4, అక్టోబర్ 2015, ఆదివారం

తెగుతున్న తీగెలు


‘ఎందుకు అంకుల్ బ్యాంకు దాకా రావడం, ఇంట్లోనే కూర్చుని నెట్లో ట్రాన్సాక్షన్స్ చేసుకునే వీలుందిగా’ అన్నదా అమ్మాయి ఓచరుపై సంతకం చేయడానికి పెన్ను అడిగినప్పుడు. నిజమే. ఇంట్లో నుంచి కాలుబయట పెట్టకుండా అన్ని పనులు చేసుకునే సదుపాయాలు వున్నాయి. అయితే బ్యాంకుకు వస్తే నాలుగు మొఖాలు కనబడతాయి. ఏమండీ ఎలా ఉన్నారని పలకరిస్తారు ఎవరో ఒకరు. ఈ బ్యాంకుతో నలభయ్ ఏళ్ళ అనుబంధం. ప్రమోషన్లు కాదనుకుని ఉండిపోయిన ఉద్యోగులు ఎంతో మంది గుర్తు పడతారు. నా కళ్ళ ముందే ఆ బ్యాంకు బ్రాంచి ఎన్నో హంగులు సమకూర్చుకుంది. కంప్యూటర్ తెర వైపే చూస్తూ పనులు చేసుకుంటున్నారు. వచ్చిన కష్టమర్ మొఖాలను కూడా గుర్తు పట్టే పరిస్తితి లేదు. నన్ను  ఏళ్ళ తరబడి చూస్తున్న వాళ్ళు మాత్రం పలకరింపుగా నవ్వుతారు. కాస్త వీలు చిక్కితే వారితో మాట కలుపుతాను. అయితే అది కూడా ఈ మధ్య తక్కువే. కాస్త విరామం దొరికినా వాళ్ళు కష్టమర్ల మొహం చూడ్డం లేదు. సెల్ ఫోను కబుర్లే సరిపోతున్నాయి.
ఎందుకు బాబాయ్ హైరానా పడుతూ దుకాణాలకు వెళ్లి సరుకులు కొంటావ్? సెల్లో ఆర్డరు చేస్తే వాళ్ళే మీ ఇంటికి తెచ్చి పడేస్తారు  అంటాడు మా పక్క పోర్షన్ అబ్బాయి. అది నిజమే కానీ ఈ వయస్సులో మరి కాలక్షేపం ఎలా! కాలం దొర్లించాలంటే ఇలా ఏదో ఒక వ్యాపకం వుండాలి కదా! షాపు అతనికి నా అభిరుచులు తెలుసు. నా ఇష్టా ఇష్టాలు  తెలుసు. సారుకు పలానా బ్రాండు కారం ఇవ్వాలిరా. మరచిపోకు అంటాడు తన పనబ్బాయితో. చేసేది వ్యాపారం  అయినా ఎక్కడో సుతారంగా తాకుతాయి అతడి మాటలు.  మొన్నీ మధ్య వెడితే ఆ షాపు కూల్చేశారు. దగ్గర్లో వున్న  మాల్ కే వెళ్లాలి. అంతా కలయ  తిరుగుతూ, ట్రాలీ తోసుకుంటూ, దాన్ని నింపుకుంటూ, అవసరం లేని వాటిని కూడా కనబడ్డాయని కొనుక్కుంటూ ....అలా అలా కాలం దొర్లించడమే. మనుషులు కనబడుతూనే వుంటారు, మాటలకే కరువు.
యాభయ్ ఏళ్ళ క్రితం ఆ మనుషులే. ఇప్పుడూ ఆ మనుషులే. కానీ ఎక్కడో ఏదో తెగిపోతోంది. అతకడం తెలియడం లేదు.

(అచ్చంగా ఇలాగే కాకపోయినా ఈ మోస్తరు అభిప్రాయాలు వున్న ఇంగ్లీష్ పోస్ట్ పెట్టిన మా కోడలు హేమలీలకు కృతజ్ఞతలు)    
NOTE: Courtesy Image Owner

7 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

వేరే దేశం లో ఉన్నాను , యువకుడినే , దిగువ మధ్యతరగతి నేపధ్యం .
ట్రాలీ తోసుకుంటూ వెళ్తూ , చివరకి చూస్తె అక్కరలేనివి ఎన్నో .
ఒకప్పుడు ఒక గుడ్డు తో తింటే ఈ రోజు మూడు గుడ్లు కి తక్కువ కాకూడదు . ఎవరినీ నిన్దించలేనిది .
ఒకప్పుడు లేనిది ఏంటో , ఇప్పుడు ఉన్నది ఏంటో ..

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

మంచి టపా వ్రాసారు. మొదటి పేరాలో చెప్పిన కారణానికే పెన్షనర్లు ఒకప్పుడు ఒకటో తారీఖున బ్యాంకులకి స్వయంగా రావడమే ఎక్కువగా జరిగేది. బ్యాంకులు కూడా ఆరోజున వాళ్ళు కూర్చోడానికి పందిళ్ళు (షామియానా అనాలేమో) వేసి, త్రాగునీరు ఏర్పాటు చేసేవారు. కోలాహలంగా ఉండేది. మామూలు రోజుల్లో కూడా పెన్షనర్లు, వయసులో కొంచెం పెద్దవాళ్ళు, ఊళ్ళో పెద్దలు బ్యాంకుకి వచ్చి స్టాఫ్ తో కాస్సేపు కాలక్షేపం చేసి వెళ్ళేవారు (వాళ్ళు వచ్చిన పని అయిపోయిన తర్వాత కూడా). ఇప్పుడంతా టెక్నాలజీ మయం. ఏటీఎం లు, ఇంటర్నెట్ బ్యాంకింగులు. Human interaction తగ్గిపోయింది. మీరన్నట్లు కస్టమర్ కి కనిపించేది కంప్యూటర్ వెనక భాగమే. అసలు కస్టమర్ బ్యాంకుకి రావడాన్నే ప్రోత్సహించడంలేదు. కొన్ని బ్యాంకులయితే కస్టమర్ టెక్నాలజీ సౌకర్యాన్ని ఉపయోగించుకునే బదులు బ్యాంకుకి వచ్చినట్లయితే ఆ కస్టమర్ వద్దనుంచి handling charges వసూలు చేస్తున్నాయిట కూడా!
సరే సెల్ ఫోన్ల విశ్వరూపం ఒకటి - మనిషి ఎదుటి వాడి మొహంలోకి చూడడం కూదా లేదు, బటన్లు నొక్కుకుంటూ కూర్చుంటారు. షాపుల్లో కూడా అంతే - అక్కడ పనిచేసేవాళ్ళకి కస్టమర్ని అటెండ్ అవడం కన్నా సెల్ ఫోన్ స్క్రీన్ వైపు మైమరపుగాగా చూస్తూ కూర్చోవడమే ఇష్టం లాగా కనిపిస్తుంది.
టెక్నాలజీ ఉపయోగకరమే కానీ మీరన్నట్లు మానవసంబంధాల మధ్యనుండే ఓ fine thread తెగిపోతోంది. Long run లొ సమాజానికి మంచిది కాదు

Unknown చెప్పారు...

Evolution :).

chavera చెప్పారు...

విశ్రాంత జీవులకు మాటలెందుకూ?--excellent write up, thanks for the excellent thoughts.

hari.S.babu చెప్పారు...

రాను రానూ ఇంగ్లీషు సైన్సు ఫిక్షన్ సినిమాల్లో భవిష్యత్తులో ఇలా ఉండబోతాడు మనిషి అని చూపించే భయకరమైన ఆకారాల్లోకి నిజంగానే మారిపోతామా అనిపిస్తున్నది:-)

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

< "విశ్రాంత జీవులకు మాటలెందుకూ?"

?????
అలా అనేసారేమిటండీ?

Rao S Lakkaraju చెప్పారు...

‘ఎందుకు అంకుల్ బ్యాంకు దాకా రావడం, ఇంట్లోనే కూర్చుని నెట్లో ట్రాన్సాక్షన్స్ చేసుకునే వీలుందిగా’
ఎందుకు బాబాయ్ హైరానా పడుతూ దుకాణాలకు వెళ్లి సరుకులు కొంటావ్? సెల్లో ఆర్డరు చేస్తే వాళ్ళే మీ ఇంటికి తెచ్చి పడేస్తారు
---------------------------------------------------
వీళ్ళే రోజూ డబ్బులిచ్చి exercise కి జిమ్ కి వెళ్ళేది.