3, అక్టోబర్ 2015, శనివారం

బీహారు ఎన్నికల్లో హామీల తిరునాళ్ళు

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 04-10-2015, SUNDAY)    

కాకతాళీయం కావచ్చు కానీ బీహారు ఎన్నికలకు ముందు సుప్రీం కోర్టు ఎన్నికల వాగ్దానాల విషయంలో ఒక వింతైన తీర్పు ఇచ్చింది.
ఎన్నికల సమయంలో ఓటర్లకు గాలం  వేయడానికి వారికి ఉచితంగా కలర్ టెలివిజన్లు, ల్యాప్ టాప్ లు వగయిరా ఇస్తామని రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలు ప్రజా ప్రాతినిధ్య చట్టం లోని సెక్షన్ 123  కిందకు రావని, ఆ హామీలు అవినీతి చర్యలు కావని పేర్కొన్నది. ఎన్నికల్లో హామీలు ఇచ్చి అధికారంలోకి  వచ్చిన తరువాత వాటిని నెరవేర్చలేని పార్టీలపై చీటింగు కేసులు పెట్టాలని కోరుతూ దాఖలయిన ఒక ప్రజాహిత వ్యాజ్యాన్ని విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఈ తీర్పు వెలువరించింది.
ఇది కూడా కాకతాళీయం కావచ్చు కాని, ఈ తీర్పు వెలువడిన కొద్ది రోజులు కూడా గడవక ముందే బీహారు అసెంబ్లీ ఎన్నికల కోసం  భారతీయ జనతా పార్టీ ఒక విజన్ డాక్యుమెంటు విడుదల చేసింది. ఆకాశమే హద్దుగా ఈ పత్రంలో అనేక హామీలను గుప్పించారు. ప్రతి దళిత కుటుంబానికి కలర్ టీవీ, భూమిలేని వారికి అయిదు గుంటల పొలం, ప్రతి పేదమనిషికి  చీరె, ధోవతి, బాగా చదువుకునే యాభయ్ వేల మంది విద్యార్ధులకు ల్యాప్ టాపులు, విద్యార్ధినులకు  స్కూటీలు, ఇలా సాగిపోయిందా హామీల జాబితా.
నిజానికి రాజకీయాల్లో ఇది కొత్త విషయమేమీ కాదు. గతంలో కూడా అనేక రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షించడానికి ఇలాటి పిల్లి గంతులు అనేకానేకంగా వేసిన సందర్భాలు అనేకం వున్నాయి. నిరుడు ఫిబ్రవరిలో మన పొరుగున వున్న తమిళనాడులో అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత కురిపించిన వాగ్దాన వర్షంలో ఈ ఉచిత జాబితా చాంతాడంత పొడుగయింది. మిక్సీలు, గ్రైండర్లు, ఆవులు, మేకలు ఇలాటివన్నీ పప్పులూబెల్లాల మాదిరిగా  ఉదారంగా ఉచితంగా పంచిపెడతామని ఊదరగొట్టారు. ఇక దరిద్రాన్ని కలికానికి కూడా కనబడకుండా తరిమికొడతా మనీ, ఏకంగా పదికోట్ల ఉద్యోగాలు సృష్టించి నిరుద్యోగులకు ఇస్తామనీ ఇలాటి భారీ హామీలు కూడా అన్నాడీ ఎంకే ఎన్నికల ప్రణాళికలో పొందు పరిచారు.
పొతే, విభజిత తెలుగు రాష్ట్రాల్లో నిరుడు జరిగిన ఎన్నికల్లో ఆయా రాజకీయ పార్టీలు ప్రకటించిన వాగ్దానాలు ఎన్నికల ప్రణాళికల రూపురేఖల్నే సమూలంగా మార్చివేశాయి. అధికారంలోకి వచ్చిన మరుక్షణమే రైతుల రుణాలను మాఫీ చేస్తామనీ, అంచేత రుణ బకాయిలు చెల్లించకుండా వేచి చూడమనీ ప్రలోభ పెట్టాయి. ఒక దశలో ఎన్నికల కమీషన్ కల్పించుకుని ఈ హామీలు ఎలా అమలు చేస్తారని కూడా ప్రశ్నించింది. చిత్తశుద్ధి వుంటే సాధ్యమని ఆ రోజుల్లో ఆ పార్టీలు సంజాయిషీ ఇచ్చాయి. అధికారం పీఠం ఎక్కిన తరువాత కానీ ఈ హామీల అమలు యెంత దుస్సాధ్యం అన్నది ఎరుక కాలేదు. ఎన్నో మల్లగుల్లాలు పడితే కానీ ఈ ఒక్క హామీ అమలు ఓ కొలిక్కి రాలేదు. ఇప్పటికే పదిహేను మాసాలు గడిచిపోయాయి. రుణ మాఫీ చేయగలిగారా అంటే గట్టిగా జవాబు చెప్పలేని పరిస్తితి. ఒకవేళ చేశామని చెప్పుకున్నా ఎన్నో మినహాయింపులు, మరెన్నో కత్తిరింపులు. చివరికి షరతులు లేకుండా ఇచ్చిన హామీని షరతులతో నెరవేర్చుకోవాల్సిన దుస్తితి.
వాస్తవ పరిస్తితులు ఇలా వున్న  నేపధ్యంలో ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు రాజకీయ పార్టీల వాగ్దానాలకు అడ్డుకట్ట లేకుండా చేస్తోంది. ఎన్ని మాటలు చెప్పయినా సరే అధికారంలోకి రావాలనే రాజకీయ పక్షాలకు ఈ తీర్పు మంచి ఊరట ఇచ్చేదిగా వుంది. ఎందుకంటె -
“సుమతీ శతకాలు, సూక్తి ముక్తావళులూ ఎన్నికల్లో వోట్లు రాల్చవు” ఇది నేటి రాజకీయులు వొంటికి పట్టించుకున్న నగ్న సత్యం. ఈ విషయంలో ఏ పార్టీకి మినహాయింపులేదు. అందుకే వోటర్లని ప్రలోభపెట్టడానికి వారు తొక్కని అడ్డ దారులు వుండవు. వోటర్లని ఆకర్షించడానికి వేయని పిల్లి మొగ్గలు వుండవు. ఈ విషయంలో వెనుకడుగు వేసే పార్టీ అంటూ కలికానికి కూడా దొరకదు. అందుకే నరం లేని నాలుక, మండు  వేసవిలోనైనా సరే వారి చేత చల్లని హామీల వర్షం కురిపిస్తుంది. కలర్ టీవీలు, లాప్ టాపులు, నెలసరి భత్యాలు, నగదు బదిలీలు, భూసంతర్పణలు, పట్టు చీరెలు, పసుపు కుంకాలు, ఉచిత వైద్యాలు, ఆల్  ఫ్రీ చదువులు, బంగారు తల్లులు, కరెంటు మీది, బిల్లు మాది తరహా హామీలు – ఒకటా రెండా సెర్చ్ చేసి రీసెర్చ్ చేసి కనుక్కున్న సంక్షేమ పధకాలతో దట్టించి వోటర్లకు అరచేతిలో స్వర్గం చూపించే ఎన్నికల ప్రణాళికలు, అంతులేని వాగ్దానాలు. ప్రభుత్వ ఖర్చుతో, ప్రజలనుంచి ముక్కు పిండి వసూలు చేసి నింపిన ఖజానా డబ్బులతో ఇలా ఈ చేత్తో ఇచ్చి అలా ఆ చేత్తో వోట్లు రాబట్టి అధికార పీఠం కైవసం చేసుకోవాలని చూసే రాజకీయ పార్టీల ‘క్విడ్ ప్రోఖో’ ఎత్తులకు చెక్ చెప్పడం ఇప్పట్లో సాధ్యం అయ్యేలా లేదు.
వాగ్దానకర్ణుల మాదిరిగా ఎడాపెడా ప్రకటిస్తున్న తాయిలాలను ఎలా ఇస్తారన్నదానికి లెక్కలు లేవు. ఎన్నాళ్ళు ఇస్తారన్నదానికి జవాబులు లేవు. ఇందులో ఒకరు తక్కువ తిన్నదీ లేదు, ఎదుటి వాడిని తిననిచ్చిందీ లేదు. ఎన్నికల కోయిల ఇంకా సరిగ్గా కూయకముందే వివిధ రాజకీయ పార్టీలు చేస్తున్న వాగ్దానాలు, ఇస్తున్న హామీలు చూస్తుంటే అసలు మేనిఫెస్టోలో ఇంకెన్ని ఉంటాయో అన్నది జవాబులేని  భేతాళ ప్రశ్నగానే మిగిలిపోతోంది.

(కార్టూనిష్టుకు ప్రత్యేక కృతజ్ఞతలు)
      
ఉపశృతి: ఒక రాజకీయ నాయకుడు చనిపోయిన తరువాత యమ భటులు వచ్చి పట్టుకు పోయారు. తాను ప్రముఖుల జాబితాలో వున్న  వ్యక్తిని కాబట్టి తనను స్వర్గంలోకి అనుమతించాలని పట్టుబడతాడు. అయితే తమ నిబంధనల ప్రకారం ముందు ఒక రోజు నరకంలో గడపాలని, తరువాత ఏది కోరుకుంటే అక్కడికే పంపుతామని అక్కడి దేవదూత చెబుతాడు. సరే అని, ఒక యమభటుడ్ని  వెంట బెట్టుకుని ముందు నరకానికే వెడతాడానాయకుడు. నరకాన్ని చూసి అతడికి మూర్చ వచ్చినంత పనవుతుంది. నిజానికి అది తాను  ఊహించుకున్న స్వర్గం కన్నా మిన్నగా వుంది. సుందరమైన భవంతులు, పచ్చని మైదానాలు. అప్సరసలను తలదన్నే సుందరీమణులు అక్కడి నరకలోకవాసులకు తలలో నాలుకలా మెసలుతూ సకల పరిచర్యలూ చేస్తున్నారు. అవన్నీ  చూసిన మన రాజకీయ నాయకుడికి నరకంలోనే వుండిపోవాలన్న కోరిక కలుగుతుంది. తిరిగి వెళ్ళిన తరువాత తన మనసులోని మాట దేవదూతతో చెబుతాడు. అతడి అభీష్టం ప్రకారం మళ్ళీ అతగాడిని నరకానికే తీసుకువెడతారు. అయితే ఇరవై నాలుగ్గంటల్లో దృశ్యం  మొత్తం మారిపోతుంది. కళ్ళు చెదిరే భవంతుల స్థానంలో పూరిళ్ళు. పచ్చిక మైదానాలు, సెలయేళ్ల స్థానంలో ఎండిన పొలాలు. నీటి చుక్క జాడలేని వాగులువంకలు. అప్సరల స్థానంలో వికృత రూపాలతో, ఒళ్ళు జలదరించే చేష్టలతో రాక్షస స్త్రీలు. అది చూసి, ‘అన్యాయం, నిన్న నాకు చూపించిన నరకం ఇది కాదంటూ’ వాదనకు దిగిన నాయకుడితో దేవదూత అంటాడిలా.  ‘నిజమే! నిన్న చూసింది ఎన్నికల ప్రచార సమయంలో చెప్పిన మాటల్లాంటి దృశ్యాలు. ఇప్పుడు చూస్తున్నది గెలిచి వచ్చిన తరువాత పరిస్తితి. రాజకీయ నాయకులకు మరింత వివరంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను’  (03-10-2015)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595
      




కామెంట్‌లు లేవు: