6, జనవరి 2019, ఆదివారం

అయోమయంలో ఏపీ రాజకీయం – భండారు శ్రీనివాసరావు


(PUBLISHED IN ‘SURYA’ TELUGU DAILY IN IT’S EDIT PAGE ON 06-01-2019, SUNDAY)

ఎవరి వెనక ఎవరు? ఎవరితో ఎవరు? ఎవరు ఎవరిచేత ఏమి పలికిస్తున్నారు? ఎవరు పలికిస్తే ఎవరు పలుకుతున్నారు. ఇంతకీ  పలికెడు వాడెవ్వడు? పలికించెడు వాడెవ్వడు?
‘ఈ పార్టీకి ఆ పలానా పార్టీతో చాటుమాటు సంబంధాలు ఉన్నాయి. ఆ పలానా పార్టీకి ఈ పార్టీతో పైకి చెప్పుకోలేని అవగాహనలు  ఉన్నాయి.’
ప్రతిరోజూ మీడియాలో, పత్రికల్లో  ఇలాంటి పలుకులే. ఇలాంటి ప్రకటనలే.
ఇవన్నీ జనాల్లో వినిపిస్తున్న మాటలు కాదు. గిట్టనివాళ్ళు పుట్టిస్తున్న పుకార్లు కాదు. ఏకంగా ఆయా పార్టీల అగ్రనాయకులే ఇలాటి వ్యాఖ్యలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో లేనిపోని అయోమయం నింపుతున్నారు.
ఒకానొక కాలంలో రాజకీయ పార్టీలు తమదైన సిద్ధాంతాలతో, కార్యాచరణ ప్రణాళికలతో తీర్పు కోరుతూ ప్రజల ముందుకు వెళ్ళేవి. ఒక పార్టీని ఓడించడానికి మరి కొన్నిపార్టీలు జతకూడితే, ఆ పొత్తును  అపవిత్ర కలయిక అని జనం  ఏవగించుకునేవారు. సిద్ధాంతాలకు దూరం జరిగితే ఆ పార్టీని దూరం పెట్టేవారు.
ఆ శకం ఏనాడో ముగిసిపోయింది.
సంకీర్ణ ప్రభుత్వాల యుగం వచ్చాక ఈ కలయికలు, విలీనాలు, పొత్తులు  ఇలాంటి మాటలన్నీ రాజకీయ నిఘంటువుల్లో మర్యాదస్తులు ఉపయోగించే పదాలుగా రూపాంతరం చెందాయి.
ఇప్పుడాకాలానికి కూడా కాలం చెల్లిందేమో అనిపిస్తోంది. ఒక పార్టీకి మరో పార్టీతో సంబంధం అంటగట్టి అదేదో బయట పెట్టాల్సిన బాధ్యత ఆ పార్టీలదే అనే కొత్త వాదాలు పుట్టుకొస్తున్నాయి. రావణవధ అనంతరం అగ్నిప్రవేశం  చేయడం ద్వారా తన సచ్చీలతను నిరూపించుకునే బాధ్యతను సీతమ్మ వారిపైనే శ్రీరాముడు  ఉంచిన విధంగా వర్తమాన కాలంలో రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. తాము చేసే ఆరోపణలనుంచి అగ్నిపునీతలుగా బయటకు రావాలని ప్రత్యర్ధి పార్టీలను పట్టుబడుతున్నాయి.         
కంటికి కనబడేదంతా నిజం కాదంటారు.  అలాగని కంటికి కనబడేదంతా అబద్ధమూ కాదు. ఈ రీతిలో సాగుతున్నాయి ఏపీ రాజకీయాలు. ప్రజల్ని అయోమయంలో ముంచెత్తుతున్నాయి. ఇది మాత్రం వాస్తవం.
బీజేపీ, వైసీపీ, టీఆర్ఎస్ ఒకే పార్టీకి మూడు ముఖాలు అంటుంది టీడీపీ. కొంతకాలం క్రితం వరకు ఇదే పార్టీ, జగన్ పార్టీ  వైసీపీ, పవన్ పార్టీ జనసేన ఒకటే అని వాదించింది. ఇంకా కొంచెం వెనక్కి పొతే అంటే 2014 ఎన్నికలకు ముందు తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అంటూ కాంగ్రెస్, వైసీపీలను ఎద్దేవా చేసింది. వైసీపీకి ఓటేస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్టే అని ప్రచారం  చేసింది. ఎందుకంటే రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించిన  దుర్మార్గపు పార్టీ అనే నిందను కాంగ్రెస్ ఆ రోజుల్లో మోస్తోంది. ఇప్పుడు బీజేపీతో సంబంధాలు చెడిన తర్వాత ఆ పార్టీకి జగన్ పార్టీతో సంబంధం అంటగడుతోంది. ప్రస్తుతం ఏపీలో బీజేపీకి జనంలో మంచి పేరు లేకపోవడం వల్ల ఆ పార్టీతో వైసీపీకి ముడి పెడితే రాజకీయ ప్రయోజనం ఉండొచ్చని టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. అదే సమయంలో  బీజేపీతో తమకు ఎలాటి పొత్తూ ఎన్నికలకు ముందు వుండే చాన్స్ లేనే లేదని వైసీపీ ఖరాఖండీగా చెబుతోంది. ‘అవన్నీ పైకి చెప్పే మాటలు, లోలోపల ఆ రెండు పార్టీలకి పొత్తు వుందనేది బహిరంగ రహస్యం అంటుంది టీడీపీ.
ఒకప్పుడు జనసేన, టీడీపీ కలిసేవున్నాయి. 2014 ఎన్నికలకు ముందు, ఆతర్వాత కొంతకాలం ఆ రెండూ మిత్ర పక్షాలే. ఏ విమర్శ వచ్చినా దాన్ని ఎదుర్కోవడంలో ఒకదానికొకటి దన్నుగా నిలబడేవి. అప్పుడు రాష్ట్రంలో బీజేపీది ఇదే వరస. ఒక మిత్రపక్షంగా టీడీపీకి అన్ని విషయాల్లో మద్దతు ఇచ్చేది. తెలుగుదేశం పార్టీ కూడా కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా గుడ్డిగా సమర్ధించిన రోజులు వున్నాయి.   ఏం జరిగిందో ఏమో! కాలక్రమంలో  ఈ మూడు పార్టీలదీ వేర్వేరు దారులయ్యాయి. వీటిమధ్య  దూరం పెరిగింది. అఘాధం ఏర్పడింది.  టీడీపీ ప్రభుత్వంలో అవినీతి విచ్చల విడిగా పెరిగిపోతోందని జనసేనాని పవన్ అనేక సభల్లో ప్రసంగాలు చేయడం మొదలు పెట్టారు. ఈ ధోరణిని టీడీపీ హరాయించుకోలేక పోయింది.  మిత్రపక్షంగా ఇచ్చే కొన్ని సలహాలు కాసింత కఠినంగా వున్నా ఓర్చుకోవచ్చు. కానీ, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహనరెడ్డిని మించి విమర్శలు చేస్తుంటే  విని తట్టుకోలేని పరిస్తితి ఏర్పడింది. ఈ నేపధ్యంలో టీడీపీ ఎదురు దాడి మొదలుపెట్టక తప్పలేదు. అయినదానికీ, కానిదానికీ ఆరోపణలు చేస్తూ పోతుంటే ఎవరికి మాత్రం ఓపిక  ఎన్నాళ్ళు వుంటుంది?
ఓరిమి కోల్పోయిన టీడీపీ జనసేన, వైసీపీలపై విమర్శనాస్త్రాలు ఎక్కుబెట్టడం మొదలు పెట్టింది. ‘ఈ రెండూ మోడీ చేతిలో కీలుబొమ్మలు. బీజేపీ ఆడించినట్టు ఆడడమే వీరి పని’ అని ఘాటు విమర్శలకు దిగింది.
‘ఇదంతా వట్టిదే. ఆ రెండు పార్టీలు, జనసేన, టీడీపీ  ఎన్నికలనాటికి మళ్ళీ చెట్టాపట్టాలు వేసుకు తిరుగుతాయి, చూస్తూ ఉండండ’ని  వైసీపీ నాయకుల జోస్యం. ఈ మాట బయటకి రావడమే ఆలస్యం, ‘మేము జనసేనకు దగ్గరయితే వైసీపీకి ఏమిటి బాధ’ అంటూ టీడీపీ అధినేత బహిరంగ వ్యాఖ్యానం. వైసీపీ, బీజేపీల నడుమ రహస్య పొత్తు ఉందా లేదా అనే విషయం వైసీపీ నాయకుడు ముందు  స్పష్టం చేయాలని సవాలు.  
అసలు బీజేపీ , టీడీపీల నడుమ స్నేహ బంధం తెగిపోలేదని, తెగినట్టు నాటకం ఆడుతున్నారని, ఎన్నికల ఘడియ దగ్గర పడే వేళకు 2014 నాటి ఆ మూడు పార్టీల పొత్తుల పునరుద్ధరణ ఖాయం అని వైసీపీ నాయకుల ఎద్దేవా. ఈ కారణం చేతనే రాష్ట్రంలో టీడీపీ అవినీతిని బీజేపీ బాహాటంగా ఖండించలేకపోతోందని, శ్వేత పత్రాల పేరుతొ టీడీపీ సాగించిన బీజేపీ వ్యతిరేక ప్రచారాన్ని ఎదిరించలేకపోతోందని, అంచేతే ప్రధాని మోడీ ఏపీ పర్యటన  వాయిదా వేసుకున్నారని వైసీపీ ఆరోపణ.
అంతేకాదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రధాని  మోడీని వీలుచిక్కిన ప్రతి సందర్భంలో ఎంతలేసి మాటలు అంటున్నా మోడీ కిమ్మనకుండా మిన్నకుండిపోవడాన్ని ఇందుకు ఉదాహరణగా వైసీపీ ఉదహరిస్తోంది. ఒక వార్తాసంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూడా బాబు గురించి మోడీ ప్రస్తావించక పోవడాన్ని ఆ పార్టీ పేర్కొంటోంది. తెలంగాణా ఎన్నికల్లో మహాకూటమి ఘోర పరాజయాన్ని గురించి మాట్లాడిన మోడీ ఆ కూటమి సూత్రధారి చంద్రబాబు ప్రస్తావన మాట మాత్రంగా కూడా తేకపోవడాన్ని వైసీపీ తప్పు పట్టింది.
‘చంద్రబాబు పైకి చెప్పుకుంటున్నట్టు నిజంగా ఆయన మోడీపై హోరాహోరీ పోరాడుతూ ఉన్నట్టయితే, వైసీపీ నుంచి టీడీపీ లోకి ఫిరాయించిన ఎంపీలపై ఈపాటికే అనర్హత వేటు పడివుండాలి. చట్ట ప్రకారం జరగాల్సిన అంశంలోనే  టీడీపీ పట్ల మోడీ  ఇలాంటి మెతకవైఖరి అవలంబిస్తుంటే ఇక వారిద్దరూ ప్రత్యర్ధులు అంటే నమ్మేదెవరు?’ అనే లా పాయింటు లాగుతోంది.
‘కలసిపోదాం’ అంటూ టీడీపీ అధినేత బహిరంగంగా ఇచ్చిన ఆహ్వానం పట్ల జనసేన వైఖరి సానుకూలంగా లేదు. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాలకు తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్ తో అందుకు బదులిచ్చారు.  ఇలాంటి ప్రకటనలు, వ్యాఖ్యల ద్వారా జనసేన శ్రేణుల్లో అయోమయం సృష్టించే టీడీపీ  వ్యూహాలకు  తాము పడబోమని జనసేన ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.    
తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పెట్టుకున్న పొత్తు ఏపీ ఎన్నికలవరకు కొనసాగుతుందా లేదా అని మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ నేతల అనుమానం. అయినా ఎందుకయినా మంచిదని, టీవీ చర్చల్లో గతంలో టీడీపీని సమర్దిస్తూ బీజేపీ నేతలు సమర్ధవంతంగా పోషించిన పాత్రలోకి వాళ్ళు  పరకాయ ప్రవేశం చేస్తున్నారు.
ఇలా రాష్ట్రంలోని మెజారిటీ పార్టీలు ఎదుటిపక్షంపై జనాలకు అనుమానాలు కలిగేలా వ్యవహారాలు సాగిస్తున్నారు. గత అనుభవాల దృష్ట్యా ఏదైనా జరగవచ్చనీ, ఎవరు ఎవరితో అయినా కలవవచ్చని, ఇంతోటిదానికి తలలు పగలగొట్టుకోవడం ఎందుకనే నిర్లిప్త పరిస్తితిలోకి ప్రజలు జారుకుంటున్నారు.
రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు అన్నింటికీ ‘లక్ష్యశుద్ధి’ పుష్కలంగా వుంది. అధికార పీఠం అధిరోహించడం ఆ లక్ష్యం. ఆ గమ్యాన్ని చేరుకునే మార్గం విషయంలోనే  ‘చిత్తశుద్ది’ కానరావడం లేదు. ఎలాగైనా సరే, ఏం చేసయినా సరే గమ్యాన్ని చేరుకోవడం ప్రధానం. ఎలా చేరామన్నది ముఖ్యం కాదు. చేరడం ఒక్కటే ప్రధానం. అందుకే ఇన్నిరకాల రాజకీయ విన్యాసాలు.
ఇవి గమనించిన తర్వాతే కాబోలు సాంఘిక మాధ్యమాల్లో రకరకాల వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి.
మచ్చుకు కొన్ని:     
 "మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరెందుకు ఖండించరు? మేము నిలదీస్తుంటే మీరెందుకు ఆ పార్టీని  నిలదీయరు?"
"
మీరు చేసేదే మేము చేస్తుంటే ఇక మా పార్టీ ఎందుకు?"
"స్క్రిప్ట్ పేపర్లు తారుమారయ్యాయా ఏమిటి! మన నాయకుడు ఆపార్టీ గురించి వేరే విధంగా మాట్లాడుతున్నాడు ప్రెస్ తో"
"
మారింది పేపర్లు కాదు, పార్టీ విధానం"
"సృష్టికర్త మాకు అప్పగించిన కర్తవ్యాన్ని రాజకీయ నేతలు తమ భుజానికెత్తుకున్నారు. ఈ లోకంలో మాకిక పనిలేకుండా పోయింది"
-
ఊసరవెల్లుల సంఘం
2014లో ఆయా పార్టీలు అనేక వాగ్దానాలు చేశాయి. ప్రజలు నమ్మి గద్దె ఎక్కించారు. వాటిల్లో అధిక శాతం నెరవేర్చామని, అదనంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసామని గద్దె ఎక్కిన  పాలక పక్షం చెప్పుకుంటోంది.  ప్రచారంలో చెప్పుకుంటున్న స్థాయిలో కాకపోయినా, అనేక రంగాల్లో మంచి అభివృద్ధి జరిగిన మాట వాస్తవం. కానీ రాజకీయ వికృత క్రీడల కారుమేఘాల్లో అది కనిపించకుండా పోతోంది. అది టీడీపీ దురదృష్టం.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నామసవత్సరంలో  ప్రవేశించింది.  మరో కొద్ది నెలల్లో అటు పార్లమెంటుకు, ఇటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జమిలి ఎన్నికలు జరుగుతాయి.
పాఠ్యప్రణాళిక పూర్తి కాకుండానే పార్టీలకి ప్రజాపరీక్షలు తోసుకువస్తున్నాయి. ఇక చేసేదేమీ లేక రాజకీయ పార్టీలు, ప్రజాస౦క్షేమాన్ని పక్కనబెట్టి  పైన చెప్పిన రాజకీయ వ్యూహ, ప్రతివ్యూహాలతో లక్ష్యసాధన పట్ల పూర్తిగా దృష్టి పెడుతున్నాయి.
ప్రజల తీర్పు వెలువడేలోపల ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరెన్ని మలుపులు తిరుగుతాయో, ఎవరు ఎవరితో జత కడతారో, ఎవరు ఎవరినుంచి దూరం జరుగుతారో ఇప్పటికిప్పుడే చెప్పడం కష్టం. అవకాశవాదానికి అగ్రతాంబూలం లభిస్తున్న ఈ సంకీర్ణ రాజకీయ యుగంలో ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పడం మరింత కష్టం.

5 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

TDP lost its credibility by aligning with congress. Rest is drama.

అజ్ఞాత చెప్పారు...

ఇంతకీ తమరు ఏమి చెప్పదలచుకొన్నారు.

Jai Gottimukkala చెప్పారు...

"ప్రచారంలో చెప్పుకుంటున్న స్థాయిలో కాకపోయినా, అనేక రంగాల్లో మంచి అభివృద్ధి జరిగిన మాట వాస్తవం"

మీరు ఈ విషయాన్ని ఎలా నిర్ధారించారు? మీకంటూ సొంతంగా ఆధారాలు ఉంటే తప్ప ఇది కుదరదు.

మీకు మీడియా లేదా మధ్య/ఉన్నత తరగతి అగ్ర వర్ణాలకు చెందిన సూత్రాల నుండి కాకుండా నేరుగా బడుగు బలహీన బీదాబిక్కీ ప్రజల స్థితిగతులు వారి నోటి నుంచే తెలిసే అవకాశం దాదాపు సున్నా కాదంటారా?

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@అజ్ఞాత: నేను చెప్పదలచుకున్నదే.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Jai Gottimukkala: చెడిపోయిన గడియారం కూడా రోజుకు రెండు సార్లు కరక్టు టైము చూపిస్తుంది. ఏ ప్రభుత్వంలో అయినా ఎంతోకొంత అభివృద్ధి జరుగుతుంది.