14, అక్టోబర్ 2015, బుధవారం

రేపు లేదు


పెసిమిజం అనుకోకండి. నిజంగా  రేపనేదే లేదు. నిన్న చరిత్ర. నేడు నిజం. రేపు అనుమానం.
మా ఇంటికి ఓ పెద్ద మనిషి వచ్చారు. నిజంగా ఆయన అన్నింట్లో పెద్దమనిషే. సందేహం లేదు. రిటైర్ అయ్యేనాటికి సొంత ఇల్లు వుంది. పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఇంట్లో ఉండాల్సిన అన్ని సౌకర్యాలు వున్నాయి. ఒక రోజు ఆవిడ ఓ మొగుడ్ని ఓ కోరిక కోరింది, డ్రాయింగు రూములో మాదిరిగానే బెడ్ రూమ్ లో కూడా ఓ ఏసీ పెట్టించమని. ఓస్ అదెంత పని అనుకున్నాడు. ఓ షాపుకు వెళ్లి మాట్లాడాడు. మరుసటి రోజు ఉదయం కల్లా పెడతానన్నాడు. విధి మరోలా తలచింది. ఎలాటి రోగంరొష్టు లేని ఆయన భార్య ఆ రాత్రే విపరీతమైన గుండెపోటు వచ్చి కన్ను మూసింది.
మా ఇంట్లో ఏసీ గదిలో కూర్చోమంటే ఆయనకు మనస్కరించలేదు. సెల వేసినట్టు భార్య అడిగిన ఆఖరు కోరిక గుర్తు చేసుకోవడమే ఆయనకు ఓ గుర్తులా మిగిలి పోయింది.
‘రాత్రి వరకు కబుర్లు చెప్పిన మనిషి మరునాడు లేదు. ఇక రేపు వుందనే నమ్మకం ఏమిటి? అది ఓ భ్రమ’ అన్నాడాయన.     
నిజమే అనిపించింది.
అందుకే ఏ పనీ రేపు చేద్దాం అనుకోవద్దని అనిపించింది. ఈ రోజే మనది. ఎవరికన్నా సాయం చేద్దాం అనే మనసుంటే ఆలస్యం చేయకుండా వెంటనే చేయాలన్న మాట. 
ఎందుకంటే రేపు మనది కాదు.  

3 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

< "అందుకే ఏ పనీ రేపు చేద్దాం అనుకోవద్దని అనిపించింది. ఈ రోజే మనది. ఎవరికన్నా సాయం చేద్దాం అనే మనసుంటే ఆలస్యం చేయకుండా వెంటనే చేయాలన్న మాట. "

సరిగ్గా చెప్పారు భండారు వారూ. మీరు చెప్పిన మంచి, సహాయం చెయ్యడానికే కాక, వేరే విషయాలకి కూడా వర్తిస్తుంది.
(1). ఎవరికయినా వారి మంచితనం గురించి చెప్పాలనిపిస్తే వారు బతికున్నప్పుడే వారికే చెప్పడం మంచిది, ఆ వ్యక్తి గూడా సంతోషిస్తారు (తదనంతరం అయితే వారి మంచి గురించి ఇతరులకి మాత్రమే చెప్పగలుగుతాం - అది "బతకని బిడ్డ బారెడు" అనే సామెత లాగా ఉంటుంది).
(2). అలాగే వయసులో పెద్దవారిని ఎవరినయినా ఓ సారి చూసి రావాలి అనిపిస్తే ఆ పని వీలయినంత వెంటనే చేసెయ్యడం మంచిది. ఆ తర్వాత వగచి ప్రయోజనం ఉండదు. నా వ్యక్తిగత అనుభవం - ఓ పెద్దాయన (ఆయన దగ్గర నేను పనిచేశాను; నేనంటే అభిమానంగా ఉండేవారు) తను రిటైరయిన కొద్ది కాలం తర్వాత "నిన్ను చూడాలని ఉందయ్యా, ఓ సారి ఇంటికి రాగలవా?" అన్నారు. నేను కొంచెం తాత్సారం చేశాను అన్నమాట నిజమే - దానికి ఇప్పుడు నేను ఏ కారణాలు చెప్పినా అవి సాకులే అవుతాయి. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన హఠాత్తుగా పోయారు. ఆ వార్త మర్నాడు పేపర్లో Obituary Column లో చూసి బాధపడ్డాను, కానీ ప్రయోజనమేమిటి, ఆ విచారం ఎప్పటికీ పోదు కదా?

మీరన్నట్లు "రేపు లేదు" అని ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటే మంచిపనులు సకాలంలో నెరవేర్చే అవకాశం ఉంటుంది కదా. మంచి టపా వ్రాశారు శ్రీనివాసరావు గారూ.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@విన్నకోట నరసింహారావు - ధన్యవాదాలు రావు గారూ.

easyvegrecipes చెప్పారు...

Well said