21, అక్టోబర్ 2015, బుధవారం

సూటిగా....సుతిమెత్తగా..... అక్షర సత్యాల్లో అర్ధ సత్యాలు

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 22-10-2015, THURSDAY)

“భారత దేశపు తొలి మహిళా ప్రధాని శ్రీమతి గాంధి, 1984,  అక్టోబర్ 31వ తేదీన ఢిల్లీలో తన అధికార నివాసం ప్రాంగణంలోనే అంగరక్షకుల తుపాకీ కాల్పులకు బలయ్యారు. ఈ దుర్ఘటన జరగడానికి కొద్ది రోజులముందుగానే తన తుది ఘడియలు దగ్గర పడుతున్నాయని ఆవిడకు తెలిసి వచ్చింది. దీనికి కారణం ఆవిడకు ఒక గుళ్ళో  కనబడిన ఓ  అపశకునం. హత్య జరిగిన అక్టోబర్ మాసంలోనే శ్రీమతి ఇందిరాగాంధీ చాలా మనసుపడి కాశ్మీర్ పర్యటన పెట్టుకున్నారు. కాశ్మీర్ ప్రకృతి సౌందర్యం అంటే ఆవిడ తెగ ముచ్చట పడేవారు. అంతేకాదు, కాశ్మీర్ లోయలోని ఒక హిందూ దేవాలయాన్ని,  అలాగే ముస్లింల ప్రార్ధనా మందిరం అయిన ఒక ప్రముఖ  మసీదును సందర్శించాలన్న కోరికతో కూడా ఆమె  ఆ పర్యటనకు బయలుదేరివెళ్ళారు. ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆవిడకి ఒక అపశకునం కనబడింది. అది చూడగానే తన రోజులు దగ్గర పడ్డాయని తోచింది. ఆ సమయంలోనే ప్రియాంకా గాంధి తన రాజకీయ వారసురాలయితే బాగుంటుంది అని కూడా  ఆమెకు అనిపించింది. కాకతాళీయం కావచ్చు కానీ, ఇది జరిగిన కొద్ది రోజుల్లోనే ఆవిడ హఠాత్ మరణానికి గురయ్యారు. ప్రియాంక రాజకీయ వారసత్వం గురించి  శ్రీమతి గాంధీ మనసులోని ఈ మాటను తదనంతర కాలంలో సోనియా గాంధి చెవిలో వేసినా, ఆవిడ దానికి ఇష్టపడలేదు.” (శ్రీమతి  ఇందిరాగాంధీ మరణించే నాటికి ప్రియాంక  గాంధి  వయస్సు  కేవలం పన్నెండేళ్ళే. మరి రాజకీయ వారసత్వం గురించిన ఆలోచన ఎలా వచ్చిందో!)


“వీపీ సింగ్ ప్రభుత్వ పతనానంతరం రాజీవ్ గాంధీని ఆనాడే ప్రధానమంత్రిని చేయాలనే ప్రయత్నాలు జరిగాయి. అయితే అప్పటి రాష్ట్రపతి వెంకట్రామన్ సుముఖత చూపని కారణంగా ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. పైగా రాజీవ్ బదులు ప్రణబ్ ముఖర్జీ ప్రధాని కావాలని వెంకట్రామన్ కోరుకున్నారు.”
ఇవన్నీ అక్షర సత్యాలు అవునో కాదో తెలియదు. కానీ ఈ సంగతులన్నీ, శ్రేమతి గాంధి అంతరంగికుడు ఎం.ఎల్ ఫోతేదార్ రాసిన  ఒక పుస్తకంలో  అక్షరబద్ధం అయ్యాయి.
శ్రీమతి గాంధీ దుర్నిరీక్షంగా దేశాన్ని పాలిస్తున్న రోజుల్లో ప్రధానమంత్రి కార్యాలయాన్ని ఇద్దరు అధికారులు తమ గుప్పెట్లో పెట్టుకుని పాలిస్తూ వుండేవారు. శ్రీమతి గాంధీ ఆంతరంగిక వర్గంలోని వారు కాబట్టి వారిరువురి మాటా మంత్రులకే కాదు, సీనియర్ అధికారులకు కూడా శిరోధార్యం. వారు ఏదైనా చెప్పారంటే ఇక అది శిలాశాసనం.  ఆర్.కే. ధావన్, ఎం.ఎల్. ఫోతెదార్  అనే ఈ ఇరువురూ, ఇందిర పుణ్యమా అని  రాజకీయంగా కూడా ఎన్నో   ఎత్తులకు ఎదిగారు.
ఫోతెదార్ రాసిన ఈ ఆత్మకధ పుస్తకం త్వరలో మార్కెట్లోకి రానుంది.
పెద్ద పెద్ద వ్యక్తులు రాసే ఆత్మకధలు అటుంచి, వారితో సన్నిహిత సంబంధాలు కలిగిన వాళ్ళు రాసే పుస్తకాల్లో మరిన్ని ఆసక్తికరమైన అంశాలు ఉండడానికి ఆస్కారం ఎక్కువ. అంచేతే పుస్తక ప్రచురణ కర్తలు కూడా ఇటువంటి వారు రాసే ఆత్మకధలకు, జీవిత చరిత్రలకు ప్రాముఖ్యం ఇచ్చి ప్రచురిస్తున్నారు. వాటిల్లో ఇటువంటి కొన్ని అంశాలకు ముందుగానే మీడియా ద్వారా ప్రాచుర్యం కల్పించి సొంత పబ్బం గడుపుకుంటున్నారనే అపవాదు కూడా వారిపై వుంది.
ప్రముఖులు జీవించివున్నకాలంలో,  వారితో సన్నిహితంగా మెలిగేవారికి ఆ ప్రసిద్దుల  జీవితాల్లో, జనాలకు తెలియని కొన్ని ఆసక్తికర అంశాలను గమనించగలిగే అవకాశం వుంటుంది. అయితే దీన్ని అవకాశంగా తీసుకుని, వారు మరణించిన తరువాత వారికి సంబంధించిన విషయాలను ఇలా ఆత్మకదల ద్వారా బయట పెట్టడంలో నైతికత ఏమిటన్న ప్రశ్నకు వారివద్ద సమాధానం ఉండడంలేదు. ఇది ఏదో మన దేశానికి సంబంధించింది మాత్రమె కాదు. నిజం చెప్పాలంటే ఇలా పుస్తకాలను మార్కెట్ చేసే సంస్కృతి విదేశాలనుంచే దిగుమతి అయింది.
వాస్తవానికి,  సాహిత్య ప్రక్రియల్లో ఆత్మకధలు లేదా జీవితచరిత్రలు ప్రధానమయినవి. వీటిని చదువుతుంటే మనకు చెందని కాలానికి చెందిన అనేక విషయాలను అవగాహన చేసుకోగలుగుతాము. మనం ఈనాడు చూస్తున్న ప్రదేశాలు, ఆచారవ్యవహారాలు వాటికి పూర్వ రూపం ఎలావుండేదో తెలుసుకోవడానికి వీటిని చదవడం ఒక్కటే సరయిన మార్గం. ఏనుగుల వీరాస్వామి గారు రాసిన నా కాశీ యాత్ర పుస్తకం చదువుతుంటే ఆనాటి హైదరాబాదు నగరం ఎలావుండేదన్న వాస్తవ చిత్రం  కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. అప్పటి ధరవరలు, వేషధారణలు, ఆహారవ్యవహారాలు అర్ధం చేసుకోవడానికి ఈరకమయిన పుస్తకపఠనం ఉపయోగపడుతుంది. అయితే ఇవి రాసిన వారు యెంత ఘటనాఘటన సమర్దులయినా కించిత్తు స్వోత్కర్ష దొర్లడం కద్దు. కొన్నింట ఏకంగా పర దూషణ ఏరులై పారుతుంది. ఇక ఆ పెద్దమనిషి యెంతటి మేరుఘనగధీరుడయినప్పటికీ  ఆ రచనని ఆస్వాదించడం పంటికింద రాయి చందమే. ముఖ్యంగా రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసినవాళ్లు రాసే  తమ జీవిత చరిత్రల్లో ఈ రకమయిన ఆత్మ స్తుతి-పరనింద తొణికిసలాడుతుంటాయి. వీటివల్ల అసలు వాస్తవాలు మరుగున పడిపోతుంటాయి. మహాత్మా గాంధీ రాసుకున్న మై ఎక్స్ పెరిమెంట్ విత్ ట్రూత్ అనేది దీనికి పూర్తి మినహాయింపు. తనలోని బలహీనతలను ఒప్పుకోవడానికి, బయట పెట్టుకోవడానికి  ఆయన ఎంతమాత్రం సంశయించకపోవడం ఆ పుస్తకంలోని గొప్పతనం. అలాగే సందర్భాన్నిబట్టి, లేదా వాస్తవాలనుబట్టి తనలోని గొప్పతనాన్ని కానీ, ఇతరులలో తనకు నచ్చని విషయాలను కానీ చెప్పాల్సివచ్చినప్పుడు ఆ విషయాలను సుతిమెత్తగా చెప్పడం మళ్ళీ ముళ్లపూడి వెంకటరమణ గారికే సాధ్యమయింది.
చిన్నప్పుడు అల్లరి చిల్లరగా తిరుగుతూ, పెరిగిపెద్దయిన తరవాత కూడా ఎలాటి ఎదుగూ బొదుగూ లేకుండా అలాగే మిగిలిపోతే పాతసంగతులు గుర్తుచేసుకునే ఛాన్సు వుండదు. ఒకవేళ గుర్తుచేసుకున్నా విన్న జనం మొహానే నవ్వుతారు. కానీ, చిన్నతనంలో ఏ తిరుగుళ్ళు తిరిగినా, పెద్దయిన తరవాత కూడా అలాగే మిగిలిపోకుండా జీవితంలో ఒక స్తాయినీ, సంఘంలో ఒక హోదాను అందుకోగలిగితే, చిన్నప్పటి చిల్లర జీవితానికి ‘ గ్లామరు’ దానంతట అదే వచ్చిపడుతుంది. అప్పటి సంగతులు చెబితే వినేవాళ్ళుంటారు. పుస్తకాలు రాసుకున్నా, రాయించుకున్నా అచ్చువేసే వాళ్ళుంటారు. కొనేవాళ్ళ సంగతి ఎలావున్నా, రివ్యూలు రాసేవాళ్ళు సిద్ధంగానే వుంటారు. అందుకే, తృణమో ఫణమో చదివించుకుని  ఇలాటి ఆత్మకధలు లేదా జీవిత చరిత్రలు రాయించుకునే రచనలకు  ఈ రోజుల్లో మంచి గిరాకీ వుంది. సచ్చీలురయిన గొప్పవారి జీవితాలను కడిగి గాలించినా ముచ్చటపడి చదువుకునే  రసకందాయఘట్టాలు మచ్చుకయినా కనిపించవు కాబట్టీ , అలాటి వారి గురించి రాసినా చదివేవారు వుండరు కాబట్టీ,  పైపెచ్చు రాసేవారికీ వేసేవారికీ గిట్టుబాటు వ్యవహారం కాదు కాబట్టీ అటువంటి  వాటి జోలికి ఎవరూ పోరు. పోతే, జీవిత చరిత్రలను వేయించుకోగలిగిన స్తాయికి చేరుకున్నారంటేనే,  అటువంటి వారి ఘనమయిన గతంలో ‘ఏవో కొన్ని  రసరమ్య ఘట్టాలు’ వుండేవుంటాయి. లేకపోయినా ‘చరిత్రలు’ రాసిపెట్టే వాళ్లకు ఆ తెలివితేటలు పుష్కలం. అవసరమైతే అలాటి ఆసక్తికర అంశాలను తమ కల్పనాచాతుర్యంతో సృష్టించగలరు. ఇంతవుంటే చాలు ఎంతో చేసి చూపగలరు. ఈ సత్తా వున్నవారినే ఇందుకోసం ఎంపిక చేసుకుంటారు. అంతే కాదు, ఆ సన్నివేశాలకు తగిన మసాలాను దట్టించి చదవాలనే ఉత్సుకతను చదువరులలో పెంచగలరు. ఆ రకమైన ముఖ్యాంశాలను గ్రంధ ప్రచురణకు ముందుగానే, ఆకర్షణీయమయిన ప్రమోలుగా రూపొందించి, పత్రికల్లో రివ్యూల ద్వారా, మీడియాలో ఇంటర్వ్యూల రూపంలో జనాలమీదకు వొదలగల టక్కుటమార విద్యల్లో ప్రచురణకర్తలు ఆరితేరిపోయారు. ఈ క్రతువులన్నీ ముగిసిన తరవాత కానీ అసలు పుస్తకం మార్కెట్లోకి రాదు.

అభివృద్ధి చెందిన దేశాల్లో బాగా ప్రాచుర్యం పొందిన ఈ మార్కెటింగ్ టెక్నిక్కులు ఇటీవల మనవైపు కూడా విస్తరిస్తున్నాయి. అందుకో చక్కని ఉదాహరణ, బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ - తన జీవితం లోని కొన్ని ఘట్టాలతో రాసిన  “ప్రయాణం” అనే పుస్తకం. ముందు చెప్పిన విధంగానే అమ్మకాలు పెంచే ప్రచార పర్వాన్ని ‘సన్’ పత్రిక ప్రారంభించింది. ఈ పుస్తకం గురించి సమీక్ష రాస్తూ అందులోని ఒక ఆసక్తికరమయిన విషయాన్ని బయట పెట్టింది.

టోనీ బ్లేర్ మహాశయులవారు, బార్లలో పనిచేస్తూ చదువుకుంటున్న రోజుల్లో ఒక ఫ్రెంచ్ యువతితో ప్రేమలో పడ్డారుట. ఆమెపై మరులుపెంచుకున్న టోనీకి ఆ వ్యామోహం నుంచి బయటపడడం ఒక పట్టాన సాధ్యం కాలేదుట.

ఆలోచించడం మానుకో, ఆనందించడం నేర్చుకో’ అని ఆ ఫ్రెంచ్ అమ్మడు అతడికి సుద్దులు నేర్పిందట. తనంటే పడిచచ్చిపోతున్న ఆ పడుచువాడు, భవిష్యత్తులో బ్రిటన్ దేశానికి ప్రధానమంత్రి కాగలడని ఆ యువతి అప్పట్లో వూహించి వుండదు.

సన్’ పత్రిక లో వచ్చిన ఈ ‘వేడి వేడి కబురు’ అందరినీ ఆకట్టుకుంది. ఏమయితేనేం - మొత్తానికి ఈ ట్రిక్ పనిచేసింది. టోనీ పుస్తకాలూ వేడి వేడి పకోడీల్లా అమ్ముడు పోయాయి.

ఇంగ్లాండ్ పుస్తక దుకాణాలలో ఈ పుస్తకాన్ని జనం హాటు కేకుల్లా ఎగరేసుకుపోయారు. ఫ్రెంచ్ అమ్మాయితో బ్రిటన్ మాజీ ప్రధాని ప్రేమ పురాణం  కాబట్టి పనిలో పనిగా ఫ్రాంకులు కూడా మూట కట్టుకోవాలని ఈ పుస్తకాన్ని ఫ్రెంచిలో భాషలో సయితం ప్రచురించారు.

పుస్తక విక్రయాలను పెంచుకునే ప్రచారంలో భాగంగా టోనీ బ్లేర్ అమెరికన్ టెలివిజన్లకు కూడా ఇంటర్వ్యూలు ఇచ్చారు. ప్రిన్సెస్ డయానాను ఆకాశానికి ఎత్తేసారు. అంతటి అందగత్తె ఈ భూప్రపంచంలో మరొకరు కానరారు అని కానరాని లోకాలకు తరలిపోయిన డయానాను వేనోళ్ళ పొగిడారు.
ఇంతకీ ఇందులో ఏముందని అనుకుంటున్నారా,  యిరవై నాలుగు (బ్రిటిష్) పౌండ్లు మీవి కాదనుకుంటే ఆ అనుమానం తీరిపోతుంది.
మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు జలగం వెంగళరావు 'నా జీవిత కధ' అనే పేరుతొ ఒక ఆత్మకధ వెలువరించారు. ఆ పుస్తకంలో కొన్ని అంశాలు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి కావడంతో అది వివాదాస్పదం అయింది.
పీవీ నరసింహారావు గురించి  శ్రీమతి గాంధీ తనతో ఇలా చెప్పారంటూ  వెంగళరావు ఆ పుస్తకంలో ఉదాహరించిన విషయాలు దిగ్భ్రాంతి గొలిపేవిగా వున్నాయి.
"నేనింతవరకు అలాటి (పీవీ) అసమర్ధ నాయకుడ్ని చూడలేదు. కందూ భాయ్ దేశాయ్, త్రిపాఠీ, ఉమా శంకర్ దీక్షిత్ లాగే ఈయనా ఒక  సీనియర్ అన్న నమ్మకంతో ఆయన్ని(ఆంద్ర ప్రదేశ్) ముఖ్యమంత్రిని చేసాను. కానీ ఆయన  బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించడం నాకెంతో బాధ కలిగిస్తోందని" ఇందిరాగాంధి తనతో చెప్పుకున్నట్టు వెంగళరావు పేర్కొన్నారు.
అలాగే మర్రి చెన్నారెడ్డి గురించి వెంగళరావు వెలిబుచ్చిన కధనాలు:
"సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో మరణించడానికి నాలుగు రోజులు ముందు ప్రధాని తనయుడు చెన్నారెడ్డి స్థానంలో అంజయ్యను ముఖ్యమంత్రి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సంజయ్ మరణ వార్త చెన్నారెడ్డిని సంతోషంలో ముంచివేసింది. సంతాపం వెలిబుచ్చడానికి బదులుగా చెన్నారెడ్డి సంబరాలు చేసుకున్నారనీ, మిఠాయిలు పంచిపెట్టారనీ, కృష్ణాజిల్లాకు చెందిన ఒక లెజిస్లేటర్ తనతో చెప్పినట్టు  వెంగళరావు తన పుస్తకంలో పేర్కొన్నారు.
అయితే, అసలా పుస్తకం తాను తన చేతుల్తో రాయలేదనీ, ఎప్పటి జ్ఞాపకాలో  గుర్తు తెచ్చుకుని చెబుతుంటే వాటిని తన కోడలు అక్షరబద్ధం చేసారని, పుస్తకం పూర్తయిన తరువాత దాన్ని సమాచార శాఖ ఉన్నతాధికారి, అనేకమంది ముఖ్యమంత్రులవద్ద పీ.ఆర్.వొ. గా పనిచేసిన భండారు పర్వతాలరావు 'ఎడిట్' చేసారని ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  చెప్పుకొచ్చారు. అయితే పుస్తకంలో కొన్ని అంశాలు కొందరు  వ్యక్తులను బాధపెట్టేవిగా  వున్నాయని, వాటిని తొలగించడం మంచిదనీ అంటూ తాను గ్రంధ ప్రచురణకు  ముందుగానే వెంగళరావు దృష్టికి తీసుకువచ్చినట్టు పర్వతాలరావు వివరణ ఇచ్చారు.  అయినా ఆయన తన సహజ శైలిలోనే,  'ఏం పర్వాలేదంటూ'  తన సలహాను  పట్టించుకోలేదని,  అంచేత ఆ పుస్తకంలో తన పేరు ఎక్కడా ప్రస్తావించవద్దని కోరినట్టు పర్వతాలరావు  చెప్పారు. అలాగే పర్వతాలరావు గారి పేరు అందులో ఎక్కడాలేదు.
ఈ కోవలోకి వచ్చేదే  మరో ఆత్మకధ మల్లెమాల పేరుతొ ప్రసిద్ధ చలనచిత్ర నిర్మాత  ఎం.ఎస్.రెడ్డి రాసిన 'ఇదీ నా కధ'. ఆ పుస్తకంలో సినిమారంగానికి చెందిన అనేకమంది ప్రముఖుల ప్రస్తావనలు వివాదాస్పదం అయ్యాయి. కొందరు సినీ ప్రముఖులను కించబరిచే వ్యాఖ్యానాలు అందులో  వున్నాయని విమర్శలు వెల్లువెత్తడంతో ఆ పుస్తకం ప్రతులను విక్రేతలనుంచి వెనక్కి తెప్పించుకోవాల్సిన పరిస్తితి ఏర్పడింది.
ఉపశృతి: జీవిత చరిత్రల నుంచి నేర్చుకునే విషయాలు వుండాలి. అంతేకాని, అమ్మకాలు పెంచుకోవడం కోసమే రాస్తే వాటిపై జనాలకు నమ్మకాలు తగ్గిపోతాయి. (21-1-2015)

రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

మిగతావి తెలియదు , మల్లెమాల గారి పుస్తకం మాత్రం చదివాను, మనకు తెలిసిన జూనియర్ ఎన్టీఆర్ గురించి రాసారని ..
ఆ పుస్తకం మొత్తం ఆయన్ని ఆయన పోగుడుకుంటూ , మిగతా వాళ్ళని తిడుతూ ఉంటారు . పుస్తకం మొత్తం వెతికనా ఆయన బలహీనతలు , మంచి చెడులు ఎక్కడ రాయలేదు . ఆన్లైన్ లో దొరుకుతుంది .

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@అజ్ఞాత: ఆన్ లైన్లో ఎందుకు ? ఈ పుస్తకాలన్నీ నా దగ్గరే వున్నాయి. జుగుప్స అనిపించే వాక్యాలను తిరిగి ఎత్తిచూపే ప్రయత్నం నేను చేయను. అలా రాయడం తప్పని ఒక పక్క చెబుతూ, ఆ పని నేను చేయలేను. అది నా బలహీనత.