22, జనవరి 2022, శనివారం

ప్రధాని గారూ! మీరు బూట్లెక్కడ కొన్నారు? – భండారు శ్రీనివాసరావు

 దాదాపు ముప్పయ్యేళ్ల క్రితం నేను మాస్కోలో, రేడియో మాస్కోలో పనిచేసే రోజుల్లో ....

ఓ రోజు ఆఫీసులో పనిచేసే రష్యన్ సహోద్యోగి విక్టర్ పత్రికలో పడిన జోకును రష్యన్ యాసలో తెలుగులోకి అనువదించి చెప్పారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, అది అర్ధం కాగానే. అది జోకేమీ కాదు. నిజానికది ఆ దేశ ప్రధాన మంత్రి నికోలాయ్ రిజికోవ్ గురించిన వార్త. ఇనుపతెర దేశంగా పాశ్చాత్య ప్రపంచం ముద్రవేసిన సోవియట్ రష్యాలో అలాటి వార్త నిజంగా వార్తే.

ప్రధానమంత్రి ఏదో కార్యక్రమంలో పాల్గొన్న ఫోటో ఓ పత్రికలో వేసారు. బూట్లు,సాక్సు వేసుకుని ఫోటోలో కానవస్తున్న ప్రధానికి ఆ పత్రిక పాఠకుడు రాసిన బహిరంగ లేఖను అదే పత్రికలో ప్రచురించారు. నా రష్యన్ సహచరుడు విక్టర్   దాన్ని  ఒక జోకుగా నాకు చదివి వినిపించాడు. ఆ లేఖ సారాంశం ఇది.

అయ్యా! ప్రధానమంత్రి గారు. బూట్లు సాక్సుకోసం గత ఆరుమాసాలుగా నేను తిరగని దుకాణం లేదు. మీరు ఎక్కడ కొన్నారో చెప్పి కాస్త పుణ్యం కట్టుకోండి’

నేను మాస్కో వెళ్ళిన కొత్తల్లో ఆఫీసులో ఎవ్వరు కూడా, జోకుల సంగతి అటుంచి, అవసరం అయిన దానికంటే ఎక్కువ తక్కువ మాట్లాడేవాళ్ళు కాదు. అలాంటిది ఏకంగా దేశ  ప్రధాన మంత్రి గురించి, అందులోను ఆయన వేసుకున్న బూట్లూ సాక్సూ గురించీ, వాటికి ఏర్పడ్డ కొరత గురించీ పత్రికకు అలా బహిరంగ లేఖ రాయడం, దాన్ని వాళ్ళు ప్రచురించడం, మళ్ళీ ఆ విషయం గురించి ఆఫీసుల్లో బాహాటంగా చర్చించుకోవడం ఇవన్నీ చూస్తుంటే చాలా చాలా ఆశ్చర్యం వేసింది. ఇండియా నుంచి వెళ్ళే ముందు సోవియట్ యూనియన్ గురించి అప్పటివరకు కర్ణాకర్ణిగా విన్నది వేరు, కళ్ళారా చూస్తున్నది వేరుగా ఉండడమే దీనికి కారణం. సోవియట్ గూఢచారి వ్యవస్థ, కేజీబీకి చెందిన ఏజెంట్లు తమ చారచక్షువులతో సమస్తం గమనిస్తుంటారని, ఆఖరికి భార్యాభర్తల నడుమ జరిగే సంభాషణలను సైతం రహస్యంగా వింటు౦టారని ఎన్నో కధలు అప్పుడు ప్రచారంలో ఉండేవి. నేను మాస్కో వెళ్ళేటప్పుడు ఓ జర్నలిష్టు మిత్రుడు జోక్ చేశాడు కూడా, “శ్రీనివాసరావు మాట్లాడకుండా బతకలేడు, అక్కడ మాట్లాడితే (నోరు తెరిస్తే) బతకలేరు” అని.   

ఈ నేపధ్యంలో మాస్కో వచ్చిన నాకు,  సోవియట్ రష్యాలో నిత్యావసర వస్తువుల కొరత గురించి ఒక సాధారణ పౌరుడు ఏకంగా దేశ ప్రధాన మంత్రిని ఉటంకిస్తూ వ్యంగ ధోరణిలో పత్రికకు ఉత్తరం రాయడం ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశం నుంచి వెళ్ళిన చాలా  అబ్బురం అనిపించింది.

ఒక విషయం ఒప్పుకుని తీరాలి. గ్లాస్ నోస్త్, పెరిస్తోయికా పేరుతొ అనేక సంస్కరణలు ప్రవేశపెట్టిన సోవియట్ అధినేత మిహాయిల్ గోర్భచేవ్ పౌరులకు చేసిన మేలేమిటో నాకు తెలియదు కానీ, ప్రజలు ప్రగాడంగా కోరుకుంటున్న వాక్స్వాతంత్రం మాత్రం పుష్కలంగా ప్రసాదించాడని నాకు అర్ధం అయింది. నిజానికి జీవించడానికి ఏమేమి కావాలో అవన్నీ అక్కడ వున్నాయి. పైగా కారుచౌకగా. లేనిదల్లా మనసులో మాట బయట పెట్ట గలిగిన స్వేచ్చ ఒక్కటే. గోర్భచేవ్ పుణ్యమా అని అదొక్కటీ దొరకడం వారికి ఎన్నడూ ఊహించని వరప్రసాదంగా భావించి వుంటారు.

ఆ కమ్యూనిస్టు దేశంలో ఇలా మొదలైన మార్పు, మార్పు అనే పదానికంటే గొప్పగా మార్పు చెందడమే నేనున్న అయిదేళ్ళ కాలంలో నేను చూసిన మార్పు. అందుకే నా మాస్కో అనుభవాల సమాహారానికి ‘మార్పు చూసిన కళ్ళు’ అని పేరు పెట్టుకున్నాను.

మార్పు అనేది ఎలా వుంటుందో తెలియకుండా సుమారు ఏడు దశాబ్దాలకు పైగా జీవించిన రష్యన్లకు తమ జీవితాల్లో పెను మార్పులు రాబోతున్నాయని ఏనాడూ ఊహించి వుండరు. చాప కింది నీరులా మార్పులు కనీ కనబడకుండా ప్రవేశిస్తున్న సంగతి మా మాస్కో మజిలీ చివరాఖరు రోజుల్లో మాకు కూడా బోధ పడింది. ఈ మార్పుల పర్యవసానం చివరికి మాస్కో రేడియో విదేశీ ప్రసారాలు మూతపడేంతవరకు దారి తీసింది.

సోవియట్ల అధికారానికి అంతిమ ఘడియలు దాపురిస్తున్నాయనడానికి సంకేతంగా మాస్కో రేడియోనుంచి వెలువడే అనేక ప్రపంచ భాషలు, వివిధ భారతీయ భాషల్లో ప్రసారాలను చాలావరకు నిలిపివేశారు. ఇక ప్రచారం అనవసరం అనుకున్నారేమో తెలియదు. ఆ క్రమంలో  చిట్టచివర్లో నిలిపివేసిన దక్షిణాది భారతీయ భాషల్లో తెలుగు విభాగం ఒకటి.

ఉపసంహారం: రష్యా నుంచి, అంటే అప్పటికింకా సోవియట్ యూనియనే, శాశ్వతంగా సొంత గడ్డకు తిరిగి వచ్చే ముందు  మాస్కో రేడియో తెలుగు విభాగం ఆఖరు బులిటెన్లో   ధైర్యం చేసి చెప్పిన చివరి పలుకులివి:

మాస్కో రేడియో నుంచి తెలుగులో వార్తలు ఇంతటితో ‘శాశ్వతంగా సమాప్తం”

 

కామెంట్‌లు లేవు: