28, అక్టోబర్ 2015, బుధవారం

ఇప్పుడే అందిన వార్త


1984 సెప్టెంబర్ 16 మధ్యాహ్నం ఒంటి గంటా ఇరవై నిమిషాలకు విజయవాడ రేడియో కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు మొదలయ్యాయి. కొద్దిసేపు గడిచిందో లేదో వార్తలు చదివే వ్యక్తి "ఇప్పుడే అందిన వార్త" అంటూ ఒక సంచలన వార్తను వినిపించారు.



"గవర్నర్ డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ ముఖ్యమంత్రి శ్రీ నాదెండ్ల భాస్కర రావు సమర్పించిన రాజీనామాను ఆమోదించారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు శ్రీ ఎన్టీ రామారావును ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాల్సిందిగా ఆహ్వానించారు" ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం సాధించిన విజయ సమాచారం ఆనాటి రేడియో వార్త ద్వారా రాష్ట్రం నలుమూలలకు చేరిపోయింది. ఆరోజు ఆవార్త చదివిన వ్యక్తి, ఆరోజుల్లో బెజవాడ ఆంద్రజ్యోతిలో పనిచేస్తున్న శ్రీ గారపాటి నరసింహారావు. తాత్కాలిక ప్రాతిపదికన ఆరోజు న్యూస్ రీడర్ గా ఆవార్తను ప్రజలకు అందించే అదృష్టం తనకు కలిగిందని శ్రీ నరసింహారావు తరచూ గుర్తుచేసుకుంటూ వుండేవారు. (ఆయన ఈ మధ్యనే అనారోగ్యంతో కన్నుమూసారు.)  ఆరోజు హైదరాబాదు రాజభవన్ సెంట్రీ రూములోని ఫోనుద్వారా బెజవాడ రేడియో కేంద్రానికి ఈ వార్తను అందించింది నేనే. ఆ రోజు నావెంట నేటి తెలంగాణా సిఎం, సీపీఆర్వో శ్రీ జ్వాలా నరసింహారావు కూడా వున్నారు.
అలాగే మరో జ్ఞాపకం.

గండిపేటలో తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశం జరుగుతోంది. నేను గోడకు ఆనుకుని  నిలబడి వున్నాను. మరి కొద్ది నిమిషాల్లో సాయంత్రం ప్రాంతీయ వార్తలు మొదలవుతాయి. నాకు టెన్షన్ పెరుగుతోంది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి ప్రసంగం అనర్ఘలంగా సాగుతోంది. పార్టీ  ప్రధాన కార్యదర్శి ఎవరన్నది  ఆరోజు  ప్రకటిస్తారు. సాయంత్రం వార్తల సమయం అయిపోయిందంటే ఇక  మరునాడు  ఉదయం విజయవాడ నుంచి వెలువడే వార్తల వరకు వేచి వుండాలి. పత్రికలు కూడా తెల్లవారినదాకా రావు. అందుకే రేడియో వార్తలకు, ముఖ్యంగా ‘ఇప్పుడే అందిన వార్తలకు’ అంత గిరాకీ.   ఆ రోజుల్లో గండిపేట నుంచి హైదరాబాదుకు డైరెక్టు టెలిఫోను సదుపాయం లేదు. ట్రంకాల్ బుక్ చేయాలి. అంత  వ్యవధానం లేదు. నేను నిలబడ్డ కాంపౌండ్ వాల్ వెనుక ఎన్టీఆర్ కుటీరం వుంది. ముఖ్యమంత్రి కాబట్టి  అందులో ఎస్టీడీ  సౌకర్యం వున్న ఫోను ఏర్పాటు చేసారు. అది ముందుగానే తెలుసుకుని, విలేకరుల వరుసలో కాకుండా ఆ గోడ దగ్గర కాచుకుని వున్నాను. ఇంతలో ఎన్టీఆర్ నోటినుంచి ‘మన పార్టీ ప్రధాన కార్యదర్శిగా చం.....’  అనే మాట వినబడింది.  అంతే! నేను ఒక్క క్షణం వృధా చేయకుండా ఆ గోడ దూకేసాను. సెంట్రీ ఎవరు ఎవరని వెంటపడ్డాడు. లెక్కచేయకుండా లోపలకు దూరి వెళ్లి ఫోను తీసుకుని రేడియోకు ఫోను చేసాను. అవతల మా న్యూస్ ఎడిటర్ ఆకిరి రామకృష్ణా రావు, నా గొంతు విని ‘ఎవరు?’ అని క్లుప్తంగా అడిగారు. నేను ‘చంద్రబాబు’ అని అంతే క్లుప్తంగా వగరుస్తూ చెప్పాను. మరునిమిషంలో టీడీపీ నూతన  ప్రధాన కార్యదర్శిగా శ్రీ చంద్రబాబునాయుడ్ని నియమించిన సమాచారం, ‘ఇప్పుడే అందిన వార్తగా’ రాష్ట్రం నలుచెరగులకూ రేడియో ద్వారా చేరిపోయింది.         

కామెంట్‌లు లేవు: