9, అక్టోబర్ 2015, శుక్రవారం

ప్రతిపక్షరహిత ప్రజాస్వామ్యం

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 11-10-2015, SUNDAY)

ఒకానొక కాలంలో మహాత్మా గాంధీ, లోక్ నాయక జయప్రకాష్ నారాయణ్ ప్రవచించిన పార్టీ రహిత ప్రజాస్వామ్యం అనే సూత్రాన్ని నాస్తిక ఉద్యమ నిర్మాత ‘గోరా’ (గోపరాజు రామచంద్ర రావు), 70 వ దశకంలో  ప్రజల్లోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేసారు. బహుళ పార్టీ వ్యవస్థ వల్ల జరిగే మేలుకన్నా కీడే ఎక్కువన్నది ఈ సిద్ధాంత కర్తల సూత్రీకరణ. కాల క్రమంలో ఈ వాదన పూర్తిగా మరుగున పడిపోయింది.
గత కొన్ని దశాబ్దాలుగా దేశంలోని అన్ని వ్యవస్థలను రాజకీయ పార్టీలే శాసిస్తూ వస్తున్నాయి.  ప్రతి రాజకీయ పార్టీకి చెప్పుకోవడానికి కొన్ని మూలసిద్ధాంతాలు ఉన్నప్పటికీ, కాలమాన పరిస్తితులను బట్టి ఆ సిద్ధాంతాలను కొంత పక్కన బెట్టి వ్యవహరించే పరిస్తితి ఈనాడు చూస్తున్నాము. ఇప్పుడు ప్రతి అంశాన్ని, విజయావకాశాలు, రాజకీయంగా ఒనగూడే లాభనష్టాల నిష్పత్తి కోణం నుంచే ఆయా రాజకీయ పార్టీలు పరిశీలిస్తున్నాయి. అధికారమే పరమావధి అయినప్పుడు సిద్ధాంతాలకు నీళ్ళు ఒదిలి అవకాశవాద రాజకీయాలకు పెద్ద పీట వేయడంలో ఆశ్చర్యం లేదు. ఎన్నికలకు ముందు సీట్ల సర్దుబాటుతో మొదలయ్యే ఈ కప్పదాట్లు అధికార పీఠం అధిరోహించిన తరువాత మరింత వికృత రూపాన్ని, స్వభావాన్ని సంతరించుకుంటున్నాయి. ఎదుటి పక్షాన్ని ఎదిరించడం కోసం, నిలువరించడం కోసం  పలు విపక్షాలతో రాజీపడి దానికి భావసారూప్యం అనే అందమైన అర్ధం లేని  పదాన్ని అడ్డు పెట్టుకోవడం రాజకీయాలను గమనించేవారికి అనుభవమే. అలా మొదలయ్యే ఈ అవకరం క్రమంగా రాజకీయ కూటముల ఆవిర్భావానికి మార్గం వేసింది. అయితే, అధికారంలో పై చేయి కోసం వెంపర్లాటలు, పదవుల పంపిణీలో కీచులాటలు, సిద్ధాంత ప్రాతిపదికలేని ఈ రాజకీయ కూటముల అస్తిత్వానికే ముప్పు తెచ్చిన సందర్భాలు కూడా గతంలో అనేకం. ఈ దిశలో ఒక అడుగు ముందుకు వేసి, ప్రతిపక్షాలన్నీ ఏకమై, తమ పార్టీ పేరును, సిద్ధాంతాలను పక్కనబెట్టి  ఒకే పేరుతొ, ఒకే జెండాతో, ఒకే ఎన్నికల గుర్తుతో,  ఒకే ఒక్క అజెండాతో,  కాంగ్రెస్ ఓటమి, ఇంకా గట్టిగా చెప్పాలంటే నాటి పాలకురాలు ఇందిరాగాంధీని గద్దె దించడానికి జరిగిన ‘జనతాపార్టీ’ ప్రయోగం, ఈ స్వార్ధ రాజకీయ కీచులాటల కారణంగానే మూన్నాళ్ళ ముచ్చటగా ముగిసిపోయింది.
పాలక పక్షాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రతిపక్షాలు ఏకమైనట్టు ఈనాడు ప్రతిపక్షాలను కనుమరుగు చేయడానికి పాలక పక్షాలు అంతే పట్టుదలగా పనిచేస్తున్నాయి. ప్రతి పక్షాలను గౌరవించడం సంగతి అటుంచి అసలు వాటి ఉనికిని గుర్తించడానికి కూడా విముఖత చూపుతున్నాయి. చట్ట సభల్లోనే కాకుండా చట్ట సభల వెలుపల కూడా ప్రతిపక్షాల పొడగిట్టని తత్వాలు,  ఎదుటి పార్టీలను చీల్చి సొంత బలం పెంచుకునే ప్రయత్నాలు కొత్త రాజకీయ సంస్కృతిగా రూపుదిద్దుకుంటున్నాయి. కొద్ది హెచ్చు తగ్గులు మినహా ఏపార్టీ కూడా దీనికి మినహాయింపు కాదనే చెప్పాలి. ఈ బలహీనత వల్లే, ఓ పక్క  పార్టీ మార్పిళ్లు నిస్సిగ్గుగా సాగిపోతున్నప్పుడు కూడా,  ఓ ఖండన ప్రకటన చేసి ఊరుకోవడం మినహా గట్టిగా నిలదీయలేకపోతున్నాయి. అంతే కాదు గద్దె ఎక్కిన వెంటనే, ఒకప్పుడు తాము కూడా ప్రతిపక్ష  పాత్ర పోషించిన విషయం గుర్తు చేసుకోవడానికి సయితం  పాలక పక్షాలు ఇష్టపడడం లేదు. ఆ రోజుల్లో చెప్పిన మాటలను, చేసిన వాగ్దానాలను, ఇచ్చిన హామీలను స్పురణకు తెచ్చుకోవడానికి కూడా ఇచ్చగించడం లేదు. పైపెచ్చు ఇప్పుడు తాము అనుభవిస్తున్న పాలక పక్షం హోదా సదా  శాస్వితం అనే భ్రమలో ఉంటున్నాయి.
అయితే చరిత్ర చెప్పే పాఠాలు వేరుగా వున్నాయి.
1984 లో ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అప్పటివరకు కనీ వినీ ఎరుగని అఖండ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మొత్తం 520 లోక సభ స్థానాల్లో ఏకంగా 411  సీట్లు గెలుచుకుని  భారత ఎన్నికల ఇతిహాసంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది.
రాజీవ్ గాంధి తల్లిగారయిన ఇందిర హయాములో కానీ, ఆయన  తాతగారయిన భారత ప్రధమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కాలంలో కానీ కాంగ్రెస్ పార్టీ ఇంతటి ఘన విజయాన్ని సాధించలేదు. అలాగే నేడు దేశాన్ని పాలిస్తున్న బీజేపీ అధినాయకుడు నరేంద్ర మోడీ పార్టీకి ఆ నాడు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించిన ఈ సువిశాల భారతంలో లభించిన సీట్లు అక్షరాలా రెండే రెండు. వాటిల్లో ఒకటి అవిభాజ్య ఆంద్ర ప్రదేశ్ లోని హనుమకొండ కాగా, ఏకే పటేల్ అనే బీజేపీ అభ్యర్ధి  గెలుపొందిన  గుజరాత్ లోని మెహ్సానా నియోజక వర్గం రెండోది. హనుమకొండ నుంచే కాదు మొత్తం ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి లోక్ సభలో బీజేపీకి ప్రాతినిధ్యం వహించిన ఏకైక వ్యక్తి చందుపట్ల జంగారెడ్డి. ఇక ఆ ఎన్నికల్లో వాజ్ పాయ్, అద్వానీ వంటి బీజేపీ అగ్రనాయకులందరూ పరాజయం పాలయ్యారు.    అలాటి బీజేపీ తిరిగి అయిదేళ్లలోనే పుంజుకుని ఎన్నికల్లో 85 స్థానాలకు ఎగబాకింది. 1984 లో రికార్డు స్థాయిలో అత్యధిక సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ,  అదే రాజీవ్ నాయకత్వంలో 197 స్థానాలకు పడిపోయి ప్రధాన ప్రతిపక్ష పాత్రకు పరిమితమయింది. 1984 లో 30 సీట్లు గెలుచుకుని లోక సభ లో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకున్న ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అయిదేళ్ళ తరువాత జరిగిన ఎన్నికల్లో కేవలం రెండే సీట్లు గెలవగలిగింది.
పొతే, ఇటీవలి కాలంలో జరిగిన ఎన్నికల్లో కూడా దేశ ప్రజలు తమ ఓటు హక్కు ఉపయోగించి ఇదేమాదిరి రికార్డులకు తెర తీసారు. నిరుడు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీ నాయకత్వంలో మొత్తం 336 సీట్లు సంపాదించి  ఎన్డీయే కూటమి సాధించిన విజయం నిజంగా చరిత్రాత్మకం. సంకీర్ణ యుగంలో జాతీయ పార్టీల ప్రాభవం క్రమేపీ కనుమరుగయిపోతున్న సమయంలో మోడీ, బీజేపీ గుర్తు మీద  282 సీట్లు సంపాదించి పెట్టి ఆ పార్టీకి అపూర్వ వైభవం కట్టబెట్టారు. ఎన్డీయే కూటమిలోని ఇతర పార్టీల ఆసరా, అవసరం లేకుండా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల సత్తా ఆ పార్టీకి లభించడం ఇప్పటి రోజుల్లో చాలా ఘనమైన సంగతే. అయితే నెలలు తిరక్కుండానే ఏం జరిగిందన్నది కూడా గమనార్హం. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీకి ఎదురయిన అవమానం అంతా ఇంతా కాదు. రాజకీయాల్లో పసికూన ‘ఆప్’ చేతుల్లో  ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవాల్సిన విషమ స్తితి. ఆ ఎన్నికల్లో కేజ్రీవాల్ నాయకత్వంలో ‘ఆప్’ భారత ఎన్నికల చరిత్రనే తిరగరాసింది.  ఢిల్లీ అసెంబ్లీ లోని మొత్తం డెబ్బయి స్థానాల్లో అక్షరాలా అరవై ఏడు సీట్లలో ఆ పార్టీ  విజయం సాధించి, అప్పటికి  మంచి ఊపులో ఊగిపోతున్న భారతీయ జనతా పార్టీ నాయకులకు చుక్కలు చూపించింది. దేశానికి స్వతంత్రం వచ్చిన దాదిగా ఇన్నేళ్ళుగా జరిగిన మొత్తం మూడువందల అసెంబ్లీ ఎన్నికల్లో  ఎప్పుడూ ఏ  పార్టీ కూడా ఇంతటి ఘన విజయం సొంతం చేసుకోలేదు.
కాబట్టి రాజకీయులు నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే సాధించిన విజయాలు సాధించబోయే విజయాలకు సోపానాలు కావాలి. శిఖరం ఎక్కిన వాడు అక్కడే వుండిపోడు. ఎప్పుడో ఒకప్పుడు కిందికి దిగకతప్పదు.  అలా దిగినప్పుడు మళ్ళీ ఎక్కే ప్రయత్నం మానుకోకూడదు. అధికార పీఠం అనేది ఈ ప్రజాస్వామ్య యుగంలో శాస్వితం కాదు. అధికారం దక్కినప్పుడు కాలయాపన చేయకుండా, జనం తమకు అధికార పగ్గాలు అందించిన నిర్దిష్ట  కాల వ్యవధిలోనే  ప్రజలకు చేసే నాలుగు మంచి పనులే శాస్వితంగా  మిగిలిపోతాయి.

ప్రజలు అధికారం ఇచ్చింది తమ పార్టీలను బలోపేతం చేసుకోవడానికి కాదు. దీపం ఉండగానే సొంత ఇల్లు చక్కబెట్టుకోవడానికి అంతకంటే కాదు.  సమాజ హితాన్ని కాంక్షిస్తూ యావత్  ప్రజానీకానికి మేలు చేసే పనులు చేస్తూ సంక్షేమ సమాజాన్ని నిర్మించడానికి. ఇది గుర్తు చేయడానికే, చరిత్ర చెప్పే పాఠాలను ఇలా గుర్తు చేయాల్సి వస్తోంది. (09-10-2015)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com  మొబైల్: 98491 30595          

NOTE: Courtesy Image Owner 

3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

మీరు చెప్పాలనుకున్నది సూటిగా చెప్పలేదేమోనని ఈసారి అనిపించింది.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@అజ్ఞాత- నిజమేనండి. రోజులు అలా వున్నాయి. ముక్కుసూటిగా పోయే కాలం కాదు.

అజ్ఞాత చెప్పారు...

Very well said