10, ఆగస్టు 2016, బుధవారం

మా నాన్నే నా మొదటి శత్రువు

  
(ఒక కొడుకు చెప్పిన కధ)
“చిన్నప్పుడు మా నాన్నంటే  హడల్. ఆయన వస్తున్నాడంటే అందరం పరార్. ఆయన ఏం మాట్లాడినా హుంకరిచినట్టే వుండేది.  మీదపడి కరిచినట్టే వుండేది.  ఆయన ఇలా వుండాలి అంటే అలాగే వుండాలి. గీచిన గీటు దాటితే ఇంతే సంగతులు, వీపు విమానం మోతే.
“పొరపాటున కూడా రేడియో ముట్టుకోవడానికి వీల్లేదు. ఆయన బీరువా తెరవడానికి కుదరదు. ఇరుగింటికీ, పొరుగింటికీ చక్కర్లు కొట్టడానికి లేదు. వూరికే కూర్చుని ముచ్చట్లు పెట్టడానికి కుదరదు. చెప్పిన మాట ఏది వినకపోయినా, వినలేదని తెలిసినా బడితె పూజే.    
“మేం అల్లరి చేస్తే అమ్మ కూడా నాన్న ఇంటికి రానీ మీ సంగతి చెబుతా అని బెదిరించేది. మాట వినగానే మాకు కాళ్ళు చల్లబడేవి. అంతా గప్ చుప్. అంత భయం నాన్నంటే. నాన్నంటే  యముడు. అందుకే చిన్నతనంలో మా నాన్నే మాకు మొదటి శతృవు.   
“అదంతా ఎప్పటిదాకా మాకు కొంత తెలివిడి వచ్చేదాకా. పదిహేను మీదపడ్డాక కాని మా నాన్నలో దాగున్న అసలు మంచితనం  నాకు కనబడలేదు.  ఆయనే ఈయనా అనిపించేది. స్కూలు ఫీజు కనుక్కుని మరీ కట్టేవాడు. పుస్తకాల సంగతి సరేసరి. ఇంటికి వస్తూనే స్కూల్లో ఏం జరిగిందీ అన్నీ అడిగి తెలుసుకునే వాడు. పాకెట్ మనీ అడక్కుండానే పెంచేవాడు. మంచి మార్కులొస్తే శభాష్ అనేవాడు. చిన్న చిన్న  బహుమతులు ఇచ్చేవాడు. రాకపోతే పర్వాలేదు ఈసారి తెచ్చుకుందువు కాని అని ప్రోత్సహించేవాడు.
“ఇప్పుడు ఇంజినీరింగ్ చదువుతున్నాను. రేపో మాపో అమెరికా పై చదువులకు వెళ్ళబోతున్నాను. ఇదంతా మా నాన్న చలవే. సందేహం లేదు. చిన్నప్పుడు  అలా క్రమశిక్షణతో పెంచబట్టే ఇప్పుడిలా తయారుకాగలిగాను.
“ఎంతయినా నాన్న నాన్నే.
“కాకపొతే వాస్తవం బోధ పడడానికి పిల్లలకు  కొంత కాలం పడుతుంది.


2 కామెంట్‌లు:

Zilebi చెప్పారు...



మానాన్నే నాకొక దా
వానలమగు మొదటి శత్రువనియను కొంటిన్
నా నడతలు మారంగన్
తానయ్యె గదా జిలేబి తాజూబ్ తండ్రీ

జిలేబి

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

"'By the time you realise that your father was right, you will have a son who thinks you are wrong" అన్నడొకాయన జ్ఞానోదయమయిన తర్వాత. వయసు పెరుగుతున్న కొద్దీ తండ్రి ఏమిటో అర్ధమవుతూ ఉంటుంది.