. అంతే! ఏడాది తిరక్కుండానే పాత మొగుడికి టేలరు, పాత భార్యకు బర్టను టాటా చెప్పేసి మళ్ళీ మరోసారి పెళ్లి చేసుకుని కొత్తగా భార్యాభర్తలు అయ్యారు. కానీ పెళ్ళాడి కొన్ని వారాలు గడిచాయో లేదో కధ మళ్ళీ మొదటికి వచ్చింది. కాపురం చివరికి వచ్చింది. మళ్ళీ విడిపోవడమే వారికి మిగిలింది.

కొసరాఖరు:

నేను మాస్కోలో రేడియో మాస్కోలో పనిచేస్తున్న రోజుల్లో తెలుగు విభాగంలో నా రష్యన్ సహచరులు లిదా స్పిర్నోవాతో పాటు, విక్టర్, గీర్మన్ లు పనిచేసేవారు. ఈ ముగ్గురికీ తెలుగు వచ్చు. మరో ఇద్దరు నటాషా, సెర్గీలకు రష్యన్ తప్ప మరో భాష తెలియదు. వాళ్ళతో నా మాటామంతీ సైగలతోనే సాగేది. సజావుగా పని చేసుకోవడానికి మా మధ్య భాష ఎంతమాత్రం అడ్డంకి కాలేదు. వీళ్ళల్లో నటాషా మరీ చిన్న పిల్ల. ఇరవై నిండకుండానే ఇద్దరికి విడాకులు ఇచ్చి మూడో మొగుడితో కాపురం చేస్తోంది. రష్యన్లకు ఇవన్నీ చాలా మామూలు. మా ఆవిడ శిలావిగ్రహం మాస్కో పుర వీధుల్లో వేయించాలని సరదాగా జోక్ చేస్తుండేది. ఎందుకంటే, పెళ్ళయి పదహారేళ్ళు (అప్పటికి) అవుతున్నా ఇంకా అదే మొగుడితో కాపురం చేస్తున్నందుకట.(కీర్తిశేషులు మా ఆవిడ నిర్మల)


కామెంట్‌లు లేవు: