1, ఆగస్టు 2016, సోమవారం

రేడియో భేరి - 10

లలిత సంగీతం
లలితసంగీతం విషయంలో హైదరాబాదు, విజయవాడ రేడియో కేంద్రాల నడుమ పోటీ వుండేది. ఈ రెండు కేంద్రాలు లలిత గీతాలతోపాటు సంగీత నాటకాలు, సంగీత రూపకాలు, యక్ష గానాలు ప్రసారం చేసేవి. 1955 నుంచి హైదరాబాదు కేంద్రం ప్రతి రోజూ ‘గీతావళి’ పేరిట లలిత గీతాలు ప్రసారం చేయసాగింది. దాశరధి, నారాయణరెడ్డి రాసిన పాటలను ఎన్నింటినో ప్రసారం చేసింది. 1957 లో దేవులపల్లి కృష్ణ శాస్త్రి హైదరాబాదు రేడియోలో ప్రయోక్తగా చేరారు. ఎనిమిదేళ్ళపాటు ఆకాశవాణిలో ఉద్యోగం చేశారు. ‘రేడియోవాళ్ళు నాచేత రాయించకపోతే నేను రాసిన దాంట్లో చాలా భాగం రాసివుండే వాణ్ణి కాదు’ అని ఆయన చెప్పేవారు.
1960 లో రజని సంగీత సంవిదానంతో కృష్ణ శాస్త్రి రాసిన ‘క్షీర సాగర మధనం’, ‘విప్రనారాయణ’, ‘మాళవిక’ యక్ష గానాలను హైదరాబాదు కేంద్రం ప్రసారం చేసింది.

జానపద సంగీతాన్నీ, జానపద కళారూపాలనూ పరిరక్షించడంలో హైదరాబాదు, విజయవాడ రేడియో కేంద్రాల కృషి ఎన్నదగ్గది. జానపద కళాకారులను రేడియో కేంద్రానికి పిలిపించి వారి పాటలను, సంగీతాన్ని స్టుడియోలో రికార్డ్ చేసి భద్రపరచడం ఒక ఎత్తయితే, ఆకాశవాణి బృందాలే మారుమూల గ్రామాల్లో వున్న కళాకారుల వద్దకు వెళ్ళి వారి సంగీతం రికార్డ్ చేసి ప్రసారం చేయడం మరో ఎత్తు. రేడియో ఆ రోజుల్లో ఈ కర్తవ్యాన్ని చాలా గొప్పగా నిర్వహించింది. ఆకాశవాణి పూనిక లేకుంటే, తెలుగు జానపద మౌఖిక కళారూపాలెన్నో మరుగున పడివుండేవి.
తెలుగువారికే ప్రత్యేకమైన పద్యాల ప్రసారం పట్ల కూడా ఆకాశవాణి ప్రత్యేక శ్రద్ధ చూపుతూ వుంటుంది. ‘సమస్యా పూరణం’ కార్యక్రమం సాహిత్య ప్రియులైన శ్రోతలకు ప్రియమైన రేడియో కార్యక్రమాల్లో ఒకటి. రంగస్థల పద్యాల పట్ల శ్రోతల్లో వుండే ఆసక్తిని గుర్తించి వాటినీ ప్రముఖ గళాల ద్వారా వినిపిస్తూ వుంటుంది.
ప్రసిద్ధ నాటకాలను పదిలపరిచే ప్రయత్నాలతో పాటు తన శబ్ద భాండాగారంలోని కొన్ని గొప్ప నాటకాలను కేసెట్లుగా, సీడీలుగా విడుదల చేసింది. ప్రముఖులు ఎందరో తాము ఆకాశవాణి కోసం చేసిన రచనలను పుస్తకాలుగా ప్రచురించిన విషయాన్ని కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాలి.
భాషా బోధనకోసం ఆకాశవాణి ప్రసారం చేసిన పాఠాలను, అలాగే సంస్కృత పాఠాలు చెప్పిన కేశవపంతుల నరసింహ శాస్త్రి, తెలుగులో రేడియో వార్తలకు వొరవడి దిద్దిన జగ్గయ్య, పన్యాల రంగనాధరావు వంటి వారిని మరచిపోవడం యెట్లా!
కార్యక్రమాల రూపకల్పనను ఉద్యోగ ధర్మం మాదిరిగా కాకుండా ఒక పవిత్రమైన కర్తవ్యంగా భావించిన వారెందరో ఆకాశవాణిలో పనిచేసి సంస్థకు మంచి గుర్తింపు తీసుకువచ్చారు. రేడియో ప్రయోక్తలుగా పనిచేసిన రోజుల్లో పింగళి లక్ష్మీకాంతం, నాయని సుబ్బారావు, దేవులపల్లి కృష్ణ శాస్త్రి, బందా కనక లింగేశ్వర రావు, ప్రసిద్ధ కవి గుర్రం జాషువా ప్రాతః స్మరణీయులు. ఆ కోవలోని వారే తదనంతర కాలంలో రేడియోలో పనిచేసిన డాక్టర్ రావూరి భరద్వాజ, తురగా జానకీరాణి, డాక్టర్. పీ. ఎస్. గోపాలకృష్ణ, ప్రయాగ వేదవతి మొదలైన వారు.
(ఇంకా వుంది)
(డాక్టర్ పీ.ఎస్.గోపాలకృష్ణ సౌజన్యంతో)

కామెంట్‌లు లేవు: