7, అక్టోబర్ 2015, బుధవారం

ఓటు, హక్కా? బాధ్యతా ?

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 08-10-2015, THURSDAY)

‘హక్కు ఒకరు ఇస్తే తీసుకునేది కాదు,  జన్మతో వచ్చేదే  హక్కు’ అనే డైలాగులు అప్పుడప్పుడూ వినబడుతుంటాయి. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ కూడా పద్దెనిమిదేళ్ళు నిండిన ప్రతివారికీ ఓటు హక్కు లభిస్తుందని అంటున్నారు. నిజంగా అలా ప్రతిఒక్క పౌరుడికీ ఓటు హక్కు లభిస్తే అంతకంటే కావాల్సింది ఏమీ లేదు. ఓటు ప్రతి ఒక్క పౌరుడి  హక్కు అంటారే కాని, ఆ హక్కును హక్కుభుక్తం చేసుకోవాలంటే ఎన్నెన్ని చిక్కుముళ్ళు ఎదుర్కోవాలన్నది ఆ హక్కు సంపాదించుకున్న ఎవరినడిగినా సరిపోతుంది. రాజ్యాంగంలోని 326 అధికరణం ప్రకారం 1950 ప్రజాప్రాతినిధ్య చట్టం  19 వ సెక్షన్ కింద  18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్క భారతీయ పౌరుడు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం అనేక వెసులుబాట్లు కల్పించారు. ప్రతి పదేళ్లకోసారి ప్రభుత్వం ఇంటింటికీ సిబ్బందిని పంపి ఓటర్లను చేర్పించే కార్యక్రమం నిర్వహిస్తుంది.  లేదా ఏటా జనవరి నెలలో నిర్వహించే  ఓటర్ల జాబితా సవరణ  ప్రక్రియను కూడా  ఇందుకోసం ఉపయోగించు కోవచ్చు. నిర్దేశిత ధరఖాస్తు పత్రంలో వివరాలను పొందుపరచడం ద్వారా ఓటు హక్కు పొందే వీలుంది. సంబంధిత అధికారి, మీరు అందచేసిన వివరాలతో సంతృప్తి చెందితే మీ పేరును,   మీ నివాసం వున్న   ఓటర్ల జాబితాలో చేరుస్తారు. ఆన్ లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే సౌలభ్యం వుంది. ఒక నియోజక వర్గంలో నివాసం వుండే వ్యక్తి ఆ నియోజకవర్గంలోనే మాత్రమే  ఓటరుగా ఉండగలుగుతాడు. ఒకే వ్యక్తి పేరు పలు నియోజక వర్గాల ఓటర్ల జాబితాలో ఉండేందుకు చట్టం అనుమతించదు.


భన్వర్  లాల్ చెప్పినట్టు చట్టం ప్రతి పౌరుడికీ ఓటు హక్కు కల్పించింది. ఆ హక్కు ఎలా పొందాలో కూడా నిర్దేశించింది. అయితే చట్టంలో పేర్కొన్నంత సులభంగా లేదు ఆచరణలో పరిస్తితి అన్నది  చాలామందికి అనుభవైకవేద్యం.
నిరుడు సార్వత్రిక ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రంలో జరిగాయి. అనంతరం రాష్ట్ర విభజన జరిగింది. హైదరాబాదు రాజధాని కావడం మూలాన రాష్ట్రంలోని మిగిలిన ఇరవై రెండు జిల్లాలనుంచి గత అనేక సంవత్సరాలలో పెద్ద ఎత్తున వలసలు సాగాయి. ఉద్యోగాలకోసం, ఉపాధులకోసం, ఉన్నత విద్యల కోసం, వ్యాపారాల నిమిత్తం,  వైద్య అవసరాల కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో హైదరాబాదుకు తరలివచ్చారు. రాజకీయుల మాట చెప్పేపనేలేదు. ఇలా వచ్చిన వారిలో కొందరు  పూర్తిగా స్థిరపడి పోయారు. కొందరు రెండు పడవలమీదా కాళ్ళుoచి కాలం గడుపుతూ వచ్చారు. అలాటివారిలో చాలామందికి హైదరాబాదు నగరంలో సొంత నివాసాలు వున్నాయి. వాటిని కూడా తమ స్తోమతకు తగ్గట్టుగా వివిధ ప్రాంతాలకు  మారుస్తూ పోయారు. దానితో పాటు వారి చిరునామాలు కూడా మారిపోయాయి. నగరం చాలా విశాలమైంది కాబట్టి అసెంబ్లీ నియోజక వర్గాల సంఖ్య  కూడా తక్కువేమీ కాదు. నివాసం మారినప్పుడల్లా చిరునామాలు మారాయి కాని ఓటర్ల జాబితాలో ఆ మార్పులు చోటు చేసుకోలేదు. ఎక్కడయితేనేం ఓటు వేయడానికి అనుకుని చాలామంది జాబితాలో మార్పులు చేసుకోవడానికి ఉత్సాహం ప్రదర్శించి ఉండక పోవచ్చు. దానితో ఓటర్లను ప్రత్యక్షంగా కలుసుకుని వారి ఓటు హక్కును నిర్ధారించడానికి వెళ్ళిన సిబ్బందికి అలాటి ఓటర్లు కనిపించకపోయే అవకాశాలు మెండు. అపార్ట్ మెంటు సంస్కృతి జీర్ణించుకుపోయిన ఈనాటి జనాల్లో పక్కవారిని గురించి పట్టించుకునే తీరిక తక్కువ. గతంలో ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసులకు స్పందించని ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగిపోయి వుండడానికి ఇదొక కారణం కావచ్చు. వెనుకటి నివాసంలో నివసిస్తూ ఉండని ఒకే ఒక కారణంతో అలాటి వారిని జాబితా నుంచి తొలగించడం అంటే వారి హక్కును కాలరాసినట్టే. 
ఇక ఓటర్లలో మరో తరగతి వారున్నారు.  నిజానికి ప్రతి ఎన్నికల్లో ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం పెంచుతూ పోతున్నది ఈ తరగతి వాళ్ళే. వాళ్ళు పొట్టపోసుకోవడం కోసం పొట్టపట్టుకుని బస్తీలకు వస్తారు. కూలీనాలీచేస్తూ, ఆటోలు, టాక్సీలు నడుపుతూ, రోడ్డుపక్క చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ, వాచ్ మన్లు గా, పనిమనుషులుగా, వంట మనుషులుగా ఇలా నానా రకాల వృత్తులు చేసుకుంటూ జీవనం గడుపుతుంటారు. కిందా మీదా పడితే కాని బతుకుగడవని ఈ బాపతు వాళ్లకు చెప్పుకోవడానికి ఓ చిరునామా అంటూ పక్కాగా వుండదు. ఎక్కడ పనిదొరికితే అదే వారి నివాస ప్రాంతం. అదే వారి అసెంబ్లీ నియోజక వర్గం. ఇలాటి వారికి బస్తీ రాజకీయ నాయకులు సహకరించి వారిని ఆ ప్రాంతంలో ఓటర్లుగా చేర్పిస్తారు. ఇది బహిరంగ రహస్యమే. వారికి వారి వారి ఊళ్ళల్లో కూడా ఓటు హక్కు వుంటుంది. అక్కడి స్థానిక రాజకీయ నాయకులే కనిపెట్టుకుని ఎప్పటికప్పుడు ఓటర్ల జాబితాలో వాళ్ళ పేర్లు వుండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇదీ నలుగురికీ తెలిసిన రహస్యమే. నిజానికి ఇటువంటి రాజకీయ ఏర్పాటు లేకుండా వుండి వుంటే దేశంలో ఓటర్ల సంఖ్య ఇంత  గణనీయంగా పెరిగిపోయే అవకాశాలు తక్కువ  అనేవాళ్ళు లేకపోలేదు. ఇటువంటి ద్వంద్వ ఓటు హక్కు కలిగిన వారిని ఏరివేయడం అంత అసాధ్యమేమీ కాదు. ఒకే పేరుతొ వంట గ్యాస్ కనెక్షన్లు అనేకం కలిగివున్నవారిని గ్యాస్ కంపెనీలు కంప్యూటర్ పరిజ్ఞానం వాడి ఒక్క మీట వేటుతో తొలగించిన సంగతి తెలిసిందే.  
ప్రతి ఎన్నికలో, అది ఓ క్లబ్ ఎలెక్షన్ కావచ్చు. సొసైటీ ఎన్నిక కావచ్చు, వార్డు మెంబరు ఎన్నిక కావచ్చు ఓటర్లను సకాలంలో జాబితాలో  చేర్పించుకుంటేనే అభ్యర్ధులు ఒడ్డున పడతారు. ఈ మధ్య ఓ కొత్త సంస్కృతి మొలకెత్తుతోంది. సరయిన ఓటర్లను దగ్గరుండి చేర్పించుకోవడం ఒక పద్దదయితే, తమకు ఓటు వెయ్యరు అని నమ్మకం వున్న  సిసలయిన ఓటర్లను కూడా జాబితానుంచి తొలగించే విధానం మరోటి.  హైదరాబాదులో పేరొందిన ఒక క్లబ్ ఎన్నికల్లో, ఓటర్లను పెద్దఎత్తున జాబితానుంచి తొలగించారని ఆరోపిస్తూ కొందరు ఈ మధ్య  కోర్టు గడప ఎక్కారు. అంటే ఎన్నికల్లో గెలుపు కోసం పట్టే అడ్డదార్ల సంఖ్య నానాటికీ పెరుగుతూనే వుందన్న మాట.                    
 త్వరలో హైదరాబాదు కార్పొరేషన్ ఎన్నికలు ఉంటాయని అంటున్నారు కాబట్టి నగరంలో రాజకీయ సందడి మొదలయింది. పాలక పక్షం కావాలని లక్షల సంఖ్యలో ఓట్లు తొలగించిందని ప్రతిపక్షాల ఆరోపణ. ఇప్పుడు పాలిస్తున్న పార్టీ కూడా గతంలో ప్రతిపక్షంలో వుండగా ఇదేమాదిరి ఆరోపణలు చేసివుండవచ్చు. అది రాజకీయాల్లో సహజాతిసహజం. కానీ చట్టం ప్రసాదించిన ఓటు హక్కు సంగతి ఏమిటి?  నివాసం మారినప్పుడల్లా  ఓటర్ల జాబితాలో పేరు మారిపోతుంటే అటువంటి అసలు సిసలు ఓటర్లకు ఉపశమనం ఎలా? ఓటు హక్కు కూడా ఇటువంటి సాంకేతిక కారణాలతో చేజారిపోతుంటే దానికి పరిష్కారం లేదా? పద్దెనిమిదేళ్ళు నిండిన వెంటనే ఒక హక్కు మాదిరిగా లభించాల్సిన ఓటు,  ఇలా ప్రతి రెండుమూడేళ్ళకు అధికారుల దయాదాక్షిణ్యాల మీద ఆధార పడాల్సిందేనా? ఇప్పుడు అందుబాటులో వున్న  అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఇందుకు ఓ మార్గం చూపలేదా?
నిజమే! ఓటు ప్రతి పౌరుడి హక్కు. పద్దెనిమిదేళ్ళు నిండగానే లభించే ఆ హక్కు చనిపోయేవరకు ఎందుకు వుండదు? నివాసం మారిన ప్రతిసారీ ఎందుకు పునరుద్దరించుకోవాలి? ఇటువంటి మార్పులను అతి తక్కువ శ్రమతో చేసుకునే వీలు లేదా?   ఓటు హక్కును సరిగ్గా ఉపయోగించుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ఊదరగొడుతుండే రాజకీయ నాయకులు ఈ విషయంలో ఎందుకు చొరవ చూపరు?
వంట గ్యాస్ బుక్ చేసి,  సిలిండర్ వచ్చే సమయంలో ఇంట్లో ఉండని వినియోగదారుడికి ఓ ఎస్.ఎం.ఎస్. వస్తుంది, ‘పలానా సమయంలో ఇంటికి తాళం వేసి వుంది’ అని. ఇలాగే ఓటరు తనిఖీకి ఒక  కాల్ సెంటర్ పెట్టి వాస్తవాలను నిర్ధారించుకునే వీలు లేదా?
కాలక్రమంలో మనిషి రూపురేఖలు మారిపోవచ్చు. చేతి రాతతో పాటు సంతకం చేసే పద్దతిలో మార్పు రావచ్చు. కానీ లావాదేవీ పత్రాలపై నిరక్షరాస్యులు వేసే బొటనవేలి ముద్రలు మాత్రం దశాబ్దాల తరువాత కూడా మారిపోని విషయం గమనంలో పెట్టుకుంటే మనుషులను గుర్తించడానికి మరింత మేలైన విధానాలు స్పురించే అవకాశం తప్పకుండా వుంటుంది. నివాసాలు మారినప్పుడల్లా ఓటర్ల జాబితాలో ఆ మేరకు సవరణలు చేసుకునే అవకాశం లేకపోలేదు. కానీ అందుకు అనుసరించాల్సిన  ప్రక్రియ,  నిరక్షరాస్యులు ఎక్కువగా వున్న మన దేశానికి పెద్దగా ఉపయుక్తం కాదు. ఇందుకోసం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కాకపోయినా కొన్ని అందుబాటులో వుండే ప్రభుత్వ ఆఫీసుల్లో అయినా కొన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి తగు సిబ్బందిని నియమించడం ప్రయోజనకరంగా  వుంటుంది.
పొతే ఎన్నికల క్రతువు నిర్వహించే ఎన్నికల సంఘం విషయంలో ఒక మాట. అయిదేళ్ళకోమారు మాత్రమే పని ఉంటుందనే ఉద్దేశ్యంతో కాబోలు, ఎన్నికల సంఘానికి శాస్విత యంత్రాంగం లేదు. ఎన్నికల సమయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించే సిబ్బందితోనే పని గడుపుకోవాలి. చెప్పుకోవడానికి విశేషాధికారాలు ఉన్నప్పటికీ  సంఘం చెప్పుచేతల్లో పనిచేసే సొంత సిబ్బంది ఉండకపోవడం శోచనీయం. గతంలో ఎన్నికలు సకృత్తుగా వచ్చేవి. ఇప్పుడలా కాదు. ప్రతి ఆరు నెలలకూ, ఏడాదికీ దేశంలో ఎక్కడో ఓ చోట ఎన్నికలే. ఈ నేపధ్యంలో ఎన్నికల సంఘానికి శాస్విత ప్రాతిపదికమీద స్వతంత్రంగా వ్యవహరించగల సిబ్బంది అవసరం ఎంతైనా వుంది.
బోగస్ ఓట్లను ఏరివేయకపోవడం తప్పే. అయితే,  అర్హత ఉన్నవారి ఓట్లను ఏదో ఒక నెపంతో తొలగించడం కూడా అంతే  తప్పు.                    
అర్హులయిన వారికి ఓటు హక్కు కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. ఆ హక్కు వారు పక్కాగా  అనుభవించేలా చేయడం కూడా వాటి బాధ్యతే. (07-10-2015)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com  మొబైల్: 98491 30595

NOTE: Courtesy Image Owner 

6 కామెంట్‌లు:

Jai Gottimukkala చెప్పారు...

గత ఎన్నికలలో లక్షలాది మంది ఆంధ్రులు రెండేసి నియోజక వర్గాలలో వోటు వేసారని, తద్వారా టీడీపీ-బీజేపీ కూటమికి గణనీయంగా అక్రమ లాభం చేకూరిందని ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు బోగస్ వోట్లు ఏరివేస్తున్నందుకు వీళ్ళు అందుకే గగ్గోలు పెడుతున్నారు.

ఎవరయినా తమ సాధారణ నివాస స్థానంలోనే వోటర్ లిస్టులో చేరాలనేది కనీస షరతు. ఆమాత్రం సోయి లేని వారికి హక్కులు ఎందుకండీ?

వోటర్ లిస్టు నుండి నకిలీల పేర్లు తొలగించే ప్రక్రియ మీరు చెప్తున్నంత ఆషామాషీగా చేయలేదు. రెండు చోట్ల వోట్లు ఉన్నాయని ఆరోపణ వచ్చిన 19 లక్షల మందికి నోటీసులు ఇవ్వగా కేవలం 6 లక్షల చిల్లర పేర్లు మాత్రమె తొలగించారు. నోటీసులు చదవడం చేతకానివారా పచ్చ తమ్ముళ్ళు?

voleti చెప్పారు...

ప్రస్తుతం వున్న ఇంటిలో సుమారు యాభై ఏళ్ళ పైబడి వుంటున్నాం..హోలుమొత్తం ఇంట్లో ఓట్లన్నీ గల్లంతు..అసలు ఇంటి నంబరే గల్లంతు.. మరల నమోదు చేయించుకొచ్చేసరికి తాతలు దిగొచ్చేరు.. ఎందుకిలా జరిగింది అని అడగటానికి గాని సరి అయిన జవాబు చెప్పే నాధుడు లేడు.. టెంపరరీ వుద్యోగులతో ..రోజుకో పర్యవేక్షకుడితో ఓటర్లను నమోదు చేశారు.. ఒక్క హైదరాబాద్ లోనే కాదు ..దేశమంతా ఇలానే తగలడుతోంది కదా.. అయినా వున్న జనాభాలో సగం మందికి ఓటు హక్కు ఉండదు..హక్కు వున్న వాళ్ళలో సహం మందికి ఓటర్ల జాబితాలో వుండరు..ఓటర్ల జాబితాలో సహం మంది ఓటు వెయ్యడానికి రారు..వోటు వెయ్యడానికి వచ్చిన వారిలో సహం మంది ఓట్లు ఎవడో వేసేస్తాడు.. చివరాఖరికి ఎవడు ఎక్కువ డబ్బులు జల్లుతాడో లేదా ఎక్కువ కులపోళ్ళు వున్న వాడో గెలుస్తాడు.. ఈమాత్రం దానికి మనదో జన్మ మనకి ఓటు ఓ జన్మ హక్కు.. క్యా బాత్ హై..

శ్యామలీయం చెప్పారు...

జై గారూ,

మీరు అనేక విషయాలలో మంచి అవగాహన కలవారు కదా. ఒక చిన్న సాయం చేయగలరా? మా ఓటుహక్కు పదిలంగానే ఉందో లేదో సులభంగా తెలుసుకొనే విధానం (sms లేదా website) ఉంతే దయచేసి చెప్పగోర్తాను.

Unknown చెప్పారు...

శ్యామలీయం గారు,

మీరు ఇక్కడ వెతుక్కోవచ్చనుకుంటా.

http://ceoaperms.ap.gov.in/Search/search.aspx

అజ్ఞాత చెప్పారు...

"ceo'ap'erms" this is also andhra ahankara, kutra...

అజ్ఞాత చెప్పారు...

కెసిఆర్ ఆంధ్ర వోట్లు తీసేస్తాడని అందరికి ఎప్పుడో తెలుసు .
ఇదేమి పెద్ద విచిత్రం కాదు . మీరు ఎంత అరిచి గగ్గోలు పెట్టినా ఖచ్చితంగా జరుగుతుంది .
Infront crocodile festival.