30, జనవరి 2022, ఆదివారం

ఈరోజు మహాత్ముడు మరణించిన రోజు – భండారు శ్రీనివాసరావు


ఎవరీ గాంధి?
1969
మహాత్మాగాంధీ శతజయంతి సంవత్సరం. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని జర్మని నుంచి ఒక ప్రొఫెసర్ భారత దేశానికి వచ్చారు. ఆయన ఆ దేశంలోని అతి పురాతనమైన విశ్వవిద్యాలయం హైడల్ బర్గ్ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. పేరు డాక్టర్ మర్ల శర్మ. వారిది కాకినాడ. పై చదువుల కోసం జర్మనీ వెళ్లి అక్కడే స్థిర పడ్డారు. గాంధి గారు పుట్టి వందేళ్ళు గడుస్తున్న సందర్భంలో భారత దేశంలోని గ్రామీణ ప్రాంతాల వాళ్ళు గాంధీని గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుని ఒక పరిశోధనా పత్రం తయారు చేసే పని పెట్టుకుని వచ్చారు. ఆ రోజుల్లో నేను విజయవాడ ఎస్సారార్ కాలేజీలో డిగ్రీ చేస్తున్నాను. ఆయన పరిశోధనలో చేదోడువాదోడుగా వుండే అవకాశం నాకు లబించింది. అందులో భాగంగా నేను శర్మగారితో కలిసి (ఉమ్మడి) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక గ్రామాలు తిరిగాను.
‘మహాత్మాగాంధి ఎవరు?’ అనేది శర్మగారు ముందే తయారు చేసుకొచ్చిన ప్రశ్నావళిలో మొట్టమొదటిది. వూరి పేరు గుర్తు లేదు కానీ పట్టుమని పాతిక గడప కూడా లేని ఓ మారుమూల గ్రామంలో ఒక నడికారు మనిషిని ఇదే ప్రశ్న అడిగితే, ఆమె జవాబుగా తన కుమారుడిని చూపించింది. అతడి పేరు గాంధి. మహాత్మాగాంధీ హత్యకు గురైన తర్వాత పుట్టిన తొలిచూలు బిడ్డడు అతడు. మహాత్ముడి మీది గౌరవంతో కొడుక్కి గాంధి అని పేరు పెట్టుకుంది. స్వాతంత్ర ప్రదాత అనే కృతజ్ఞతతో ఆ రోజుల్లో వేలాదిమంది తమ సంతానానికి గాంధీ పేరు పెట్టుకున్నారు. వారిలో ఎంతమంది తమ నడవడికతో ఆ పేరుకు న్యాయం చేకూర్చారో తెలుసుకోవాలంటే మరో విదేశీ యూనివర్సిటీ పూనుకోవాలి.
అది అప్పటి మాట.
దశాబ్దాలు గడిచిన తర్వాత మా పక్కింటి పిల్లవాడు తల్లిని అడుగుతుంటే విన్నాను, ‘మమ్మీ! గాంధి అంటే ఎవరు? ఈరోజు నేను స్కూల్లో మాట్లాడాలి. నా ఫ్రెండ్ గోపి ఏమో, రాహుల్ గాంధి గ్రాండ్ పా అంటున్నాడు, కరక్టేనా!’
ఈ పిల్లవాడి ప్రశ్న కంటే ఆ తల్లి ఇచ్చిన జవాబు నన్ను మరింత ఆశ్చర్యానికి గురి చేసింది. ‘నన్ను విసిగించకురా! వెళ్లి గూగుల్ లో వెతుక్కో’
ఈ నేపధ్యంలో మహాత్మా గాంధి ఆయన బోధనలు, ప్రబోధాలు నేటి తరానికి ఏ మేరకు శిరోధార్యాలు అనే పెద్ద ప్రశ్న నా ముందు నిలిచింది.
మహాత్మాగాంధీ తన జీవిత కాలంలో ఎన్నో చెప్పారు. ఎన్నో రాశారు. ఈ విషయంలో ఆయనది ఒక రికార్డు అనే చెప్పాలి. తన దృష్టికి వచ్చిన ప్రతి ఉత్తరానికీ, సామాన్యులు, అసామాన్యులు అనే బేధం లేకుండా స్వదస్తూరీతో ఓ కార్డు ముక్కపై జవాబు రాయడం ఆయనకు ఓ అలవాటు. ఆయన సూక్తులూ, బోధనలు వర్తమానానికికూడా వర్తిస్తాయంటూ గాంధి జయంతి, వర్ధంతి రోజుల్లో నాయకులు చేసే షరామామూలు ప్రసంగాలతో జాతి జనుల చెవులు చిల్లులు పడివుంటాయి. ఆచరణకు వచ్చేసరికి హళ్లికి హళ్లి. సున్నకు సున్నా.
భారతీయ సమాజంలో వైరుధ్యాలు, అసమానతలు నానాటికి పెరిగిపోతున్నాయి. పెరగడమే కాదు, మరింత తీవ్రస్వరూపం ధరిస్తున్నాయి. సంపదలు పెరుగుతున్నా దేశంలో కోట్లాది సామాన్య ప్రజలకు వాటి పంపిణీ సక్రమంగా జరగడం లేదు. పేదలు నిరుపేదలు అవుతున్నారు. సంపన్నులు కోట్లకు పడగెత్తుతున్నారు. సామాన్యుల జీవన ప్రమాణాలు పాతాళంలోకి దిగజారుతుంటే, కలవారి జీవన ప్రమాణాలు అంతరిక్షాన్ని తాకుతున్నాయి. దేశంలో సంపదలు పెరిగాయి. సంపదలతో పాటు వైరుధ్యాలు, అసమానతలు పెరిగాయి. పెరిగిన సంపదలలో 73 శాతం భారత జనాభాలో కేవలం ఒక శాతం వున్న శ్రీమంతుల గుప్పిట్లోకి వెళ్లాయి. ఇవన్నీ చూస్తున్నప్పుడు గాంధి పుట్టిన దేశమా ఇది? అనే అనుమానం కలక్కమానదు. బహుశా ఆయన మళ్ళీ పుట్టి ఈ దేశాన్ని చూస్తుంటే ఆయనకు కూడా తప్పకుండా ఇలాంటి సందేహమే పొటమరించి వుండేదేమో! ఎందుకంటే ఆయన స్వతంత్ర భారతం గ్రామీణ భారత పునాదులపై నిర్మించబడాలి అని బలంగా కోరుకున్నారు. గ్రామస్వరాజ్యమే దేశ స్వరాజ్యం అని నమ్మిన నాయకుడాయన.
అలా అని దేశం పరిస్తితి మరీ ఘోరంగా వుందని అర్ధం కాదు. ఎన్నో అవలక్షణాల నడుమ కూడా పురోగతి చుక్కల్ని తాకుతున్నమాట సైతం అవాస్తవం కాదు. కాకపోతే ఆనాడు మహాత్మా గాంధి కన్న కలల ప్రకారం సాగుతోందా అంటే అనుమానమే.
మహాత్ముడి బోధనలలో సర్వకాలాలకు వర్తించేవి వున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా మార్చుకోవాల్సినవీ వున్నాయి. మహాత్ముడు రాట్నం వడికి తీసిన నూలు దుస్తులు ధరించమని ప్రజలకు చెప్పారు. ఆనాడు ఆయన ఉద్దేశ్యం ఖద్దరును ప్రోత్సహిస్తే విదేశాలపై ఆధారపడాల్సిన అవసరం వుండదు అన్నది కావచ్చు. మరి నేటి తరం ‘రాటం మాకిప్పుడు కాదు వాటం’ అంటోంది. విదేశీవస్తు బహిష్కరణకు గాంధి నాడు పిలుపు ఇస్తే దేశవ్యాప్తంగా ప్రజలు ఉవ్వెత్తున స్పందించి తమ దుస్తులు మూటలు కట్టి తీసుకొచ్చి నడివీధుల్లో గుట్టలుగా పోసి తగలబెట్టారు. మహాత్ముడి మాటకు జనాలు ఎలాంటి విలువ ఇచ్చారో తెలుసుకోవడానికి ఇలాంటి దృష్టాంతాలు కోకొల్లలు.
‘గమ్యం (లక్ష్యం) ఎంత గొప్పదిగా పరిశుద్ధంగా వుండాలని కోరుకుంటామో, ఆ లక్ష్య సాధనకు మనం అనుసరించే మార్గాలు కూడా అంతే పవిత్రంగా వుండాలి’ అని మహాత్ముడు చెప్పిన సూక్తిని ఆయనకు ఏకలవ్య శిష్యుడిగా ప్రపంచం పరిగణించిన నల్ల జాతి నాయకుడు మార్టిన్ లూధర్ కింగ్ తరచూ పేర్కొంటూ వుండేవారు. మహాత్ముడు ప్రబోధించిన అహింసావాదాన్ని ఆయన మనసా వాచా కర్మణా నమ్మి ఆయన తన ఉద్యమాన్ని నడిపారు. ఏ దేశంలో అయితే వర్ణ వివక్షకు వ్యతిరేక పోరాటాన్ని మహాత్ముడు ప్రారంభించారో ఆ దేశమే తదనంతర కాలంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ప్రతిష్టించి నివాళులు అర్పించిందంటే ఆయన బోధనల లోని ప్రభావం అంత గొప్పదని అవగతమవుతుంది.
నిజానికి మహాత్ముడి బోధనల అవసరం ఆనాటి రోజులకంటే ఈనాడే ఎక్కువగా వుంది. కానీ వాటిని విదేశాల్లో వారు పాటిస్తూ, గౌరవిస్తుంటే, మనం మాత్రం జయంతులు, వర్ధంతుల సందర్భాల్లో ఇచ్చే సందేశాలకు పరిమితం చేసి సంతోషపడుతున్నాం. మోహన్ దాస్ కరం చంద్ గాంధి అనే మహానీయుడు నడయాడిన నేలమీదనే మనమూ నడుస్తున్నాం అనే స్పృహను కోల్పోతున్నాం. పైగా ఆయనకు మహాత్ముడు అనే బిరుదు ఎవరిచ్చారు అనే అర్ధ రహితమైన చర్చలతో కాలక్షేపం చేస్తున్నాం.
‘ఇది తగునా!’ అనే ప్రస్తావన మనకు రాదు. ఎందుకంటే మహాత్మా గాంధి అంటే ఎవరు అనే ప్రశ్నకు జవాబు చెప్పాలంటే గూగుల్ వెతుక్కోవాల్సిన దుస్తితిలో వున్నాం. ఇక ముందు కూడా వుంటాం. కారణం గాంధీతో కానీ, ఆయన సూక్తులతో కానీ నేటి యువతరానికి అవసరం లేదు. పాత తరం పట్టించుకునే పరిస్తితిలో లేదు.





(30-01-2022)

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

https://swarajyamag.com/ideas/dismantling-sainthood-ambedkar-on-gandhi

This article by reputed analyst, opinion maker and scientist , Anand Ranganathan will provide deep insight into the relation between Gandhi and Ambedkar.


Ahimsa will not work always. Dushta shikshana is equally important. Akhanda movie has rightly presented the importance of Dharma Yuddham which is in line with Sri Krishna's teachings in Bhagawad Gita.